అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, May 10, 2012

దళిత గిరిజనుల అభివృద్ధి ఇలాగేనా?

డా|| బి. గంగారావు   Wed, 9 May 2012, IST  
60శాతం దళితులు, 73శాతం గిరి జనుల ఇళ్లు నేటకీి మట్టి నేలలే. మెజాయిక్‌, టైల్స్‌తో ఇంటి ఫ్లోరింగ్‌ కలిగిన వారు 5.23 శాతం దళితులుంటే, 3.54 శాతం గిరిజనులున్నారు. మిగిలినవారు చెక్క, సిమెంట్‌ ఫ్లోరింగ్‌ కలిగి ఉన్నారు. ఇళ్ళలోని గదులు సంఖ్యను పరిశీలిస్తే ఎంత దుర్భరస్థితిలో దళితులు, గిరిజనులు ఉన్నారో అర్థమవుతుంది.

ప్రపంచీకరణ విధానాలవల్ల దేశంలోని దళిత గిరిజనుల పరిస్థితులు మరింతగా దిగజారినట్లు 2012 జనాభా లెక్కలు వెల్లడిస్తున్నాయి. లక్షల కోట్ల బడ్జెట్లు, పంచవర్ష ప్రణాళికలు, సంక్షేమ పథకాలంటూ ఊదరగొడుతున్నా ఇవేవీ దేశంలో అత్యధిక దళిత, గిరిజన కుటుంబాలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించలేకపోతున్నాయి. ఇరుకైన ఇల్లు, మచ్చుకైనా కనిపించని పారిశుద్ధ్యం, దుర్వాసనతో పొంగి పొర్లే మురికి కాలువలు, ఎక్కడ చూసినా చెత్తా, చెదారాలు ఇదీ వీరి ఆవాసాల చుట్టూ ఉన్న పరిస్థితి. కాగితాల్లో పేదరికపు లెక్కలు పడిపోవచ్చు. కాని దళిత గిరిజన జీవితాలను తెరచి చూస్తే పేదరికపు విషపుకోరలు ఎలా విస్తరిస్తున్నాయో అర్థమవుతుంది. అన్ని సదుపాయాల్లోను దేశ సగటు కంటే అధమస్థాయిలోనే వీరున్నారు. 64 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పెద్ద సంఖ్యలో విద్యుత్‌ శక్తి లేని ఇల్లు, 70 శాతానికి పైగా దళిత, గిరిజన ఆవాసాలకు కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు.
కొద్ది రోజుల క్రితం భారత రిజిస్ట్రార్‌, జనగణన కమీషనర్‌ కార్యాలయం భారతదేశంలోని షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ఇళ్ళ స్థితిగతులు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఆస్తులకు సంబంధించిన 2011 జనాభా లెక్కల వివరాలను విడుదల చేసింది.
దీని ప్రకారం దేశ జనాభా 1.21కోట్లు. వీరంతా 6,38,588 గ్రామాలు, 7935 పట్టణాల్లో ఉన్నారు. మొత్తం జనాభాలో 31.16శాతం పట్టణాల్లో నివసిస్తున్నారు.
దేశంలో మొత్తం 33.08 కోట్ల ఇళ్లు ఉన్నాయి. 22.06 కోట్లు (66.7శాతం) గ్రామాల్లోను, 11.01కోట్లు (33.29శాతం పట్టణాల్లోను ఉన్నాయి. వీటిల్లో 4.42 కోట్ల దళిత ఆవాసాలు, 2.33కోట్ల గిరిజన ఆవాసాలున్నాయి. దేశ జనాభాలో దళిత గిరిజనులు నాల్గవ వంతు ఉంటే మొత్తం ఆవాసాల్లో 20శాతం మాత్రమే కలిగిఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో చూస్తే కేవలం 13శాతం మాత్రమే ఉన్నాయి.
