విదేశాల్లో ఒంగోలు గిత్త వైభవం
మహానంది బీటీ.. మోన్‌శాంటోకు సిరి
మన వేపకు విదేశాల్లో పేటెంట్
తరలిపోతున్న మన జన్యు సంపద
బలిష్ఠమైన కాయం! చూడచక్కని రూపం! ఎత్తయిన మూపురం! నడకలో రాజసం! చేతులు నొప్పెట్టేలా పితికినా ఇంకా వచ్చే పాలు! ఇవి మన ఒంగోలు జాతి పశువుల విశిష్టత! ఒంగోలు జాతికి పెట్టింది పేరైన మన దేశంలో ప్రస్తుతం ఉన్న పశువులు 50 లక్షలు మాత్రమే! కానీ, మన దేశం నుంచి ఒక్కొక్క గిత్తను, వాటి వీర్యాన్ని ఎత్తుకెళ్లిన బ్రెజిల్‌లో ఎన్ని ఉన్నాయో తెలుసా!? 12 కోట్లు!!
మీరు బీటీ కాటన్ పత్తి విత్తనాలు కొన్నారా!? వాటికి గుత్త హక్కుదారు మోన్‌శాంటో అని అనుకుంటున్నారా!? అయితే, మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, ఆ బీటీకి పుట్టినిల్లే మన కర్నూలు జిల్లాలోని మహానంది!
హైదరాబాద్, సెప్టెంబర్ 16 : సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్ వేప, రుచికరమైన బాస్మతి నుంచి అత్యధిక దిగుబడి ఇచ్చే పత్తి వరకూ అన్నీ మన జాతి సంపదలే! కానీ, వాటిపై పేటెంట్‌ను మాత్రం ఇతర దేశాలు ఎగరేసుకుపోయాయి! మన జాతికే జవజీవాలను ఇచ్చే జీవ వైవిధ్యాన్ని దొంగిలించాయి. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకపోతే మన దేశ జీవ వైవిధ్యాన్ని ఎవరూ కాపాడలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత విలువైనది జన్యు పదార్థం.
మొక్కది కావచ్చు. జంతువుది కావచ్చు. అది ఎల్లలు దాటిపోయిందంటే తిరిగి తెచ్చుకోవడం దాదాపు అసాధ్యం. వాస్తవానికి జీవ వైవిధ్యానికి వివిధ ప్రదేశాల్లోని జంతువులు, మొక్కల జన్యు పదార్థమే కీలకం. కానీ, మన ప్రభుత్వాల అసమర్థత వల్ల, అధికారులు, పరిశోధకుల స్వార్థం వల్ల లక్షల కోట్ల రూపాయల విలువైన జన్యువులు విదేశాలకు తరలిపోయాయి. దురదృష్టకరమైన అంశమేమిటంటే, ఈ అంశంలో మన చట్టాలు కూడా విదేశీ కంపెనీలకు, వారి ప్రతినిధులకు సహకరిస్తున్నాయి.
మన దేశంలో విదేశీ విత్తనాల కంపెనీలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేది ఆంధ్రప్రదేశ్‌పైనే. దీనికి ప్రధాన కారణం ఇక్కడి జీవ వైవిధ్యం. అత్యంత విలువైన వేప నుంచి ఎక్కువ దిగుబడి ఇచ్చే పత్తి వరకూ మన రాష్ట్రంలో దొరుకుతాయి. కానీ, బహుళజాతి కంపెనీలు వాటిని దొంగిలించి విదేశాలకు తరలించుకుపోయాయి. ఉదాహరణకు, కర్నూలు జిల్లాలోని మహానంది ప్రాంతంలో బ్యాక్టీరియం బేసిలస్ త్రూఇన్‌జిన్‌సిస్ (బీటీ) అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విత్తనాల జన్యు మార్పిడిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనిని మోన్‌శాంటో కంపెనీ 1992లో సేకరించి విదేశాలకు తరలించింది. దీనిని ఉపయోగించి విత్తనాలను తయారు చేయడం ప్రారంభించింది.
ఈ విషయాన్ని మన ప్రభుత్వం 2007లో గ్రహించింది. అన్ని రకాల శాస్త్రీయ విశ్లేషణల్లోనూ ఇది మహానంది ప్రాంతానికి చెందినదే అని తేలింది. దీంతో దానిని ఉపయోగించి తయారు చేసే విత్తనాలపై రెండు శాతం రాయల్టీ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం మోన్‌శాంటోకు నోటీసులు పంపింది. అయితే, ఇక్కడ చట్టాలు అడ్డువచ్చాయి. జీవ వైవిధ్య చట్టం (బీడీఏ) 2002లో అమల్లోకి వచ్చింది. దానికి ముందే బీటీ విదేశాలకు తరలిపోయింది కాబట్టి ఈ విషయంపై అమెరికా కోర్టుల్లోనే పోరాడాలని లాయర్లు తేల్చి చెప్పారు. అలాగే, ఆచార్య రంగా విశ్వవిద్యాలయం నుంచి నరసింహా అనే బీటీ కాటన్ విత్తనాల జన్యు పదార్థం కూడా తరలిపోయింది.
ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇందుకు కారణం, జీవ వైవిధ్యానికి సంబంధించి మన చట్టాలు సమర్థంగా లేవు. ఉదాహరణకు, మన దేశం నుంచి తీసుకువెళ్లే ప్రతి జీవ పదార్థానికి జాతీయ జీవ వైవిధ్య అథారిటీ అనుమతి ఉండాలి. కానీ, జీవ వైవిధ్య చట్టంలోని 40వ అధికరణ ప్రకారం కొన్నిటికి మినహాయింపు ఉంది. అదే విదేశాల్లో అయితే- ఒక్క విత్తనాన్ని కూడా అనుమతి లేకుండా విదేశాలకు తీసుకు వెళ్లనివ్వరు. దీనికి సంబంధించి రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు చైర్మన్ హంపయ్యకు ఒక ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది.
రష్యా నుంచి జొన్న విత్తులు భారత్‌కు తీసుకు రావాలని హంపయ్య భావించారు. అనుమతులు తీసుకున్నా మాస్కో ఎయిర్‌పోర్టులో ఆ విత్తనాలను తిరిగి పరిశీలించారు. కానీ,ఇక్కడికి వచ్చిన తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వాటిని ఎవరూ పట్టించుకోలేదు. " కస్టమ్స్ వంటి శాఖలు జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశాల్లో క్రియాశీలంగా వ్యవహరించాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి'' అంటారు హంపయ్య.
ఒంగోలు పశువులు తరలిపోయాయి
ఈ ఏడాది జూలైలో పనామాలో జరిగిన వరల్డ్ బ్రహ్మ బుల్ కాంగ్రెస్‌లో ఒక ఎద్దును రూ.3 కోట్లకు కొనుగోలు చేశారు. వాస్తవానికి అది మన ఒంగోలు జాతి ఎద్దే. గుండ్లకమ్మ, ఆలూరు నదుల మధ్య ప్రాంతంలోని ఒంగోలు, కందుకూరు మండలాలు ఈ జాతి పశువుల జన్మస్థలం. 150 ఏళ్ల క్రితం ఒంగోలు జాతి ఎద్దులను, ఆవులను కొందరు వర్తకులు బ్రెజిల్‌కు తీసుకువెళ్లారు. వాటి సంతతే బ్రెజిల్‌లో కనిపించే ఎద్దులు. ఎక్కువ పాలు ఇవ్వడం, అక్కడి పశువులకు వచ్చే ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వీటికి రాకపోవడం, రుచికరమైన మాంసం లభించటం మొదలైన కారణాలతో వీటికి బ్రెజిల్‌లో క్రేజ్ పెరిగింది.
ఆ తర్వాత ఈ జాతి పశువులు ఆస్ట్రేలియాకు, అమెరికాకు ఎగుమతి అయ్యాయి. దురదృష్టకరమైన అంశమేమిమంటే- ఒకవైపు ఈ జాతి పశువులు మన దేశంలో అంతరించిపోతూ ఉంటే బ్రెజిల్‌లో మాత్రం రోజురోజుకు వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికీ విదేశాలకు చెందిన అనేకమంది వ్యాపారులు ప్రకాశం జిల్లాకు వచ్చి ఈ పశువులను రహస్యంగా తరలించుకుపోతూ ఉంటారు. చిత్తూరుకు చెందిన పునుగౌరు జాతి ఆవులకు కూడా విదేశాల్లో క్రేజ్ ఉంది. వీటిని పరిరక్షించుకోకపోతే అతి త్వరలో ఒంగోలు జాతి పశువుల మాదిరిగానే వీటి సంతతి కనుమరుగవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
బయో డీజిల్ దొంగిలించారు
బయో డీజిల్ తయారీలో జత్రోపా అనే మొక్క సమర్థంగా పని చేస్తుంది. జత్రోపా ద్వారా బయో డీజిల్‌ను తయారు చేస్తే ఏటా రూ.10 వేల కోట్లను ఆదా చేయవచ్చు. దేశంలో అనేక ప్రాంతాల్లో జత్రోపాను పండిస్తున్నా- ఛత్తీస్‌గఢ్‌లోని పెండ్రా, సుర్‌గజా జిల్లాల్లోని జత్రోపాకు ఒక విశిష్టత ఉంది. వీటినుంచి చాలా ఎక్కువ బయో డీజిల్ ఉత్పత్తి అవుతుంది. దీంతో, ఈ మొక్కలపై రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు ప్రారంభించింది. వీటిని ఆలంబనగా చేసుకొని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2015 నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం వాహనాలన్నింటినీ బయో డీజిల్‌తో నడుపుతామని ప్రకటించింది.
దీనిపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది కూడా. రాష్ట్రంలో 16 జిల్లాల్లో 8 కోట్ల జత్రోపా చెట్లను నాటింది. ఈ నేపథ్యంలో 2009లో జత్రోపా జన్యు పదార్థాల (జత్రోపా కార్‌కస్)ను బ్రిటన్‌కు చెందిన డీ1 ఆయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసే సునీల్ పూరీ అనే ఉద్యోగి దొంగిలించాడు. పోలీసులు పూరీ ఇంటిపై దాడులు చేసినప్పుడు జన్యు పదార్థాలు లభించాయి కూడా. ఇవన్నీ పెండ్రా, సుర్‌గజా జిల్లాల్లో దొరికే మొక్కల జన్యు పదార్థాలే. దీనికి సంబంధించి ప్రభుత్వం పూరీపై కేసు పెట్టింది. కానీ, డీ1 కంపెనీపై మాత్రం ఎటువంటి కేసు పెట్టలేదు.
పెద్దలు చెప్పారిలా..
జీవవైవిధ్యానికి ప్రధాన ఆధారమైన చెట్లను కాపాడుకోవాలన్న విషయం మన పూర్వీకులకు బాగా తెలుసు. ఈ సందేశాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికే దీన్ని మన సంస్కృతిలో భాగంగా మార్చారు. స్థల వృక్షాలను పూజించడం ఆ కోవలోకే వస్తుంది. ఏ గుడిలోనైనా దాదాపు ఏదో ఒక వృక్షం ఉంటుంది.
ఒక్కో దేవుడికి ఒక్కో రకం చెట్టును ప్రతిరూపంగా కూడా కొలుస్తారు. దాన్నే సంస్కృతంలో స్థల వృక్షం అంటారు. దాని మొదలు దగ్గర దేవుడి మూర్తిని ప్రతిష్టిస్తారు. గుడికి వచ్చే భక్తులు దాన్ని కూడా పూజిస్తారు. అంటే ప్రకృతిని పూజిస్తారన్నమాట. కొన్ని ఆలయాల్లో వందల ఏళ్ల క్రితం నాటి మహా వృక్షాలు కూడా ఉన్నాయి. వాటిపై అనేక రకాల పక్షి, కీటక జాతులు ఆవాసమేర్పరచుకుంటాయి. ఇది కూడా జీవ వైవిధ్య పరిరక్షణలో భాగమే. ఇదే మన పూర్వీకులు ముందు తరాలకు చాటిన సందేశం.
పరపరాగ ప్రయాణం
ఒక పూవు పూసింది. కాయ కాసింది. పంట పండింది. వీటన్నింటికీ మూల కారణం... పరపరాగ సంపర్కం! ఒక పువ్వు నుంచి మరో పువ్వు పైకి పుప్పొడిని మోసుకెళుతూ పరపరాగ సంపర్కానికి కారణమయ్యే జీవులు ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల రకాలు ఉన్నాయి. అందులో... 25వేల నుంచి 30 వేలు ఈగల జాతికి చెందినవే. ఇంకా... మిడతలు, సీతాకోక చిలుకలు, కుమ్మరి పురుగులు, చిమ్మటపురుగులు పరపరాగ సంపర్కానికి దోహద పడుతున్నాయి. ఇవి లేకుంటే... మనకు ఆహారమూ లేదు!
No comments:
Post a Comment