అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, September 24, 2012

నగరమా.. సిద్ధమా!?

నత్తనడకన 'వైవిధ్య' పనులు.. పెండింగ్‌లో 50%
29న గణేశ్ నిమజ్జనం, 30న 'తెలంగాణ మార్చ్'

1వ తేదీలోపు చెత్త తరలింపు అసాధ్యం
పచ్చికలన్నీ నలిగిపోయే ప్రమాదం
రోడ్ల రీకార్పెటింగ్‌కు వర్షాలతో అడ్డంకి
జీవ వైవిధ్య సదస్సుకు సిద్ధం కాని సిటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 19: అక్టోబర్ 1 నుంచే జీవ వైవిధ్య సదస్సు! అతిథులు ఒక్కొక్కరు వస్తున్నారు. హోటళ్లన్నీ హౌస్‌ఫుల్! కానీ... రోడ్లమీద ఎక్కడి గుంతలు అక్కడే! ఆ పక్కన ఎక్కడి ఆక్రమణలు అక్కడే! 'నగరాన్ని సుందర నందనంగా తీర్చిదిద్దండి!' అని ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కు హుకుం జారీచేసింది. కానీ... సరిపడా నిధులు, సమయం మాత్రం ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం బట్టబయలైంది.

అయినా సరే... పీకమీద కత్తిపెట్టి నెలాఖరుకల్లా నగరాన్ని అద్దంలా తయారుచేయాలని ఆదేశాలు మాత్రం జారీచేసి పారేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు కాలూచెయ్యీ ఆడట్లేదు. కొన్ని రోజులుగా రోడ్లమీద, రోడ్ల పక్కన పనులు చేయడం... ఆ వెంటనే చినుకులు పడి అవన్నీ వర్షార్పణ కావడం... ఇదీ పరిస్థితి! ఇప్పుడు వర్షాలు కొంత తెరపినివ్వడంతో పనులు అంతోఇంతో జోరందుకున్నాయి! నెలాఖరుకు ముగియవచ్చు కూడా! కానీ... ఈ అందాలు అక్టోబర్ 1 నాటికి అలాగే ఉంటాయా!?

క్లిష్ట... సమయం
జీవ వైవిధ్య సదస్సుకు ఎవరు ముహూర్తం పెట్టారో కానీ... ఏమాత్రం ముందూ వెనుక చూడలేదని ఇట్టే చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ కష్టమంతా పాదాల కింద నలిగిపోయేలా టైమ్ ఫిక్స్ చేశారు. ఎందుకంటే... ఈనెల 29న గణేశ్ నిమజ్జనం ఉంది. ఆ రోజున రాజధాని నగరం జనసంద్రమే అవుతుంది. మరీ ముఖ్యంగా... హుస్సేన్‌సాగర్ పరిసరాలు ఇసుకేస్తే రాలనట్లు తయారవుతాయి. పరిసర జిల్లాల నుంచి లక్షల్లో జనం నగరానికి చేరుకుంటారు. తాగి పారేసిన వాటర్ ప్యాకెట్లు, తిని పడేసిన ప్రసాదం పొట్లాలు, చెత్తాచెదారం టన్నుల కొద్దీ పేరుకుపోతుంది. ఇక 29న మొదలయ్యే నిమజ్జనం మరునాడు మధ్యాహ్నం వరకు కొనసా....గుతూనే ఉంటుంది.

అది ముగిశాక ట్యాంక్‌బండ్ పరిసరాలు ఎంత భీకరంగా ఉంటాయో చెప్పలేం. ఈ జనం ధాటికి జీహెచ్ఎంసీ పరచిన పచ్చికలు, నాటిన 'చెట్లు' ఎన్ని ఉంటాయో, ఏ మేరకు మిగులుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఆ దేవుడే దిగి వచ్చినా... నిమజ్జనం చెత్తను ఒక్కరోజులో తీయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనిచేసినా రోడ్లను, హుస్సేన్ సాగర్‌ను శుభ్రం చేయడానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుంది. అయితే... సెప్టెంబర్ 30న ఈ పనులు జరిగేలా కనిపించడం లేదు. కారణం... ఆ రోజు తెలంగాణ మార్చ్!

ఆ రోజున స్తంభనే...
రాజకీయ జేఏసీ తెలంగాణ మార్చ్‌ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 'ఇంటికొకరు, చేతికో జెం డా' అని నినదించి... హైదరాబాద్‌కు తరలి రావాలని అన్ని జాల్లాల ప్రజానీకానికి పిలుపునిచ్చింది. నిమజ్జనం రోజునే రాజధానికి వచ్చే జనం, మార్చ్‌కు వచ్చే జనంతో సెప్టెంబర్ 30న కూడా రాజధాని కిటకిటలాడనుంది.

