అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Saturday, September 15, 2012

అగ్గిపుల్లా..సబ్బు బిళ్లా..C/O ఫారిన్ షాప్

 9/15/2012 1:38:00 AM
మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి..
*మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి..
*యూపీఏ సర్కారు వివాదాస్పద నిర్ణయం.. వ్యతిరేకతలన్నీ బేఖాతరు
*51% వరకూ పెట్టుబడులు.. స్టోర్ల ఏర్పాటుకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి
*ఎయిర్‌లైన్స్‌లోకీ 49 శాతం దాకా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
*బ్రాడ్‌కాస్టింగ్ సేవల్లో ఎఫ్‌డీఐ 74శాతానికి పెంపు


లక్షలాది చిల్లర దుకాణాలకు మూత. కోట్లాది మంది ఉపాధి హుళక్కి. ముందుగా కాస్త మురిపించినా, మెల్లిమెల్లిగా తారస్థాయికి నిత్యావసరాల ధరలు. బహుళజాతి చిల్లర దిగ్గజాల గుత్తాధిపత్యం.. ఇలాంటి మరెన్నో విపరిణామాలు సమీప భవిష్యత్తులో దేశాన్ని ముంచెత్తనున్నాయా? ఇటువంటి పలు భయాందోళనలకు తావిచ్చేలా వివాదాస్పద సంస్కరణలకు యూపీఏ సర్కారు తాజాగా తెర తీసింది. డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ సబ్సిడీ కోతతో ‘ఆమ్ ఆద్మీ’ నడ్డివిరిచిన మర్నాడే విదేశీ రిటైల్ దుకాణాలకు తలుపులు బార్లా తెరిచేసింది. మల్టీ బ్రాండ్ రిటైల్, దేశీయ విమానయాన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు పచ్చజెండా ఊపింది.

విపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా.. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకంటూ మరిన్ని ‘కీలక’ నిర్ణయాలనూ ప్రకటించింది. తద్వారా మరో రాజకీయ దుమారానికి తెర తీసింది. ఈ నిర్ణయాలు కార్పొరేట్ రంగంలో పెట్టుబడులకు భారీగా ఊతమిస్తాయంటూ మార్కెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ చిల్లర దుకాణాలకు గేట్లెత్తడంపై బీజేపీ, వామపక్షాలతో పాటు, తృణమూల్ వంటి యూపీఏ పక్షాలు తీవ్రంగా భగ్గుమంటుంటే.. పాలక పక్షం మాత్రం.. ప్రభుత్వ విధానాల్లోనూ, ప్రధానిలో పనితీరులోనూ జడత్వం జడలు కట్టిందన్న విమర్శలను ‘దూకుడు’గా తిప్పికొట్టే ప్రయత్నం చేశామంటూ సంబరపడుతోంది...

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో కొంతకాలం వెనక్కి తగ్గిన కేంద్రం, తాజాగా మరోసారి మల్టీ బ్రాండ్ రిటైల్ తేనెతుట్టెను కదిపింది. ఈ రంగంలోకి 51 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) కీలక సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో పాటు క్యారీ ఫోర్, టెస్కో, మెట్రో వంటి విదేశీ కంపెనీలు భారత్‌లో మల్టీ బ్రాండ్ దుకాణాలను తమ సొంత బ్రాండ్లతో తెరిచేందుకు మార్గం సుగమం కానుంది. అయితే వాటి ఏర్పాటుకు ఆయా కంపెనీలను అనుమతించే నిర్ణయాధికారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం విడిచిపెట్టింది. తద్వారా తనపై నేరుగా విమర్శలు రాకుండా మెలిక పెట్టింది!

దాదాపు ఏడాది తర్వాత..

