అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Saturday, September 15, 2012

రిటైల్‌లో ఎఫ్‌డిఐ టెర్రర్‌

  • మల్టీబ్రాండ్‌లో 51 శాతం - సింగిల్‌ బ్రాండ్‌లో 100 శాతం
  • విమానయాన రంగంలో 49 శాతం
  • బ్రాడ్‌కాస్టింగ్‌ మీడియాలో 74 శాతం ఎఫ్‌డిఐలు
  • కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలు
భగ్గుమన్న డీజిల్‌ మంటలు ఆరకముందే యుపిఏ సర్కార్‌ సంస్కరణల టెర్రర్‌ సృష్టించింది. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న రిటైల్‌లో ఎఫ్‌డిఐపై మొండిగా ముందుకెళ్తోంది. శుక్రవారం నాడు
న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రిటైల్‌ మల్టీ బ్రాండ్‌ రంగంలోకి 51 శాతం, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలోకి వంద శాతం ఎఫ్‌డిఐ ప్రవేశానికి ఆమోద ముద్ర వేసింది. దీని రాజకీయ పర్యవసానాలెలా ఉంటాయో తెలిసి కూడా ఆత్మహత్యాసదృశమైన ఈ సంస్కరణల పంథావైపే మొగ్గింది. ఇంతకుముందు వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపించింది. కానీ, వాల్‌మార్ట్‌ వంటి అమెరికన్‌ బడా బహుళజాతి సంస్థల ఒత్తిడికి తలొగ్గి ఈ రాజకీయ బరితెగింపునకు పాల్పడింది. అంతేకాదు, బ్రాడ్‌కాస్టింగ్‌ మీడియా రంగంలో ప్రస్తుతం ఉన్న 49శాతం ఎఫ్‌డిఐ పరిమితిని 74శాతానికి పెంచింది. విమానయాన రంగంలో 49శాతం ఎఫ్‌డిఐకి ఆమోదం తెలిపింది. పనిలో పనిగా లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మాలని కూడా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ముదనష్టపు చర్యలపై అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి.

ఈ నిర్ణయం దేశానికే వినాశకరం. లక్షలాది చిల్లర వర్తకుల ఉపాధిని హరించి వేసి, వారి కుటుంబాలను వీధులపాలు చేస్తుంది. పలు రాష్ట్రప్రభుత్వాలు వ్యతిరేకి స్తున్నప్పటికీ ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రకాష్‌ కరత్‌, సిపిఎం ప్రధానకార్యదర్శి
రిటైల్‌లో బలవంతంగా ఎఫ్‌డిఐలను ప్రవేశపెట్టే చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతిపక్షం, స్వపక్షంలోనూ వ్యతిరేకత ఉన్నా..రిటైల్‌ రంగంపై ఆధారపడిన ఐదు కోట్ల మంది చిరుద్యోగుల జీవితాలను సర్కార్‌ అపాయంలోకి నెడుతోంది. దేశాన్ని ధ్వంసం చేసే రిటైల్‌ ఎఫ్‌డిఐలకు మన్మోహన్‌ సర్కార్‌ లాకులెత్తేస్తోంది.
రవిశంకర్‌ ప్రసాద్‌, బిజెపి
డీజిల్‌ ధర పెంపు, రిటైల్‌లోకి ఎఫ్‌డిఐల నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవు. కేంద్రానికి 72 గంటలు గడువిస్తున్నాం. ఆలోపు నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మంగళవారం జరిగే పార్లమెంటరీ సమావేశంలో కఠిన నిర్ణయం తీసుకోకతప్పదు
మమత బెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌

