అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, September 12, 2012

మలిసంధ్యకో మనసు తోడు!

కోరుకుంటున్న ఒంటరి వృద్ధులు
పెరుగుతున్న వృద్ధ వివాహాలు
సహజీవనం పైనా ఆసక్తి
నిస్వార్థ ఆత్మీయ భావనతో ఏకం
విస్తరిస్తున్న కొత్త జీవన ధోరణి

ఈనాడు ప్రత్యేక విభాగం
హైదరాబాద్‌ శివారులోని ఆ గేటెడ్‌-టౌన్‌షిప్‌కి సరికొత్త శోభ ఆ దంపతులే!  ఉదయం నడక.. యోగా.. పూజా కార్యక్రమాలు.. షాపింగ్‌.. అపార్ట్‌మెంట్‌ సొసైటీ మీటింగ్‌..  ఇలా ఏ వ్యవహారమైనా.. అన్నింటా తామే అయి.. అందరికీ తలలో నాలుకయ్యేదీ వారే!ఆ అనోన్య దంపతులే లలిత-రాజారావు! 'మీరు మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌!' అంటే ఇద్దరూ ఫక్కున నవ్వేస్తారు.
కానీ గమనించి చూస్తే..ఆ నవ్వు వెనుక ఓ సన్నటి విషాద రేఖ దోబూచులాడుతుంటుంది!నిజానికి వారిద్దరూ ఒకరికొకరు తారసడింది నాలుగు నెలల కిందటే! అదీ.. ఓ వయోధికుల స్వయంవరంలో! అవును. ఇద్దరికీ అది రెండో పెళ్ళి!! లలిత వయసు 53. రాజారావుకు 65 ఏళ్లు.  రావుగారి పెద్దబ్బాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరీ ఆశీర్వదించి.. కాదు.. అభినందించి వెళ్లారు!  లలితమ్మ సంతానం సుదూరాల్లో ఉంటూనే తమ అభినందనలు తెలిపారు.. సమాజానికి భయపడి! ఆ ఇద్దరి నవ్వు వెనక అందుకే ఆ విషాదరేఖ!

రాష్ట్రంలో ఇలాంటి వయోధిక పెళ్ళిళ్లు, సహజీవనాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇలా ఏకమవుతున్నవాళ్లందరిదీ ఇంచుమించు ఒకటే గతం. కడుపునపుట్టినవారితో పెరుగుతున్న ఎడం. అందరూ ఉండీ అనాథలుగా మిగిలిన దైన్యం! పండు వయసులో పలకరించే తోడు కోసం పడే ఆరాటం! అది కేవలం శారీరక తపన కాదు. ఓ ఉద్వేగ బాసట. ఓ మానసిక ఆసరా. ఓ సహజీవన కామన! దాని ఫలితమే ఈ విలక్షణ స్వయంవరాలు. జీవన మలిసంధ్యవేళ పెళ్ళిళ్లు. అంతేకాదు.. సహజీవనాలు కూడా!!

ఇప్పుడు సహజీవనమా?!
లివింగ్‌ టు గెదర్‌... కంపానియన్‌షిప్‌... సహజీవనం. పేరేదైనా మన సమాజం దీన్నో సాంస్కృతిక సంక్షోభం(కల్చరల్‌ షాక్‌)గానే చూస్తోంది! కానీ ఒంటరి వృద్ధులకు పెళ్ళికన్నా సహజీవనమే మంచిదన్నది నిపుణుల భావన. ఆస్తిపాస్తుల గొడవలు, భరణాల ఇబ్బందుల వంటివేవీ ఇందులో ఉండవు. విడిపోవాలనుకున్నా పెద్ద సమస్య కాదు. పైగా ఈ వృద్ధుల సహజీవనం వెనుక శారీరక కోరికలుండవు. అవి తీరాక ఎవరి దారి వారి చూసుకునేంతటి స్వార్థమూ ఉండదు. కాబట్టి సహజీవనంపై వృద్ధుల మొగ్గును ఓ అపనమ్మకంగా కాకుండా.. ఓ సౌలభ్యంగానే చూడాలంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న 'తోడు-నీడ' సంస్థ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా స్వయంవరాల ద్వారా 30 వృద్ధ జంటల్ని కలిపింది. వీరిలో 20 జంటలు సహజీవన సహచరులుగానే కొనసాగుతుండటం గమనార్హం. మిగతావారిలో ఐదుగురు మొదట సహజీవనం చేసి ఆ తర్వాత దంపతులయ్యారు. కేవలం ఐదు వృద్ధ జంటలు మాత్రమే వెంటనే పెళ్ళిపీటలకు ఎక్కారు! సహజీవనం చేస్తున్నవారిలో గత రెండేళ్లుగా ఒక్క జంటకూడా ఇంతవరకు విడిపోకపోవటం విశేషం. యువతకీ వృద్ధులకీ అదే తేడా మరి!

కొత్త పరిణామం!
''పదేళ్ల కిందట మా వద్ద పునర్వివాహం కోసం నమోదు చేసుకునేవారిలో 50 ఏళ్లు దాటినవారి సంఖ్య 10 శాతమే ఉండేది. ఐదేళ్ల కిందట ఇది 40 శాతానికి చేరగా.. ఇప్పుడు 75 శాతానికి ఎగబాకింది. మా 35 ఏళ్ల అనుభవంలో ఇది కొత్త పరిణామం'' అని చెబుతున్నారు ప్రముఖ వివాహ పరిచయ వేదిక సంస్థ 'క్విక్‌ మ్యారేజస్‌' నిర్వాహకురాలు వనజారావు. మలిసంధ్య పెళ్ళిళ్లు ఒకప్పుడు కేవలం ఉన్నత మధ్యతరగతి, సంపన్నవర్గాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు అన్ని వర్గాల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. పెళ్ళిళ్ల పరిచయ వేదికల్లో(మ్యారేజ్‌ బ్యూరోలు) ఇప్పుడు పిల్లల బయోడేటాతో పాటు తమదీ ఇచ్చే తల్లిదండ్రులున్నారంటే అతిశయోక్తి కాదు.

సమస్యలూ ఉన్నాయి!
* ఆస్తిపాస్తుల గొడవలు: విశ్వేశ్వర్‌రావు (పేరు మార్చాం) ఓ వ్యాపారి. పదేళ్ల కిందట భార్య చనిపోయారు. ఆ మధ్య ఆయన స్వయంవరానికి వెళ్లి, నచ్చిన వ్యక్తితో పెళ్ళికి సిద్ధపడ్డారు. ఆస్తి మొత్తం పిల్లలకు పంచి.. తన వాటా తను తీసుకుని పెళ్ళి చేసుకుంటానన్నారు. పిల్లలు ససేమిరా అన్నారు. ఆస్తి పంచితే విశ్వేశ్వరరావు వాటా కిందే రూ.9 కోట్లుంటాయి మరి! పిల్లలు ఆయన్ని పొరుగురాష్ట్రానికి తీసుకెళ్లి గృహనిర్బంధంలో ఉంచారు! ఆయన సెల్‌ఫోన్‌లో పాత నెంబర్‌లన్నీ డిలిట్‌ చేసేశారు. అయినా విశ్వేశ్వరరావు వాళ్ల కళ్లుగప్పి తప్పించుకుని, ఆమెని పెళ్ళి చేసుకోవటానికి సిద్ధపడ్డారు. కానీ ఈసారి ఆయన సంతానం ఏకంగా 'స్వయంవరం' నిర్వాహకులపైనే దాడికి దిగారు! ముదిమి పెళ్ళిళ్ల విషయంలో ఆస్తే ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. అందుకే మ్యారేజ్‌ బ్యూరోలు ముందుగానే పిల్లల సమ్మతి తీసుకుంటున్నాయి. పెళ్ళి బయోడేటాలో ఆస్తి వివరాలు పెట్టడం నిషేధిస్తున్నాయి.