నిజానికి 51 శాతం మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్‌డీఐలకు 2011 నవంబర్‌లోనే కేంద్రం పచ్చజెండా ఊపడం, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీలతో పాటు విపక్షాలూ తీవ్రంగా ప్రతిఘటించడంతో నిర్ణయాన్ని నిలుపుదల చేయడం తెలిసిందే. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తామని అప్పట్లో ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా ఎలాంటి పురోగతీ లేకపోయినా తాజాగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. అది కూడా బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలను బీజేపీ పూర్తిగా స్తంభింపజేసిన వెంటనే పెట్రో వడ్డింపుతో పాటు ఈ వివాదాస్పద సంస్కరణల నిర్ణయాలు తీసుకోవడం విశేషం!

సింగిల్ బ్రాండ్.. షరతులకు మంగళం

సింగిల్ బ్రాండ్ రిటైల్‌లోకి ఎఫ్‌డీఐ పరిమితిని 51 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ గతంలోనే కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు 30 శాతం తయారీ వస్తువులను కచ్చితంగా దేశీయ చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్‌ఎంఈ)ల నుంచే కొనుగోలు చేయాలనే షరతులను కూడా ఇప్పుడు సడలించడం మరో పెద్ద విశేషం. అయితే అందుకోసం సదరు రిటైల్ సంస్థ భారత్‌లోనే తమ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల విదేశీ వాచీల తయారీ సంస్థలు, టెక్స్‌టైల్ వంటి కంపెనీలు సొంతంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు వీలవుతుందని శర్మ చెప్పారు. స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ తయారీ దిగ్గజం ఐకియా రూ.10,500 కోట్ల పెట్టుబడితో సింగిల్ బ్రాండ్‌లోకి వచ్చేందుకు ప్రణాళికలు ప్రకటించడం తెలిసిందే. అయితే ‘30 శాతం నిబంధన’ను సడలించాలని అది కోరింది.

మల్టీబ్రాండ్‌లో నిబంధనలివీ..

మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలోకి వచ్చే విదేశీ కంపెనీలు కనీసం 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.550 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇందులో సగం విధిగా గ్రామీణ ప్రాంతాల్లో నిల్వ, గిడ్డంగుల సదుపాయాల కల్పనకు వెచ్చిం చాలి. ఎఫ్‌డీఐ పెట్టిన మూడేళ్లలోపు ఈ మౌలిక వసతుల కల్పనకు నిధులను వెచ్చించాలి.
10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే విదేశీ భాగస్వామ్యంతో మల్టీబ్రాండ్ రిటైల్ స్టోర్లకు అనుమతిస్తారు. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు. పెద్ద నగరాల ఎంపిక నిర్ణయం ఆయా రాష్ట్రాలదే.

ఈ మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్‌డీఐల నిర్ణయాలకు సంబంధించి నోటిఫికేషన్లు, నిబంధనల పూర్తి వివరాలను పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) త్వరలోనే ప్రకటిస్తుంది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, అస్సాం, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, మణిపూర్ మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్‌డీఐలను స్వాగతిస్తుండగా బీహార్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, త్రిపుర, ఒడిశా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఇక విదేశీ ఎయిర్‌లైన్స్ హవా....

తీవ్ర ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న దేశీయ విమానయాన పరిశ్రమకు ఊరట లభించింది. దేశీయ విమానయాన కంపెనీల్లో విదేశీ ఎయిర్‌లైన్స్ 49 శాతం దాకా పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం అనుమతించింది. ఇకపై విదేశీ ఎయిర్‌లైన్స్ నేరుగా ఈక్విటీ వాటా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. దీంతో నిధుల కొరతతో అల్లాడుతున్న దేశీయ ఎయిర్‌లైన్స్‌కు ఉపశమనం లభిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ‘దేశీయ విమానయాన రంగంలోకి ఇప్పటిదాకా 49 నుంచి 100 శాతం దాకా ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నా విదేశీ విమానయాన కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు మాత్రం వీల్లేకపోయింది.