ఇప్పటి వరకూ రాజకీయ పరమైన అడ్డంకులతో జాప్యం జరుగుతున్న ఆర్థిక సంస్కరణల అమలుపై దూకుడు ప్రదర్శిం చేందుకు మన్మోహన్‌ సర్కారు సిద్ధమైంది. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపా రంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టు బడు లు (ఎఫ్‌డిఐ), విమాన రంగంలో 49 శాతం, ప్రసా రాల రంగంలోకి 74 శాతం వరకూ ఎఫ్‌డిఐ, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తదితర అంశాలపై కేంద్రం ప్రధాన నిర్ణయాలను ప్రకటించింది.
గత నవంబర్‌లోనే ప్రభుత్వం ఆమోదించిన మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో 51 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించే ప్రతిపాదన అమలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం ద్వారా విదేశీ రిటైల్‌ వ్యాపార సంస్థలు మన దేశంలో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విదేశీ రిటైల్‌ సంస్థల భాగస్వామ్యంతో కూడిన వాణిజ్య సంస్థల ప్రారంభానికి అనుమతించే అంశాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికే వదిలివేసినట్లు కేబినెట్‌ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి చిదంబరం మీడియాకు వివరించారు. అమెరికా రిటైల్‌ వ్యాపార దిగ్గజం వాల్‌మార్ట్‌ మన దేశానికి చెందిన భారతీ సంస్థతో కలిసి ఇప్పటికే మన రాష్ట్రంలోని కొన్ని ప్రధాన నగరాల్లో రిటైల్‌ స్టోర్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో స్థానిక వనరుల నుండి పెట్టుబడులు సమకూర్చుకోవాలన్న నిబంధన నుండి ఏ సంస్థ అయినా మినహాయింపు కోరితే ఆ సంస్థ మన దేశంలోనే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మల్టీబ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో 51 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించే అంశానికి కేంద్రం గత నవంబర్‌లోనే ఆమోదముద్ర వేసినప్పటికీ యుపిఎ భాగస్వామ్య పక్షాలతో పాటు అనేక రాజకీయ పక్షాలు వ్యతిరేకించటంతో దానిని పెండింగ్‌లో పెట్టింది. ఈ నిర్ణయం అమలును మంత్రి వర్గం పెండింగ్‌లో పెట్టినందున దానికి తిరిగి కేబినెట్‌ ఆమోదముద్ర లభించాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రి వివరించారు.
పిఎస్‌యుల్లో వాటాల విక్రయం
ప్రభుత్వరంగంలోని నాలుగు సంస్థల్లో మైనార్టీ వాటాలను విక్రయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం లభించింది. హిందుస్థాన్‌ కాపర్‌, ఆయిల్‌ ఇండియా, ఎంఎంటిసి, నాల్కో సంస్థల్లోని ఈ వాటాల విక్రయం ద్వారా రూ.15 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చిదంబరం తెలిపారు. ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయాన్ని వేగవంతం చేయాలని చిదంబరం గత నెలలో అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. కంపెనీల్లో వాటాల విక్రయానికి స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించటం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్లు ఖజానాకు సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందు మన రాష్ట్రానికే చెందిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) సంస్థలో వాటాల విక్రయాన్ని ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
విమానరంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలు
దేశీయ విమానరంగంలోకి 49 శాతం మేర ఎఫ్‌డిఐలను అనుమతించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశీయ విమాన సంస్థలకు ఆర్థిక వనరులు సమకూర్చుకునే వెసులుబాటు లభిస్తుందని విమానయాన శాఖ మంత్రి అజిత్‌ సింగ్‌ కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాకు వివరించారు. ఎఫ్‌డిఐలను 49 శాతం, 75 శాతం, 100 శాతం అనుమతించినప్పటికీ విదేశీ విమాన సంస్థలను అనుమతించబోమని ఆయన చెప్పారు. ప్రస్తుత ఎఫ్‌డిఐ నిబంధనల ప్రకారం విమానరంగానికి చెందని విదేశీ సంస్థలు భారత్‌కు చెందిన విమాన సంస్థల్లో 49 శాతం వాటాలను కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. భారతీయ సంస్థల్లో విదేశీ విమాన సంస్థల పెట్టుబడులను అనుమతించాలన్న డిమాండ్‌ ప్రభుత్వం వద్ద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
మీడియా రంగంలో 74 శాతం వరకు ఎఫ్‌డిఐ
వార్తా ఛానెళ్ళు, ఎఫ్‌ఎం రేడియోలో మినహా వివిధ సేవా రంగాల్లో నేరుగా ఎఫ్‌డిఐలకు 74 శాతం పరిమితిని విధిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసు కుంది. టివి ఛానెళ్ళు, ఎఫ్‌ఎం రేడియోల్లో అయితే పెట్టుబడులు 26 శాతానికే పరిమిత మవుతాయి. ఆర్ధిక వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ (సిసిఇఎ) తీసుకున్న ఈ నిర్ణయం డిటిహెచ్‌, హెచ్‌ఐటిఎస్‌, మల్టీ సర్వీస్‌ ఆపరేటర్లు, కేబుల్‌ టివిలకు వర్తిస్తుంది. ఇప్పటివరకు కేబుల్‌ టివి, డిటిహెచ్‌ల్లో మాత్రమే 49 శాతం ఎఫ్‌డిఐ వర్తిస్తోంది. హెచ్‌ఐటిఎస్‌లో మాత్రం 74 శాతం ఉంది. భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి ఉన్న మొబైల్‌ టివిలో కూడా 74 శాతం ఎఫ్‌డిఐని అనుమతించారు. సమావేశం అనంతరం వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్‌ శర్మ విలేకర్లతో మాట్లాడుతూ, 74 శాతంలో 49 శాతం ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా, మిగిలిన మొత్తం ప్రభుత్వ రూట్‌ ద్వారా వస్తుందని చెప్పారు. దీనికి ముందుగా విదేశీ పెట్టుబడుల పెంపు బోర్డు(ఎఫ్‌ఐపిబి) అనుమతి పొందాల్సి వుంటుంది. అయితే, టివి వార్తా చానెళ్ళకు సంబంధించినంతవరకు కరెంట్‌ ఆఫైర్స్‌, ఎఫ్‌ఎం రేడియో, కంటెంట్‌ ప్రొవైడర్లలో ఎఫ్‌డిఐ పరిమితి 26 శాతం వరకే అనుమతించబడుతుంది.

No comments:

Post a Comment