అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, May 4, 2012

పసుపు రైతు విలవిల!

నిలువునా ముంచుతున్న దళారులు
మరింత దెబ్బ తీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పెట్టుబడి ఖర్చు కూడా దక్కని వైనం
సర్కారు తీరుపై వైఎస్సార్ జిల్లా రైతుల నిరసన


హైదరాబాద్, న్యూస్‌లైన్: పసుపు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓవైపు దళారుల దోపిడీ.. మరోవైపు సర్కారు విధానాలు అతడ్ని నిలువునా ముంచుతున్నాయి. దళారుల దోపిడీతో పెట్టుబడి కూడా దక్కకుండా విలవిల్లాడుతున్న పసుపు రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వారిని మరింత దెబ్బతీశాయి. క్వింటాల్ పసుపు పెట్టుబడి ఖర్చు రూ.5,500 అని రాష్ట్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం.. క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున మార్కెట్ జోక్యం పథకం(ఎంఐఎస్) ధర ఇస్తే సరిపోతుందని కేంద్రానికి తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మరింత నిర్దయగా క్వింటాల్ పసుపు ఎంఐఎస్ ధరను రూ.4 వేలుగా ఖరారు చేసింది. అనంతరం ఈ ధరకు రైతుల నుంచి పసుపు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీచేసింది.

అంతేకాకుండా మే 20వ తేదీ వరకే ఎంఐఎస్ అమలవుతుందని పేర్కొంది. రాష్ట్రంలో 5 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి కాగా, ఎంఐఎస్ కింద 54 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఎంఐఎస్ కింద ఒక రైతు కుటుంబం నుంచి కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలనే అడ్డగోలు నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, మెట్‌పల్లి, కడప, దుగ్గిరాల, నిర్మల్‌లలో అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్.. ఇప్పటికి కేవలం 3 వేల క్వింటాళ్ల పసుపును మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేసింది. సర్కారు తీరు ఇలా ఉండడంతో బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రైతులను దోచేస్తున్నారు. గతేడాది క్వింటాల్ పసుపు ధర రూ.12 వేల వరకు పలకగా.. ఇప్పుడు కనీసం రూ.3 వేలు కూడా రావడం కష్టంగా మారింది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో పసుపు పొడి ధర మాత్రం కిలో రూ.220 వరకు పలుకుతోంది.

క్వింటాల్‌కు రూ.12 వేలు ఇవ్వాలి...


పసుపు మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.12 వేలుగా నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పసుపు రైతు సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. పసుపు కొనుగోళ్లకు కాలపరిమితి విధించకుండా జూన్, జూలై వరకు కొనుగోలు చేయాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు. పసుపు మద్దతు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పసుపు రైతు సమాఖ్య, అఖిల పక్ష రైతు సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా రైతులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షలు గురువారం రెండోరోజు కొనసాగాయి. పసుపు రైతు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ దీక్షల్లో సి.సుదర్శన్‌రెడ్డి, డి.వి.నారాయణ, లెక్కల వెంకటరెడ్డి తదితరులు కూర్చున్నారు. పసుపు మద్దతు ధర రూ. 12 వేలుగా నిర్ణయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment