- లక్ష్యం కుదింపు - ఏమూలకూ చాలని శిక్షణా కేంద్రాలు
- నిరుద్యోగుల సమాచార సేకరణ చేయలేని దైన్యం
- వెనుకబడ్డామని మంత్రి ఒప్పుకోలు
-
ఇదీ రాజీవ్ యువకిరణాలు పథకం తీరు!
పైనుంచి కింది వరకూ సమన్వయ లోపంతో కొనసాగుతున్నట్లు విదితమౌతోంది. ప్రభుత్వ లెక్కలకూ ఆచరణకూ ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,99,392 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాన్ని 3.32 లక్షలకు కుదించారు. అంటే 1,67,392 ఉద్యోగాలకు కోత పెట్టారు. ఈ పథకం ద్వారా నిర్వహించే మేళాలు, శిక్షణ జాతరలను తలపిస్తున్నాయి తప్ప ఉపాధికి ఉపకరించడంలేదని నిరుద్యోగ యువత నుంచి వినవస్తోంది. మున్సిపల్ శాఖా మంత్రి ఎం.మహీధరరెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో ఈ పథకంపై జరిగిన సమీక్షానంతరం మాట్లాడిన మాటలు నిరుద్యోగ యువత అభిప్రాయాన్నే ప్రతిబింబించాయి.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెడితే.. దీని అమల్లో ఆయా జిల్లాల్లోని సీనియర్ అధికారులు శ్రద్ధ కనబరచడం లేదంటూ మంత్రి మహీధరరెడ్డి నెపాన్ని అధికారుల మీదకు నెట్టారు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు, 'మెప్మా' ప్రాజెక్టు డైరెక్టర్లు, కలెక్టరు/జాయింట్ కలెక్టర్లు మధ్య సమన్వయం లేదనీ, అందువల్ల ఈ పథకం ఆశించిన ఫలితాలనివ్వలేదనీ మంత్రి ఒప్పుకున్నారు. మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత కారణంగా ఆయా పట్టణాల్లో ఎంతమంది నిరుద్యోగులున్నారనే సమాచారం సేకరించలేని పరిస్థితి ఉందనీ.. పట్టణాల్లో 'మెప్మా' కార్యక్రమాల గురించి మున్సిపల్ కమిషనర్లను ప్రశ్నిస్తే.. ఎలాంటి సమాచారమూ రావడం లేదనీ మంత్రే వాపోవడం దయనీయం. మరో నిప్పులాంటి నిజాన్ని కూడా మంత్రి బయటపెట్టారు. నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న సంస్థలను కమిషనర్లు తనిఖీలు చేసిన దాఖలాలే లేవు పొమ్మన్నారు. కనుక రాజీవ్ యువ కిరణాలు ప్రసరించడం లేదనీ, ఆ పథకానికి చీకట్లు కమ్ముకుంటున్నాయనీ మంత్రి మాటలను బట్టి ఇట్టే విదితమౌతోంది. మరో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాత్రం ఈ పథకం ద్వారా లక్షలాది ఉద్యోగాలు లభిస్తున్నాయంటూ శనివారం సరికొత్త అంకెలను బయట పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3.32 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇది ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యానికి (4,99,392 ఉద్యోగాల కల్పనకు) పూర్తి భిన్నంగా ఉంది. మంత్రి ప్రకటనను బట్టి దాదాపు లక్షన్నరకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టారని తెలుస్తోంది.
