భారత్‌లోనైనా,
బ్రిటన్‌లోనైనా వాతావరణాన్ని కలుషితం చేసే వాయువులు అవే! వాటి తీవ్రత
ఎక్కడైనా ఒక్కటే! కానీ, పర్యావరణ సంబంధిత విషయాల్లో అభివృద్ధి చెందిన
దేశాలు చాలా తెలివైన వ్యూహాలు అమలు చేస్తాయి. అందులో భాగంగా తెరపైకి
వచ్చిందే కార్బన్ క్రెడిట్స్. తాము పర్యావరణానికి చేస్తున్న హానిని
కడిగేసుకునేందుకు, పారిశ్రామిక ప్రగతి సుస్థిరం గా కొనసాగేందుకే దీనిని
ప్రారంభించారు. పర్యావరణ వినాశంలో ఆ దేశాల పాపం భూగోళానికే శాపమైంది.
'మీ పాపాలను మేమెందుకు భరించాలి?' అన్నది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. దీన్ని తిప్పికొట్టేందుకే కార్బన్ క్రెడిట్స్ పథకాన్ని రచించారు. 'మాతో పోల్చితే సగటున మీరు తక్కువ కాలుష్యం విడుదల చేస్తున్నారు కదా! ఆ మేరకు మేం మీకు డబ్బిస్తాం. మా కాలుష్యం మేం యథాప్రకారం కొనసా గిస్తాం! మీరు ఆర్థికంగా లబ్ధి పొందుతారు! మేం పారిశ్రామికంగా దూసుకుపోతాం' అనే సూత్రీకరణతో పథకం రచించి క్యోటో ప్రోటోకాల్‌లో చేర్చారు. దీనిలో భాగంగా క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజమ్ (సీడీఎం) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పర్యావరణానికి హానికర వాయువుల వినియోగాన్ని తగ్గిస్తున్నామని రుజువుచేసిన కంపెనీలకు, వ్యక్తులకు- సీడీఎం కొన్ని పాయింట్లు కేటాయిస్తుంది. వీటినే కార్బన్ క్రెడిట్స్ అంటారు. ఒక టన్ను కార్బన్ డై ఆక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదల కాకుండా అడ్డుకున్నా... లేక అంతే కార్బన్ డై ఆక్సైడ్ కలిగించే హానిని తొలగించినా ఒక కార్బన్ క్రెడిట్ వస్తుంది. ఇలా వచ్చినవాటిని అంతర్జాతీయ ఎక్స్ఛేంజీల్లో విక్రయించుకోవచ్చు. 2008లో ఒక్కో పాయింట్ విలువ దాదాపు రూ.1500. ఇప్పుడు... రూ.400. అభివృద్ధి చెందిన దేశాలిలా డబ్బులు పోసి కొన్న క్రెడిట్స్‌కు సమానంగా కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేసుకోవచ్చు. ఏతావాతా... ఇందులో ఆర్థిక కోణమే గానీ, పర్యావరణానికి మేలుచేసే లక్ష్యం ఎక్కడా కనిపించదు.
అసలు లక్ష్యం గాలికి...
తక్కువ ఇంధన వనరులను ఉపయోగించడం, ఆధునిక టెక్నాలజీ ద్వారా 'పరిశుద్ధమైన అభివృద్ధి వ్యవస్థ' (సీడీఎం) ఏర్పాటు, తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తి, వ్యర్థాల సమర్థ నిర్వహణ... వంటి పద్ధతులద్వారా కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలను ప్రోత్సహించడమే కార్బన్ క్రెడిట్స్ ముఖ్యో ద్దే శం. ఈ కంపెనీలకు ఆర్థికపరమైన ప్రోత్సాహం కల్పించి ఆగితే సరిపోయేది. కానీ... 'కార్బన్ క్రెడిట్స్ కొనుగోలు చేసే కంపెనీలు అంతేస్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేసుకోవచ్చు'ననే వెసులుబాటులో మొత్తం ఉద్దేశమే దెబ్బతినిపోయి పరిస్థితి కాస్తా 'హళ్లికి హళ్లి సున్నకు సున్న'గా మారింది.
