అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, September 24, 2012

ఓ 'డెంజర్' జోన్

సహజ రక్షణ కవచానికి చిరుగులు
అతినీల లోహిత కిరణాలతో అనర్థాలు
ఫలితాలు ఇవ్వని ఐరాస చర్యలు
నేడు 'ఓజోన్ డే'

హైదరాబాద్, సెప్టెంబర్ 15 : రెండు ఆక్సిజన్ అణువుల బంధం ఏర్పడితే... ఓ2. ఈ బంధానికి మరో అణువు వచ్చి చేరితే ఓజోన్ (ఓ3). ఇది భూమికి ప్రకృతి పట్టిన గొడుగు! విచక్షణ మరిచి సాగుతున్న అభివృద్ధి... విచ్చలవిడిగా వెలువడుతున్న గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారంతో ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. ఓజోన్ పొర పలుచబడుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఓజోన్ పొర క్షీణత 30 నుంచి 40 శాతానికి పెరిగింది.

ఒక రంగం అభివృద్ధి మరొక రంగంపై ప్రతికూల ప్రభావం చూపకూడదన్న అర్థ శాస్త్ర నియమం గా డి తప్పింది. పారిశ్రామిక విప్లవం మోసుకొచ్చిన కాలుష్యం మొత్తం ప ర్యావరణాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆధునికతకు, అభివృద్ధికి చిహ్నాలుగా ఉన్న మోటార్ కార్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, స్ప్రేలు, ఇంకా మరెన్నో రకాల రసాయనాల వాడకంతో క్లోరోఫ్లోరో కార్బ న్ (సీఎఫ్‌సీ), హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్ (హెచ్‌సీఎఫ్‌సీ) వాయువులు వెలువడుతూ ఓజోన్‌కు చిల్లులు పొడుస్తున్నాయి. ఫలితంగా... అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిని తాకి, అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి.

వర్షాకాలంలో వానలు పడవు. చలికాలంలో చలి పెట్టదు. అ యితే... అతివృష్టి. కాకుంటే... అనావృష్టి. గతి తప్పిన రుతువులతో అంతా అతలాకుతలం. ఈ పరిస్థితికి ముఖ్య కారణం... ఓజోన్ పొర క్షీణతే. ఓజోన్ క్షీణత వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా... ఉష్ణోగ్రతలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల వల్ల అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి.

నిజానికి... వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జీవుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో ప్రకృతిసిద్ధమైన సర్దుబాటు జరుగుతుంది. దీనివల్లే పరిణామక్రమంలో భిన్న రకాల జీవులు ఆవిర్భవిస్తాయి. అయితే... ఈ సర్దుబాటును భూతాపం సంక్లిష్టం చేస్తోంది. మంచు కరిగిపోవడం, ఎడారులు విస్తరించడం, సముద్రాల్లో ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో జీవ పరిణామ క్రమం కూడా గతి తప్పింది.

చేతులు కాలాక...
చేతులు కాలాక.. ఆకులు పట్టుకోవడం మనిషికి బాగా అలవాటైన పని. ఓజోన్ పొరకు భారీగా చిల్లులు పడిన తర్వాతే... మనం మేల్కొన్నాం. దానిని కాపాడుకునే పనిలో పడ్డాం. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాన్ని ఎదుర్కొనడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపట్టారు. సీసం వంటి హానికర పదార్థాల ఉత్పత్తి నియంత్రణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి, ప్రజారవాణా వ్యవస్థ, నీటి కొరత అంశాలపై దృష్టి సారించారు. విషపూరిత వాయువుల మోతాదును పరిమితం చేయడం ఐరాస లక్ష్యం.