దేశంలో 57శాతం దళితలు, 60శాతం గిరిజనులు నాసిరకమైన ఇళ్ళల్లో నివాసం ఉంటున్నారు. తాటాకులు, గడ్డి, రేకులు, ప్లాస్టిక్‌కవర్‌తో పై కప్పులున్న ఇళ్ళలో 53 శాతం దళితులు, గిరిజనులు నివాసం ఉంటున్నారు. 22శాతం దళితులు, 10శాతం గిరిజనులు మాత్రమే సిమెంట్‌ కాంక్రీటుతోకూడిన పైకప్పు ఇళ్లు కలిగి ఉన్నారు. 10నుండి 12శాతం మంది దళిత గిరిజనులు మాత్రమే సిమెంట్‌ ఇటుకలతో గోడలు నిర్మించుకున్నారు. అధిక భాగం తాటాకు, రేకులు, మట్టి, చెక్కలతో గోడలు నిర్మించుకున్న ఇళ్లల్లో ఉంటున్నారు.
60శాతం దళితులు, 73శాతం గిరిజనుల ఇళ్లు నేటకీి మట్టి నేలలే. మెజాయిక్‌, టైల్స్‌తో ఇంటి ఫ్లోరింగ్‌ కలిగిన వారు 5.23 శాతం దళితులుంటే, 3.54 శాతం గిరిజనులున్నారు. మిగిలినవారు చెక్క, సిమెంట్‌ ఫ్లోరింగ్‌ కలిగి ఉన్నారు.
ఇళ్ళలోని గదులు సంఖ్యను పరిశీలిస్తే ఎంత దుర్భరస్థితిలో దళితులు, గిరిజనులు ఉన్నారో అర్థమవుతుంది. ఒకేఒక్క రూముతో కాలం వెలిబుచ్చుతున్న దళితులు, గిరిజనులు సగానికి సగం కుటుంబాలు దేశంలో ఉన్నాయి. రెండే రూములున్న కుటుంబాలు 32శాతం ఉంటే, 4 నుండి 5 రూములున్న కుటుంబాలు 2 నుండి 4శాతం మాత్రమే ఉన్నాయి. ఆ కుటుంబాల్లోని జనాభా సంఖ్య చూస్తే వీరి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమౌతుంది. 3వ వంతు దళిత, గిరిజనుల ఇళ్లల్లో 6 నుండి 9 మందికి పైగా నివాసం ఉంటున్నారు.
ఇళ్ళు లేని వారు చూస్తే 15శాతం పైబడి ఉన్నారు. మరో 20శాతం ఇళ్లలో 2నుండి 5పైబడి పెళ్లయిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇళ్ళు సంపాదించుకునే స్థోమత లేక ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇందిరమ్మ, వాంబే, జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం, రాజీవ్‌ ఆవాస్‌ యోజన తదితర పథకాల పేర పేదలకు ఇళ్ళు నిర్మిస్తున్నామనే ప్రభుత్వ ప్రచారంలో నిజమెంతో ఈ అంకెలు తెలియజేస్తున్నాయి. రెండోవైపు పట్టణాల్లోని మురికివాడలపై పాలకులు దాడి చేస్తున్నారు. అత్యధిక మంది దళిత గిరిజనులు ఈ మురికివాడల్లోనే తల దాచుకుంటున్నారు.మురికివాడల రహిత నగరాలు, నగరాల ఆధునీకరణ పేరుతో మురికివాడలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. అలా ఖాళీ చేసినవాటినిసంపన్నుల వ్యాపార, విలాసాలకు కట్టబెడుతున్నారు. పేద దళిత గిరిజనులను ఆవాసాలకు దూరం చేస్తున్నారు. 30శాతం దళిత కుటుంబాలు, 14.62 శాతం గిరిజన కుటుంబాలు మాత్రమే శుద్ది చేసిన సురక్షిత మంచి నీరు పొందుతున్నాయి. 64 శాతం కుటుంబాలకు ఇంటి ఆవరణలో మంచి నీటి సౌకర్యం లేదు. 36 శాతం కుటుంబాలు సుదూర ప్రాంతానికి వెళ్ళి మంచినీరు తెచ్చుకుంటున్నారు. రెండొంతుల కుటుంబాలు తాగునీటి కోసం చేతిపంపు, మూతఉన్న, మూతలేని నూతులు, బోర్ల మీద ఆధారపడుతున్నాయి. దళితులు కంటే గిరిజనుల స్థితి మరీ ఘోరం. పెస్సీ, కోకోకోలా వంటి బహుళజాతి సంస్థలకుకావలసినంత సురక్షితమైన నీరు లభిస్తుంది. నగరాలు, పట్టణల్లో ప్రత్యేక కాలనీలు, ఆకాశ హర్మ్యాలకు, స్టార్‌ విల్లాలకు 24 గంటలూ శుద్ధిచేసినా మంచినీరు అందుబాటులో ఉంటుంది. దళిత గిరిజనలకు మాత్రం మంచినీరు అందుబాటులో ఉండదు.
