అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, November 28, 2012

‘అగ్ని'కి ఆహుతే!: ప్రమాదాల నివారణకు చర్యలు శూన్యం




అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటులో అలసత్వం
ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఆస్తులు బుగ్గికావాల్సిందే... ఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనాలు వచ్చే సరికి సమయం పడుతోంది. దీంతో ప్రజల ఆస్తులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. దీన్ని నిరోధించేందుకు అవసరమైన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు తమ సొత్తును పోగొట్టుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఆదివారం రాత్రి మణికొండలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చిన 45 నిముషాల తర్వాత అగ్నిమాపక వాహనం ఘటన స్థలానికి చేరకుందని స్థానికులు పేర్కొంటున్నారు. వాహనం ఆలస్యంగా రావడం వల్లే ఆరుగురు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతం 16 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. వాస్తవానికి ప్రతి 50వేల జనాభాకు ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 70 లక్షలకుపైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ సుమారు 150 వరకూ అగ్నిమాపక కేంద్రాలు ఉండాల్సిఉంది. అయితే ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు తొమ్మిది రెట్లు అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో కొత్తగా 18 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్తగా ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ గత ఏడాదిమేలో ఉత్తర్వులు జారీ చేసింది. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌, మదాపూర్‌, మహేశ్వరం, హైకోర్టు, అసెంబ్లీ వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటి వరకూ కూడా వీటిల్లో అనేకం భవన నిర్మాణాలకు నోచుకోలేదు. ఇప్పటికీ భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. దీంతో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు ఒక ప్రహసనంగా మారింది. ఏడాదిన్నర కావస్తున్నప్పటకీ ఇప్పటి వరకూ భూ సేకరణ వద్దే ఆగిపోయింది. దీంతో అగ్నిప్రమాదాలు జరిగిన సందర్భాల్లో సుదూర ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చే సరికే ప్రజల సొమ్ముతోపాటు ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అగ్నిమాపక శాఖకు వాహనాల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65 వరకూ వాహనాల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. జిల్లాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వాహనాల కేటాయింపులు జరుపుతుంటారు. ఈ లెక్కన గ్రేటర్‌కు వచ్చే వాహనాలు కూడా చాలా స్వల్పంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
* కూకట్‌పల్లిలో ఏర్పాటు చేయాలనుకున్న అగ్నిమాపక కేంద్రానికి ఇప్పటికీ భూసేకరణ చేయలేదు. దీంతో తాత్కాలికంగా జేఎన్‌టీయూలో పెడతామని అధికారులు ప్రకటించినా కూడా అమల్లోకి రాలేదు.
* మాదాపూర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ నిర్మించాలనే విషయమై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం కాకపోవడంతో ప్రస్తుతం ఏపీఐఐసీ భవనంలో ఏర్పాటు చేశారు. అయితే సిబ్బంది నియామకం మాత్రం చేపట్టలేదు.
* అసెంబ్లీలోనూ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న వాహనాన్ని తాత్కాలికంగా ఇక్కడ తీసుకువచ్చి ఉంచారు.

No comments:

Post a Comment