ఆ తర్వాత జరిగిన 'క్యోటో' ఒప్పందంలోనూ ఈ సమస్యపైనే దృష్టి సారించారు. 37 పారిశ్రామిక దేశాలు ఇక్కడ జరిగిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీరంతా కలిసి 2012 నాటికి 5.2 శాతం (1990తో పోలిస్తే) కార్బన వాయువులను తగ్గించాలని నిర్ణయించారు. ఆ తర్వాత జరిగిన భారీ కార్యాచరణ ప్రణాళికలోనూ, ఈ మధ్య జరిగిన కోపెన్‌హాగన్ సదస్సులోనూ లక్ష్యాలను నిర్ణయించుకున్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

పర్యావరణ విధ్వంస ఫలితం..
+ కంప్యూటర్ వినియోగం ద్వారా రోజుకు 45 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతోంది.
+ పర్యావరణంలోకి విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ దాదాపు 100-200 సంవత్సరాలపాటు గాల్లో అలానే ఉంటుంది.
+ మధ్య దక్షిణాఫ్రికాలోని 110 రకాల ఎటోలోపస్ జాతి కప్ప ల్లో రెండొంతులు వాతావరణ మార్పుల బారిన పడ్డాయి.

+ కరీబియన్, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో తడి నేలలు తగ్గిపోవడంతో ఫ్లెమింగో పక్షుల మనుగడకు ముప్పు ఏర్పడింది.
+ సముద్రపు ఆహార గొలుసులో ప్రాథమికమైన ప్లాంక్టన్ (ప్లవక) జీవులు వేగంగా తగ్గిపోతున్నాయి. తుఫానులు అధికం కావడంతో అల్బాట్రాస్ పక్షుల సంఖ్య తగ్గిపోతోంది.
+ హిమాలయాలు వేగంగా కరగడం వల్ల బెంగాల్‌లోని సుం దర్‌బన్ అడవులు పూర్తిగా మునిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.

ఆ ఐదు...
ఒకప్పుడు రిఫ్రిజిరేటర్లు భారీ స్థాయిలో సీఎఫ్‌సీలను విడుదల చేసేవి. 1995 తర్వాత 'ఓజెన్ ఫ్రెండ్లీ' ఫ్రిజ్‌లే వస్తున్నాయి. ఓజోన్‌ను క్షీణింపచేసే ఐదు ప్రధాన వస్తువులు ఇవి...
1. ఇన్‌హేలర్లు: ఆస్తమా రోగులు వాడే ఇన్‌హేలర్లలో హెచ్‌సీఎఫ్‌సీలు ఎక్కువగా ఉంటాయి. ఇన్‌హేలర్లలో సీఎఫ్‌సీల వాడకాన్ని అమెరికా 2009లోనే నిషేధించింది. 2013 నాటికల్లా ఇలాంటి ఉత్పత్తులను నిలిపివేయాలని మన దేశం కూడా నిర్ణయించింది. అయితే... శాస్త్రవేత్తలు దీనికి తగిన ప్రత్యామ్నాయాన్ని ఇప్పటిదాకా కనుగొనలేక పోయారు.
2. అగ్నిమాపక పరికరాలు: ఇళ్లు, కార్యాలయాల్లో ఉపయోగించే అగ్నిమాపక పరికరాల్లో ఉపయోగించే హాలో ఆల్కలీన్‌లు ఓజోన్‌కు తీవ్ర నష్టం కలుగచేస్తాయి.
3. ఏరోసోల్ హెయిర్ స్ప్రే: కేశ సౌందర్యానికి స్ప్రేలు వాడ టం అధికమవుతోంది. కానీ... ఏరోసోల్ (గ్యాస్ ఆధారిత) హె యిర్‌స్ప్రేల్లోని సాల్వెంట్లు, పాలిమర్లు, ప్రొపెల్లెంట్లన్నీ సీఎఫ్‌సీ, హెచ్‌సీఎఫ్‌సీ వాయువులను వెలువరిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏరోసోల్ బేస్డ్ హెయిర్‌స్ప్రేలను నిషేధించారు.
4.కీటక నాశినులు: మన ఇళ్లలో దోమలు, ఈగలు, బొద్దింకలను చంపేందుకు వాడే స్ప్రేలలోనూ సీఎఫ్‌సీ, హెచ్‌సీఎఫ్‌సీలు పుష్కలంగా ఉంటాయి. ఓజోన్ పొరకు చేటు తెస్తాయి.
5. ఫోమ్ ఇన్సులేషన్: ఫ్రిజ్‌లు, ఇతరత్రా ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రవాణాలో దెబ్బతినకుండా మెత్తగా ఉండే ఫోమ్ ఇన్సులేషన్ (కవచం) ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇవి కూడా హెచ్‌సీఎఫ్‌సీ మయమే.

