అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, September 24, 2012

అరణ్య రోదన

జీవ వైవిధ్యానికి నిలయంగా అడవులు
ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా 'వనాంధ్ర'

రాష్ట్రంలో మొదటి జీవావరణ ప్రాంతం శేషాచలం
దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమున్న నల్లమల
అరుదైన జీవ, వృక్ష జాతులకు అవి నిలయాలు
గొడ్డలి దెబ్బకు తరుగుతున్న రాష్ట్రంలోని అడవులు
వన్య ప్రాణులకు కష్టం.. గిరిజనులకు నష్టం


కొండలు, కోనల నుంచి ఒంపులు తిరిగే గంగమ్మ...
ఏటిలో ఊటలు... చెలమలో సెగలు...
కూ...కూ... అంటూ కోకిలమ్మ పాటలు
కిలకిలకిలమను రామచిలుక పలుకులు
కొండలు ఢీకొని బండలు మింగే కొండ చిలువలు
బుసలు గక్కుతూ తాచు పాముల కోరలు
కట్లపాము కట్లు... నాగుపాముల నడకలు...
కాచుకున్న తోడేళ్లు... కాలు నిలవని జింకలు...
చిరుతలు, ఉడుతలు, ఎలుకలు, ముంగిసలు....
జీవ వైవిధ్యానికి అడవి తల్లిని మించిన ఇల్లు ఎక్కడుంటుంది? మరి... అడవిలో కొలువైన జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకుంటున్నామా?
సిగలో దట్టమైన దండకారణ్యం! దిగువన ఆదిశేషుడి నిలయమైన శేషాచలం! నడుమ నల్లమల వేసిన పచ్చల హారం! మనది... నిజంగా వనాంధ్రప్రదేశ్. జీవ వైవిధ్యంలో... ఒక్కో అడవిది ఒక్కో ప్రత్యేకత.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: శ్రీమహావిష్ణువు భూలోకంలో ఆవాసం ఏర్పరుచుకోవడానికి ఎంచుకున్న ప్రాంతం... శేషాచలం. శ్రీనివాసుడు కొలువైన కొండలివి. తిరుమల ఏడుకొండలూ శేషాచలం అడవుల్లో అంతర్భాగమే. మన రాష్ట్రంలోని ఏకైక జీవావరణ ప్రాంతం (బయోస్పియర్ జోన్) ఇది. శేషాచలం కొండలు ఆకాశం నుంచి చూస్తే... శేషుడి (సర్పం) ఆకారంలో కనిపిస్తాయి. 2,50,182 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించాయి. ధగధగలతో మెరిసే బంగారు బల్లి, తల, తోక భాగాల్లో రెండు కట్లతో మెరుస్తూ ప్రమాదకరమైన విషాన్ని తనలో దాచుకుని ఉండే స్లైండర్ లోరిస్ పాము ఈ భూమి మీదే అంతరించిపోయాయని అనుకుంటున్న సమయంలో... వాటి ఉనికి శేషాచలంలో కనిపించింది.

అడవి రేచుకుక్కలు, రాళ్లలో దాగి ఉండే స్ఫర్ ఫౌల్ (రాతి కోడి), ప్రపంచంలోనే వేగంగా పరుగెత్తే చిరుత పులులు, రంగులు అద్దినట్లుండే కలీల పెయింటెడ్ కప్పలు, 110 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన కొలిబర్ బోలన్«థీ, శ్రీవారి అభిషేకానికి అవసరమైన అద్భుత సువాసనలు వెదజల్లే నూనెను విడిచే పునుగు పిల్లులు, దేవాంగ పిల్లి, ఎలుకలా చిన్నగా ఉండే మౌస్‌డీర్, రడ్డీ మంగూస్... ఇలాంటి అత్యంత అరుదైన జీవులు ఈ అడవుల్లోనే కనిపించాయి.

