గిడ్డంగుల అద్దెలు పైపైకి.. పంటల ధరలు కిందికి
ఆరుగాలం కష్టపడినా మార్కెట్ మాయతో దగా
దళారుల నిలువు దోపిడీతో నష్టాలే మిగులు..
రైతు కష్టాలకు కేరాఫ్‌గా మారిన మిర్చి మార్కెట్లు
పసుపు రైతులదీ ఇదే వ్యథ..
రాష్ట్రంలో 5 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అయితే.. 600 క్వింటాళ్లు సేకరించిన సర్కారు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: చేల నిండా పంట ఉన్నా చేతిలో చిల్లి గవ్వ ఉండదు.. మార్కెట్‌లో అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర దక్కదు.. ఇంట్లో నిల్వ చేద్దామంటే పాడవుతుందన్న భయం.. శీతల గిడ్డంగుల్లో దాచుకుందామనుకుంటే జాగా దొరకదు.. ఎలాగోలా దొరికినా అద్దెల దరువుకు గుండె చెరువు..! పంటను అటు అమ్ముకోలేక.. ఇటు దాచుకోలేక రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతులు పడుతున్న కష్టాలివీ! కరెంటు చార్జీల పెంపు పుణ్యమా అని కోల్డ్ స్టోరేజీల అద్దెలు మోతెక్కిపోతున్నాయి. ఆ రేట్లను భరించి నిల్వ చేసుకునేందుకు సిద్ధమైనా.. ధరలు రోజురోజుకూ పడిపోతుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. మిరప ధర ఇప్పటికే భారీగా పతనమైంది. కిందటేడాది క్వింటాలుకు రూ.10 వేల దాకా ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ. 3,000కు పడిపోయింది. మిర పే కాదు.. పసుపు పంటదీ ఇదే కథ! సర్కారు నిర్లక్ష్యం కారణంగా వాణిజ్య పంటలు సాగు చేసిన రైతులు ఈసారి నిలువునా మునిగిపోతున్నారు. ధరలు పడిపోతుంటే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దింపి కనీస గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం.. చోద్యం చూస్తోంది. 2004లో మిర్చి ధర ఇలాగే పడిపోతే అప్పటి ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. నేరుగా రైతుల నుంచే పంటను కొనుగోలు చేయించింది. ఈసారి కూడా అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను దింపితే రైతులకు కాస్తయినా ఊరట కలుగుతుందని అధికారులు పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పంట ఫుల్లు.. గోదాములు నిల్లు..
రాష్ట్రంలో మిర్చికి పేరొందిన గుంటూరు, ఖమ్మం, వరంగల్ మార్కెట్లు ఇప్పుడు రైతన్న కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. కోల్డ్ స్టోరేజీలన్నీ నిండిపోయాయి. రైతులు నిల్వ చేసేందుకు తెస్తున్న మిర్చి పంటకు స్థలమే లేదు. దీంతో అటు తక్కువ రేటుకు అమ్ముకోలేక.. ఇటు ఎక్కడ నిల్వ చేసుకోవాలో తెలియక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ‘‘వరంగల్ మార్కెట్లో క్వింటాలుకు రూ.2 వేలకు సైతం కొనే పరిస్థితి లేదు. వచ్చిన ధరకు అమ్ముకుందామనుకున్నా కొనేవారు లేరు. పంట వెనక్కి తీసుకుపోయి ఏం జేయాలే? ఆరు బయట, గోదాముల్లో నిల్వ చేస్తే మిర్చి రంగు మారి పాడైపోతది. కోల్డ్ స్టోరేజీలో ఉంచుదామంటే అన్నీ నిండిపోయాయి...’’ అంటూ ఓ రైతు ‘న్యూస్‌లైన్’ ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. వరంగల్ మార్కెట్ పరిధిలో 12 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటన్నింట్లో 12 లక్షల మిరప బస్తాలు.. అంటే 48 వేల టన్నులు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం గిడ్డంగులన్నీ నిండిపోయాయి. అదనంగా ఒక్క క్వింటాలు కూడా నిల్వ చేసే పరిస్థితి లేదని స్టోరేజీ యజమానులు చెబుతున్నారు. పంటను తీసుకువస్తున్న రైతులను తిప్పి పంపుతున్నారు. గుంటూరు మార్కెట్ యార్డు ఆసియాలోకెల్లా రెండో అతిపెద్ద మార్కెట్‌గా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి ఏటా ఆ జిల్లాతోపాటు ఏడెనిమిది జిల్లాల నుంచి మిర్చి పంట వస్తుంది. జిల్లాల్లో మొత్తం 115 కోల్డ్‌స్టోరేజీలు ఉండగా... ఇందులో 76 స్టోరేజీలు గుంటూరు చుట్టుపక్కలే విస్తరించి ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే దాదాపు 60 లక్షల నుంచి 65 లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయి.
అద్దెలు పెరిగే.. ధరలు తగ్గే..
కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల్వ ఉంచి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామనుకుంటే.. అద్దెలు అనూహ్యంగా పెరిగాయి. అప్పుగా తెచ్చిన పెట్టుబడుల భారానికి తోడు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వకు అయ్యే ఖర్చు పేద రైతులకు పెనుభారంగా మారింది. స్టోరేజీ యూనిట్లో మిరప నిల్వ చేయడం ఖరీదుతో కూడుకున్న పనే. ఒక్కో బస్తాకు రూ.90దాకా చెల్లించాలి. అదనంగా మరో రూ.5 చొప్పున ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఆరు నెలల పాటు అందులో ఉంచేలా ఒప్పందం ఉంటుంది. ఈలోపు ఎప్పుడైనా రైతులు తమ సరుకును తీసుకునే వీలుంటుంది. లేకుంటే ఆరు నెలల తర్వాత అద్దె చెల్లించాలి. ప్రస్తుతం ఉన్న కోల్డ్ స్టోరేజీ యూనిట్లన్నీ ప్రైవేటు వ్యాపారులకు చెందినవే కావడంతో.. అందులో నిల్వ చేయడానికి కూడా పైరవీలు సాగుతుండటం గమనార్హం. స్టోరేజీల అద్దెలు ఒక్కసారిగా పెరగడం, నిల్వ సామర్థ్యం లేదంటూ బోర్డులు పెట్టడంతో యార్డుకొచ్చిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మంచి ధర కోసం చూస్తే పంట నిల్వ సమస్యగా మారే ప్రమాదముందన్న భయంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. దీంతో చేతికి పెట్టుబడులు కూడా రావడం లేదు. మరోవైపు కరెంటు చార్జీల ప్రభావం స్టోరేజీలపైనా పడింది. పెరిగిన భారాన్నంతా యాజమాన్యాలు రైతు నెత్తినే రుద్దుతున్నాయి.
‘రైతు బంధు’ ఊసెక్కడ..?
పంట ఉత్పత్తులకు మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని సమయంలో ఆదుకునే రైతు బంధు పథకం ఊసే కనిపించడం లేదు. మిర్చి రైతులు తమ పంటను పెద్ద ఎత్తున గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం.. దీనికి పథకాన్ని వర్తింపజేయడం లేదు. వరి ధాన్యానికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అదీ అరకొరగానే! పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేస్తే... ఆ విలువపై మూడో వంతు మొత్తాన్ని సర్కారు రుణంగా అందించడం ఈ పథకం ఉద్దేశం. గోదాముల్లో పెడితే పందికొక్కుల పాలవుతుందన్న భయంతో రైతులు ధాన్యం దాచుకునేందుకు ముందుకు రావడం లేదు. ఎక్కువగా మిర్చి రైతులే పంటను గిడ్డంగుల్లో దాచుకునేందుకు మొగ్గుచూపుతారు. మిర్చికి ఈ పథకం వర్తించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం ధరలు భారీగా పడిపోయాయి. మిర్చి రేట్లు దారుణంగా పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అటు ప్రైవేటు గిడ్డంగుల్లో ప్రమాదాల వల్ల పంట నష్టపోయినవారిని కూడా ఆదుకోవడం లేదు. గుంటూరులో ఎనిమిది నెలల కిందట సాయిసూర్య, నందిని, వెంగమాంబ కోల్డ్‌స్టోరేజీల్లో కాలిపోయిన మిర్చి బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. తాము రైతుల పక్షమని అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు.. అదే రైతుకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నాయని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పసుపు గిడ్డంగుల్లోనూ కష్టాలే..: పసుపు రైతులకు కూడా గిడ్డంగుల కష్టాలు తప్పడం లేదు. కిందటేడాదితో పోల్చుకుంటే క్వింటాలు ధర భారీగా పతనమై రూ.4 వేలకు చేరుకోవటంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. ఇటు ధర పడిపోతుండటం.. అటు ఏడాదిగా గిడ్డంగుల అద్దె పెరిగిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పసుపు ఎక్కువగా పండించే నిజామాబాద్ జిల్లాలో ఆరు శీతల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కొక్కటి 5 వేల టన్నుల సామర్థ్యంతో 30 వేల టన్నుల సరుకును నిలువ చేసే అవకాశం ఉంది. అయితే వాటిలో దాదాపు సగం మేరకు ప్రముఖ కంపెనీలు విత్తనాలను నిలువ చేసేందుకు తీసుకున్నాయి. గత సంవత్సరం 70-80 కిలోల బస్తాను నిలువ చేసేందుకు నెలకు రూ.8 నుంచి రూ.10 అద్దె వసూలు చేశారు. ప్రస్తుతం కరెంటు కోతలతో జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నామంటూ అద్దెను ఏకంగా రూ.15 పెంచడంతో రైతులు నష్టపోతున్నారు.
