అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, November 28, 2012

రాష్ట్రంలో 5 జిల్లాల్లో నగదు బదిలీ (ఈనాడు)

జనవరి 1 నుంచి హైదరాబాద్‌, రంగారెడ్డి,
అనంత, చిత్తూరు, తూ.గో.జిల్లాల్లో అమలు
దేశవ్యాప్తంగా 51 జిల్లాలు
తొలిదశలో ఉపకారవేతనాలు,
పింఛన్ల బదిలీకే పరిమితం
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు
చిదంబరం, జైరాం రమేష్‌ వెల్లడి

ఈనాడు - న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు బదిలీ పథకానికి కాంగ్రెస్‌పార్టీ పచ్చజెండా ఊపింది. మంగళవారం ఏఐసీసీ ప్రధాన
కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేష్‌లు... జనవరి 1 నుంచి 16 రాష్ట్రాల్లోని 51 జిల్లాల్లో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. 2013 జూన్‌ నుంచి ఈ పథకాన్ని దేశవ్యాప్తం చేస్తామని కేంద్రమంత్రులు ప్రకటించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలు అమలుచేస్తున్న 42 సంక్షేమ, సబ్సిడీ పథకాలకు గాను ప్రస్తుతం 29 పథకాలను నగదు బదిలీ జాబితా కిందికి తెస్తున్నట్లు చిదంబరం వెల్లడించారు. ఇప్పటివరకు సాధారణ పద్ధతుల్లో విద్యార్థులు, వృద్ధులు, వితంతు, వికలాంగులకు మంజూరు చేస్తున్న ఉపకారవేతనాలు, పింఛన్లను ఇక మీదట నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించారు. ఆధార్‌ సంఖ్య ఆధారంగా బ్యాంకు ఖాతాలు తెరిచి లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తామని తెలిపారు. డబ్బు కేవలం వారి ఖాతాల్లో జమచేయడమే కాదు ఆ మొత్తం వాళ్ల ఇళ్లకు చేరే విధంగా ప్రత్యేక ప్రతినిధులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీళ్లు మినీ ఏటీఎంలుగా పనిచేస్తారన్నారు. సాధారణ వ్యక్తులతోపాటు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక సంఘాలను కూడా బ్యాంక్‌ ప్రతినిధులుగా ఉపయోగించుకుంటామని చెప్పారు. సంస్కరణల ప్రస్థానంలో ఇదో విప్లవాత్మక అడుగని, ఇది ఆటను మలుపుతిప్పుతుందని చిదంబరం అభివర్ణించారు. ప్రస్తుతం నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బుకు సంబంధించిన విషయాలకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఆహారం, ఎరువుల సబ్సిడీల జోలికి పోవడంలేదన్నారు. వాటిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని వెల్లడించారు. ప్రస్తుతం నగదు బదిలీ చేపట్టబోయే 51 జిల్లాల్లో ఆధార్‌ కార్డుల జారీ కార్యక్రమం 80% దాకా పూర్తయిందని చిదంబరం చెప్పారు. దీన్నిబట్టి చూస్తే 95% మంది లబ్ధిదారులకు ఆధార్‌ ప్రకారం బ్యాంకు సేవలు అందించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. లబ్ధిదారుల సమాచారాన్నంతా కంప్యూటరీకరించి సంబంధిత బ్యాంకులకు అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనాలు, పింఛన్ల మొత్తం విడుదల చేసినా అది వివిధ స్థాయిల్లో మూడునాలుగు నెలలు పెండింగ్‌లో ఉంటోందని, దీనివల్ల పేదలకు సకాలంలో సాయం అందడంలేదని పేర్కొన్నారు. నగదుబదిలీ పథకంతో ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా, ఒక్క రూపాయి వృథాకాకుండా నేరుగా ఖాతాల్లోకి నూటికినూరు శాతం నగదు చేరిపోతుందని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖకు చెందిన 14 ఉపకారవేతన పథకాలు, ఉన్నత విద్యాశాఖకు చెందిన 4, మానవవనరుల శాఖకు చెందిన 2, మైనార్టీ వ్యవహారాలశాఖ పరిధిలోని 3, మహిళా, శిశుసంక్షేమ శాఖకు చెందిన 2, వైద్యఆరోగ్యశాఖకు చెందిన 1, కార్మిక, ఉపాధిశాఖకు చెందిన 5 పథకాల ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. నగదు బదిలీ పథకంలో మోసాలు, డూప్లికేషన్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చిదంబరం చెప్పారు. ఒక్క ఆధార్‌సంఖ్యతో రెండు ఖాతాలు తెరవడానికి వీలుండదని తెలిపారు. నగదు బదిలీ పథకాన్ని చూసి పార్టీ గర్వపడుతోందన్నారు.
రాజకీయ ఎత్తులు!: నగదు బదిలీ పథకానికి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించి రాజకీయంగా లబ్ధిపొందాలని కాంగ్రెస్‌ ఎత్తులు వేస్తోంది. కేంద్రమంత్రి జైరాం రమేష్‌ ఈ విషయాన్ని విలేకర్ల సమావేశంలో సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాదని, విప్లవాత్మక రాజకీయ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. గతంలో రాజీవ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు వంద రూపాయలు విడుదల చేస్తే 15 రూపాయలే ప్రజలకు చేరుతోందని చెప్పారని గుర్తుచేశారు. ప్రజల డబ్బును పూర్తిగా ప్రజలకు అందించాలన్న ఆయన కలను నిజంచేసే ఈ పథకంపట్ల ప్రజల్లో విస్తృతప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల పథకం తొలిదశలో అమలు చేసే 51 జిల్లాల డీసీసీ అధ్యక్షులను పిలిచి వారికి దీనిగురించి పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. ఆ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ, చిదంబరం పాల్గొంటారని వెల్లడించారు. 'మీ డబ్బు మీ హక్కు' అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు జైరాం రమేష్‌ చెప్పారు. నగదు బదిలీ పథకం అంటే ఓటర్లకు లంచం ఇవ్వడమేనన్న ప్రతిపక్షాల విమర్శలు పూర్తిగా అసంబద్ధమని చిదంబరం మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తే లంచం ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనికి ఎన్నికలతో సంబంధంలేదని స్పష్టం చేశారు. సంస్కరణల క్రతువులో తాను 20 ఏళ్ల నుంచి పాల్గొంటున్నానని, ప్రతి తొలి అడుగూ ప్రతిపక్షాల విమర్శలు, నిట్టూర్పుల తర్వాతే వేస్తున్నామని వ్యంగ్యంగా అన్నారు.
 

No comments:

Post a Comment