* ఈ నెల 30 నుంచి సెమిస్టర్ల పరీక్షలు ప్రారంభం
* వర్సిటీ, కళాశాలల మధ్య కొరవడిన సమన్వయం
* అడిగినంత పైసలిస్తే హాజరు శాతం తక్కువున్నా ప్రమోట్
* వర్సిటీ పాలకవర్గం దృష్టికి వచ్చినా పట్టించుకోని వైనం
* ఇదీ జేఎన్‌టీయూ-హెచ్ అనుబంధ కళాశాలల విద్యార్థుల పరిస్థితి
జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే
విద్యార్థులకు ఎంత హాజరు తక్కువ ఉంటే అంత మంచిదనే అభిప్రాయంలో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాల కంటే వారి నుంచి ఎంత మేరకు డబ్బు వసూలు చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదెక్కడో కాదు... రాష్ట్రంలోనే సాంకేతిక విద్యలో ప్రథమస్థానంలో ఉన్న జేఎన్‌టీయూ-హెచ్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల దుస్థితి.
విద్యార్థులు బేజారు
వర్సిటీకి అనుబంధ కళాశాలల విద్యార్థులు సెమిస్టర్ల పరీక్షలకు హాజరయ్యేందుకు 72 శాతం హాజరు ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత గుర్తింపు పొందిన వైద్యుడి వద్ద నుంచి సర్టిఫికెట్ సమర్పించాలి. దాని వల్ల 10 శాతం హాజరు శాతం నుంచి మినహాయింపు ఉంటుంది. కచ్చితంగా 65 శాతం హాజరు ఉంటే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తారు. ఏదేనీ కారణాల వల్ల 65 శాతం కన్నా హాజరు తక్కువ ఉంటే సెమిస్టర్ల పరీక్షలకు అనుమతి ఉండదు. వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం డిటైన్ అయి ఇంట్లో చెప్పుకోలేక పోతున్నారు. ఏడాది పాటు చదువుకు బ్రేక్ పడుతుందన్న విషయంలో స్పష్టత రావడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఆందోళన...
సుమారు 100 కళాశాలల నుంచి 10 వేల మంది విద్యార్థులను డిటైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఓ రెండు ప్రైవేటు కళాశాలల నుంచి గత వారం ఒక్కో కళాశాలలో 100 మందికి పైగా డిటైన్ చేసినట్లు పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. అసలే బీటెక్ 2-2, 3-2, 4-2 సెమిస్టర్ల పరీక్షలు కావడంతో ప్రస్తుత సంవత్సరం పూర్తి చేసుకొని తదుపతి చదువులు కొనసాగించాలనుకునేవారికి భంగపాటు తప్పడం లేదు. విద్యార్థులే ముందుకు వచ్చి తమను ఎలాగైనా డిటైన్ నుంచి గట్టెక్కిస్తే దానికి ప్రతిఫలంగా తాము డబ్బు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఈ పరిణామం ఆయా కళాశాలలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీన్నే అదునుగా చూసుకొని హాజరు శాతాన్ని బట్టి యాజమన్యాలు మరింత డబ్బు డిమాండ్ చేస్తున్నాయని పలువురు విద్యార్థులే పేర్కొంటున్నారు.
అడిగినన్ని సమర్పించుకుంటేనే...
హాజరు ఎంత ఉంటే మీకెదుకు సారు... చెప్పండి ఇంత ఇస్తవా ఇవ్వు లేదంటే నీ ఇష్టం... అంటూ ఆయా కళాశాలల ప్రతినిధుల నుంచి విద్యార్థులకు అందుతున్న ప్రతిస్పందన ఇది. ఈ విషయాన్ని యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్తే... తక్కువ హాజరు ఉంటే డిటైన్ చేయరా... అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. మరో వారం రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో విద్యార్థులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
చివరి ఏడాది సంకటం
బీటెక్ పూర్తయిన విద్యార్థుల... ఉన్నత చదువులు... ఉద్యోగాల కలలు కల్లలుగానే మిగలనున్నాయి. హాజరు శాతం తక్కువ అంటూ వందలాది మందిని డిటైన్ చేసి ఆయా కళాశాలల నోటీస్ బోర్డుల్లో జాబితాను ఉంచారు. ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరు కాకపోతే మరో సంవత్సరం చదవాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలల యాజమాన్యాలు, వర్సిటీ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద నుంచి డబ్బులు తీసుకొని రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆయా కళాశాలల ప్రతినిధులకు ముట్టజెప్పి ప్రమోట్ చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పరీక్షల విభాగం బేఖాతర్...
ఈ నెల 30 నుంచి పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఎందరు? ఎంత మందిని డిటైన్ చేశారన్న విషయమై... ఆ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ గోవర్థన్‌ను ీన్యూస్‌టుడే' సంప్రదించగా తమ దగ్గర జాబితా చూసి ఇస్తామని చెప్పారు. రోజులు గడిచినా చివరకు ఆయన ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. వర్సిటీ అధికారులకు ఆయా కళాశాలల నుంచి ముడుపులు అందుతున్నాయన్న వార్తలు ఇటీవల ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పత్రికల్లో డిటైన్ జాబితా బయటకు వస్తే... తమ పరువు ఎక్కడ పోతుందోనని యాజమాన్యాలు భయపడుతున్నాయని విద్యార్థులు అంటున్నారు