ఎర్ర చందనం... అనగానే గుర్తొచ్చేది మనకు శేషాచలం కొండలే. చైనా, జపాన్ తదితర దేశాల ప్రజలు మహిమ గల చెట్లుగా కొలిచే ఎర్ర చందనం వృక్షాలు శేషాచలం కొండల్లోనే కనిపిస్తాయి. ఈ వృక్షాలను మన దేశ సంపదగా కేంద్రం గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడా కనిపించని 11 రకాల మొక్కలు ఇక్కడే కనిపిస్తాయి. "శేషాచలం అడవుల్లో జీవ వైవిధ్యం అనంతం. కేవలం రెండేళ్లలో 11 రకాల కొత్త మొక్కలు, పదికిపైగా పైగా జంతువులను గుర్తించాం'' అని అటవీ శాఖ సంరక్షణాధికారి పీవీ చలపతిరావు తెలిపారు.

అందాల నల్లమల
శ్రీశైలం, అహోబిలం, మహానంది, లంకమల్లేశ్వరం వంటి అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం... నల్లమల! దేవుళ్లకే కాదు... జీవుళ్లకూ కీలకమైన జీవవైవిధ్యానికి ఇది నిలయం. ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, నల్లగొండ జిల్లాల పరిధిలో 9 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దేశంలోనే అతిపెద్ద అభయారణ్యం నల్లమలలోనే ఉంది. ఈ అడవుల్లో 1548 రకాల మొక్కలు, వృక్షాలు, పొదలు ఉన్నాయి. అశ్వగంధి, కొండగోగు, నరమామిడి, సరస్వతి ఆకు, నేలవేము, పొడపత్రి, అడవి చింత, మయూరి శిఖ, తెల్ల గురివింద, నల్లేరు, అడవి ఉల్లి, చిల్ల గింజలు, నాగముష్టి, అడవి తులసి, గడ్డి చేమంతి వంటి 400కుపైగా ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి.

అర్కిస్, బాన్సియా, హెబోరిన్ కుటుంబాలకు చెందిన 1500 రకాల పుష్పజాతులు నల్లమలలో కనిపిస్తాయి. ప్రమాదకరమైన విషం ఉండే రాకాసి సాలీడును, 'హార్స్ షూ బ్యాట్' అనే గబ్బిలాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మన నల్లమలే. ఈ అడవుల్లో 120 రకాల సాలీడులను గుర్తించారు. ఈ భూమిపై 1800 రకాల సీతాకోక చిలుకలుండగా... నల్లమలలోనే 102 రకాలు కనిపిస్తాయి. రాత్రిపూట హుషారుగా ఉండే 55 రకాల చిమ్మట (మాత్)లు ఇక్కడున్నాయి. అప్పుడే కాలిపోయిన చెట్టు బూడిదలో గుడ్లుపెట్టే జువెల్ బీటల్స్ అనే దిమ్మస పురుగులకూ నల్లమల ఆవాసం కల్పిస్తోంది.

నల్లమలలో 22 రకాల పాములు ఉండగా... వాటిలో విషపూరితమైన రక్తపింజరి, కట్లపాము, నాగుపాము, బ్యూమ్‌పిట్ వైపర్, సాస్కెల్డ్ వైపర్ కూడా ఉన్నాయి. నల్లమల అడవుల్లో 303 రకాల పక్షి జాతులను గుర్తించారు. పెద్ద పులులతో సహా 82 రకాల క్షీరదాలున్నట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా... పొయినిలోథరియరెగాలిస్, ప్రినికస్ ఆంధ్రాయెన్సిన్, మెటాక్రొమాన్‌టిస్, టోమరస్, శ్రీశైల యెన్సిస్ అనే నాలుగు రకాల జీవులను కూడా నల్లమలలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశంలోని ఐదు జీవ వైవిధ్య కేంద్రాల్లో నల్లమల కూడా ఒకటి. దేశంలో అతి పెద్దదైన పులుల సంరక్షణ కేంద్రం నల్లమలలోనే ఉంది.

జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉన్న అడవులకు... మనిషే శత్రువుగా మారాడు. శేషాచలంలో ఎర్రచందనంపై గొడ్డలి వేటు, వరంగల్ అడవుల్లో టేకు చెట్లపై కాటు, నల్లమలలో కలప కోసం రెచ్చిపోతున్న గొడ్డళ్లు! ఈ దెబ్బకు అడవులు పలుచబడుతున్నాయి. ఆవాసం కోల్పోతున్న వన్యప్రాణులు జనంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. అనుమతి లేకుండా అడుగు పెట్టేందుకు వీల్లేని జీవావరణ ప్రాంతమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... శేషాచలంలో స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. స్మగ్లర్ల ధాటికి వేలాది ఎకరాల్లో అరుదైన వృక్ష జాతి మచ్చుకైనా కనిపించకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తోంది.

వేటగాళ్లు, స్మగ్లర్లు, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల నల్లమలలో వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ అడవుల్లో వందేళ్ల క్రితం పులుల సంఖ్య వేలల్లో ఉండేది. ఇప్పుడు వందల్లోకి చేరుకుంది. ఆత్మకూరు, రుద్రకోడూరు, బైర్లూటి రేంజ్ పరిధిలో ఔషధ మొక్కలు, పక్షులు, జంతు జాలాలు కూడా కనిపించకుండా పోతున్నాయి. అటవీ చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ... వాటి అమలు తూతూమంత్రంగా ఉండటం! మనిషిలోని అత్యాశ! వాతావరణంలో మార్పులు... ఇవన్నీ అడవులకు శాపాలుగా మారుతున్నాయి.

గిరిజనానికి కష్టం..
జిగురు, తేనె, ఇప్ప పూలు, నక్కెర పండ్లు, జాన, దేవదారి, వెలగ పండ్లు, చెంచు గడ్డలు, నేరేడు, ఉసిరి, కరక్కాయ... మహబూబ్‌నగర్ జిల్లాలో చెంచులకు జీవనాధారంగా ఉన్న అటవీ ఉత్పత్తులు ఇవి. ఇప్పుడు... వీటి లభ్యత తగ్గిపోయింది. చెంచులకు కష్టం వచ్చింది.

అడవుల జిల్లా...
ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణంలో ఒకప్పుడు 40 శాతం అడవే ఉండేది. ఇప్పుడు అడవులు పలుచనవుతూ... ఈ జిల్లా కూడా ఇతర జిల్లాల్లాగే మారుతోంది. గిరిజనులు అడవుల్లో లభించే తెల్లబంక, వెదురు, తునికి ఆకు, ఇప్ప పువ్వు, జిగురు, తేనే, వెదురు, పండ్లు, దుంపలు సేకరించి తమ అవసరాలకు ఉపయోగించుకుని మిగతావి అమ్ముకుని తమకు కావాల్సిన సరుకులను కొనుక్కునేవారు. అడవులు లేక గిరిజనులకు ఉపాధి కరువైంది. ఇక్కడ ఒకప్పుడు విస్తారంగా కనిపించిన నేలవేము, మారెడు, అడ్డసరం, ఎంపెన, తెల్ల ఉసిరి, పొడపత్రి మొదలైన 38 రకాల వనమూలికలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి.

ఓరుగల్లులో...
వరంగల్‌లోని అడవి దేశంలోని మిగిలిన అడవులకంటే ప్రత్యేకమైనది. ఇది... '5ఏసీ3' కేటగిరీలోకి వచ్చే ఆకురాలు అడవి. అత్యంత నాణ్యమైన టేకు చెట్లు, నల్లమద్ది, వేగిస, వెదురు, తునికాకు చెట్లు ఇక్కడ విస్తారంగా కనిపిస్తాయి. ఈ అడవి ఇప్పుడు స్మగ్లర్ల దెబ్బకు తల్లడిల్లుతోంది. కేవలం ఎనిమిదేళ్లలో 23 చదరపు కిలోమీటర్ల అడవి నాశనమైపోయింది. రాష్ట్రంలో అడవులు శరవేగంగా క్షీణిస్తున్న జిల్లాల్లో వరంగల్‌ది రెండో స్థానం. అయితే, ఖమ్మం జిల్లాది మొదటి స్థానం.

చాప బరిగెకు చేటు...
చాప బరిగె... అంటే కేన్ మొక్క. కుర్చీలు, సోఫాల తయారీకి వాడతారు. ప్రపంచంలో 370 రకాల కేన్ జాతులు ఉండగా... మన దేశంలో 22 జాతులున్నాయి. వీటిలో రెండు మన రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కనిపించగా... ఒకటి వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోనే పెరుగుతున్నట్లు గుర్తించారు. కానీ ఇది ధ్వంసమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

'అనంత' సీమలో...
అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం, కదిరిలోని బట్రేపల్లి అడవులు 30 ఏళ్ల క్రితం దట్టంగా ఉండేవి. పులులు, ఏనుగుల సంచారంతో... మనిషి అడుగు పెట్టాలంటేనే భయపడేవాడు. ఇప్పుడు అడవులు పలుచబడ్డాయి. వన్యప్రాణులు అంతరిస్తున్నాయి. ఎలుగు బంట్లు అడవిలో ఆహారం దొరకక ఊరిలోకి వచ్చి... జనం చేతిలో చస్తున్నాయి. వజ్రకరూరు, ఉరవకొండ ప్రాంతంలోని గ్రామాల్లోకి చిరుతలు కూడా అడుగు పెడుతున్నాయి.

కనిపించని కలివి కోడి
'ఈ ప్రపంచంలో ఇక లేదు. అంతరించిపోయింది' అని అనుకున్న కలివి కోడి 1986 జనవరి 5న కడప జిల్లా లంకమల అభయారణ్యంలో కనిపించింది. అలా కనిపించడం అదే మొదటిసారి, అదే ఆఖరి సారి. ముంబైకి చెందిన ఓ సంస్థ అడవిలో ఎంతగా వెతికినా మళ్లీ కలివి కోడి జాడ కనిపించలేదు. అడవుల నరికివేత ఇలాగే కొనసాగితే... దేవాంగ పిల్లి, బెట్టుడత వంటి అరుదైన ప్రాణులూ అంతరించడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అడవులే ఆధారం
+ ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది తమ జీవనోపాధికి అడవులపైనే ఆధారపడుతున్నారు. దాదాపు 30 కోట్ల మందికి అడవులే ఆవాసం.
+ ఐదువేల రకాల వాణిజ్య ఉత్పత్తులకు అడవుల్లోని జీవ వైవిధ్యమే ఆధారం.
+ అడవులను జాగ్రత్తగా కాపాడుకుంటే ... భూమిపై ఉన్న రెండింట మూడొంతుల జీవ, జంతు వైవిధ్యాన్ని కాపాడినట్లే!
+ ప్రాథమిక అరణ్యాల విస్తీర్ణం గత 12 సంవత్సరాల్లో 4 కోట్ల హెక్టార్లు తగ్గిపోయింది. కారణం... కలప, వ్యవసాయం కోసం చెట్లు నరకడమే!
+ ప్రపంచంలోని అటవీ అడవుల్లో ఐదు దేశాల వాటా 53 శాతం. ఆ ఐదు దేశాలు... బ్రెజిల్, చైనా, కెనడా, రష్యన్ ఫెడరేషన్, అమెరికా.
+ గత 20 ఏళ్లలోనే 35 శాతం మడ అడవులు మాయమైపోయాయి.

'సంప్రదాయ' ఔషధం..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికీ 80 శాతం మంది సంప్రదాయ ఔషధాలపైనే ఆధారపడుతున్నారు. ఈ ఔషధాల్లో దాదాపు సగం అడవుల్లోని చెట్ల నుంచే తయారవుతున్నాయి.

No comments:

Post a Comment