పైగా... కార్బన్ క్రెడిట్స్ పేరిట భారీస్థాయిలో ఆర్థిక మోసాలకూ తెరలేచింది. సీడీఎం నిబంధనల ప్రకారం నడిచే ఫ్యాక్టరీలు మాత్రమే కర్బన ఉద్గారాలను తగ్గించుకోగలవు. తద్వారా కార్బన్ క్రెడిట్స్ సంపాదించే అవకాశముంటుంది. ప్రాజెక్టులు సీడీఎం నిబంధనలను అనుసరిస్తున్నదీ లేనిదీ నిర్ధారించేందుకు నేషనల్ క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజమ్ అ«థారిటీ (ఎన్‌సీడీఎంఏ) ఏర్పాటు చేశారు. దీని అనుమతి పొందాక సీడీఎం అధీకృత అంతర్జాతీయ సంస్థలు- మరోసారి ప్రాజెక్టును పరిశీలిస్తాయి.
ఇవి ఇచ్చే నివేదికను సీడీఎం ఎగ్జిక్యూటివ్ బోర్డు పరిశీలిస్తుంది. అంతిమంగా ఆ ప్రాజెక్టుకు 'క్లీన్' హోదా ఇస్తారు. మన దేశంలో ఇలా 827 కంపెనీలకు కార్బన్ క్రెడిట్ పొందే అవకాశం కల్పించారు. ఇవి ఇప్పటిదాకా రూ.10వేల కోట్లు ఆర్జించినట్లు అంచనా. టాటా, ఐటీసీ, రిలయెన్స్, జిందాల్ స్టీల్, బజాజ్, సీఎఫ్ఎల్, అదానీవంటి పెద్ద గ్రూపులు కార్బన్ క్రెడిట్‌ల విక్రయాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి.
దగా జరుగుతోందా?
ఎన్‌సీడీఎంఏ అనుమతి కోసం కొన్ని కచ్చితమైన సూత్రాలను సీడీఎం రూపొందించింది. ప్రాజెక్టులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం వల్ల పర్యావరణ హానికర ఉద్గారాల విడుదల తగ్గుతోందని, కార్బన్ క్రెడిట్‌ల విక్రయం తో అందే సొమ్ము లేకపోయినా ఆ కంపెనీకి నడిచే సామర్థ్యం ఉందని నిర్ధారించాలి. అయితే, మన దేశంలో సీడీఎం హోదా పొందిన కంపెనీలలో చాలావరకు పర్యావరణ చట్టాలను, కాలుష్యమండలి నిబంధనలను అతిక్రమిస్తున్నవే. దీనికి సంబంధించి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో జై బాలాజీ స్పాంజ్ కంపెనీకి సీడీఎం హోదా ఉంది.
కానీ, దీన్ని బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చాలాసార్లు అభిశంసించింది. ఒకసారి మూసివేయించింది కూడా. అయినా... ఈ కంపెనీ కార్బన్ క్రెడిట్స్‌ను విక్రయించుకుంటూనే ఉంది. కేంద్రం ఏర్పాటు చేసిన ఎన్‌సీడీఎంఏ సిబ్బంది ఎటువంటి తనిఖీలు లేకుండా సీడీఎం హోదా ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వికీలీక్స్ వెబ్‌సైట్ కూడా ఈ గుట్టును రట్టు చేసింది. భారత్‌లోని ప్రముఖ కంపెనీలూ కార్బన్ క్రెడిట్స్‌కోసం దగా చేస్తున్నాయని సీడీఎం ఎగ్జిక్యూటివ్ బోర్డు గుర్తించి వాటి అనుమతులను రద్దు చేసింది. నాలుగేళ్లలో బోర్డు తిరస్కరించిన ప్రాజెక్టులలో 44 శాతం భారత్‌కు చెందినవేనంటే... మన దేశంలో కార్బన్ క్రెడిట్స్ పేరిట దందా ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
భూమితో బేరం!
కాలుష్యాన్ని తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను ఆదేశించవచ్చు. కానీ... అవి ఉత్పత్తిని తగ్గించాలి. కాబట్టి తమ మనుగడను స్థిరం గా కొనసాగిస్తూనే పేద దేశాలతో బేరం కుదుర్చుకోవడం కార్బన్ క్రెడిట్స్ వెనుక వ్యూహం. వెరసి... భూమిపై కాలుష్య భారం తగ్గేదేమీ ఉండదు.