ఇప్పుడు అవి కూడా 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అనుమతించాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది’ అని పౌర విమానయాన మంత్రి అజిత్‌సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుత ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం విమానయాన వ్యాపారంతో సంబంధమున్న విదేశీ ఇన్వెస్టర్లకు దేశీయ ఎయిర్‌లైన్స్‌లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ 49 శాతం వాటా కొనుగోలుకు అవకాశం లేదు. అధిక పన్నులు, విమాన ఇంధన ధరల పెరుగుదల, విమానాశ్రయ ఫీజుల మోత, వడ్డీ రేట్ల భారం, మౌలిక వసతుల లేమి తదితర కారణాలతో ప్రస్తుతం దేశంలోని విమానయాన కంపెనీల్లో దాదాపు అన్నీ తీవ్ర నష్టాలు, రుణ భారంతో కొనసాగుతున్నాయి. ఇండిగో తప్ప ప్రభుత్వ రంగ ఎయిరిండియా, కింగ్‌ఫిషర్, జెట్ వంటివన్నీ నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. తాజా నిర్ణయంతో వాటిలో విదేశీ భాగస్వామ్యాలకు అవకాశం ఏర్పడింది. తద్వారా నగదు కొరత నుంచి వాటికి ఉపశమనం లభించొచ్చు.

పవర్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజీల్లో కూడా...

దేశంలోని పవర్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజీల్లోకి కూడా ఎఫ్‌డీఐలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఈ సంస్థల్లో 49% దాకా విదేశీ పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే ఈ అనుమతులు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(పవర్ మార్కెట్) నియంత్రణలకు లోబడి ఉంటాయి. ఇందులో 26% దాకా ఎఫ్‌డీఐ రూపంలో, మిగతా 23 శాతాన్ని విదేశీ సంస్థాగత పెట్టుబడుల(ఎఫ్‌ఐఐ) కింద అనుమతిస్తారు. ఎఫ్‌ఐఐ పెట్టుబడులను ఆటోమేటిక్ మార్గంలో, ఎఫ్‌డీఐలను ప్రభుత్వ ఆమోదిత మార్గంలో ఆమోదిస్తారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, పవర్ ఎక్స్ఛేంజ్ ఇండియాలు ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన వపర్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజీలు. విద్యుత్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజీలను పటిష్టం చేయడంతో పాటు విద్యుత్ లభ్యత పెరిగేందుకు, పంపిణీ మెరుగయ్యేందుకు ఇది దోహదపడుతుందని శర్మ చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, మరిన్ని పెట్టుబడులకు ఎఫ్‌డీఐలు దోహదం చేస్తాయన్నారు. ప్రస్తుత విధానం ప్రకారం విద్యుత్ రంగంలో(అణు విద్యుత్ తప్ప) 100% ఎఫ్‌డీఐలకు (ఆటోమేటిక్ రూట్) అనుమతి ఉంది.

బ్రాడ్‌కాస్టింగ్‌లోకీ మరిన్ని విదేశీ నిధులు..

దేశీయ ప్రసార మాధ్యమాల(బ్రాడ్‌కాస్టింగ్) రంగంలోనూ మరో ప్రధాన సంస్కరణల నిర్ణయం వెలువడింది. వివిధ బ్రాడ్‌కాస్టింగ్ సేవల్లో ఎఫ్‌డీఐ పరిమితిని ఇప్పుడున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే, టీవీ వార్తా చానళ్లు, ఎఫ్‌ఎం రేడియో, కరెంట్ అఫైర్స్, కంటెంట్ ప్రొవైడర్ల సంస్థల్లో మాత్రం ప్రస్తుత 26 శాతం ఎఫ్‌డీఐ పరిమితి యథాతథంగా కొనసాగుతుంది. డెరైక్ట్-టు-హోమ్, హై ఎండ్ స్కై (హెచ్‌ఐటీఎస్), మల్టీ సర్వీస్ ఆపరేటర్లు(ఎంఎస్‌ఓ), కేబుల్ టీవీల వంటి బ్రాడ్‌కాస్ట్ క్యారేజీ సర్వీస్ ప్రొవైడర్లందరికీ తాజా నిర్ణయం వర్తిసుంది. ఈ సేవల్లో ఎఫ్‌డీఐ పరిమితులన్నింటినీ ఏకస్థాయికి తీసుకు రావడమే దీని లక్ష్యం. ఇప్పటిదాకా కేబుల్ టీవీ, డీటీహెచ్‌ల్లో 49%, హెచ్‌టీఐఎస్‌లో 74% ఎఫ్‌డీఐ పరిమితులు కొనసాగుతున్నాయి. మొబైల్ టీవీలో కూడా 74 శాతం దాకా ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నారు. ఇకపై బ్రాడ్‌కాస్టింగ్‌లో 74 శాతం, 49 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్‌లోను, మిగతావాటిని ప్రభుత్వ ఆమోదం (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు-ఎఫ్‌ఐపీబీ) మార్గాన అనుమతిస్తారు.

