అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, May 7, 2012

ఇందిర జలప్రభ అమలు అధ్వానం

* ప్రచారానికే సర్కారు పరిమితం
* రెండేళ్లలో లక్ష బోర్లు లక్ష్యం
* 7 నెలల్లో తవ్వింది 1800 బోర్లే
* రిగ్గు యజమానులతో రేటు వివాదం
* 10 జిల్లాల్లో పూర్తిగా ఆగిన పనులు
* మిగతా ప్రాంతాల్లోనూ ముందుకుసాగని పథకం
* మోటార్ల ధర ఖరారుపై ప్రభుత్వం మొద్దునిద్ర


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇందిర జలప్రభ పథకంలో ‘ప్రభ’ లోపించింది. అణగారిన వర్గాల కోసమంటూ అట్టహాసంగా ప్రారంభించిన పథకం కాస్తా అట్టర్ ఫ్లాపయింది. లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకున్న సర్కారు ఆచరణలో చతికిలబడింది. గత ఏడాది మహాత్మాగాంధీ జయంతి రోజున ప్రారంభించిన ఈ పథకం ఏడు నెలలు గడిచినా ఒక్కడుగూ ముందుకు కదలలేదు. కొత్త బోర్లు వేయడం, మోటార్లు బిగించడం, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, సూక్ష్మ సేద్య పరికరాలు అమర్చడం ఈ పథకం ముఖ్యోద్దేశం. రెండేళ్లలో లక్ష బోర్లు ఏర్పాటు చేయాలని ఘనంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, మొదటి ఏడు మాసాల కాలంలో కేవలం 1,800 బోర్లు మాత్రమే వేశారు. వాటిలోనూ ఏ ఒక్కటి కూడా.. నేటికీ పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదంటే సర్కారు నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అవగతమవుతుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సాగుయోగ్యం కాని భూముల్లో బోర్లు వేయాలని, భూములు సాగులోకి వస్తే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. జలప్రభ పథకానికి రూపకల్పన చేసింది. ఆ మేరకు ఘనంగా ప్రచారం నిర్వహించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఆయా వర్గాల భూములను సర్వే చేయించి, రికార్డులు రూపొందించారు. వాటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. పది లక్షల ఎకరాలకు సంబంధించి దాదాపు 2.72 లక్షల మంది ఎస్సీ/ఎస్టీ/బీసీలకు చెందిన భూములను సాగుయోగ్యం చేయాలన్న ఉద్దేశంతో గత ఏడాది అక్టోబర్ రెండో తేదీన పథకాన్ని ప్రారంభించారు.

ఒక బోరు కింద పది ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేయడాన్ని ఒక బ్లాక్‌గా పేర్కొన్నారు. ఒక బ్లాక్‌లో ఉన్న భూ యజమానులను బ్లాక్ యూజర్ గ్రూపు (బీయూజీ)గా పేర్కొన్నారు. పది లక్షల ఎకరాలకు మొత్తం లక్షబోర్లు వేయాలని నిర్ణయించారు. ఆ బోర్ల కింద సూక్ష్మ సేద్యంతో ఆరుతడి పంటలు పండించడానికి వీలుగా పథకాన్ని రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో వేయదగిన పంటలను వ్యవసాయాధికారులు నిర్ణయిస్తారని, ఆ మేరకు పంటలు వేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. రెండేళ్లలో పథకం అమల్లోకి తేవాలని భావించారు.

మొదటి సంవత్సరంలో ఆరు లక్షల ఎకరాలు, రెండో సంవత్సరంలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.1,800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మొదటి ఏడాది ఆరు లక్షల ఎకరాలు సాగులోకి తేవాలంటే 10 ఎకరాలకు ఒక బోరు చొప్పున 60 వేల బోర్లు వేయాల్సి ఉంది. అంటే నెలకు 5 వేల బోర్ల చొప్పున వేస్తేగానీ లక్ష్యం నెరవేరదు. పథకం ప్రారంభించి ఏడు నెలలు అవుతుండగా 35 వేల బోర్లు వేయాల్సి ఉన్నా.. ఇప్పటికి 1,801 బోర్లు మాత్రమే తవ్వారు. వీటిలోనూ ఒక్కటి కూడా పంటలకు నీరందించేందుకు సిద్ధం కాలేదు.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
బోర్ల తవ్వకంపై రిగ్గుల యజమానులతో నెలకొన్న రేట్ల వివాదం పథకానికి ప్రధాన ఆటంకంగా మారింది. పథకంలో కీలకమైన మోటార్ల రేటూ ఇంతవరకు ఖరారు కాలేదు. ఏడు నెలలు పూర్తయిన తరువాత కూడా మోటార్ల కొనుగోలు వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఒక్కో మోటారుకు ఎంత చెల్లించాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఆరంభంలో ఏదోరకంగా కొన్ని మోటార్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. మోటార్ల ధర నిర్ణయించడం కోసం ఇదివరకు టెండర్లు పిలిస్తే. మోటార్ల ఉత్పత్తి సంస్థలు కుమ్మక్కై మార్కెట్ ధర కంటే 30 శాతం అధికంగా ధరలు కోట్ చేశాయి.

మరోవైపు రాష్ట్రంలోని చిన్నతరహా పరిశ్రమల యజమానులు కోర్టుకు వెళ్లడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. ఆ తరువాత ఉన్నతాధికారుల కమిటీతో మోటార్ల ధర ఖరారు చేయాలనుకున్నారు. ఈ కమిటీ బోర్ల లోతు ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించి గరిష్ట రేటు చెల్లించే ఫైలును మంత్రికి పంపించినట్లు సమాచారం. ఆయన దానిపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ తిరిగి పంపించారని తెలిసింది. మరోవైపు ఇందిర జలప్రభలో 90 మీటర్ల నుంచి 120 మీటర్లలోతు వరకు మాత్రమే బోర్లు వేయడానికి భూగర్భ జల నిపుణులు సిఫారసు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువలోతు వెళ్లాలంటే ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంది.

కాగా రాయలసీమ ప్రాంతంలో భూమి గట్టిగా ఉండడంతో అధిక ధర చెల్లించాలని అక్కడి బోర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మీటర్‌కు రూ.230 చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇక్కడి రిగ్ యజమానులు రూ.250 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా పది జిల్లాల్లో రిగ్ యజమానులు ముందుకురాకపోవడంతో బోర్లు వేసే ప్రక్రియ ఆగిపోయింది. మిగతా ప్రాంతాల్లోనూ పరిపాలనాపరమైన కారణాలకు, అధికారుల నిర్లక్ష్యం తోడవటంతో జలప్రభ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. బోర్లు వేసిన కొన్నిచోట్ల విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడం, ఇచ్చినా మోటారు లేకపోవడం సమస్యలతో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క బోరు కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు.

No comments:

Post a Comment