2011-12 ఆర్థిక సంవత్సరం నుంచీ 2014 -15 ఆర్థిక సంవత్సరం ముగింపు వరకూ 15,35,600 ఉద్యోగాలు కల్పించను న్నట్లు తొలుత ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకనుగుణంగా ఈ నాలుగు ఆర్థిక సంవత్సరాలకూ ఏయేటికాయేడు లక్ష్యాలనూ ప్రకటించారు. 2011-12లో 2,46,600 ఉద్యోగాలు, 2012-13లో 4,99,392; 2013-14లో 6,14,240, చివరి ఆర్థిక సంవత్సరం 2014-15లో 1,75,368 ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ లెక్కలకూ ఆచరణకూ ఎక్కడా పొంతన కుదరడం లేదు. పథకం ప్రకటించిన ఈ రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు కూడా చూపించలేకపోయారు. మిగిలిన రెండు సంవత్సరాల్లో 13 లక్షలకు పైన ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. మున్సిపల్ మంత్రి మహేంద్రరెడ్డి ఆవేదనను బట్టి చూస్తే ఉపాధి లక్ష్యం చేరుకోవాలంటే ఏ అద్భుతమో జరగాలి. బహుశా ఆ అద్భుతం 2014 లో ఎన్నికలున్నందున 2013-14 ఆర్థిక సంవత్సరంలో యువతను మభ్యపరిచేలా మేళాలు, శిక్షణా జాతర్లు ద్వారా చూపిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించినప్పుడు.. చాలా నిరాశాజనకంగా కొనసాగుతోంది.
వర్తమాన ఆర్థిక సంవత్సరాన్నే తీసుకుంటే ఆదివారానికి (నిన్నటికి) 17,56,532 మంది నిరుద్యోగ యువత తమ పేర్లను ఆన్‌లైన్‌లో రిజిస్టరు చేసుకున్నారు. వీరిలో ఎస్సీలు 4,12,955 మంది (23.51 శాతం), బిసిలు 8,66,631 మంది (49.34 శాతం), మైనారిటీలు 73,314 మంది (4.17 శాతం), ఎస్టీలు 1,40,494 (8 శాతం), ఓసీలు 2,63,138 మంది (14.98 శాతం) ఉన్నారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యం 4,99,392. అయితే దాన్ని 3.32 లక్షలకు కుదించినట్లు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రకటనను బట్టి విదితమౌతోంది. దాదాపు 1,67,392 ఉద్యోగాలకు ఎగనామం పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఉద్యోగాల కల్పనకు ఉద్ధేశించి శిక్షణ ఇచ్చేందుకు 507 ట్రయినింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లు 3.22 లక్షల (ఈ సంవత్సరం లక్ష్యం మేరకు) ఉద్యోగార్థులకు శిక్షణ ఇవ్వాలంటే 507 సెంటర్లు ఎలా సరిపోతాయే ప్రభుత్వానికీ, అధికారులకే తెలియాలి. భవిష్యత్తులో మరో వెయ్యి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం 507 సెంటర్లలో ఆదివారానికి (నిన్నటికి) 15,001 మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. (వీరు 22 సెక్టార్లలోని 178 కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు) ఈ ప్రకారంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే వెయ్యి సెంటర్లలో మరో 30 వేల మందికే శిక్షణ ఇవ్వడానికి వీలవుతుంది. శిక్షణ ఒక్కో బ్యాచ్‌కు ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కో కోర్సు శిక్షణ 45 రోజులకే పూర్తయితే మరో కోర్సులో శిక్షణ నాలుగు నెలలు పడుతుంది. సగటున ప్రతి కోర్సుకూ రెండేసి నెలల శిక్షణ ఇచ్చినా లక్ష మందికి శిక్షణ పూర్తి చేయడం (అదీ ఏ అవరోధమూ ఎదురుకాకుండా ఉంటే) కనాకష్టమవుతుందని సర్వత్రా వినవస్తోంది. ఇంతకూ గత రెండేళ్లుగా ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ కల్పించిన ఉద్యోగాలు 1,98,197 మాత్రమే. 2011-12లో 1,62,164 ఉద్యోగాలు, 2012-13లో 36,033 ఉద్యోగాలు కల్పించాలి. (అయితే ఇవన్నీ ప్రభుత్వ లెక్కలు మాత్రమే. క్షేత్రస్థాయిలో ఈ లెక్కల వాస్తవమెంతో తెలియదు). ఈ లెక్కన చూసుకున్నా మరో రెండేళ్లలో 15 లక్షల ఉద్యోగాల లక్ష్యం పూర్తి చేయాలి. అంటే దాదాపు మరో 13 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది ఎంతమేరకు సాధ్యమవుతుందో పై లెక్కలను పరిశీలించినవారికి అవగతం కాగలదు.
No comments:
Post a Comment