అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, September 24, 2012

దగాపడ్డ ధరిత్రి!

రాజధానిలో జీవ వైవిద్య సదస్సు...
అక్టోబర్ 1 నుంచి 19 వరకు

193 దేశాల నుంచి ప్రతినిధులు..
జీవ వైవిద్య పరిరక్షణపై మేధో మథనం
ఫలితాలపై సందేహాలెన్నో..
సామాన్యులకు అందని గత సదస్సుల ఫలాలు

460 కోట్ల సంవత్సరాలు! ఇది భూమి వయసు!
భూమిని ఒక మహిళతో పోలుద్దాం!... ప్రతి 10 కోట్ల సంవత్సరాలను ఒక సంవత్సరంగా లెక్కిద్దాం! అంటే... భూమి అనే మహిళ వయసు ఇప్పుడు 46 ఏళ్లు.

భూమి పుట్టి కళ్లు తెరిచిన తొలి ఏడేళ్లలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు! అది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం!
ఆ తర్వాత మరో 35 సంవత్సరాలపాటు భూమి జీవితంలో ఏం జరిగింది? ఈ ప్రశ్నకు అస్పష్టమైన సమాధానాలు మాత్రమే లభించాయి.

భూమి 42 ఏళ్ల వయసులో... తొలి పుష్పం వికసించింది.
44 సంవత్సరాల వయసులో... రాక్షస బల్లులలాంటి భారీ సరీసృపాలు నడయాడాయి.
జస్ట్... ఓ ఎనిమిది నెలల కిందటే భూమిపై క్షీరదాలు నడక ప్రారంభించాయి.
పోయిన వారమే ఏప్ (తోకలేని కోతి) నుంచి మనిషి ఆవిర్భావ ప్రక్రియ మొదలైంది.
4 గంటల క్రితం.. ఆధునిక మానవుడు ఆవిర్భవించాడు.
సరిగ్గా గంట క్రితం... మనిషి వ్యవసాయం కనిపెట్టాడు.
ఒకే ఒక్క నిమిషం కిందట.. పారిశ్రామిక విప్లవం, వెంటనే పొగలు, సెగలతో భూమి వేడెక్కడమూ మొదలైంది.
ఈ ఒకే ఒక్క నిమిషంలో అందాలకు నిలయమైన ఈ భూమి ఓ చెత్తబుట్టలా తయారైంది. మనిషి అవసరాలు మాత్రమే తీర్చే వనరులా మారింది. భూమి... ఇప్పుడు అలసిపోయింది. ఆయాసపడుతోంది.

460 కోట్ల సంవత్సరాల వయసున్న భూమికి... గత 206 ఏళ్ల నుంచే పెను ముప్పు వచ్చి పడింది. 'అందరూ బాగుండాలి' అనే సిద్ధాంతం నడిచినన్ని రోజులు భూమి బాగానే ఉంది. 'నేను మాత్రమే బాగుండాలి' అని మనిషి అనుకోవడం మొదలుపెట్టిన తర్వాతే సమస్య మొదలైంది. మరి ఇప్పుడేం చేయాలి? పరిష్కారం కనుగొనేందుకే... సదస్సులు, సమావేశాలు, మేధో మథనాలు! ఈ తరహా చర్చల్లో అతి పెద్దది, అంతర్జాతీయమైనది... మన దేశంలో, మన హైదరాబాద్‌లో అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరగనుంది. ఈ సదస్సులో ఏం జరుగుతుంది? ఏం ఒరుగుతుంది?


హైదరాబాద్, సెప్టెంబర్ 13 : జీవ వైవిధ్యంపై ఇదో అంతర్జాతీయ వేడుక! మొత్తం 193 దేశాల ప్రతినిధులు... కొందరు దేశాధినేతలు, అన్ని దేశాల పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, రెం డువేల మందికిపైగా పాత్రికేయులు... మొత్తంగా సుమా రు పదివేల మంది విదేశీ ప్రతినిధులు! దీనికి మన హైదరాబాద్ వేదిక! 'ప్రకృతిని రక్షించు. అది నిన్ను రక్షిస్తుంది!' ఇదీ నినాదం! ఇది ప్రభుత్వాల విధానం కావాలి!

అందుకు ఇప్పటిదాకా ఏంచేశాం? ఇకపై ఏం చేయాలి? ఇందులో ఎవరి బాధ్యత ఎంత? ఇవీ మనముందున్న ప్రశ్నలు. దీనికి సమాధానం కనుగొనడమే జీవ వైవిధ్య సదస్సు ముఖ్య లక్ష్యం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) పేరిట ఇప్పటిదాకా పది సదస్సులు జరగ్గా.. ఇది కాప్-11. ఐరాస 2011-20ని జీవవైవిధ్య దశాబ్దంగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సదస్సు ఇదే! దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.450 కోట్లదాకా ఖర్చు చేస్తున్నాయి.

ఎవరెవరో వస్తారు! ఏవేవో మాట్లాడుకుంటారు! ఎన్నెన్నో తీర్మానాలు చేస్తారు! ఇందులో ఏ ఒక్కటీ సామాన్యుడికి అర్థం కాదు! అవి అమలయ్యాయో, లేదో కూడా తెలియదు! పది సదస్సుల్లో జరిగింది దాదాపు ఇదే! హైదరాబాద్ సదస్సు మాత్రం ఇందుకు భిన్నంగా నిలవనుంది. శాస్త్రవేత్తల నుంచి సామాన్యులదాకా అందరికీ అర్థమయ్యేలా చర్చలు జరుగుతాయని, తీర్మానాలు చేస్తారని నిర్వాహకు లు చెబుతున్నారు. అయినా... ప్రస్తుతం ఏదీ దాచేస్తే దాగే పరిస్థితి లేదు.

1992లో బ్రెజిల్‌లో 'ధరిత్రీ సదస్సు' జరిగింది. అప్పటి తీర్మానాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. పాషాణ పాకాల్లాంటి తీర్మానాల సారాంశం మేధావులకే అంతు చిక్కలేదు. అప్పట్లో మీడియా కూడా విస్తృతంగా లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. కాప్-11కు వివిధ దేశాలనుంచి 2000 మంది జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు హాజరవుతున్నారు. ప్రతి అంశంపైనా మీడియా కన్ను వేస్తుంది. చర్చలు, సమావేశాలు, ఒప్పందాలు ఏమేరకు సామాజిక, పర్యావరణ సంబంధమైనవో... లేక ఆర్థిక పరమైనవో అప్పటికప్పుడే నిగ్గు తేలిపోతుంది.

వైవిధ్యమా... స్వార్థమా?
జీవ వైవిధ్య సదస్సులో అగ్రదేశాల స్వార్థమే లేదా? కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు అస్సలు లేవా? ఇవి కొందరు పర్యావరణవేత్తల సందేహాలు! ఇవి అర్థం లేనివేమీ కావు! ఒకచోట చేరి... ఒక దేశానికి, ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన జీవ, జంతుజాతుల సమాచారాన్ని తెలుసుకుని... వాటిపైనా మేధోపరమైన హక్కులు కల్పించుకోవడమనే రహస్య అజెండా ఈ సదస్సు వెనుక ఉందని పర్యావరణ నిపుణులు వాదిస్తున్నా రు. ఇరవై ఏళ్లలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన అనేక సదస్సుల తీర్మానాలు పెద్దగా అమలైన దాఖలాలు లేవని గుర్తుచేస్తున్నారు.

