125 రోజుల పనిదినాలు కలేనా?
ఉపాధి హామీ చట్టం ద్వారా ఏడాదికి 125 రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉన్నా అది అమలు జరగడం లేదు. జిల్లాలో 2007 నుంచి 58 మండలాల్లోని 1012 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలౌతోంది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 2,35,699 కుటుంబాలకు గాను 13 వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని కల్పించారు. లక్షలాది కుంటుంబాలకు వంద రోజులు కూడా పని కల్పించని ప్రభుత్వం 125 రోజులు పని కల్పిస్తుందనుకోవడం అడియాశగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రోజువారీ సగటు వేతనం రూ.106.25 ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.115గా ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5.92 లక్షల జాబ్ కార్డులు జారీ చేసిన అధికారులు ఏప్రిల్ 25 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి కల్పించగలిగారు.
ఉపాధిలో రూ.5.20 కోట్ల అవినీతి..
ఉపాధి పథకంలో ఆరేళ్లలో జిల్లాలో రూ.5.20 కోట్ల అవినీతి జరిగినట్టు అధికారుల సామాజిక తనిఖీల్లో బట్టబయలైంది. ఈ అవినీతికి సంబంధించి 2277 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినా, 666 మందిపైనే చర్యలు తీసుకున్నారు. మిగిలిన వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. ఈ మొత్తంలో ఇప్పటివరకూ రూ.79,67,619 మాత్రమే రికవరీ చేశారు.
మేట్స్, ఫీల్డు అసిస్టెంట్లపై నెపం మోపుతున్న అధికార్లు
జిల్లాలో రోజుకు 1.14 లక్షల మందికి ఉపాధి కల్పించివారికి రూ.1.20 కోట్లు కూలిగా చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 25 నాటికి రూ.18.7 కోట్లు కూలీలకు చెల్లించామని వారు అంటున్నారు. కానీ అనేక ప్రాంతాల్లో కూలి రేట్లలో వ్యత్యాసం భారీగా ఉండడానికి మేట్స్, ఫీల్డు అసిస్టెంట్లే కారణమని అధికారులంటున్నారు. పని విభజన సమయంలో ఎంతమేరకు ఎన్ని గంటలు పని చేయాలి అనే విషయాలను కూలీలకు వివరించడంలో ఫీల్డు అసిస్టెంట్లు విఫలమయ్యారని అధికారుల వాదన.
కోరుకొండ మండలం కోటి కేశవరంలో 163 మంది కూలీలు ఉపాధి హామీ పని చేస్తున్నారు. వీరంతా నాగంపల్లి, కోటికేశవరం గ్రామాల మధ్య ఉన్న వినుకొండ కాలువ, నల్ల చెరువుల్లోని పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకూ వారు ఐదు రోజుల పాటు రోజంతా కష్టపడితే వారికి దక్కిన రోజువారీ వేతనం రూ.40 మాత్రమే. ఇదేమని కూలీలు ప్రశ్నిస్తే చేసిన పనికి లెక్కగట్టి డబ్బులు చెల్లిస్తున్నామని ఉపాధి హామీ ఎపిఓ చెబుతున్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి.
No comments:
Post a Comment