53.3 శాతం దళిత కుటుంబాలకు, 77.49 శాతం గిరిజన కుటుంబాలకు అసలు మురుగునీటిపారుదల సౌకర్యం లేదు. 11.35 శాతం మూతలేసిన మరుగునీటి కాలువల సౌకర్యాన్ని దళితులు కలిగి ఉంటే కేవలం 6.11 శాతం మాత్రమే గిరిజన ఆవాసాలు కలిగి ఉన్నాయి. మూతలేని (ఓపెన్‌) మురుగునీటి కాలువల సౌకర్యం 35.2 శాతం దళితులు, 16.7 శాతం గిరిజనులకు మాత్రమే అందుబాటులోకి ఉంది.
27.7 శాతం దళితుల ఇల్లు, 17.35 శాతం గిరిజనుల ఇళ్ళకు మాత్రమే స్నానపు గదులు ఉన్నాయి. అందులోనూ కేవలం 19.7 శాతం దళితులకు, 14.11 గిరిజనుల స్నానపు గదులకు మాత్రమే పైకప్పు ఉంది.
మరొక ముఖ్యమైన సమస్య మరుగుదొడ్ల సౌకర్యం. 66శాతం దళిత కుటుంబాలకు, 77.6 శాతం గిరిజనులకు మరుగుదొడ్లు సౌకర్యమే లేదు. అత్యధిక మంది నేటికి బహిర్భూమికెళ్ళాల్సి వస్తోంది. 13.8శాతం దళిత కుటుంబాలు సెప్టిక్‌ట్యాంక్‌లు కలిగి ఉంటే 91శాతం గిరిజన కుటుంబాలకు అసలు సెప్టిక్‌ట్యాంకుల సదుపాయమే లేదు.
41శాతం దళిత, గిరిజన కుటుంబాలకు ప్రత్యేక వంట గదులు లేవు. అన్నీ ఒక రూముకే పరిమితమై ఉన్నాయి. నూటికి 80శాతం కుటుంబాలు నేటికీ కట్టెలు, పిడకలు, బొగ్గులు, వ్యర్థపదార్థాలనే వంటకు ఇంధనాలుగా వాడుతున్నాయి. కిరోసిన్‌ వాడేవారు కేవలం 3శాతం లోపు కుటుంబాలు మాత్రమే. కేవలం 17.22 శాతం దళితులు, 9శాతం గిరిజన కుటుంబాలకు మాత్రమే వంటగ్యాస్‌ను వంటకు వినియోగించుకోగలుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే 20 శాతం లోపు మాత్రమే దళిత, గిరిజనులు ఎల్‌.పి.జి గ్యాస్‌ కనెక్షన్‌ సౌకర్యం కలిగి ఉన్నాయి. నేటికీ దేశంలో సగానికి పైగా దళిత, గిరిజన ఆవాసాలకు విద్యుత్‌ సౌకర్యం లేదంటే ఆశ్చర్యం కలుగకమానదు. పట్టణ ప్రాంతాన్ని మినహాయిస్తే మూడింట రెండొంతులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లోని వీరికి విద్యుత్‌ సౌకర్యం లేదు. 40శాతానికి పైబడి కిరోసిన్‌ దీపాల మీద ఆధారపడి ఉన్నాయి. ఇంకా అనేక మంది ఎటువంటి ఇంధనాన్ని ఉపయోగించుకోగల స్తోమతలేక కటిక చీకట్లోనే కాపురాలు చేస్తున్నారు.
