అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, September 9, 2012

మిడతా మిడతా ఊచ్

మిడతా మిడతా ఊచ్
సాలీడు, గిజిగాడి గూడు...
చిలకా గోరింకల కువకువలు

ఆరుద్ర పురుగు అందం
తూనీగల గుంపులో ఆనందం
మనిషి స్వార్థానికి అన్నీ బలి
ఆధునిక జీవితంలో వైవిధ్యం నాశనం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 : తొలకరి వానలు పడగానే పొలంలో రకరకాల తీగలు, మొక్కలు మొలిచేవి! వాటి
ఆకులనే ఆకు కూరల్లాగా వాడుకుని తినేవాళ్లు. 'బతికుంటే బలుసాకైనా తినొచ్చు' అనే సామెత ఎక్కడి నుంచి వచ్చిందని! బలుసాకు చేలల్లో, చేల గట్లమీద ఎక్కడ పడితే అక్కడ కనిపించేది! మరి ఇప్పుడో... బలుసాకు లేనే లేదు! ఏటా వానలు పడిన తర్వాత... పిల్లలంతా చేల చుట్టూ తిరుగుతూ ఈ ఆకులు కోసుకునే వాళ్లు. బందల (ఒక రకం చెట్లు) చాటున పెరిగిన పుట్టగొడులు కోసుకుని వచ్చే వాళ్లు! పుట్టగొడుగుల కూర ఎంత రుచిగా ఉండేదో! ఇప్పుడు... అవి కనిపించడమే లేదు! చేలల్లో తేళ్లు, పాములు ఎన్నెన్ని ఉండేవో!

అడుగు తీసి అడుగు వేయాలంటే ఎంతో జాగ్రత్తగా వేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏడాదిలో రెండు మూడుసార్లు కూడా చేలల్లో పాములు కనిపించడంలేదు. తేళ్ల సంఖ్య కూడా పడిపోయింది. పచ్చ మిడతలను తలచుకుంటేనే కళ్లకు నీళ్లొస్తాయి. అప్పట్లో పచ్చ మిడతలు ఎన్నెన్ని ఉండేవో! మరి ఇప్పుడో... అదే పనిగా వెతికినా ఒకటి రెండు కూడా కనపడే పరిస్థితి లేదు. పచ్చని గడ్డి పరకల మీద చెంగు చెంగుమని గెంతే చిన్న మిడతలు కూడా తగ్గిపోతున్నాయి. ఏం చేద్దాం... పచ్చగడ్డి మైదానాలు పోతున్నాయి.

వాటితోపాటు మిడతలు కూడా మాయమవుతున్నాయి. పురుగుల మందు దెబ్బకు అన్నీ పోతున్నాయి. అనంతపురం జిల్లాలో దాదాపు 15 సంవత్సరాలపాటు ఎర్రగొంగళి పురుగు రెచ్చిపోయింది. ఇది వచ్చిందంటే వేరుశెనగ పంట నాశనమే! ఈ పురుగును నాశనం చేసేందుకు... ఒక్కో రైతు మూడునాలుగుసార్లు బలమైన మందులు కొట్టేవాళ్లు! ఈ మందుల దెబ్బకు ఎర్రగొంగళితోపాటు చేలల్లో రైతుకు పనికొచ్చేవి, పనికి రానివి అనే తేడా లేకుండా అన్ని రకాల క్రిమి కీటకాలు నాశనమైపోయాయి!

తూనీగా... తూనీగా
గుండ్రటి తల, పొడవాటి రెక్కలు, తోక... ఓరకం హెలికాప్టర్‌లాగా ఉండే తూనీగను చూస్తేనే ఓ ఆనందం! ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్న వెంటనే.. తూనీగలు గుంపులు గుంపులుగా చేరి గాల్లో ఎగిరేవి. తూనీగల గుంపు వచ్చిందంటే... వాన కూడా వచ్చినట్లే! పిల్లలు వీటిని చాకచక్యంగా పట్టుకుని, వాటితో ఆడుకుని తర్వాత మళ్లీ గాల్లోకి వదిలేసే వారు! ఇప్పుడు... ఈ తూనీగల గుంపులు అంతర్థానమయ్యాయి. అక్కడొకటి, ఇక్కడొకటి కనిపిస్తే గొప్ప! కొన్నాళ్లకు ఈ తూనీగలు సినిమా పాటల్లో, టైటిళ్లలో మాత్రమే కనిపిస్తాయేమో!

మరి జీరంగుల మాటో!? "ఎర్ర బుగ్గలగాడు తూతూతూ... పచ్చబుగ్గలగాడు తూతూతూ..' అంటూ పిల్లలు ఆకుపచ్చ, ఎర్ర జీరంగుల్ని పట్టుకుని పాడుకునే వారు. బలమైన రెక్కలతో ఉండే జీరంగుల్ని కొన్ని చోట్ల బంగారు పురుగులు అని కూడా అంటారు. జీరంగుల్ని అగ్గిపెట్టెల్లో పెట్టి, వాటికి తుమ్మాకు మేతను వేసేవారు. అవి అగ్గిపెట్టెల్లోనే గుడ్లు కూడా పెట్టేవి. రంగు రంగుల గుడ్లను మట్టిలో పాతిపెడితే... ఏదైనా దొరుకుతుందని పిల్లల ఆశ. ఈతచెట్లు, తుమ్మచెట్లు నరికి వేయడంతో జీరంగులకు ఆశ్రయం కరువైంది. జానెడు పొడవు, వందల కాళ్లు, ఎటు కావాలంటే అటు తిరిగే శరీరం... అదే 'రోకలిబండ'. ఇవి మట్టి రోడ్ల మీద, పొలం గట్ల మీద మెల్లగా పాకుతూ వెళ్లేవి.

రాత్రిళ్లు పొలాల్లో ఉంటాయి. పగలయ్యేసరికి చదునైన ప్రదేశాలకు వస్తుంటాయి. అప్పట్లో వీటి రాకపోకలకు అడ్డే లేదు. ఆ తర్వాత పల్లెలకు రోడ్లు పడ్డాయి. ఆటోలు, బస్సులు, జీపులు, మోటారు బైకులు పెరిగాయి. వీటి చక్రాల కింద పడి రోకలి బండలు చచ్చిపోతున్నాయి. చీకిచెట్లు, తుమ్మచెట్ల జిగురు వెంబడి మెల్లగా పాకే ముక్కు పురుగుల సంఖ్య బాగా పడిపోయింది. చీకిచెట్లలో రొదపెట్టే కీచురాళ్లు కనిపించడం లేదు. వినిపించడమూ లేదు. కందిరీగలు, సాలె పురుగులు, ఎర్రలు... ఇవీ తగ్గిపోయాయి.

కువకువలు ఎక్కడ?
పశువుల కొట్టాల చూరుల కింద పిచ్చుక గూళ్లు కనిపించేవి. ఊరపిచ్చుకలు ఊరంతా సందడి చేసేవి. ఇప్పుడు ఆ కిచకిచల చప్పుళ్లే లేవు. ఇప్పుడు పశువులకు కొట్టాల బదులు షెడ్లు వేస్తున్నారు. ఇక గూడు కట్టుకునే అవకాశమేదీ! అప్పుడు పిచ్చుకలు తమ గూళ్లు తాము కట్టుకునేవి. మరి ఇప్పుడో... 'ఊర పిచ్చుకలను కాపాడదాం రండి'... అంటూ వాటి కోసం మనం గూళ్లు పెట్టాల్సి వస్తోంది! అలా పెట్టినంత మాత్రాన వస్తాయా? పల్లెల్లో పుట్టి పెరిగిన వారికి గుర్తుండే ఉంటుంది!

సాయంత్రమయ్యేసరికి రావిచెట్లు, చింతచెట్లు చిలకలు, గోరింకలతో కళకళలాడేవి. వాటి అరుపులతో అంతా సందడిగా ఉండేది. 'వీటి అరుపులతో సచ్చిపోతున్నాం' అని ఒక్క రాయి చెట్టుమీదికి విసిరితే వందల పక్షులు గాల్లోకి ఒక్కసారిగా గుప్పున ఎగిరేవి. మరి ఇప్పుడో... గోరింకలు, రామచిలకలులేక రావిచెట్లు, చింతచెట్లు కళతప్పి బోసిపోయాయి. ఎంత విషాదం!? మనిషి తాను బతకడానికి ఏమైనా చేస్తాడు! ప్రకృతి సూత్రం ఇది కాదు! ఇది పరస్పర ఆధారితం!

క్రిములను తింటూ పురుగులు బతుకుతాయి. పురుగుల మీద ఆధారపడి పక్షులు బతుకుతాయి. చెట్లు ఉంటే పక్షులకు ఆవాసం ఉంటుంది. ఊరిలో మడుగులు ఉంటే కప్పలు బతుకుతాయి. కప్పల కోసం పాములు వస్తాయి. మనిషి స్వార్థానికి, మనిషి వాడే విష రసాయనాలకూ అన్నీ నాశనమవుతున్నాయి. ఆ నాశనమవుతున్న వాటిని కాపాడుకునేందుకే జీవ వైవిధ్యం పేరిట సదస్సు! నాశనం చేసేది మనమే! 'నాశనమై పోతున్నాయంటూ' వాపోయేదీ మనమే!