క్యోటో ప్రొటోకాల్...
దీని ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల సంస్థలు- తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకొని వాయు ఉద్గారాలను నియంత్రించాలి. లేదం టే వర్ధమాన దేశాల సంస్థలకు కర్బన వాయువుల నియంత్రణ టెక్నాలజీ ని అందించాలి. తద్వారా పర్యావరణానికి చేకూరే లబ్ధిని కార్బన్ క్రెడిట్స్ రూపంలో పొందవచ్చు. క్రెడిట్స్ కొనుగోళ్లలో దాదాపు 50 శాతం వాటా బ్రిటన్‌దే. అంటే ఆ మేరకు అది కాలుష్యాన్ని వెదజల్లుతోందన్నమాట!
కాలుష్యంపై రాజీ ఉండదు
కాలుష్యానికి అధికారిక అనుమతి పొందేలా కార్బన్ క్రెడిట్స్ అవకాశం కల్పిస్తోంది. బ్రిటన్‌లో ఒక ఆయిల్ కంపెనీ ఉందనుకుందాం. అది విడుదలచేసే వాయువులు నిబంధనలకన్నా ఎక్కువస్థాయిలో ఉన్నాయి. అప్పుడా కంపెనీ అదనంగా విడుదల చేసే కర్బన వాయువుల నియంత్రణ అవసరం లేకుండా- వర్ధమాన దేశాల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఆ కంపెనీలు నిబంధనల కన్నా తక్కువ వాయువులను విడుదల చేస్తే- వాటిని కార్బన్ క్రెడిట్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు.
- స్పెషల్ డెస్క్
వైవిధ్యంగా..
ఒక్క క్షణం ఆగండి!
పర్యావరణ నిపుణుల అంచనాల ప్రకారం... 50 ఏళ్లు బతికే ఒక చెట్టు..
+ రూ.5.3 లక్షల విలువ చేసే ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
+ రూ.6.4 లక్షల విలువ చేసే భూసారాన్ని పరిరక్షిస్తుంది.
+ ఆ చెట్టు నిరోధించే భూమికోతకు విలువ కడితే అది రూ.6.4 లక్షలుంటుంది.
+ అది నిరోధించే వాయుకాలుష్యానికి లెక్కగడితే రూ.10.5 లక్షలుంటుంది.
+ ఇతర జీవజాలానికి అదిచ్చే ఆశ్రయానికి రూ.5.3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది.
మొత్తం కలిపితే రూ.33.9 లక్షలు! అందుకే.. "ఒక చెట్టును కొట్టే ముందు ఒక్క క్షణం ఆగండి. ఆలోచించండి. కొట్టక తప్పదనుకున్నప్పుడు బదులుగా పది మొక్క లు నాటండి'' అని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా
కిశోరీ బికంపురా-రాజస్థాన్‌లోని థార్ ఎడారి అంచుల్లో గల ఓ గ్రామం. మూడు దశాబ్దాల క్రితం ఇక్కడ చుక్క నీరు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ బతుకులు ఎడారిలో కలిసిపోతాయని జనం అనుకున్నారు. ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఎడారిలో జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఆ సమయంలోనే ఊర్లోకి వచ్చే బస్సులోంచి దిగాడు రాజేంద్ర సింగ్. క్రమంగా 'యువభారత సంఘం' స్వచ్ఛంద సంస్థకు నేతృత్వం వహించిన రాజేంద్ర సింగ్ అకుంఠిత దీక్షతో నీటి సంరక్షణ, నిర్వహణ చర్యలు చేపట్టారు. వెయ్యి గ్రామాలకు ఈ ఉద్యమాన్ని విస్తరించారు. ఆయన పద్ధతు లు దేశవ్యాప్తంగా అమలయ్యాయి. చివర కు ఎడారిలో పూలు పూయించి రామన్ మెగసెసె అవార్డు అందుకున్నారు. ఓ ప్రముఖ పత్రిక సర్వేలో ఈ గ్రహాన్ని కాపాడగల 50మంది సమర్థులలో ఒకరుగా స్థానం పొంది 'వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అయ్యారు.
No comments:
Post a Comment