ఓజోన్ కాలుష్యం జీవ వైవిధ్యంపైనా ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్రంగా కనిపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నైట్రోజన్ ఆక్సైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీ) వల్ల ఓజోన్ కాలుష్యం పెరుగుతోంది.
- హిమబిందు ( పర్యావరణ విభాగం -జెఎన్‌టీయూ)

భూ స్థాయిలో ఉన్న ఓజోన్ కాలుష్యం కార్బన్ డయాక్సైడ్, మీథైన్ల కన్నా ప్రమాదకరమైంది. వాతావరణంలో సహజంగా ఉండే క్లోరిన్, బ్రోమైన్ల రసాయన చర్యల వల్ల ఇది జరుగుతోంది.
- సజ్జల జీవానంద రెడ్డి
(పర్యావరణ వేత్త )


అన్ని అర్థాలకు మూలం ఇంధనాలను విచక్షణారహితంగా వాడటమే. మెరుగైన ప్రజా రవా ణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ప్ర జల దృష్టంతా వ్యక్తిగత వాహనాలపైనే. దీంతో కాలుష్యం పెరుగుతోంది. గ్రౌండ్ లెవల్ ఓజోన్ కాలుష్యాన్ని నియంత్రించాలంటే సర్కారు చిత్తశుద్ధితో ప్రజా రవాణాపై దృష్టి పెట్టాలి.
-ప్రసాద్(కాలుష్య నియంత్రణ మండలి)

అడవి బిడ్డలకు భాగస్వామ్యం
అడవులు కనుమరుగవుతుండటంపై ఓ యువ అటవీ అధికారి అజిత్‌కుమార్ బెనర్జీకి దిగులు పట్టుకుంది. పశ్చిమబెంగాల్‌లోని 'ఆరాబరి' అటవీ ప్రాంతంలో అతను పనిచేస్తున్నాడు. అక్కడి మూగజీవుల గూడు చెదురుతుంటే తట్టుకోలేకపోయాడు. ఏదో ఒకటి చేయాలన్న తపన రగిలింది. దాని ఫలితంగానే సంయుక్త అటవీ నిర్వహణ(జేఎఫ్ఎం) అన్న ఉద్యమం పుట్టింది. ఇది 1972లో చోటుచేసుకున్న పరిణామం. అడవుల రక్షణలో స్థానికులకూ పాత్ర కల్పించడమే ఆయన చేపట్టిన ఉద్యమం. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించింది.

స్థానిక గ్రామస్తులు ఎక్కడికక్కడ రక్షణ కమిటీలుగా ఏర్పడి అటవీ శాఖతో కలిసి రంగంలోకి దిగారు. ఇందుకు ప్రతిగా అటవీ ప్రాంతంలో లభించే కలప మినహా ఇతర ఏ ఉత్పత్తులనైనా స్థానికులు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో అటవీ రక్షణలో వారు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. చెట్ల నరికివేత గణనీయంగా తగ్గింది. గిరిజన గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించాయి. విజయవంతమైన ఈ పద్ధతి దేశమంతా విస్తరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. మూడు దశాబ్దాల్లో చెప్పలేనంత మార్పు వచ్చింది. దీని వెనుక ఉన్న హీరో అజిత్ కుమార్ పేరు చిరస్థాయిగా నిలిచింది.

మా జోలికి రావొద్దు
'చీమా చీమా ఎందుకు కుట్టావ్' అని అడిగితే... 'నా పుట్టలో వేలు పెడితే కుట్టనా!' అని చీమ అంటుంది. 'మీరు మా జోలికి రావొద్దు. మేం మీ జోలికి రాం!' అనేది జంతువుల విధానం. కానీ... వాటి ఆవాసాలను మనుషులు ధ్వంసం చేస్తుండటంతో, అవి మనుషుల మీద పడుతున్నాయి. అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఆహార లభ్యత తగ్గిపోవడంతో... పెద్దసైజు గబ్బిలాలు మనుషులపై దాడి చేయడం అధికమైంది. ఫలితంగా... రేబిస్ వ్యాధి తీవ్రత పెరిగింది. అలాగే... పెరూలో అడవులు చిక్కగా ఉన్న చోటుకంటే... అటవీ క్షయం జరిగిన చోట మలేరియా కారక దోమకాటు 278 రెట్లు అధికమైంది!

No comments:

Post a Comment