చితికిపోయిన శనగ రైతు..
ప్రకాశం జిల్లాలో శనగ రైతులకు కష్టాలే మిగిలాయి. గిట్టుబాటు ధరలేక సుమారు రెండు లక్షల క్వింటాళ్ళ శనగలు కోల్డ్ స్టోరేజీల్లోనే మూలుగుతున్నాయి. జిల్లాలో 30 కోల్డ్ స్టోరేజీలు వుండగా అందులో ఏకంగా 26 కోల్డ్ స్టోరేజీల్లో శనగ పంట ఉంది. రైతుల వద్ద నుంచి అధికారులు విత్తన శనగలను క్వింటాలు రూ.7,500 చొప్పున కొనుగోలు చేశారు. ఈ ధరల ప్రకారమే స్టోరేజీల్లో శనగలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తే బాగుండేది. కానీ ఎంతవరకు అవసరమో అంతే కొనుగోలు చే సి మిగిలిన శనగలను వదిలేయడంతో ప్రస్తుతం ధర భారీగా పడిపోయింది. విద్యుత్ చార్జీల భారాన్ని స్టోరేజీ నిర్వాహకులు పంట దాచుకున్న రైతులపైనే మోపుతున్నారు.
కూలీలకే రూ.10 వేలు ఖర్చయింది..
‘‘14 క్వింటాళ్ల మిర్చిని మార్కెట్‌కు తెచ్చిన.. రూ.3,500 ధరకు అమ్ముకుంటే నాకేం మిగలదు. నిరుడు క్వింటాలు రూ.8,500 కు అమ్మినా. పదిహేను రోజుల ముందే అడ్తిదారుకు సరుకును అమ్మకానికి పెట్టిన. రేటు లేకపోవడంతో స్టోరేజీలో ఉంచా. ఈసారి కూలీలకే రూ.10 వేలు ఖర్చయింది.. అడ్తిదారు దగ్గర ఆ డబ్బు అప్పుగా తీసుకుంటా.. ఎప్పుడు మంచి రేటు వస్తుందోనని ఎదురు చూసుడే. అంతకంటే చేసేదేమీ లేదు’’
పెట్టుబడి రూ.5,500.. ధర 4 వేలు!
హైదరాబాద్, న్యూస్‌లైన్: బహిరంగ మార్కెట్‌లో దళారుల దోపిడీతో పెట్టుబడి కూడా దక్కని దీన స్థితిలో ఉన్న పసుపు రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే క్వింటాల్ పసుపు పెట్టుబడి ఖర్చు రూ.5,500 ఉంది. దళారుల దోపిడీతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ఇంత కన్నా ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... మార్కెట్ జోక్యం పథకం(ఎంఐఎస్) కింద క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున ధర ఇస్తే సరిపోతుందని కేంద్రాన్ని కోరింది. కేంద్రం మరింత నిర్దయగా పసుపు ఎంఐఎస్ ధరను క్వింటాల్ రూ.4 వేలుగా ఖరారు చేసింది. ఈ ధరకు రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కారు మార్చి 24న ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 20 వరకే ఎంఐఎస్ అమలు చేశారు. రాష్ట్రంలో 5 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి కాగా ఎంఐఎస్ కింద 54 వేల టన్నులు సేకరించాలని నిర్ణయించి, రైతుల నుంచి 600 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్నారు. నిజామాబాద్, మెట్‌పల్లి, కడప, దుగ్గిరాల, నిర్మల్‌లలో అరకొరగా ఈ కొనుగోళ్లు జరిపారు. ఇందులోనూ.. ఎంఐఎస్ కింద ఒక రైతు కుటుంబం నుంచి కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలంటూ అడ్డగోలు నిబంధనలు పెట్టారు.
శీతల గిడ్డంగులన్నీ ప్రైవేటు చేతిలోనే..
రాష్ట్రంలో శీతల గిడ్డంగులన్నీ ప్రైవేటు చేతిలోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 270 కోల్డ్ స్టోరేజీలు ఉంటే.. అందులో 260 పూర్తిగా ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోనే ఉన్నాయి. మరో పది స్టోరేజీలు ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో ఉన్నా లీజు పద్ధతిన వాటిని ప్రైవేటు యాజమాన్యాలే నడుపుతున్నాయి. ఒక్కో స్టోరేజీలో 80 వేల నుంచి 90 వేల బస్తాలు నిల్వ చేయవచ్చు. ఐదు టన్నుల సామర్థ్యం గల గిడ్డంగిని నిర్మించాలంటే సుమారు రూ.1.5 కోట్లు ఖర్చవుతుంది.
No comments:
Post a Comment