అపార్ట్‌మెంట్ పక్క భూమి వివాదం
పరారీలో యజమాని
పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు చూపిన తెగువ వెలకట్టలేనిది. ఆదివారం రాత్రి 8:30గంటల సమయంలో బాబా అపార్ట్‌మెంటు పక్కనున్న గుడిసెలో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఐదు అంతస్థుల్లోని 10ప్లాట్ల వాసుల హహాకారాలు స్థానికులను కలచివేసింది. తొలుత మొదటి, రెండు అంతస్థుల్లోకి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో కొందరు బయటకు రాగా, మరికొందరు మంటల్లో మసి బారారు. మూడు, నాలుగు, ఐదు అంతస్థుల్లో నివసించే వారు కిందకు రాలేక టెర్రర్స్‌పైకి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికులు మధుసూదన్‌రెడ్డి, ఎం.చంద్రకాంత్‌గౌడ్, చంద్రకిరణ్, కె.మురళీ, శాంతిభూషణ్, దస్తగిరి, కడారి జనార్దన్‌రెడ్డి, ఎం.రాఘవరెడ్డి తదితరులు ఒకవైపు పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సీఐ నారాయణగౌడ్, సిబ్బందితోపాటు తెగువతో సహాయ చర్యలు చేపట్టి పలువురిని కాపాడారు. కాలిబూడిదైన మృతదేహాలను సైతం బయటకు తీసుకువచ్చారు. కాగా, ప్లాటు నంబరు 401, 402ల్లోని నివాసితులు పై అంతస్థుకి చేరుకున్నారు. దీంతో స్థానికులు పక్క అపార్ట్‌మెంటులో నుంచి ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంటుపైకి నిచ్చెన వేసి అక్కడ చిక్కుకున్న వారిని రక్షించారు. ఇందులో ఏడు నెలల గర్భవతి సైతం ఉన్నారు. ఆదివారం కావడంతో మొత్తం 10 ప్లాట్లలోని మూడు ప్లాట్ల కుటుంబాలు బయటకు వెళ్లాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ, వారి ఇళ్లలో ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయారు. ప్లాట్లలో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు రాత్రి ఇరుగు పొరుగు వారి ఇళ్లలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం కొందరు తమ సామగ్రిని తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. నాలుగేళ్ల క్రితం సంబరంగా ఫ్లాట్లు కొనుగోలు చేసి, గృహ ప్రవేశాలు చేసిన యజమానులు బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్లిపోయారు. ప్రాణాలను తెగించి స్థానికులను రక్షించిన యువకులను, సీఐ నారాయణగౌడ్‌ను హోంమంత్రి సబితారెడ్డి, సీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు.
స్వస్థలాలకు మృతదేహాలు
ఉస్మానియా ఆసుపత్రి: మణికొండ శ్రీరామ్‌నగర్ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన భౌతిక కాయాలకు సోమవారం ఉస్మానియా మార్చురీలో శవ పరీక్ష నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించడంతో అంత్యక్రియలకు స్వస్థలాలకు తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాలకు సోమవారం ఉదయం ఉస్మానియా మార్చురీలో ఫోరెన్సిక్ విభాగాధిపతి హరికృష్ణ ఆధ్వర్యంలో శవ పరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాలకు దహన సంస్కారాల కోసం ఒంగోలు, గుంటూరు జిల్లాల్లోని ఎడ్లపాడు ప్రాంతాలకు తీసుకుని వెళ్లిపోయారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటపతిరాజు సోమవారం ఉదయం ఉస్మానియా మార్చురీకి చేరుకుని మృతదేహాలకు సత్వరమే శవ పరీక్ష చేయాల్సిందిగా ఫోరెన్సిక్ వైద్యాధికారులను కోరారు.
ఆ నిర్మాణం.. నిబంధనలకు విరుద్ధం
మణికొండ, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణంతోనే పెను ప్రమాదం సంభవించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంటు 220 గజాల విస్తీర్ణంలో బిల్డరు సెల్లార్‌తోపాటు ఐదు అంతస్థులను నిర్మించారు. ఆదివారం అర్ధరాత్రి సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్ అపార్ట్‌మెంటులోని మెట్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్లపై నుంచి ఒకరికి మించి వెళ్లలేని పరిస్థితితోపాటు సెట్‌బ్యాకులు లేకుండా రోడ్డుకు ఆనుకుని అపార్ట్‌మెంటు నిర్మించడంపై కలెక్టర్ మండిపడ్డారు. చిన్నపాటి స్థలంలో ఇన్ని అంతస్థులకు ఎలా అనుమతి ఇచ్చారని స్థానిక అధికారులను ఆమె ప్రశ్నించారు. దీనిపై గ్రామ కార్యదర్శి సత్యపాల్‌రెడ్డిని ీన్యూస్‌టుడే' వివరణ కోరగా సెల్లార్+జీ+3తో అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అదనంగా నిర్మించిన అంతస్థును బిల్డరు బీపీఎస్‌లో రెగ్యులర్ చేయించుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తుల మృతదేహాలను ఇరుకు మెట్లపై నుంచి కిందకు తీసుకురావడం ఒకింత కష్టంగా మారింది.
డీపీవో పరిశీలన
మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృతి చెందిన ప్రాంతాన్ని జిల్లా పంచాయతీ అధికారి ఈ.ఎస్.నాయక్ పరిశీలించారు. సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్, సైబరాబాద్ సీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగారెడ్డి జేసీ ముత్యాలరాజు, చేవెళ్ల ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ ముకుంద్‌రెడ్డి తదితరులు సోమవారం ఉదయాన్నే చేరుకున్నారు. అక్రమాలకు డీపీవోనే కారణమని స్థానిక నేతలు జేసీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా డీపీవో సంఘటన స్థలానికి రాలేదని వివరించారు. డీపీవో నాయక్ సమస్య సర్దుమణిగాక సాయంత్రం 4గంటలకు సంఘటన స్థలం పరిశీలించారు.
పుప్పాలగూడలో అంత్యక్రియలు
లిఫ్టులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వాచ్‌మెన్ భాస్కరరావు మృతదేహానికి పుప్పాలగూడ శ్మశాన వాటికలో దహన సంస్కారాలను పూర్తి చేశారు. భార్య లక్ష్మీ, కూతురు శాంతకుమారి తదితరుల రోదనలు స్థానికులను కలచి వేసింది.
No comments:
Post a Comment