పైగా... వెనుకబడిన, మూడో ప్రపంచ దేశాలకు చెందిన వైవిధ్య సంపదను బడా దేశాలు, బడాబడా కార్పొరేట్ కంపెనీలు సొంతం చేసుకోవడం గమనార్హం. "దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి నిర్వాకమే ఉదాహరణ. ఈ సంస్థ బహుళ జాతి సంస్థల కన్నుసన్నల్లో నడుస్తోంది. 40 వేల రకాల మొక్కలు, వృక్షాలకు చెందిన వివిధ రకాల జన్యు వనరుల జెర్మ్‌ప్లాసమ్‌లను సదరు సంస్థ బహుళ జాతి కంపెనీలకు అప్పగించింది'' అని పర్యావరణ వేత్తలు ఆరోపించారు. నిజానికి... ఇలా వ్యవహరించడం గతంలో జీవ వైవిధ్య సదస్సుల్లో చేసిన తీర్మానాలకు విరుద్ధం. అయినా, ఇది జరుగుతూనే ఉంది. మనకు కావాల్సింది కార్పొరేట్ అనుకూల జీవ వైవిధ్యం కాదని... అందరికీ పనికొచ్చే ప్రజా వైవిధ్యం అని చెబుతూ హైదరాబాద్‌లోనే పోటీ సదస్సు కూడా జరగనుంది.

కాప్-11 ముఖ్య లక్ష్యాలు..
* అందరికీ అందుబాటులో వైవిధ్యం...
* పేదరిక నిర్మూలనకు జీవ వైవిధ్యం
* జీవ వైవిధ్యాన్ని సాధించడం ఎలా?
* నగరాల నుంచి దేశ ప్రభుత్వాల వరకు అనుసరించాల్సిన ప్రణాళికల రూపకల్పన
* జీవ వైవిధ్య అభివృద్ధికి పరస్పర సహకారం
* సంప్రదాయ పరిజ్ఞానాన్ని సంరక్షించుకునేందుకు చట్టబద్ధ వ్యవస్థ
* సాంస్కృతిక, స్వదేశీ, స్థానిక ప్రజల ప్రతిభా వారసత్వాల రక్షణకు నైతిక నియమావళి ఏర్పాటు
* పంటలు, మొక్కల సంరక్షణపై అంతర్జాతీయ స్థాయి ప్రణాళిక.

కాప్-11లో...
హైదరాబాద్ సదస్సులో 56 డాక్యుమెంట్లపై చర్చ జరుగుతుంది. అంతకుముందు పది సదస్సుల కథాకమామిషు...
2010: నగోయా-జపాన్ (110 డాక్యుమెంట్లు - 36 నిర్ణయాలు)
2008: బాన్ - జర్మనీ (106-34)
2006: క్యురిటిబా - బ్రెజిల్ (94 - 36)
2004: కౌలాలంపూర్ - మలేషియా (114 - 32)
2002: హేగ్ - నెదర్లాండ్స్ (81 - 29)
2000: నైరోబీ - కెన్యా, కొలంబియా, మాంట్రియల్ (24 - 3)
(నైరోబీలో అసాధారణ సమావేశం జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది కొలంబియా, మాంట్రియల్‌లోనూ సమావేశాలు జరిగాయి)
1998: బ్రటిస్లావా - స్లొవేకియా (112 - 27)
1996: బ్యూనస్ ఎయిర్స్ - అర్జెంటీనా (56- 23)
1995 జకార్తా - ఇండొనేషియా (32- 13)


మూడు దశల్లో...
అక్టోబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరిగే కాప్-11 మూడు దశలుగా సాగుతుంది. 1 నుంచి 5వ తేదీ వరకు మీటింగ్ ఆఫ్ పార్టీస్ (మాప్) సమావేశం జరుగుతుంది.
8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సభ్య దేశాల సదస్సు (కాప్) జరుగుతుంది.
చివరి మూడు రోజుల్లో ఉన్నత స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తారు. అప్పటిదాకా జరిగిన చర్చల ఆధారంగా కీలకమైన తీర్మానాలు చేస్తారు.

No comments:

Post a Comment