అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Saturday, September 15, 2012

వాల్‌మార్ట్ వచ్చేస్తోంది!

భారత్‌లో మల్టీబ్రాండ్ రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు మార్గం సుగమం
వరుసలో క్యారిఫోర్.. టార్గెట్‌లు కూడా...
ఎఫ్‌డీఐలకు కేంద్ర కేబినెట్ ఆమోదంతో పరిశ్రమకు కొత్త జోష్



విమర్శలు, వ్యతిరేకతలను తోసిరాజంటూ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు ఆమోదముద్ర వేసిన కేంద్రం తేనెతుట్టను కదిపింది. దీనివల్ల ఉపాధి కల్పన జరుగుతుందని, వ్యవసాయోత్పత్తులు వృధా కాకుండా చూడటం సాధ్యపడతుందని.. తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని.. అలాగే రైతులకు మేలు జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఇది ఇటు చిల్లర వర్తకులు, రైతాంగం మొదలుకుని అటు తయారీ తదితర రంగాల్లో ఉద్యోగాలకు కూడా పెను ప్రమాదమని మరోవైపు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే సింగిల్‌బ్రాండ్ రిటైల్, మల్టీబ్రాండ్ హోల్‌సేల్ వ్యాపారాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతులు వున్నాయి. సింగిల్ బ్రాండ్ (ఒకే షాపులో ఒకే బ్రాండు ఉత్పత్తులు) రిటైల్ వ్యాపారాల్లో నైక్ షూ కంపెనీ, లెవీస్ జీన్స్ కంపెనీ, టిస్సోట్ వాచ్ కంపెనీ తదితర ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థలన్నీ భారత్‌లో స్వంత షోరూమ్‌లు ఏర్పాటుచేసాయి. ఇక మల్టీబ్రాండ్ (ఒక షాపులో పలు బ్రాండ్ల ఉత్పత్తులు) హోల్‌సేల్‌లో వాల్‌మార్ట్, మెట్రోలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో మెట్రో బ్రాండ్ పేరుతో రెండు హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నడుపుతోంది.

బెస్ట్‌ప్రైస్‌బ్రాండ్ పేరుతో భారతివాల్‌మార్ట్ (అమెరికా వాల్‌మార్ట్, భారతి ఎయిర్‌టెల్‌ల జేవీ) విజయవాడలో హోల్‌సేల్ స్టోర్ నిర్వహిస్తోంది. హోల్‌సేల్‌లో కొనుగోలుచేసి చిల్లరగా విక్రయించుకునే వ్యాపారులే ఈ స్టోర్లలో కొనుగోళ్లు జరుపుతారు. ఈ స్టోర్స్‌లో వివిధ బ్రాండ్లకు చెందిన 15,000కుపైగా ఉత్పత్తుల్ని అవి అమ్ముతున్నాయి. ఇప్పుడు తాజాగా మల్టీబ్రాండ్ రిటైల్‌లో 51 శాతం విదేశీ పెట్టుబడుల్ని అనుమతించడం వల్ల రిలయన్స్, స్పెన్సర్స్ తదితర అవుట్‌లెట్స్‌కు పోటీగా ఒక భారత్ భాగస్వామ్య కంపెనీతో కలిసి విదేశీ దిగ్గజాలు రిటైల్ దుకాణాల్ని తెరవవచ్చు. ఇలా మల్టీబ్రాండ్ రిటైల్ దుకాణాల ఏర్పాటుకు విదేశీ కంపెనీలను అనుమతించడం పట్ల వినియోగదారులు, రైతులు ఆసక్తి కనపరుస్తుండగా, చిల్లర వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్‌డీఐలకు అనుకూల వాదనలు..
దళారుల పాత్ర తొలగి.. రైతులకు అధిక ధర గిట్టేందుకు తోడ్పడుతుంది.
రిటైల్ స్థాయిలో ధరలు తగ్గుతాయి కనుక.. ద్రవ్యోల్బణం అదుపులోకి వసృ్తంది.
పెద్ద రిటైల్ సంస్థలు ఏర్పాటు చేసే కోల్డ్‌స్టోరేజీలు, గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాల వల్ల పండ్లు, కూరగాయల్లో వేస్టేజి తగ్గుతుంది.
చిన్న, మధ్య తరహా సంస్థలకు పెద్ద మార్కెట్‌లో అవకాశాలు.. దానితో పాటు మెరుగైన టెక్నాలజీ, బ్రాండింగ్ లభిస్తుంది.
టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు దేశానికి అత్యంత అవసరమైన విదేశీ పెట్టుబడులు వస్తాయి.
ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
మార్కెట్లో పోటీ పెరగడం వల్ల అటు ఉత్పత్తిదారులకు, ఇటు వినియోగదారులకు ఉపయోగం.

వ్యతిరేక వాదనలు ఇవీ...
వేలకొద్దీ చిన్న కిరాణా షాపులు మూతబడతాయి. దాదాపు 4 కోట్ల మంది ఉపాధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఏర్పడుతుంది.
ధరలు ప్రారంభంలో తగ్గినప్పటికీ..రిటైల్ మార్కెట్‌పై బహుళజాతి కంపెనీలు ఆధిపత్యం పెరిగితే ధరలూ పెరిగిపోతాయి.
రైతులకు కూడా మొదట్లో మంచి రేటు లభించినా.. తర్వాత వారు ఎంఎన్‌సీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది.
పెద్ద కంపెనీలు చౌక రేట్లకు అమ్మడం వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలు దెబ్బతింటాయి.
ఎంఎన్‌సీ రిటైలర్ల గుత్తాధిపత్యం పెరిగిపోతుంది.

క్యాష్ అండ్ క్యారీ అంటే..
రిటైల్ వర్తకులు తమకు కావలసిన వస్తువులను వివిధ చోట్ల నుంచి కొనుగోలు చేసే శ్రమను తప్పిస్తూ మల్టీబ్రాండ్ రిటైల్ కంపెనీలు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఒకేచోట అన్ని రకాల వస్తువులను చౌకధరలకు అందిస్తాయి. రిజిష్టర్ చేసుకున్న వర్తకులకు మాత్రమే పరిమితమైన ఈ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో క్రెడిట్ (అప్పుమీద జరిగే) లావాదేవీలు ఏవీ ఉండవు. వినియోగదారుడు జరిపే అన్ని రకాల కొనుగోళ్లకు, పొందే సేవలకు తక్షణమే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసే కంపెనీలు తమ ఖాతా పుస్తకాల్లో బిల్స్ రిసీవబుల్స్ (రావలసిన బకాయిలు) చూపించరు. సాధారణంగా క్రెడిట్ లావాదేవీలు జరిపే కంపెనీలు తమ కస్టమర్ల నుంచి రావాల్సిన బకాయిలను బ్యాలెన్స్‌షీట్‌లో అసెట్స్(ఆస్తులు)గా చూపుతాయి. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం పాత కాలం పద్ధతి. అయితే ఇటీవల బహుళజాతి రిటైల్ కంపెనీలు మళ్లీ ఈ పద్ధతిని ఎక్కువగా అమలు చేస్తున్నాయి.

ఉవ్విళ్లూరుతున్న ఎంఎన్‌సీలు..
వాల్‌మార్ట్ (అమెరికా)
టార్గెట్ (అమెరికా)
క్యారీఫోర్ (ఫ్రాన్స్)
టెస్కో (బ్రిటన్)
మెట్రో (జర్మనీ)

No comments:

Post a Comment