ఎరువుల ధర పెంపు, విత్తనాల సమస్య
డీఏపీ భారం రూ. 8.90 కోట్లు
వచ్చే ఖరీఫ్‌లో వివిధ పంటల సాగుకు జిల్లాలో 9,91,700 బస్తాల డీఏపీ అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఒక్కో బస్తాపై రూ.90 పెరిగే అవకాశం ఉండటంతో డీఏపీ వినియోగం ద్వారా జిల్లా రైతులపై దాదాపు రూ. 8.90 కోట్ల భారం పడనుంది. ఇది అన్నదాతకు అశనిపాతమే!
రూ.50 పెరిగితే... రూ.10.45 కోట్ల భారం
భారత ఎరువుల ఉత్పత్తిదారుల సంఘం అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే.. బస్తా యూరియాపై రూ.50 వరకు ధర పెరగనుంది. జిల్లాలో వచ్చే ఖరీఫ్‌లో 20,90,640 బస్తాల యూరియా అవసరమని అంచనా. ఒక్కో బస్తాపై రూ. 50 చొప్పున పెరిగితే జిల్లా రైతులపై యూరియా వినియోగం ద్వారా రూ.10.45 కోట్ల భారం పడుతుంది.
ఐఆర్-64 రాయితీకి మంగళం
పాతరకం విత్తనాలపై రాయితీని ఎత్తివేసి, రైతులు ఇతర రకాల విత్తనాలు సాగు చేసే దిశగా మళ్లించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఐఆర్-64 విత్తనాలపై రాయితీని ఎత్తేసింది. ఈ విషయంలో ముందస్తుగా రైతుల్ని చైతన్యం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొత్త రకం వంగడాలను రాయితీపై ఇస్తామని కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో వచ్చే ఖరీఫ్‌లో దాదాపు 10 వేల ఎకరాల్లో ఐఆర్-64 వరి విత్తనాలు సాగు చేస్తారని అంచనా. గత ఏడాది ఈ రకం రాయితీ విత్తనాలు అరకొరగా సరఫరా చేసిన ప్రభుత్వం ఈమారు ఏకంగా ఎత్తివేసింది. దీంతో ఈ రకం విత్తనాలు సాగు చేసే రైతులు బహిరంగ మార్కెట్లో వీటిని కొనాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి 30 కిలోల విత్తనాలు అవసరం. ప్రభుత్వం రాయితీ కింద ఇస్తే కిలోకు రూ.5 చొప్పున 30 కిలోలకు రూ.150 రాయితీ వచ్చేది. రాయితీ ఎత్తివేయడంతో 10 వేల ఎకరాల్లో సాగు చేసే రైతులపై రూ.15 లక్షల భారం పడుతుంది. ఇలా భారం వేయడమే తప్ప బాధ్యతగా వ్యవహరించకపోవడంతో అన్నదాతల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యవసాయం మర్చిపోతారు
- మంద బలరాంరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసంబద్ధ విధానాలతో భవిష్యత్తులో రైతులు వ్యవసాయం మర్చిపోయే పరిస్థితి ఉంది. నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఎగుమతులూ చేస్తోంది. కానీ ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. ఎరువుల ధరలు పెరగనుండటం ఆందోళన కల్గించే పరిణామం.
ఇదో దగా..!
- మారెడ్డి హన్మంతారెడ్డి, రైతు సంఘాల సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షుడు
ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తోంది. కాంప్లెక్స్, డీఏపీ విషయంలో పోషకాధార రాయితీ విధానం అమల్లోకి తెచ్చి రైతుల నడ్డి విరిచింది. యూరియా ధరలను కూడా పెంచడానికి సిద్ధం అవుతోంది. ఇది ముమ్మాటికీ రైతుల్ని దగా చేయడమే.
No comments:
Post a Comment