ఉద్యమకారుల ప్రధాన దృష్టి కూడా ట్యాంక్ బండ్ -అమరవీరుల స్తూపం-సచివాలయం -అసెంబ్లీ ఆవరణ తదితర ప్రాంతాలపైనే ఉం టుంది. తెలంగాణ మార్చ్ రోజున ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. సరిగ్గా... మార్చ్ మరుసటిరోజు అంటే అక్టోబర్ 1నుంచే జీవ వైవిధ్య సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సును కూడా అడ్డుకుంటామని కొందరు ఉద్యమకారులు ఇప్పటికే హెచ్చరించారు. వీటన్నింటి నేపథ్యంలో... అటు జీహెచ్ఎంసీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.

ఎక్కడి పనులు అక్కడే...
+జీవ వైవిధ్య సదస్సు నిర్వహణ బాధ్యతలలో అత్యంత కీలకంగా వ్యవహరించాల్సిన అటవీ శాఖ చేయాల్సిన పనులు చాలావరకు మిగిలిపోయాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో 10-15 వరకు బ్యాటరీ కార్లు సిద్ధం చేయాలని... వనస్థలిపురం, చిలుకూరులలో ఉన్న జింకల పార్కులను అందంగా తీర్చిదిద్దాలని, నెక్లెస్ రోడ్డు నుంచి ఎల్‌బీ స్టేడియం వరకు జీవ వైవిధ్య రన్ (పరుగు) ఏర్పాటు చేయాలని, విదేశీ అతిథులను శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లాలని అటవీ శాఖ చాలా లక్ష్యాలే పెట్టుకుంది. వీటిలో ఎన్ని నెరవెరుతాయో చూడాలి మరి!

+ రోడ్ల రీకార్పెటింగ్ కోసం 62 ప్రాంతాలను గుర్తించారు. ఇందుకోసం రూ.60 కోట్లు అంచనా వ్యయం నిర్ణయించారు. మాదాపూర్ మినీ చార్మినార్ - హైటెక్స్ వరకూ అదనపు క్యారేజ్‌వే నిర్మిస్తున్నారు. అయితే, రీ కార్పెటింగ్ చేసినా వర్షం కారణంగా మళ్లీ పరిస్థితి మొదటికి వస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

+రూ.20కోట్ల వ్యయంతో 52 ఫుట్‌పాత్‌లు అభివృద్ధి చేయాల్సి ఉంది. బంజారాహిల్స్, ఎన్టీఆర్ మార్గ్, జూబ్లీహిల్స్, హుస్సేన్‌సాగర్ తదితర ప్రాంతాల్లో ఈ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ 50 శాతం మేరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిమజ్జనం తర్వాత ట్యాంక్‌బండ్‌పై ఫుట్‌పాత్‌ల గతి ఏమవుతుందో చూడాలి!

+విదేశీ ప్రతినిధులు సందర్శించే ప్రదేశాల ఆధారంగా 12 జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని కోసం 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నారు. అయితే, రహదారుల పనులు పూర్తి కాకుండా జంక్షన్ల అభివృద్ధి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

+సూచిక బోర్డుల ఏర్పాటుకోసం భారీ ప్రణాళికలు రూపొందించారు. దీనికోసం మూడు ప్రధాన మార్గాలను గుర్తించారు. రూ.10 కోట్లతో పనులు అప్పగించారు. ఫ్యాబ్రికేషన్ పనుల్లో జాప్యం అవుతోంది. ఎన్ని కారిడార్లలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారో అధికారులు కూడా చెప్పలేకుండా ఉన్నారు.

+నగరంలో 34 చోట్ల రూ.కోటి వ్యయం చేసి ఫౌంటైన్లు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. సదస్సు నాటికి కనీసం 28 ఫౌంటైన్లు సిద్ధమవుతాయని అంచనా!

+సెంట్రల్ మీడియన్లు, ట్రాఫిక్ ఐలాండ్లలో మట్టి తొలగించే పనులు జరుగుతున్నాయి. 22 కారిడార్లలో ఈ పనులను సుమారు రూ.9 కోట్లతో చేపట్టారు. వర్షం కారణంగా పనులకు బాగా ఆటంకం కలిగింది.