ఎక్కడమ్మా.. ఎర్రెలుకా?
ఎర్రగా ఉండే ఎర్రెలుకలు పొలాల్లోని కంచెల కింద, తువ్వ నేలల్లో బొరియలు తవ్వుకుని నివసించేవి. ఒకటీ రెండూ కాదు వందలూ వేల సంఖ్యలో ఉండేవి. రైతులు వీటి బెడద తట్టుకోలేక తలలు పట్టుకునే వాళ్లు. వాటిని పట్టుకునేందుకే బుడబుక్కల వాళ్లు, వేటగాళ్లు పనిగట్టుకుని ఊళ్లలోకి వచ్చే వాళ్లు. తాము పట్టుకున్న ఒక్కో ఎలుకకు ఇంత చొప్పున డబ్బులు తీసుకునే వాళ్లు. రుచికరమైన ఆ ఎలుకల మాంసాన్ని వండుకుని తినేవాళ్లు. ఎర్రనేలల్లోని గుట్టల కింద ఉడుములు పట్టుకునేందుకు కూడా వేటగాళ్లు వచ్చేవాళ్లు. ఇప్పుడు ఉడుములు లేవు. ఎలుకలూ తగ్గిపోయాయి.

పురుగో.. పరుగు
పేడను గోళికాయలా చేసుకుని.. వెనుక కాళ్లతో వాటిని దొర్లించుకుంటూ గూటికి చేర్చేవి పేడ పురుగులు. ప్రస్తుతం పల్లెల్లో 80శాతం రైతుల దగ్గర పశువులే లేవు. మరి పశువుల పేడను ఆశ్రయించే 'పేడపురుగులు' ఇంకెక్కడుంటాయి? అగ్గిపురుగు. ఇది పట్టి చూస్తే తప్ప కనిపించదు. ఆకారంలో చాలా చిన్నది. గడ్డి పోచలకు అంటుకుని ఉంటుంది. పొరపాటున చేయి తగిలితే.. సూది గుచ్చుకున్నట్లు ఉంటుంది. అరగంటపాటు నొప్పి తగ్గదు. ఎర్రగొంగళి నివారణకు మందులు పిచికారి చేయడంతో.. అగ్గి పురుగులూ నాశనమయ్యాయి. కుమ్మరి పురుగులు గుర్తున్నాయా? బంకమట్టిలో, ఒండ్రుమట్టిలో కనిపించేవి. ఇప్పుడు... కుంటలు పూడిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. వాటి మీద ఆధారపడి బతికే కుమ్మరి పురుగుకు సమస్యలొచ్చాయి.

కూలిన 'గిజిగాడు' గూడు
గూడు కట్టుకోవడంలో అన్ని పక్షులది ఒక తీరు! గిజిగాడిది ఒక ప్రత్యేకమైన తీరు! బావుల గోడల సందుల్లోంచి మొలిచే చెట్లకు గిజిగాడు గూడు కట్టుకుంటుంది. ఈత చెట్లకూ ఈ గూళ్లు కనిపించేవి. ఒకటే పొడవు ఉన్న గడ్డి పోచలను ముక్కున కరచి తెచ్చుకుంటుంది. అత్యంత నైపుణ్యంగా గూడు కట్టుకుంటుంది. విదూషకుడి టోపీలా ఉండే ఈ గూడు కూడా ప్రత్యేకమైనదే. అన్ని పక్షులు పక్క నుంచే, పై నుంచో గూటిలోకి ప్రవేశిస్తాయి. కానీ... గిజిగాడి గూటికి 'తలుపు' కింది నుంచి ఉంటుంది. ఈ పక్షి లోపల వెచ్చగా ఉంటుంది. వాన వచ్చినా తడవదన్న మాట! బోర్లు, కొళాయిలూ వచ్చాక ఊరిలో బావులన్నీ పాడుపడిపోయాయి. పూడ్చేస్తున్నారు. గూడు పోయిన గిజిగాడు అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేరాడు!

ఎక్కడమ్మా చందమామ?
'పచ్చని పచ్చిక భరితమౌ బీడులందు ఇంద్రగోపంబులు సాంద్రముగ కనిపించును'.. ఇది పోతన పద్యం. ఈ పద్యంలోని ఇంద్రగోపం అనేది ఒక పురుగు. దీనినే కొందరు ఆరుద్ర పురుగు అంటారు. ఇంకొందరు పట్టుపురుగు, చందమామ పురుగు అని కూడా పిలుస్తారు. తొలకరి వానలు పడగానే ఇసుక నేలల్లో, ఆకుపచ్చ భూముల్లో ఎర్రెర్రగా మెరుస్తూ... వందలూ వేల సంఖ్యలో మెల్లమెల్లగా నడుస్తూ ఆకాశంలో నక్షత్రాలను తలపిస్తాయి. మెత్తటి శరీరంతో.. ముట్టుకుంటూనే సిగ్గుతో ముడుచుకుంటాయి. ఇప్పుడు ఊర్లలో ఆరుద్ర పురుగుల జాడ కనిపించకుండా పోతోంది. రైతుకు ఎంతో మేలు చేసే ఈ పురుగు... రైతులు వాడే రసాయన ఎరువులు, క్రిమి సంహారాలవల్లే నశిస్తున్నాయి.

No comments:

Post a Comment