* ఇదో సున్నిత కోణం: ''నేను పెళ్ళి చేసుకుంటున్న విషయం విని అమెరికాలో ఉంటున్న మావాడు తట్టుకోలేకపోయాడు. 'మేం నిన్ను బాగా చూసుకోవడం లేదా? అందుకే ఇలా చేస్తున్నావా? ఆ కొత్త వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడతాడేమో?' అంటూ కుమలిపోయాడు. అలిగాడు. మాట్లాడటం మానేశాడు. ఇప్పుడిప్పుడే మెల్లగా సందేశాలు పంపటం మొదలెట్టాడు'' అంటారు నెల్లూరుకు చెందిన మైథిలి సన్నటి కన్నీటి తెరతో.

ఇవీ కారణాలు..
* ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావటం మూలంగా ఇటీవల సగటు జీవనకాలం బాగా పెరిగింది. 60 ఏళ్లకు ఉద్యోగ విధుల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా.. జీవన సహచరి లేకపోతే ఆ తర్వాతి కాలమంతా ఒంటరిగా ఉండిపోవాల్సిందే. అందుకే జీవితంలోకి మరొకర్ని ఆహ్వానించేందుకు సిద్ధపడుతున్నారు.

* నిన్నటి తరం మధ్యతరగతి దంపతులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమయ్యారు. ఆ పిల్లలు నేడు విదేశాల్లోనో.. పొరుగురాష్ట్రాల్లోనో స్థిరపడుతున్నారు. భర్త లేదా భార్య ఎవరో ఒకరు రాలిపోతే.. మిగిలినవారికి ఒంటరితనమే గతి అవుతోంది. అన్నీ ఉన్నా పచ్చి మంచి నీళ్లు ఇచ్చేవారులేని స్థితి ఎందరినో వేధిస్తోంది.

* నేటితరం వయోధిక మహిళలు విద్య, ఉద్యోగం అందించిన చైతన్యం గలవారు. ఆ చైతన్యంతోనే పిల్లల్నీ పెంచినవారు. అదే తెగువతోనే ఇప్పుడు కొత్త జీవన సహచరుల కోసం చేయీ చాస్తున్నారు.

* తల్లయినా సరే. వితంతువులను శుభకార్యాలప్పుడు దూరంగా ఉంచడం ఎంతోమందిని కలచివేస్తోంది. పిల్లల పెళ్ళిళ్లు, కన్యాదానాల వేళ ఒంటరి తల్లులు పడే క్షోభ అంతాఇంతా కాదు. ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహిళలు మరో పెళ్ళి కోసం చూడటానికి ఇవీ దోహదం చేస్తున్నాయి.
                                                         ***
సహకరిద్దాం.. స్వాగతిద్దాం!
''తమ పెద్దవాళ్ల జీవితంలోకి బయటివాళ్లు భాగస్వాములుగా వచ్చినంత మాత్రాన.. వీరికి తల్లి-తండ్రి కాకుండా పోరు కదా! పిల్లలు ఈ విషయం గ్రహించాలి. పెద్దలకు తిండీ, బట్ట, ఇల్లే కాదు. ఓ మానసిక తోడూ అవసరమని గుర్తించాలి. వాళ్లకు మనం సహకరించాలి. నేటి సమాజంలో ఇదో విప్లవం. కాబట్టి దీన్ని స్వాగతించాలి''
-రాజేశ్వరి, వ్యవస్థాపకురాలు,
సెల్ఫ్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌
ది ఏజ్డ్‌ (సేవా - తోడునీడ)
                                                              ***
వ్యక్తిత్వమే ముఖ్యం..
''పిల్లలు, తోబుట్టువుల వంటి బంధమేదైనా ఆలుమగల అనుబంధానికి సాటి రాదు. స్వయంవరాలకు అందుకే వెళుతున్నాం. డబ్బు, హోదా కన్నా పరిణతి, అభిప్రాయాలకి ప్రాధాన్యం ఇస్తున్నాం. అన్నింటికన్నా వచ్చేవారు మా పిల్లలతో కలిసిపోవాలనీ కోరుకుంటున్నాం''
-కృష్ణంరాజు(52), హైదరాబాద్‌

No comments:

Post a Comment