అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, April 29, 2012

25 లక్షలమందికి రేషన్‌ కటకట


మే నెలలో బియ్యం, కందిపప్పు, పామాయిల్‌ కష్టమే
కూపన్ల పంపణీ జరగనందునే
పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితం

హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల 25 లక్షల మంది నిరుపేదలు నిత్యావసరాలకు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. మే నెలలో రేషన్‌ బియ్యం, కందిపప్పు, పామాయిల్‌ లేక కటకటలాడే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం.. రేషన్‌ సరుకులు తీసుకోవటానికి అవసరమైన కూపన్లను అధికారులు పంపిణీ చేయకపోవటమే. ఏప్రిల్‌ నెలలోనే పంపిణీ చేయాల్సిన కూపన్లను ఇప్పటికీ పంపించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.25 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డుదారులుండగా వీరిలో రెండుకోట్ల మందికే తెల్లకార్డులున్నాయి. మిగిలిన 25 లక్షల మంది రచ్చబండ ఒకటి, రెండు కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ తెల్లకార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఆధార్‌ కార్యక్రమం పూర్తయిన తరువాత తెల్లకార్డులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈలోగా రేషన్‌ పొందడానికి వీలుగా ఆరునెలల కిందట కూపన్లు మంజూరు చేశారు. ఈ కూపన్లు ఏప్రిల్‌ నెలతో అయిపోయాయి. అధికారులు కొత్తగా కూపన్లు ఇస్తేనే మే నెల కోటా కింద రూపాయికి కిలో బియ్యంతోపాటు చవకధరల్లో కందిపప్పు, పామాయిల్‌ తదితర సరుకులు లభిస్తాయి. వాస్తవానికి, కొత్తగా ఇవ్వాల్సిన కూపన్లను మార్చిలోనే ముద్రించి ఆ నెలాఖరుకే కార్డుదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కార్డుదారుల దగ్గర కూపన్లు అయిపోతున్నాయని క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా కూడా పట్టించుకోలేదు. కూపన్లు ముద్రించే కాంట్రాక్టును సకాంలో ఇవ్వలేదు. మార్చి నెలాఖరులో కాంట్రాక్టును ఇస్తే ఆ సంస్థ కూపన్లు ముద్రించి ఇవ్వడానికి మరింత ఆలస్యం చేసింది.
పంపిణీకి వ్యవస్థ అంటూ లేదు
ముద్రించిన కూపన్ల పంపిణీకి జిల్లాల్లో ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. గ్రామీణ స్థాయిలో వీఆర్‌వోలే వీటిని పంపిణీ చేయాలి. పట్టణస్థాయిలో మున్సిపాల్టీల ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. వీఆర్‌వోలు అన్ని పనులు వదులుకొని కూపన్లు పంపిణీ చేయాలంటే కనీసం నెల రోజుల పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 12 జిల్లాల్లో వీఆర్‌వోలు క్షేత్రస్థాయిలో ఉప ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. దీంతో వారు కూపన్లపై దృష్టిసారించే అవకాశం లేదు.
ఆలస్యంగా మేల్కొన్న పౌరసరఫరాలశాఖ అధికారులు కూపన్లను ఇప్పుడు సిద్ధం చేసి ఒకటి రెండు రోజుల్లో రాజధానితోపాటు కొన్ని జిల్లాలకైనా పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని జిల్లాలకు కూపన్లు అందాలంటే కనీసం వారం రోజులైనా పడుతుందని అంచనా. ఆ తర్వాత కూపన్లను ఆయాజిల్లాల్లో యుద్ధప్రాతిపదికన పంచినా కనీసం 20 రోజులైనా పడుతుంది. అంటే, 25 లక్షల మంది తెల్లకార్డుదారుల్లో అధికశాతం మందికి మే నెల సరుకులు లభించే అవకాశం కష్టమే.
మూడుజిల్లాల్లో బయోమెట్రిక్‌ అమలు
యోమెట్రిక్‌ కార్డుల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీని హైదరాబాద్‌, అనంతపురం, తూర్పుగోదావరిజిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం పోస్టాఫీసుల్లో పెండింగ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులను తక్షణం ఆయా జిల్లాలకు పంపిణీ చేయాలని పోస్టల్‌శాఖకు అధికారులు సూచించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేదీ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులతోపాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హరిప్రీత్‌ సింఘ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆధార్‌ వివరాల ఆధారంగా బయోమెట్రిక్‌ కార్డులను జారీ చేసి రేషన్‌ సరుకులను సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. తొలుత దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. బయోమెట్రిక్‌ విధానంలో కార్డును యంత్రంలో పంచ్‌ చేసి వేలిముద్ర నమోదు చేస్తేనే రేషన్‌ సరుకులు అందుతాయి. దీనిద్వారా రేషన్‌ సరుకుల అక్రమ తరలింపును అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది

No comments:

Post a Comment