అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Saturday, September 15, 2012

ఎఫ్‌డిఐలపై తొందరెందుకో?

  • ముఖ్యమంత్రికి రాఘవులు ప్రశ్న
  • డీజిల్‌పై సుంకాన్ని
  • ఎత్తేయాలని డిమాండ్‌
  • విపక్షాల ప్రశ్నలకు జవాబులిప్పించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి
మల్టీబ్రాండ్‌ రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత తొందరగా ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు
ప్రశ్నించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వివరణివ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అనేక కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, యుపిఎ-2లోని కొన్ని భాగస్వామ్య పక్షాలు సైతం సుముఖత వ్యక్తం చేయలేదని గుర్తుచేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో తనను కలిసిన విలేకరులతో రాఘవులు మాట్లాడారు. మల్టీబ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారం, విమాన యానంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు తలుపులు బార్లా తెరిచిందని విమర్శించారు. అయితే వీటి అమలు నిర్ణయాన్ని పేరుకి రాష్ట్రాలకి వదిలేసినట్లు చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. రిటైల్‌ రంగంలోకి 51 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించడం ద్వారా నాలుగు కోట్ల మంది చిల్లర వ్యాపారులు, వారి కుటుంబాలు రోడ్డున పడనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో దివాళా తీసిన కంపెనీలకు మన దేశంలో ఆశ్రయమిచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన చర్యలకు ఒడిగట్టిందని విమర్శించారు. విదేశీ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి దేశ ప్రజలను తాకట్టు పెట్టిందన్నారు.


ఎంఎన్‌సిల ప్రయోజనాలకోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకోవడం శోచనీయమన్నారు. ఎఫ్‌డిఐలను దేశంలోకి అనుమతించడం ద్వారా వ్యవసాయరంగంలో అభివృద్ధిని సాధించవచ్చంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, చిన్న, సన్నకారు రైతులు అత్యధికంగా ఉన్న మనలాంటి దేశాల్లో ఎఫ్‌డిఐలను ప్రవేశపెట్టడం వల్ల వారు వ్యవసాయం నుంచి పూర్తిగా దూరమయ్యే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. దీంతోపాటు విద్యుత్‌, వ్యాపార సంస్థల్లోకి సైతం ఎఫ్‌డిఐలను అనుమతినిస్తూ నిర్ణయించారని విమర్శించారు. ప్రధాని మన్మోహన్‌ చేతగానివాడూ, అసమర్థుడూ అంటూ ఇప్పటివరకూ అనేకమంది విమర్శించారని, అయితే విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరవడంలో తానెంత సమర్థుడినోనన్న విషయాన్ని ఆయన నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎఫ్‌డిఐలను అనుమతించడంపై అఖిల భారత స్థాయిలో వామపక్షాలు ఇతర లౌకిక ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని ఆందోళనలకు రూపకల్పన చేస్తున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆందోళలకు రూపకల్పన చేస్తామని తెలిపారు.
పెట్రోల్‌, డీజిల్‌పై ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని రాఘవులు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరలను పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌పై సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలని డిమాండ్‌ చేశారు. సుంకాన్ని కనీసం పది శాతమైనా తగ్గించాలని కోరారు. సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులైనా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దూషణభాషణలకు తావివ్వకుండా ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై నియమించిన మంత్రుల సబ్‌ కమిటీ నిధుల అమలుకు చట్టం చేయాలంటూ సిఫారసు చేస్తే ఆ నివేదికను పరిశీలించమని శాఖలకు పంపడం శోచనీయమన్నారు. అంటే శ్రీకృష్ణ కమిటీ మాదిరిగానే దీన్ని కూడా బుట్టదాఖలు చేయదలిచారా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం సభలో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశాల నేపథ్యంలో విపక్షాలపట్ల23 పక్షపాతంతో వ్యవహరించాలని రాఘవులు స్పీకర్‌కు సూచించారు. గతంలో సభలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యాయా? లేదా? విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయా? లేదా? అనే అంశాలపై శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రశ్నలకు జవాబులు రాకపోతే వచ్చేట్లు చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పైనే ఉంటుందన్నారు.
జగన్‌ అక్రమార్జన కేసులో విచారణకు సంబంధించి న్యాయవాదిని మార్చాలనే విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, న్యాయవాది వ్యక్తిత్వాన్ని మనం శంకించలేం కదా? అని సమాధానమిచ్చారు. అయితే మొత్తంగా ఈ కేసును నీరుగార్చేందుకు గతం నుంచి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే అక్రమంగా విడుదల చేసిన 26 జీవోలను రద్దు చేయడం లేదని, వాటి విడుదలతో సంబంధమున్న మంత్రులకు న్యాయ సహాయం చేస్తామంటూ ప్రకటించిందని రాఘవులు గుర్తుచేశారు.

No comments:

Post a Comment