అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, September 17, 2012

'సింగూరు'పై కంగారు!

జలాశయానికి వరదకు రాకపోవడంతో ఇబ్బందులు
మెదక్‌ జిల్లాలో తాగునీటికి అంతరాయం
రాజధాని తాగునీటికి మరో గండం
అక్టోబరుపైనే ఆశలన్నీ..!
న్యూస్‌టుడే, హైదరాబాద్‌: వేసవి కష్టాలను దాటిన జలమండలికి వర్షాకాలంలో ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్నటిదాకా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌పై నెలకొన్న ఉత్కంఠ పూర్తిగా తొలగక ముందే... సింగూరు జలాశయంలో నీటిమట్టం తెరపైకొచ్చింది. గత ఏడాది ఈ సమయానికి భారీ వరదతో గేట్లు ఎత్తివేసిన అధికారులకు ఈసారి భిన్న పరిస్థితి ఎదురైంది. ఉన్న నీటి నిల్వలను కొద్దికొద్దిగా తాగునీటికి మాత్రమే వాడుకోవాల్సిన విషమ పరిస్థితి నెలకొంది. మెదక్‌ జిల్లాలోని అనేక ప్రాంతాల తాగునీటికి అంతరాయం కలగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాగునీటికి పూర్తిగా కోత పెట్టి... రాజధాని తాగునీటి కోసమే ఉన్న నీటిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో నెల రోజుల్లో జలాశయానికి వరద కళ లేకుంటే రానున్నది గడ్డుకాలమేనని అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర తాగునీటి పరిస్థితి విచిత్రంగా తయారైంది. చెంతన ఉన్న జంట జలాశయాలు ఒట్టిపోతుండగా... వందల కిలోమీటర్ల దూరంలోని ప్రధానప్రాజెక్టులు సైతం గుబులు రేపుతున్నాయి. నిన్నటికి నిన్న నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు వరద నీరు రాకపోవడంతో పరిస్థితి విషమంగా తయారైంది. ఇప్పటికీ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానప్పటికీ శ్రీశైలం రిజర్వాయర్‌లోకి కొద్దిపాటి నీరైనా వచ్చింది. రాజధాని తాగునీటికి ఎలాగూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నందున నెలల తరబడి సరఫరాకు ఢోకాలేదని జలమండలి అధికారులు ధీమాగా ఉన్నారు. శ్రీశైలానికి ఆ కాస్త్తెనా వరద రాకుంటే పరిస్థితి మరొలా ఉండేది. తాత్కాలికంగానైనా సమస్య నుంచి ఊరట లభించగా... ప్రస్తుతం సింగూరు జలాశయాలపై ఆందోళన మొదలైంది.
ఆ జలకళ నేడేది..?
సింగూరు జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 30 టీఎంసీలు కాగా...సాధారణంగా జులై, ఆగస్టుల్లో వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో గతఏడాది ఈపాటికే జలాశయానికి జలకళ వచ్చింది. ఏకంగా గేట్లు తెరవాల్సిన మేరలో వరద వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం కళ తప్పింది. ఆదిలో కొంతమేర వచ్చిన వరద మొహం చాటేసింది. దీంతో కేవలం 12 టీఎంసీల వరకు మాత్రమే నీటి నిల్వ ఉంది. ఈ క్రమంలో మంజీరాలో నీళ్లు తగ్గడంతో కొన్నిరోజులుగా మెదక్‌ జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు వందలాది గ్రామాల తాగునీటికి తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్‌ నగరానికి కూడా వారం రోజులకుసరిపడే నీటి నిల్వ మాత్రమే ఉండటంతో ఎలాగోలా ఆదివారం 0.25 టీఎంసీలను సింగూరు నుంచి మంజీరాకు తరలించి, సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌ తాగునీటికి ఢోకా లేనప్పటికీ ఈ సీజన్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంటేనే మరుసటిఏడాది వేసవిలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది.
నెల రోజుల్లో వరద రాకుంటే కష్టమే
సింగూరు జలాశయానికి నెల రోజులల్లోగా వరద రాకుంటే మాత్రం ప్రస్తుతం ఉన్న నిల్వలనే వాడుకుంటూ ఉండాలి. ఈ చొప్పున వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మాత్రమే ఇవి సరిపోతాయి. దీంతో మెకద్‌లోని పలుప్రాంతాల రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదు. నెల రోజుల్లో ఏడెనిమిది టీఎంసీలు వచ్చినా వచ్చే ఏడాది వేసవి గడస్తుందని, ఆతర్వాత వర్షాలపై ఆశలు పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఈ మేర వరదకూ గండిపడితే మాత్రం రానున్నది గడ్డుకాలమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతాన్ని పరిశీలిస్తే సింగూరుకు ఒకేసారి వరద వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈదఫా గతంలో కొంతమేర వచ్చి ఆగిపోయింది.
* గత పన్నెండేళ్లుగా (2000 సంవత్సరం నుంచి) సింగూరు జలాశయంలో అక్టోబరు నాటికి నీటిమట్టం స్థాయి 521 అడుగుల కంటే ఎక్కువగా ఉంది. కేవలం 2004, 2009లో మాత్రమే 519 అడుగుల వరకు ఉంది. మరో నెల రోజుల్లో వరద రాకుంటే ఆ జాబితాలోకి 2012సంవత్సరం కూడా చేరనుంది.

No comments:

Post a Comment