అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, November 28, 2012

అంతులేని విషాదం...: కళ్లెదుటే బూడిదైన ఆత్మీయులు




అగ్నిప్రమాదంలో ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య
మణికొండ, నార్సింగి, న్యూస్‌టుడే: ఆదివారం ఆహ్లాదకరమైన సాయంత్రం.. సెలవు రోజు కుటుంబ సభ్యులతో ముచ్చట్లు.. విందు భోజనానికి రమ్మంటూ ఫోన్లలో ఆహ్వానాలు.. చిన్నారుల అల్లర్లు... క్రమంగా చీకట్లు కమ్ముకుంటున్నా సందడి తగ్గలేదు.. చీకట్లతో అగ్నికీలల రూపంతోపాటు మృత్యుదేవత కూడా కమ్ముకుంటోదన్న విషయం ఆ అపార్ట్‌మెంటు వాసులకు తెలీదు.. తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. మంటల్లో కాలిపోయారు.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం పుప్పాలగూడ శ్రీరాంనగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం దృశ్యాలివి.. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఐదుగురు మృతిచెందగా.. సోమవారం ఉదయానికి మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. అపార్ట్‌మెంటు లిఫ్ట్‌లో చిక్కుకున్న వాచ్‌మెన్‌ తంగిడి భాస్కరరావు(55) మృతిచెందారని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి రెవెన్యూ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దుర్ఘటనకు బాధ్యుడిగా అపార్ట్‌మెంటు యజమాని విజయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంటు అనుమతులపై విచారణ చేస్తున్నారు. బాధితులకు నష్టపరిహారంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌ కాలనీలో బాబానివాస్‌ అపార్ట్‌మెంటును కొన్నేళ్ల క్రితం విజయ్‌కుమార్‌ నిర్మించారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలం కూడా మరొకరి భాగస్వామ్యంతో కొన్నారు. ఆ షెడ్‌లో సినిమా షూటింగ్‌లకు అవసరమైన సామగ్రిని ఉంచి అద్దెకు ఇస్తుంటారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. ఆదివారం సాయంత్రం అపార్ట్‌మెంటుకు ఆనుకుని ఉన్న షెడ్‌లో నుంచి స్వల్పంగా ప్రారంభమైన మంటలు, పొగ ఒక్కసారిగా ఎగిసిపడడంతో పెను ప్రమాదానికి దారి తీసింది. అపార్ట్‌మెంటులో నివసించే ప్రజలు ముంచుకొస్తున్న ముప్పు గమనించే లోపు ఊహించిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో మద్దినేని వెంకటసుబ్బయ్య(59), పేనిని శ్రీహరిరావు(61), పేనిని అరుణ(55), ఆలపాటి మహాలక్ష్మీ(88), వాచ్‌మెన్‌ తంగిడి బాస్కరరావు(50), 10రోజుల బాబు చనిపోగా... అనంత రావమ్మ(55), ఎ.పద్మ(39)లు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చూస్తుండగానే కాలిపోయారు
బాబానివాస్‌ అపార్ట్‌మెంటులో వేణుగోపాల్‌ అనే ప్రైవేటు ఉద్యోగి మొదటి అంతస్థులో నివసిస్తున్నారు. 10రోజుల కిందట ఆయన భార్య శారద కవల పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలను చూసేందుకు నాన్నమ్మ అరుణ(50), తాతయ్య శ్రీహరిరావు(55)లు గుంటూరు నుంచి ఇక్కడకు వచ్చారు. మనువళ్ల బోసి నవ్వులను చూసి ఆనందించే సమయంలోనే మృత్యుదేవత వారి తలుపు తట్టింది. విధి నిర్వహణలో భాగంగా చెన్నై వెళ్లేందుకు వేణుగోపాల్‌ ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరిన కొద్ది నిమిషాలకే ఈ దుర్వార్తతో ఇంటి ముఖం పట్టారు. ఇంటికి చేరుకునే సరికి తల్లిదండ్రులతోపాటు 10రోజుల కుమారుడి ప్రాణాలు గాలిలో కలిశాయి. అత్త అనంతరావమ్మ(55) తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పొగ, మంటలు వేగంగా వ్యాపిస్తుండడాన్ని గమనించిన వేణు భార్య శారద(బాలింత) ఏడేళ్ల బాబుతోపాటు 10రోజుల పసికందును తీసుకుని బయటకు వచ్చింది. వీరిని బయట వదిలి