అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, May 7, 2012

ఆరోగ్యం అందరి హక్కు

  • అందుకోసం ఉద్యమిద్దాం
  • పిహెచ్‌సిలను బలోపేతం చేయాలి
  • జిడిపిలో 3 శాతం నిధులు కేటాయించాలి
  • జెవివి సదస్సులో శ్రీనాధ్‌రెడ్డి, తదితరులు
ఆరోగ్యం అందరి హక్కు అని, ఆరోగ్య సేవలను సార్వత్రికరించాలని జనవిజ్ఞాన వేదిక (జెవివి) నిర్వహించిన సదస్సులో 'ప్రజారోగ్యం'పై ప్రణాళిక సంఘం నియమించిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి తదితర వక్తలు సూచించారు. ఇందుకోసం బృహత్తరమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముందన్నారు. అందరికీ ఆరోగ్యం అందాలంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు.
డాక్టర్‌ శ్రీనాథ రెడ్డి కమిటీ నివేదిక నేపథ్యంలో 'అందరికీ ఆరోగ్యం ఎలా' అనే అంశంపై జెవివి ఆదివారంనాడు ఓ సదస్సును నిర్వహించింది. జెవివి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కట్టా సత్యప్రసాద్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ్‌ రెడ్డితో పాటు జెవివి నాయకులు, ఎమ్మెల్సీ గేయానంద్‌, నిమ్స్‌ మాజీ డైరక్టర్‌ డాక్టర్‌ రాజారెడ్డి తదితరులు ప్రసంగించారు. శ్రీనాథ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఉద్యమం ద్వారానే అందరికీ ఆరోగ్యం సాధ్యమౌతుందన్నారు. వైద్య, ఆరోగ్య రంగ మార్పుల కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య రంగానికి జిడిపిలో కేవలం ఒక శాతం మాత్రమే కేటాయిస్తున్నారని, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం చాలా వెనకబడి ఉందని తెలిపారు. చిన్న దేశాలైన శ్రీలంక, నేపాల్‌ కూడా ఈ రంగానికి మన కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందాలంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను తప్పనిసరిగా అభివృద్ధి చేసి, వాటిలో అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వాలని సూచించారు.

మందుల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటున్నాయనీ వాటిని అదుపు చేయాలన్నారు. ప్రాణ రక్షక మందులను ఉచితంగా ఇవ్వాలన్నారు. అందరికీ ఆరోగ్యం అంటే కేవలం వైద్యమందిస్తే సరిపోదని..ప్రజలందరికీ మంచి తాగునీరు, పౌష్టికాహారం అందించాలన్నారు. పారిశుధ్య వ్యవస్థ కూడా మెరుగుపర్చాలన్నారు. ఇవి అందించకుండా అందరికీ ఆరోగ్యం సాధ్యం కాదన్నారు. ప్రజలకు బీమా సౌకర్యం కల్పించేదానికంటే వారికి మెరుగైన వైద్యం అందిస్తే బాగుంటుందని తన నివేదికలో ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిపారు. జిడిపిలో 0.5 శాతం నిధులు కేటాయిస్తే దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులను సరఫరా చేయవచ్చన్నారు. ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడానికి బ్యూరోక్రాట్స్‌, రాజకీయ నేతలే ఒప్పుకోరని తెలిపారు. వైద్యరంగంలో జరిగే అవినీతిని నిర్మూలించాలని సూచించారు. దేశంలో వైద్య, నర్సింగ్‌ కళాశాలల సంఖ్య పెరగాలని సూచించారు. ఈ ఉద్యమంలో ట్రేడ్‌ యూనియన్లు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలూ కలిసి పోరాడాలన్నారు. ఆరోగ్య విషయంలో వెనకబడిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక నిధులు అందించాలన్నారు. దేశంలో కేరళ అగ్రస్థానాన ఉండగా బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఈశాన్య రాష్ట్రాలు వెనకబడ్డాయని చెప్పారు.
డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ ప్రజారోగ్యంపై శ్రీనాథ్‌రెడ్డి కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని కోరారు. దశాబ్దాలుగా వైద్యరంగం దెబ్బతింటోందని విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో అందరికీ ఆరోగ్యం అందించడమనేది పెద్ద లక్ష్యంగా ఉందన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి తక్కువగా ఖర్చు చేస్తున్న చివరి 15 దేశాల్లో మన దేశం ఉందని తెలిపారు. ప్రభుత్వం 'వైద్యాన్ని కొనుక్కోండి లేకపోతే చావండి' అని చెబుతోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెడితేనే అందరికీ ఆరోగ్యం సాధ్యమౌతుందన్నారు. చిన్న దేశమైనా క్యుబా దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించ గలుగుతోందన్నారు. నిమ్స్‌ మాజీ డైరక్టర్‌ డాక్టర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉచితంగా వైద్య సేవలు ఇచ్చేవారని, మందులు కూడా అందించేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మందులు ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పవలసిరావడం విడ్డూరంగా ఉందన్నారు. జెవివి గౌరవాధ్యక్షులు మెహతాబాన్‌జీ, ఓపిఎస్‌డిహెచ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ రామయోగయ్యతోపాటు జెవివి నేతలు డాక్టర్‌ రమాదేవి, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment