చెరువులో పూడిక తీయడం
ఔషధ మొక్కలను గుర్తుంచుకొని సంరక్షించడం
గణేశుడి ఆరాధన.. జీవ వైవిధ్య పరిరక్షణ
మనిషి మనుగడకు కావాల్సిన ప్రతిదాన్నీ ప్రకృతి మాత అందించింది. ప్రకృతి
ఇచ్చిన ఆ వనరులను పరిరక్షించుకోవడానికి మనం సృష్టించుకున్న సందర్భాలే
పండుగలు. ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి.. ఇలా ఏ పర్వదినాన్ని
తీసుకున్నా ఆయా పండుగల్లో పాటించే ఆచారాల వెనుక పరమార్థం జీవ వైవిధ్యాన్ని
పరిరక్షించుకోవడమే! ఈ విషయంలో గణేశ చతుర్థి మరీ ప్రత్యేకం. ఆ పండుగనాడు
ఆచరించే అన్ని సంప్రదాయాలూ జీవ వైవిధ్యాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించేవే
కావడం గమనార్హం.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 : చెరువు మట్టితో విగ్రహాల రూపకల్పన.. ఇరవై ఒక్క ఔషధ పత్రాలతో పూజ (ఏకవింశతి పత్ర పూజ).. ఆ నిర్మాల్యంసహా మళ్లీ గణేశుని ప్రతిమలను నిమజ్జనం చేయడం.. వీటన్నిటి వెనుకా ఒక అర్థం ఉంది. ఒకప్పుడు.. ఊళ్లల్లో చెరువు నుంచి తీసిన మట్టితో తయారుచేసిన విగ్రహాలను మాత్రమే పూజించేవారు. ఈ ఆచారం వెనుక అసలు పరమార్థం.. చెరువులో పూడిక తీయడమే. వానల వల్ల కొత్తగా వచ్చి చేరే నీటితోపాటు మట్టి కూడా పేరుకుపోతుంది.
విగ్రహాల కోసం మట్టిని తీయడంవల్ల పరోక్షం గా పూడిక తీసినట్టవుతుంది. దీనివల్ల చెరువులోకి మరింత ఎక్కువగా కొత్త నీరు వచ్చి చేరడానికి వీలవుతుంది. వాననీటి సంరక్షణకు ఇది ముఖ్యమైన అంశం. ఎక్కువ నీటిని నిల్వ ఉండేలా చేయడం అంటే.. భూగర్భజలాలను వృద్ధి చేయడమే! మూడోది.. అత్యంత ముఖ్యమైన ఉపయోగం.. పూడిక తీసిన చెరువు నీటిలో ఆక్సిజన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల జలచరాల మనుగడ బాగుంటుందని పర్యావరణ నిపుణుల విశ్లేషణ.
పూజ.. పత్రి.. గరిక, తులసి, మారేడు, జిల్లేడు, రావి, జమ్మి, జాజి, గన్నేరు, మామిడి, దానిమ్మ, ఉత్తరేణి, మరువం, దవనం, రేగు.. వినాయకుడి పూజలో వినియోగించే ప్రతి ఆకూ.. పువ్వు.. పండు.. విశిష్టమైన ఔషధ గుణాలు కలిగినవే. ఒక్కో మొక్కకూ ఒక్కో రోగాన్ని తగ్గించే గుణం ఉంటుంది. ఉదాహరణకు.. గరిక. దూర్వాయుగ్మంగా వ్యవహరించే గరిక అతిదాహాన్ని నివారిస్తుంది. పలు చర్మరోగాలకు, చుండ్రుకు రూపొందించే ఔషధాల్లో దీన్ని వినియోగిస్తారు. పొట్ట పెరగడాన్ని తగ్గించే గుణం రేగుపండ్లకు ఉంటుంది. అందుకు గుర్తుగానే.. వినాయకుడి పూజలో 'లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి' అని వస్తుంది.
కడుపునొప్పి, శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఉత్తరేణి చక్కగా పనిచేస్తుంది. అది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇక తులసి మొక్క ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామిడాకు అతిమూత్ర వ్యాధికి దివ్యౌషధం. ఎంతకీ తగ్గని పుండ్లకు గన్నేరు మంచి మందు. దానిమ్మ ఆకు అజీర్ణానికి ఔషధం. ఈ పండు తింటే ఆకలి బాగా వేస్తుంది. దుర్గంధాన్ని, క్రిములను పారద్రోలే సుగంధ మొక్కలు మరువం, దవనం. వావిలి ఆకుల పొగకు దోమలు పరారైపోతాయి. శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు జిల్లేడు మిక్కిలి ప్రశస్తమైనది.
మారేడు పిప్పి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ మొక్కలను, వాటి ఆకులను, పూలను, పండ్లను నేరుగా వాడక్కర్లేదు.. ఆ ఔషధ మొక్కల గాలి తగిలినా చాలు.. దీర్ఘకాలంలో ఎంతో మేలు చేస్తాయి. అందుకే తొమ్మిదిరోజుల పాటు పత్రిపూజను మన పెద్దలు ప్రమాణంగా నిర్ణయించారు. ఆరోగ్య సంరక్షణలోనే కాదు.. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో కూడా ఈ మొక్కలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే దేవుడి పేరు చెబితే అయినా తదుపరి తరాలవారు వాటి ని గుర్తుంచుకుని, ఏడాదికొకసారి వాటిని సేకరించడం ద్వారా పరిరక్షిస్తారన్నది మన పూర్వికుల ఆలోచన.
ఇక తొమ్మిదిరోజులపాటు వినాయకుణ్ని పూజించాక, తీసుకెళ్లి నిర్మాల్యంసహా నిమజ్జనం చేస్తాం. అందులో.. అన్నాళ్లూ గణేశుని పూజించడానికి ఉపయోగించిన ఔషధ మొక్కల ఆకులు ఉంటా యి. కొన్ని గంటలపాటు నీళ్లల్లో నానిన తర్వాత అవి ప్రభావం చూపుతాయి. వానల కారణంగా చెరువులు, నదుల్లోకి కొత్తనీటి తోపాటు చేరే విషపురుగులు, క్రిములకు ఆ ఆకుల్లోని ఔషధ గుణాలు విరుగుడుగా పనిచేస్తాయి.
కొత్తనీటిలోని బ్యాక్టీరియా ను నిర్మూలిస్తాయి. దీనివల్ల ఆ నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. వినాయక చవితి వేడుకల్లో అంతర్లీనంగా ఇంత సైన్స్ ఉందన్నమాట!! భారత ఉపఖండంలో క్రీ.పూ.3000 సంవత్సరం నుంచి ప్రకృతి ఆరాధన ఉందని ఒక అంచనా. మొక్కల్లోని ఔషధ గుణాలను గ్రహించి, వాటి మనుగడ ప్రమాదంలో పడకుండా ఉండేందుకు ఆనాడే ఈ అంశాన్ని దైవంతో ముడిపెట్టి, పూజల్లో మొక్కలను భాగం చేసిన మన పెద్దల దూరదృష్టికి శిరసు వంచి నమస్కరించకుండా ఉండగలమా?
No comments:
Post a Comment