అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, July 2, 2012

జిపి కార్మికుల వెట్టి..!

 ప్రజాశక్తి - యాచారం   Sun, 1 Jul 2012, IST  
  • ఏళ్ల తరబడి పెరగని వేతనాలు
  • ధరల మోతతో గంజినీళ్లు కరువు
  • భారమైన కుటుంబ పోషణ
  • కార్మికులను మరిచిన ప్రభుత్వం
గ్రామ పంచాయతీ కార్మి కులు (జిపి కార్మికులు) ఆ గ్రామం బాగుకోసం నిరంతరం కష్టించేవారు. పదిమంది మంచికోరి ఆ కార్మికులు చేయని కష్టం లేదు. గ్రామ నడి వీధుల నుంచి మురుగు కాలువల కంపు వరకు ముక్కుమూసుకుని ఎత్తిపోస్తారు. అందరి సుఖమే తమ సుఖంగా భావించి కంపును
భరించి తమ చెమట చుక్కను ధారపోస్తున్నారు. ఇదంతా నిస్వార్థమేనా..? అనుకోవచ్చు. కానీ వారిపైనా ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆ కుటుంబాల బాధ్యతను మోస్తూ... నిత్యం మురుగు కంపులో తలమునకలవుతున్న ఆ కార్మికులు ఏళ్లకు యేళ్లుగా వెట్టి చేస్తున్నారు. ఇదంతా చేస్తున్న ఆ కార్మికులను ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. కనీసం కనీస సౌకర్యాల కల్పన లేదు. చివరికి వారు చేస్తున్న పనికి తగిన వేతనమూ లేదు. గొప్ప మనసుతో వారు చేస్తున్న ఆ పాకీ పనికి ఎంత వేతనమిచ్చినా.. తక్కువే. అలాంటి వారికి కనీస వేతనాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. అందరి బాగును కోరే జిపి కార్మికుల బతుకును బండ చేస్తున్నాయి. వారి జీవన విధానంపై ప్రత్యేక కథనం..


ఉదయం నాలుగు గంటల సమయం. నిద్రలో నుంచి మేల్కోవడంతోనే ఆతృతతో పనులు మొదలు పెట్టింది పద్మ. ఆదరాబాదరాగా ఇల్లంతా చదిరింది. భర్తతో పాటు పిల్లలు, అత్తమామలకు కావాల్సిన వంటలు, ఇతర ఏర్పాట్లూ చేసింది. ఆరు గంటల్లో చల్లటి నీటిని నెత్తిన దిగబోసుకుని ఆతృతగానే తట్ట, చేతిలో చీపురు పట్టుకుని ఇంటి నుంచి బయటపడింది. ఆరుకు కొద్దిగా సమయం మించినా కాంట్రాక్టరు లేదా కార్యదర్శితో చివాట్లు. వెళ్లిన వెంటనే హాజరు వేసుకుని రోడ్లపైకి వెళ్లడం.. రోడ్లంతా శుభ్రం చేయడంలో నిమగమైంది. 9-30 గంటల మధ్య కాసేపు విరామం. ఆ సమయంలోనే టిఫిన్‌ చేసింది. ఐదు నిమిషాలు కూడా ఆలస్యం కాకుండా మళ్లీ పనిలో లీనమైంది. ఇలా మధ్యాహ్నం ఇంటి గంట వరకు పని తప్ప మరో ధ్యాస లేదామెకు. మళ్లీ సాయం త్రం నాలుగు గంటల నుంచి మొదలుకుని ఎనిమిది గంటల వరకు అదే పనిలో నిమగం. ఇది ఓ కార్మికురాలు నిత్యం చేస్తున్న పని పద్ధతి.
ఇలా రోజూ 10 గంటలకు పైగా శ్రమిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు గ్రామ పంచాయతీ కార్మికుల చేస్తున్న కృషి. ఇలా ఎన్ని గంటలైనా గ్రామం బాగుకోసం చేసే గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తున్న వేతనాలు పదుల్లోనే.. కొన్నేళ్లగా వారు చేస్తున్న వెట్టికి... వేళ్ల మీద ఖర్చు పెట్టేందుకు ప్రస్తుతం ఇస్తున్న జీతం రూ.500లు. మరి కొందరికి ఆయా పంచాయతీల కార్యదర్శులు... సర్పంచుల పుణ్యమాని వెయ్యి నుంచి 1500 లోపు వేతనం తీసుకుంటున్న వారూ ఉన్నారు. వారికి ప్రభుత్వం వేతనంగా చెల్లించే ఈ వందలతో తమ సంసారాన్ని నెట్టుకురావాలి. ఇది సాధ్యమేనా? ఎవరికీ సాధ్యం కాదు. కానీ ప్రభుత్వాల మీద ఉన్న నమ్మకంతో కొన్నేళ్లుగా శ్రమిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. చివరికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక ఇంటి దగ్గరుంటే అందులోనూ వేతనాల కోత. ఇదే పనిలో ఏళ్లుగా చేసి వృద్ధాప్యానికి చేరుకున్న వారికి కూడా కనీసం పింఛన్లు ఇవ్వని స్థితి నేడు కొనసాగుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో వెయ్యి.. రెండు వేలతో ఏం కొనాలి. తమ కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటున్నారు కార్మికులు. వేతనాలు పెంచాలనీ.. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలనీ.. పని ముట్లు అందజేయాలనీ.. వైద్య సదుపాయం.. పిల్లలకు విద్య అందించాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. అందుకు వారికి అండగా సిఐటియు నిలవడంతో కొద్దిమేర వారి పోరాటాలు సత్ఫలితాలనిస్తున్నాయంటున్నారు. బట్టలు, నూనెలు, సబ్బులు, గ్లౌజులు, బూట్లతో పాటు తోపుడుబండ్ల(చెత్త మోసుకుపోయేవి)ను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కానీ చట్టబద్దంగా కనీస వేతనాలను అమలు చేయడంలోనూ, సౌకర్యాల కల్పనలోనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చట్టాలను ఉన్న వారికి చుట్టాలుగా చేస్తున్న ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ వీటినీ సాధించు కునేందుకు రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు చేస్తామని కార్మికులు చెబుతున్నారు. వేతనాలు, కనీస సౌకర్యాలతో పాటు టిఎ, డిఎలతో ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సాధించుకుంటామని, అందుకు సిఐటియు నిరంతరం అండగా నిలవాలని జిపి కార్మికులు కోరుతున్నారు.

కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం : బ్రహ్మయ్య, సిఐటియు డివిజన్‌ అధ్యక్షుడు
పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. కార్మికులతో వెట్టిచాకిరీకి తగిన వేతనానికి ఇవ్వాలంటూ చట్టాన్ని అమలు చేయాలి. ట్రెజరీల ద్వారా వేతనాలు అందజేయాలి. మౌలిక, కనీస సౌకర్యాలు కల్పించాలి. జనశ్రీ, బీమా యోజనాలను(పిఎఫ్‌) అమలు చేయాలి. అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు అరికట్టాలి.
ఇచ్చే జీతాలూ ఇవ్వడం లేదు : కిష్టయ్య, కార్మికుడు
మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరువు బతకనివ్వడం లేదు. చేస్తున్న పనికి అధికారులు జీతాలు ఇవ్వడం లేదు. ఇచ్చేది కూడా నెలల తర్వాత ఇస్తుండ్రు. ధరలు విపరీతంగా పెరిగాయి. ఐదొందలు పిల్లల ఖర్చులకూ సరిపోవు. కనీసం మాకివ్వాల్సిన కొబ్బరి నూనె, సబ్బులూ ఇవ్వడం లేదు. బతకడం కష్టంగా ఉందని యాచారం గ్రామానికి చెందిన దేవరకొండ కిష్టయ్య తన కుటుంబ బాధ్యతనూ, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు.
జీతాలు పెంచడం లేదు : పోచమ్మ, కార్మికురాలు
పదేళ్లకు పైగా పని చేస్తున్నాను. ఇప్పుడు ఐదు వందలు ఇస్తున్నారు. ఈ పైసలతో ఏం కొనాలి. ధరలు బాగా పెరిగాయి. తినడానికి తిండికి కష్టంగా ఉంది. కుటుంబం గడబడం లేదు. ఇంట్లో వారికీ పని లేదు. బతకడమే కష్టంగా ఉంది. ఇక పని చేయాలంటే చేతకావడం లేదని యాచారం మండలం మెడిపల్లి గ్రామానికి చెందిన మురుగు పోచమ్మ తన ఆర్థిక ఇబ్బందులనూ, ప్రభుత్వంపై వ్యతిరేకతనూ వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment