సిటీబ్యూరో, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని.. చదువులకు కేరాఫ్ అడ్రస్.. పెద్ద పెద్ద విద్యాసంస్థలన్నీ కొలువుదీరిన కేంద్రం.. చెప్పుకోవడానికి విశేషాలు చాలా ఉన్నా.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మాత్రం ఈ హైటెక్ నగరానికి ఈ ఏడాది నిరాశే మిగిలింది. గతేడాది టాప్‌టెన్‌లో కొన్ని స్థానాలు
దక్కించుకున్నప్పటికీ.. ఈసారి చోటు దక్కకపోవడం గమనార్హం. మంగళవారం విడుదలైన ఫలితాలను పరిశీలిస్తే... రాష్ట్ర స్థాయిలో టాప్ ‘టెన్’ మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాలో నగరం నుంచి ప్రాతినిథ్యమే లేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.
పొరుగు జిల్లాల నుంచి లెక్కకు మించి విద్యార్థులు టాప్ మార్కులు సాధించగా.. హైదరాబాద్ జిల్లా విద్యార్థులకు వారి సరసన ఏ గ్రూపులోనూ చోటు దక్కలేదు. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు కూడా ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో స్థానాన్ని దక్కించుకోలేక పోయారు. ఒక్క బైపీసీ గ్రూపులో మాత్రం బి.సంతోషిరూప (988), కె.నరేశ్‌బాబు (986) మార్కులు సాధించి కాస్తంత పరువు నిలిపారనుకుంటే.. చివరికీ అదీ మిగల్లేదు. సంతోషిరూప స్వస్థలం కర్నూలు జిల్లా కాగా, నరేశ్‌బాబుది వరంగల్ జిల్లా హన్మకొండ కావడం విశేషం.
ఇతర జిల్లాలకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థులు.. నగర శివారులోని కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నారని తెలిసింది. ఉత్తీర్ణత శాతం రీత్యా చూస్తే మాత్రం హైదరాబాద్ గతేడాది కంటే ఒక మెట్టు పెకైక్కింది.
హైదరాబాద్‌లో 59%..
రంగారెడ్డిలో 66%..
ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో హైదరాబాద్ జిల్లాలో 59 శాతం, రంగారెడ్డి జిల్లాలో 66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణు లయ్యారు. రెండు జిల్లాల్లోనూ ఉత్తీర్ణత విషయంలో బాలికల హవా కొనసాగింది. హైదరాబాద్ జిల్లా నుంచి ఈ ఏడాది 53886 మంది పరీక్షలు రాయగా 31618 మంది పాసయ్యారు. పాసైనవారిలో బాలురు 51.64 శాతం ఉండగా, బాలికలు 66.08 శాతం ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది మొత్తం 82672 మంది రాయగా 54435 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 63.03 శాతం బాలురు కాగా 32224 మంది 69.54 శాతం బాలికలు పాసయ్యారు.
No comments:
Post a Comment