మరోబాబు, అత్త, మామల కోసం గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే దట్టమైన పొగ ఆమెను మళ్లీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. తన కళ్లెదుటే తమవారు మంటలకు ఆహుతి అవుతున్న సంఘటన ఆమెను తీవ్రంగా కలిచి వేసింది. ఒకే కుంటుబంలో ముగ్గురు మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలిచి వేసింది. ఇక రెండో అంతస్థులో అల్లుడు రామకృష్ణ వద్ద నెల రోజులుగా ఉంటున్న ఆలపాటి మహాలక్ష్మి అనే వృద్ధురాలు వయసు మీదపడి కదలలేని స్థితిలో వీల్‌చైర్‌పై కూర్చున్న స్థితిలో మృతిచెందారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మద్దినేని వెంకటసుబ్బయ్య(59) తన కొడుకు వెంకటేశ్వరరావు వద్ద (ఫ్లాట్‌ నెం.302) ఉంటున్నారు. మంటల దాటికి తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపు మరణించాడు. భవనం ఐదో అంతస్థులో ఉంటున్న అనంత పద్మ(39) తన ఇద్దరు పిల్లలను తీసుకుని కిందకు దిగుతుండగా రెండో అంతస్థులో పొగలు కమ్మేయడంతో ఊపిరాడక ఆమె తీవ్రంగా గాయపడ్డారు. పద్మ ఇద్దరు కుమారులు కిందకు వచ్చారు. ఆమెతోపాటు అనంత రావమ్మ(55) ఐదో అంతస్థు నుంచి రెండో అంతస్థులోని శారదా ఇంటికి వస్తుండగా ఆమెను సైతం పొగ చుట్టేసింది. దీంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. పద్మ 50శాతం, రావమ్మ 80శాతం గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు.
ప్రాణాలు కాపాడి.. మృత్యువుతో పోరాడి ఓడిన వాచ్‌మెన్‌
అపార్ట్‌మెంటు పక్కన గుడిసెలో పొగ, టైర్లు కాలుతున్న వాసనను గమనించిన వాచ్‌మెన్‌ భాస్కర్‌రావు పైనున్న అపార్ట్‌మెంటు వాసులను అప్రమత్తం చేసేందుకు అంతస్థులన్నింటికీ సమాచారం అందించారు. ఒకటి, రెండు, మూడు అంతస్థుల్లో ఉన్న 10మందిని రక్షించారు. మూడో అంతస్థులో నివాసం ఉంటున్న ఒక మహిళ తాను గ్యాస్‌స్టవ్‌ ఆర్పలేదని చెప్పడంతో తిరిగి అక్కడి వెళ్లాడు. గ్యాస్‌స్టవ్‌ ఆర్పేశాక మూడో అంతస్థు నుంచి లిఫ్ట్‌లో కిందికి వస్తుండగా మంటలు ఎక్కువయ్యాయని విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. మూడో అంతస్థు రెండో అంతస్థు మధ్యలో లిఫ్టు ఆగిపోయింది. లిఫ్టులో నుంచి కేకలు వేసినా ఆ వాతావరణంలో ఎవరికీ వినిపించలేదు. లిఫ్టు తలుపులు తెరిచేందుకు ఎంత ప్రయత్నించినా రాలేదు... బయటి గేటులో నుంచి తలతో బాదినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈలోపు పొగ, మంటలు విస్తరించడంతో లిఫ్టులోనే ప్రాణాలు వదిలారు. రాత్రి 9గంటల నుంచి వాచ్‌మెన్‌ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనుమానంతో పోలీసులు తెల్లవారుజాము 2 గంటలకు లిప్టులో పరిశీలించగా, అందులో ఆయన మృతదేహం నిలబడిన స్థితిలోనే కనిపించింది. మృత్యువుతో పోరాడిన క్రమంలో రక్తపు మరకలు గుర్తులుగా మిగిలాయి.
జేసీ సందర్శన
అగ్ని ప్రమాదం జరిగిన అపార్టుమెంటును రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ ముత్యాలరాజు సోమవారం ఉదయం సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, మంటలకు కారణమైన గుడిసెలు, అపార్ట్‌మెంటు అనుమతులపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. భవన నిర్మాణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 200 గజాల స్థలంలో జీ+5తో నిర్మాణం చేస్తే అధికారులు ఏం చేశారని కాలనీ అధ్యక్షులు మధుసూధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాంతారావు, వెంకట్‌లు జేసీని ప్రశ్నించారు. కనీసం మెట్లపై నుంచి ఒకరు వెళ్తే మరొకరికి వెళ్లేందుకు వీల్లేకుండా నిర్మించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment