అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, June 8, 2012

ఉచిత యూనిఫారాలు ఇప్పట్లో లేనట్లే!



పథకంలో అక్రమాల దందా!



నిబంధనలకు తూట్లు.. అర్హతలేని కంపెనీలకు ఆర్డర్లు!
అన్యాయమంటూ హైకోర్టును ఆశ్రయించిన ఇతర కంపెనీలు
వాదనలు వినిపించే తీరికా లేని విద్యాశాఖ!
ఆర్డర్లను తాత్కాలికంగా 4 వారాలపాటు
నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మరో వారం రోజుల్లోగా స్కూళ్లను తిరిగి తెరవనున్నారు. కానీ ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఉచిత యూనిఫారాలు అందే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. జూన్ 12న స్కూళ్లు తెరిచేనాటికి కాదు కదా.. మరో రెండు నెలలకూ వాటినందించే పరిస్థితి లేదు. విద్యాశాఖ నిర్వాకమే ఇందుకు కారణం. అడ్డగోలు నిబంధనలు, అర్హత లేని కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడంద్వారా ఉచిత యూనిఫారాల పథకాన్ని వివాదాల్లోకి నెట్టింది. కేంద్ర నిబంధనల్ని తుంగలో తొక్కి ఇచ్చిన ఆర్డర్లతో పథకాన్ని భ్రష్టు పట్టించింది. ముడుపుల బాగోతానికి తెరతీసి.. అడ్డగోలు విధానాలతో దాదాపు 56 లక్షల మంది విద్యార్థులకు స్కూళ్లు తెరిచేరోజున యూనిఫారాలు లేకుండా చేసింది. అంతేకాదు.. మరో రెండు నెలల్లోనూ వారికి యూనిఫారాలను ఇవ్వలేని దుస్థితిని కల్పించింది. పథకం అమలులో విద్యాశాఖ అనుసరించిన అడ్డగోలు విధానాలను సవాలు చేస్తూ పలు కంపెనీలు కోర్టును ఆశ్రయిస్తే.. కోర్టులో తమ వాద నలు వినిపించే తీరికా లేకపోయింది. విద్యాశాఖ తరఫున న్యాయవాదులుగానీ, అధికారులుగానీ హాజరుకాలేదు. దీంతో విద్యాశాఖ ఇచ్చిన క్లాత్ సరఫరా ఆర్డర్లను తాత్కాలికంగా నాలుగు వారాలపాటు నిలుపుదల చేస్తూ గత వారం(మే 31న) హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

నిబంధనలకు పాతర..

రాష్ట్రంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకున్న 56,26,804 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున రూ.225 కోట్లతో అందించాల్సిన యూనిఫారాలకు కావాల్సిన క్లాత్ సరఫరా పనుల్లో నిబంధనలను విద్యాశాఖ యథేచ్ఛగా తుంగలో తొక్కింది. కేంద్ర నిబంధన ప్రకారం కేంద్రీకృత కొనుగోళ్లు చేయడానికి అస్సలు వీల్లేదు. కానీ విద్యాశాఖ మాత్రం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) ముసుగులో వాటికే జెండా ఊపింది. 2 కోట్ల మీటర్ల సూటింగ్, 2.4 కోట్ల మీటర్ల షర్టింగ్ సామర్థ్యమున్న కంపెనీలే ఈఓఐలో పాల్గొనాలని పేర్కొన్నా.. నిర్ణీత సామర్థ్యం, అర్హతలేని కంపెనీలకే అవకాశమిచ్చింది. మఫత్‌లాల్, అలోక్, బన్స్‌వారా, అరవింద్, ఎన్‌టీసీ వంటి ఇతర రాష్ట్రాల కంపెనీలకు పనులు కట్టబెట్టింది. అన్ని అర్హతలున్న రాష్ట్ర కాంపొజిట్ మిల్లులకు మొండిచేయి చూపింది. మరోవైపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో క్లాత్ సరఫరా పనుల్ని ఎన్‌టీసీకి అప్పగించిన విద్యా శాఖ.. ఆప్కోను వరంగల్, కరీంనగర్ జిల్లాలకు పరిమితం చేసింది. మిగతా 19 జిల్లాల్లో ఎంపిక చేసిన 4 కంపెనీల నుంచి కొటేషన్లు తీసుకోవాలని, తక్కువకు సరఫరాచేసే కంపెనీనుంచే క్లాత్ కొనుగోలు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. కానీ కంపెనీలు కుమ్మక్కై.. ఒక జిల్లాలో తక్కువ రేటు, మరో జిల్లాలో ఎక్కువ రేటు చొప్పున కోట్ చేసి జిల్లాల్ని పంచుకున్నాయి. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందనే ఆరోపణలున్నాయి.

దళారుల మేలుకే కంపెనీ పేరుండాలన్న నిబంధన తొలగింపు..

2011-12 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం ఇవ్వనున్న యూనిఫారాల విషయంలో పది నెలలుగా నోరుమెదపని విద్యాశాఖ.. ఆలస్యమవుతుందనే సాకుతో రెండు నెలలక్రితం హడావుడి చేసింది. క్లాత్‌పై ప్రతి రెండు మీటర్లకు విధిగా కంపెనీ పేరుండాలన్న నిబంధనను తొలగించింది. మళ్లీ నాసిరకం క్లాత్‌నే సరఫరా చేసే అవకాశాన్ని దళారులకు కల్పించింది. దీంతో రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, తదితర ప్రాంతాల్లోని చిన్నపాటి మిల్లుల్లో ఉత్పత్తయ్యే క్లాత్, బయటి మార్కెట్‌లో లభించే నాసిరకం క్లాత్‌ను సరఫరా చేసే అవకాశమిచ్చింది. పైగా క్లాత్‌పై ప్రతి రెండు మీటర్లకూ దానిని సరఫరా చేసే కంపెనీ పేరుండాలంటే మరో రెణ్నెల్లు పడుతుందని, దాంతో యూనిఫారాల పంపిణీ ఆలస్యమవుతుందని కుంటిసాకులు చెప్పింది. నిజానికి ఏ కారణమూ లేకుండా పదినెలలు జాప్యం చేసిన సర్కారు.. నాణ్యమైన యూనిఫారాలిచ్చేందుకు మరో రెండునెలలు ఆగినా పోయేదేమీ లేదు. కానీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు దళారులతో కుమ్మక్కై.. ‘ఆలస్యం’ ముసుగుతో కంపెనీ పేరుండాలనే నిబంధనను తొలగించి పథకాన్ని భ్రష్టు పట్టించింది.

No comments:

Post a Comment