అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, May 7, 2012

ఖరీఫ్‌... కలవరం


అందనంత ఎత్తులో ఎరువుల ధరలు
అన్నదాతకు పెరగని రుణ లభ్యత
పంట పెట్టుబడికీ చాలని దుస్థితి
అన్నీ సిద్ధమైనా వరుణుడిపైనే భారం
అధికారులు చేయూతనిస్తేనే రైతు గట్టెక్కేది
న్యూస్‌టుడే, పరిగి
తొలకరికి ఒక్కో రోజు దగ్గరవుతున్న కొద్దీ.. రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఖరీఫ్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే హడలిపోతున్నాడు.. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ పరీక్షలనే ఎదుర్కోబోతున్నాడు.. ఏడాది వ్యవధిలో డీఏపీ ధర రెండింతలైంది.. ఇతర ఎరువుల ధరలూ పెరిగాయి.. మరోవైపు బ్యాంకర్లురైతులకు గీచిగీచి రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.. అధికారులు షరామామూలుగా అన్ని సిద్ధంగా ఉంచేశామని, ఇక వడ్డించడమే తరువాయి అన్నట్లుగా బీరాలు పోతున్నారు.. జూన్‌ ఒకటి నుంచి ఖరీఫ్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు మదిలో ఆందోళన, అధికారులకు విన్నపాలపై 'న్యూస్‌టుడే' కథనం. జిల్లాలో 5.71 లక్షల హెక్టార్ల భూమి సాగుకు అనువుగా ఉన్నా ఉపరితల పారుదల వనరులు, చెరువులు, కుంటలు, బావులు, ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 60 వేల హెక్టార్లు మాత్రమే సాగవుతోంది. రాష్ట్ర సరాసరి 40 శాతం కాగా జిల్లాలో కేవలం 9 శాతం మాత్రమే సాగులో ఉంది.
భారమైన ఎరువులు
నానాటికీ పెరుగుతున్న ఎరువుల ధరలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా ఖరీఫ్‌ సాధారణ సాగు 1.58 లక్షల హెక్టార్లు ఉంది. గతేడాది డీఏపీ 31,956 టన్నులు, యూరియా 57,920, పొటాష్‌ 14,068, కాంప్లెక్సు ఎరువులు 26,056 టన్నుల మేరకు అవసరం ఉన్నాయి. పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతులు రూ.13.5 కోట్ల భారాన్ని మోస్తున్నారు. గతేడాది సకాలంలో ఎరువులు దొరక్క అవస్థలు పడాల్సి వచ్చింది. పంటలు దెబ్బతిన్నాక యూరియా అందింది. జిల్లాకు రావాల్సిన కేటాయింపులు సైతం ఇతర జిల్లాల వారు తన్నుకుపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈసారి తొలకరికి ముందే ఎరువులు సిద్ధం చేయాలని రైతులు కోరుతున్నారు.
విత్తనాలు అందేనా
గత ఖరీఫ్‌లో అన్నదాతలు కోరుకున్న మేలు రకం పత్తి విత్తనాలు దొరకలేదు. ఈసారి కూడా విత్తనాల కొరత రానున్నట్లు కనిపిస్తోంది. గత డిసెంబరులోనే విత్తనాలకు ముందస్తు డిపాజిట్లు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితులు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయశాఖ అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
పెరగని రుణ ఆర్థిక కొలత
పంట రుణాలకు బ్యాంకర్లు ఇచ్చే రుణ ఆర్థిక కొలత (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) పెరగడం లేదు. ఎరువులు, కూలీల ధరలు పెరిగిపోతున్నా రుణ శాతం పెరగకపోవడంతో కర్షకులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పత్తి, కంది, వరి, మొక్కజొన్న వంటి పంటలు ప్రధానంగా సాగు చేస్తారు. అన్ని పంటలకు పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయి. పత్తికి బ్యాంకర్లు ఇచ్చేది ఎకరాకు రూ.16 వేలు, పసుపునకు రూ.20వేల వరకు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రుణంలో కనీసం 25 శాతమైనా అదనంగా పెరగాల్సి ఉంది. వేధించనున్న కూలీల కొరత
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే కూలీల కొరత తీవ్రం కానుంది. వీడని వర్షాభావంతో దాదాపు రైతులందరూ నష్టపోయారు. కుటుంబ పోషణ భారమైన నేపథ్యంలో ఉన్న మేరకు అందరూ పంటలు సాగు చేయాలని భావిస్తున్నారు. అసలే జిల్లాలో కూలీల కొరత తీవ్రం. యాంత్రీకరణ పేరిట వ్యవసాయశాఖ ఖర్చు చేస్తున్న నిధులు పేదల వరకు చేరలేకపోతున్నాయి. అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా మినీ యంత్రాలు వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎరువులు, విత్తనాల కొరత ఉండదు- విజయ్‌కుమార్‌, వ్యవసాయశాఖ జేడీ
జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత ఉండదు. అవసరం మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం 50వేల టన్నుల యూరియా, 30వేల టన్నుల డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు, 8వేల టన్నుల పొటాష్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఆర్థిక స్థోమతను బట్టి ముందుగానే ఎరువులు తీసుకువెళ్తే కొనుగోలు కేంద్రాలపై భారం తగ్గుతుంది. వర్షాలు పడ్డాక అందరూ ఒకేసారి వస్తే సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. విత్తనాల బ్రాండ్‌ విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కొరత రాకుండా చూస్తాం.
సమస్యను అధిగమించవచ్చు ఇలా
* జిల్లాలో 10నుంచి 31వరకు చైతన్య యాత్రలు జరగబోతున్నాయి.గ్రామం వారీగా ఎరువులు, విత్తనాల అవసరతను పరిగణలోకి తీసుకుని ఇండెంట్‌ తయారు చేస్తే ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. రైతుల్లోనూ ఆత్మస్త్థెర్యం కలుగుతుంది.
* ఉపాధి హామీ పథకం కింద సుమారు 45వేల మంది కూలీలు నిత్యం పనుల్లో పాల్గొంటున్నారు. వర్షాలు పడితే నేల మెత్తగా ఉండటంతో వీరి సంఖ్య మరింత పెరిగి కూలీల కొరతకు దారి తీసే అవకాశం ఉంది.
* ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం శ్రీవరి సాగు చేసే రైతులకు ఉపాధినిధుల అవకాశాన్ని కల్పిస్తోంది. ఉపాధి నిధులను వ్యవసాయానికి వినియోగిస్తే ఇటు కూలీల కొరత తీరడంతో పాటు సాగు విస్తీర్ణంపెరిగే అవకాశం ఉంటుంది. రైతులకు ఆర్థికంగా కొంతైనా వెసులుబాటు కలుగుతుంది.

No comments:

Post a Comment