ఉపసంహరణలకు ఊతం..

ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాలు (డిజిన్వెస్ట్‌మెంట్) జోరందుకునేందుకు వీలుగా కేంద్రం కీలక అనుమతులిచ్చింది. హిందుస్థాన్ కాపర్, ఆయిల్ ఇండియా, ఎంఎంటీసీ, నాల్కోల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు సీసీఈఏ ఆమోదముద్ర వేసింది. తద్వారా ఖజానాకు రూ.15 వేల కోట్ల నిధులు లభించవచ్చని అంచనా.

అయితే నైవేలి లిగ్నైట్‌లో (5 శాతం) వాటా విక్రయం, ఆర్‌ఐటీఈఎస్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ-10 శాతం వాటా) ఎజెండాలో ఉన్నా వాటిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఆయిల్ ఇండియాలో 10 శాతం, హిందుస్థాన్ కాపర్‌లో 9.59 శాతం ప్రభుత్వ వాటా విక్రయాల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. నాల్కోలో 12.15 శాతం, ఎంఎంటీసీలో 9.33% చొప్పున వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గాన అమ్మకానికి అనుమతించారు. ప్రస్తుతం ఆయిల్ ఇండియాలో ప్రభుత్వానికి 78.43%, హిందుస్థాన్ కాపర్‌లో 99.59 శాతం, నాల్కోలో 87.15 శాతం, ఎంఎంటీసీలో 99.33% వాటాలున్నాయి. 2012-13లో రూ.30 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటిదాకా ఒక్క కంపెనీలోనూ వాటాను విక్రయించలేదు. మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయంటూ విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్) ఐపీఓ (రూ.2,500 కోట్ల సమీకరణ అంచనా)ను వాయిదా వేయడం తెలిసిందే. గతేడాది కూడా రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో రూ.14,000 కోట్లే సమీకరించగలిగారు!

దేశ ప్రయోజనాల కోసమే: ప్రధాని

మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డీఐ తదితర నిర్ణయాలను ప్రధాని మన్మోహన్‌సింగ్ పూర్తిగా సమర్థించారు. కష్ట సమయాల్లో వృద్ధి జోరును పెంచడం, ఉద్యోగ కల్పనే వీటి లక్ష్యమని వివరించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ చర్యలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీటివల్ల భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందన్నారు.

అన్నింటికీ ఏకాభిప్రాయమంటే కుదరదు: ఆనంద్ శర్మ

అన్నింటికీ ఏకాభిప్రాయమంటే కుదిరే పని కాదని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ విలేకరులతో వ్యాఖ్యానించారు. ‘‘ఏకాభ్రిపాయం, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వంటి విషయాల్లో గందరగోళం అనవసరం. అందరినీ సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మల్టీ బ్రాండ్ రిటైల్ ఎఫ్‌డీఐలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాదనను గౌరవించాం. అందుకే దాని అమలును కూడా ఆమె విచక్షణాధికారానికే వదిలేస్తున్నాం’’ అని ఆయనన్నారు. విధాన జడత్వమనేది పూర్తిగా మీడియా సృష్టేనని, ప్రభుత్వ నిర్ణయాలేవైనా ప్రజాప్రయోజనాల మేరకు, అందరితో సంప్రదించాకే ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి అంశాన్నీ వ్యతిరేకించడం ద్వారా బీజేపీ సంకుచిత రాజకీయాలకు పాల్పడుతోందని కూడా విమర్శించారు.

No comments:

Post a Comment