అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, May 4, 2012

దుస్థితిలో గ్రామీణ భారతం

  • జనాభాలో 60 శాతం మంది ఆదాయం రోజుకు రూ.35 కంటే తక్కువ
  • పట్టణ ప్రాంతాల్లో రూ. 66 కన్నా తక్కువే
  • తలసరి వినిమయం కేరళలో అధికం
  • నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో వెల్లడి
గ్రామీణ భారతంలో 60 శాతానికి పైగా ప్రజలు రోజుకు 35 రూపాయల కన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.66 కన్నా తక్కువతో బతుకుతున్నారు. ప్రజల ఆదాయ వ్యయాలపై నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ జె దాస్‌ ఆ నివేదిక పీఠికలో ఈ విషయాలు పేర్కొన్నారు. 2009 జులై-2010 జూన్‌ మధ్య కాలంలో ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 66వ సర్వే నిర్వహించింది. దేశంలో గ్రామీణ ప్రజల నెలవారీ తలసరి ఖర్చు (ఎంపిసిఇ) రూ.1,054గానూ, పట్టణ ప్రాంతాల్లో రూ.1,984గానూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అట్టడుగు స్థాయిలో జీవించే 10 శాతం జనాభా కేవలం 15 రూపాయలతో రోజు వెళ్ళదీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇది రోజుకు రూ.20గా ఉంది. ఈ 10 శాతం జనాభా సగటు ఎంపిసిఇ రూ.453. అదే పట్టణ ప్రాంతాల్లో రూ.599. బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో సగటు ఎంపిసిఇ బాగా తక్కువగా ఉండగా, కేరళలో అత్యధికంగా ఉంది. 2009-10లో సగటు గ్రామీణ భారతీయుడి ఇంటి అవసరాల్లో 57 శాతం కేవలం ఆహారానికే ఖర్చయింది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 44 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తృణధాన్యాల నెలవారీ సగటు తలసరి వినిమయం 11.3 కిలోలు ఉండగా, నగరాల్లో 9.4 కిలోలుగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
కీలకాంశాలు
* గ్రామాల్లో ఎంపిసిఇ రూ.1053.64కాగా పట్టణాల్లో రూ.1984.46గా ఉంది. అంటే పట్టణ ప్రజల తలసరి వినిమయ స్థాయి గ్రామీణ ప్రజలతో పోలిస్తే 88 శాతం అధికంగా ఉంది. గ్రామాల్లో అట్టడుగు పది శాతం నిరుపేదల ఎంపిసిఇ రూ.453గా ఉంటే పట్టణాల్లో ఆ కేటగిరీవారి ఎంపిసిఇ రూ.599 గా ఉంది. ఎంపిసిఇ ఆధారిత ర్యాంకుల్లో అగ్రభాగాన ఉన్న పైతరగతి పది శాతం జనాభా ఎంపిసిఇ నిరుపేదల కంటే 5.6 రెట్లు ఎక్కువగా రూ.2517గా ఉంది. పట్టణాల్లో తొలి పది శాతం అగ్రగణ్య ప్రజల ఎంపిసిఇ పట్టణ నిరుపేదల కంటే 9.8 రెట్లు అధికంగా రూ.5863గా ఉంది.

* పెద్ద రాష్ట్రాల్లో కేరళ గ్రామీణ ప్రజల ఎంపిసిఇ మిగిలిన రాష్ట్రాల ప్రజలకంటే అత్యధికంగా రూ.1835గా ఉంది. ఈ జాబితాలో తర్వాత స్థానాల్లో పంజాబ్‌ (రూ.1649), హర్యానా (రూ.1510) నిలిచాయి. మిగిలిన అన్ని పెద్ద రాష్ట్రాల్లో సగటు గ్రామీణ ఎంపిసిఇ రూ.750 నుంచి రూ.1250 మధ్య ఉంది.

* సగటు గ్రామీణ ఎంపిసిఇ బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో అత్యల్పంగా (రూ.780వరకు) ఉంది. ఒడిషా, జార్ఖండ్‌లో కూడా చాలా తక్కువగా (రూ.820వరకు) ఉంది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో రూ.900 వరకు ఉంది.

* పట్టణ సగటు ఎంపిసిఒలో మహారాష్ట్ర (రూ.2437), కేరళ (రూ.2413) అగ్రభాగంలో ఉన్నాయి. తర్వాత స్థానాన్ని హర్యానా (రూ.2321) చేజిక్కించుకుంది. దేశ సగటు ఎంపిసిఇ కంటే అధిక ఎంపిసిఇ కలిగిన ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ (రూ.2238), పంజాబ్‌ (రూ.2109), కర్నాటక (రూ.2053) నిలిచాయి.

* పట్టణ ఎంపిసిఇ బీహార్‌లో అత్యల్పంగా (రూ.1238)గా ఉంది. మిగిలిన ఏ పెద్ద రాష్ట్రంలోనూ పట్టణ ఎంపిసిఇ రూ.1500 కంటే తక్కువగా లేదు.

* మన రాష్ట్రంలో గ్రామీణ సగటు ఎంపిసిఇ రూ.1234గా ఉంది. ఆహార ఖర్చు రూ.717గా ఉంది. అలాగే పట్ణణ సగటు ఎంపిసిఇ రూ.2238గా ