అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, May 7, 2012

అనంతగిరి పర్యటకం... ఇక ఖరీదేనోయ్‌!


గది అద్దెలు పెంచేసిన పర్యటకశాఖ
వారాంతపు సెలవుల్లో 90 శాతం అదనం
న్యూస్‌టుడే, వికారాబాద్‌
'అనంత' అందాలను వీక్షించేవారికి.. అందుబాటు ధరలతో వసతి కల్పిస్తున్నాం.. రారమ్మని పిలిచిన పర్యటకశాఖ అధికారులు.. జనం తాకిడి ఎక్కువకాగానే లాభాలు మూటగట్టుకోవచ్చని ఆశించారు.. గది అద్దెలు పెంచేసి పర్యటలకు షాక్‌ ఇచ్చారు.. అనంతగిరి పర్యటకం ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు.. నగర జీవనంతో అలసిన తమకు దగ్గర్లో విడిది కేంద్రం దొరికిందని ఆశించినవారికి భంగపాటు మిగిల్చారు..! 2010 ఫిబ్రవరి 1న వికారాబాద్‌కు ఆరు కి.మీ దూరంలోని అనంతరిలో పర్యటక భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 34 గదులు ఉన్నాయి. వీటితో పాటు ఈతకొలను, జిమ్‌, బార్‌ అండ్‌ రెస్టారెంటు అందుబాట్లో ఉన్నాయి. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఈ గదులకు పన్నులతో కలిపి రూ.1650 వసూలు చేసేవారు. సరిగ్గా 15 నెలలు గడిచిందో లేదో పర్యటకశాఖ ఇక్కడ గది అద్దెలను అమాంతం పెంచేయడం గమనార్హం.
సాధారణం వేరు... వారాంతానికి వేరు...
తాజాగా మే ఒకటి నుంచి పర్యటకశాఖ అధికారులు సాధారణ, వారాంతపు రోజులంటూ రెండు రకాల అద్దెలు వసులు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఒక్కో గదికి రూ.790 చొప్పున పెంచేశారు. అంటే రూ.2440 చెల్లించాలన్నమాట. ఇక వారాంతపు సెలవులైన శుక్ర, శని, ఆదివారాల్లో ఒక్కో గదికి రూ.2780 చొప్పున చెల్లించాలి. అంటే రూ.1130 బాదుడన్న మాట. ఒక్కసారి భారీగా అద్దెలు పెంచటం ఏమిటని పర్యటకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తాకిడి పెరగడంతో...
రాష్ట్ర వ్యాప్తంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కబోస్తుంటే అనంతగిరిలో మాత్రం 33 డిగ్రీలు దాటడం లేదు. సముద్రమట్టానికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ఉండటం, చెట్లు, లోయలతో కూడుకొన్న ప్రదేశం కావటంతో ఇక్కడ చల్లగా ఉండి పర్యటకుల్ని విశేషంగా ఆకర్శిస్తోంది. దీంతో పర్యటకుల తాకిడి భారీగా పెరిగింది. వారాంతపు సెలవుల్లో పర్యటకులు పోటెత్తుతున్నారు. అనంతగిరిలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు నగరం, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మొన్నటివరకు పర్యటకులు రావటంలేదని ఆందోళన చెందిన పర్యటకశాఖ నేడు ఉత్సహంతో అద్దెలను పెంచేసింది.
అనధికారికంగా అదనపు బాదుడు...
గతంలో పర్యటక కేంద్రంలో గదులను అద్దెకు తీసుకొన్నవారికి పిల్లలంటే అదనపు రుసుం లేదు. గది బుక్‌ చేసుకొన్నవారు ఉచితంగానే ఈత కొలను, జిమ్‌ ఉపయోగించుకొనే సౌకర్యం కల్పించారు. వీటితో పాటు కాఫీ, ఉదయం అల్పాహారం ఉచితంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం వీటికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
పైనుంచే ఆదేశాలు -మేనేజర్‌, పర్యటక భవనం
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పర్యటక భవనంలో అద్దెలు పెంచాం. ఈ విషయంలో మా ప్రమేయం ఏమీ లేదు.

No comments:

Post a Comment