ఇక బ్యాంకు అకౌంట్స్‌, రేడియో, టివి, ఇంటర్‌నెట్‌, ఫోన్లు, మోటారు వాహనం, కార్లు వంటి సదుపాయాలు పరిశీలిస్తే వీటికి ఈ కుటుంబాలు ఎంతదూరంగా ఉన్నదీ అర్థమవుతుంది. సగానికి పైగా దళిత, గిరిజన కుటుంబాలకు బ్యాంకుల్లో కనీసం సేవింగ్‌ అకౌంట్స్‌ కూడా లేవు. 16శాతం మంది మాత్రమే రేడియో కలిగి ఉన్నారు. 61శాతం దళిత కుటుంబాలకు టెలివిజన్‌ సౌకర్యం లేదు. గిరిజనులలో అయితే 78శాతం కుటుంబాలుకు టెలివిజన్‌ లేదు. కేవలం 6శాతం లోపు మాత్రమే మొబైల్‌ లేదా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సౌకర్యం ఉంది. కంప్యూటర్‌ కలిగిన వాళ్ళు 5 శాతంలోపు మాత్రమే ఉన్నారు.
గడిచిన పదేళ్ళలో ఇంటర్నెట్‌ వాడేవారు దేశంలో గణనీయంగా పెరగొచ్చు. లేదా ప్రపంచదేశాలతో పోల్చుకుంటే ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ నాల్గవ స్థానంలో ఉండొచ్చు. కానీ దళితులు, గిరిజనులు ఇంటర్నెట్‌ వాడకం చాలా తక్కువ. అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థను వినియోగించుకోలేని దయనీయస్థితిలో ఇప్పటికీ అత్యధికమంది దళిత, గిరిజన కుటుంబాలున్నాయన్నమాట.
నూటికి 90మందికి మోటర్‌ వాహన సౌకర్యం లేదు. ఇక కార్లు, జీపులు వంటి ఆస్తులు చూస్తే అంకెలు కూడా కనిపించటం లేదు. ఉన్న ఈ సౌకర్యాలు కూడా కొద్దిభాగం పట్టణ ప్రాంతాల్లోని దళిత, గిరిజన కుటుంబాలు మాత్రమే కలిగి ఉన్నాయి. మౌలిక సదుపాయాలే కాక విద్య, ఆరోగ్యం వంటి వాటిల్లోనూ తీవ్ర అసమానతలను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకులను సైతం పొందలేకపోతున్నారు. ఫలితంగా పౌష్టికాహార లోపంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నది. అనేక జబ్బులకు ఆలవాలంగా వీరి ఆవాసాలు ఉంటున్నాయని అనేక ప్రభుత్వ ఆరోగ్య సర్వేలు రుజువుచేస్తున్నాయి.
గడచిన పదేళ్ళలో ఏడాదికి పదిశాతం చొప్పున సంపద పెరిగింది. దేశంలో కుబేరుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మౌలిక సదుపాయాలు, ఉపాధి, భూమి, ఆదాయ వనరులకు దూరమవుతున్నవారి సంఖ్య ఏడాదికేడాది ఎలా పెరుగుతున్నదీ ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.
విచిత్రమేమంటే ఇంత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వీరు నేటికీ కాంగ్రెస్‌, తెలుగుదేశం, తదితర బూర్జువా పార్టీల వెనుకే గణనీయంగా ఉన్నారు. వీరినే నమ్ముకొని జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ఎదురు చూస్తున్నారు. కాని ఈ పార్టీల పాలనలో వీరి జీవితాలు అడుగంటిపోతున్నాయి. 2011 జనాభా గణాంకాలు తెలియజేస్తున్న వాస్తవాలను ఇప్పటికైనా పాలకులు గమనించి దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలి. జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర,రాష్ట్ర, స్థానిక బడ్జెట్‌ల్లోనూ, ప్రణాళికల్లోనూ దళిత, గిరిజనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ప్రత్యేక ఏజెన్సీల ద్వారా వీరి అభివృద్ధికి ఖర్చు చేయాలి. విద్య, వైద్యం, మౌలికసదుపాయాలు, సేవలు పొందేందుకు చట్టబద్ధమైన ఏర్పాట్లు చేయాలి.

(రచయిత సి.పి.ఐ.(ఎం) (గేటర్‌ విశాఖ నగర కమిటీ) కార్యదర్శి

No comments:

Post a Comment