+ సదస్సు కోసం 14 మేజర్ థీమ్ పార్కులను సిద్ధం చేస్తున్నారు. దీని కోసం రూ. 2.24 కోట్లు వ్యయం చేసినట్లు సమాచారం. కొన్ని పార్కుల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

+ సదస్సు సందర్భంగా 57 వరద కాలువల అభివృద్ధికి రూ.95 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. అయితే, ఆ పనులు గడువులోగా పూర్తి చేయ డం అసాధ్యమని తేలడంతో... అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకే పరిమితం చేశారు. మాదాపూర్ మినీ చార్మినార్-హైటెక్స్ మార్గంలోనూ పనులు జరగని పక్షంలో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

+ సదస్సు కోసం గుర్తించిన ప్రధాన మూడు మార్గాల్లో ఒక వైపు కేబుళ్లను తొలగిస్తూ... మరో వైపు ఆధునిక వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో ఆయా కారిడార్లలో పనులు చేపట్టారు.

+ హెచ్ఎండీఏ రూ.15 కోట్లతో ఆయా పార్కులు, ఫ్లై ఓవర్ల వద్ద పనులు చేపడుతోంది. ఇవి ఇప్పటి వరకూ కొలిక్కి రాలేదు.

రెక్కలు తెగిన రాబందు
కబ్జాదారులను రాబందులుగా అభివర్ణిస్తూ ఆడిపోసుకుంటూంటాం! నిజానికి... రాబందులే మని షి దెబ్బకు బలైపోతున్నాయి. భారత్‌లో తొమ్మిది రకాల రాబందులున్నాయి. 1990 తర్వాత వీటి సంఖ్య 95 శాతం పడిపోయింది. జంతువుల కళేబరాలను ఆహారంగా తీసుకుని... పర్యావరణానికి మేలుచేస్తూ ఇవి జీవిస్తాయి. కానీ... నగరాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో జంతు కళేబరాలు దొరకడంలేదు. పైగా వీధి కుక్కలు పెరగడంతో రాబందులకు ఆహారవేటలో తీవ్ర పోటీ తప్పలేదు. రాబందులు గూడు కట్టుకునేందుకు, గుడ్లు పెట్టేందుకు అనుకూలమైన పొడవాటి చెట్లే మాయమైపోతున్నాయి. ఈ కారణాలవల్ల రాబందుల రెక్కల చప్పుడు వినిపించని దుస్థితి ఏర్పడింది.

దటీజ్ బహుగుణ!
పశ్చిమబెంగాల్‌లోని ఓ కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు 800ఏళ్ల క్రితం హిమాలయ పర్వత పాదాల్లోని ఓ గ్రామానికి వలస వెళ్లారు. మొక్కల్లోని ఔషధగుణాలను పసిగట్టడం వారికి కొట్టిన పిండి. అదే సమయంలో స్థానిక రాజు జబ్బుపడ్డాడు. తమ మూలికా వైద్యంతో ఆయనకు ఈ బెంగాలీలు చికిత్సచేశారు. సంతోషించిన రాజు వారికి బహుగుణ అనే గ్రామాన్ని బహుమతిగా ఇచ్చాడు. అదే వారి ఇంటిపేరుగా మారింది. జీవ వైవిధ్యం విలువ తెలిసిన ఆ కుటుంబం నుంచి వచ్చినవాడే సుందర్‌లాల్ బహుగుణ. పర్యావరణ పరిరక్షణ తమ జన్యువుల్లోనే ఉందన్నట్లు సుందర్‌లాల్ కూడా జగమెరిగిన ఉద్యమకారుడయ్యాడు. చెట్లను కన్నబిడ్డల్లా భావించే ఆయన తన జీవితాన్నే వాటికి అంకితం చేశారు. 'పర్యావరణమే శాశ్వత ఆస్తి' అంటూ చిప్కో(కౌగిలించుకోవడం) ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చెట్లను కౌగిలించుకుని వేలాది గ్రామాల ప్రజలు వాటిని నరికేయకుండా అడ్డుగా నిలిచారు. ఆయన ఉద్యమం వల్ల అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. హిమాలయా ప్రాంతంలో చెట్ల నరికివేతపై 15ఏళ్ల నిషేధం విధించారు. ఆ తర్వాత కూడా ఆయన పర్యావరణానికి చేటు తెస్తుందంటూ తెహ్రీ డ్యాం నిర్మాణంపై పోరాడారు. రెండు దఫాలుగా సుదీర్ఘ (45రోజులు, 74 రోజులు) నిరాహార దీక్షచేశారు. జీవ పరిరక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెట్టారు.

No comments:

Post a Comment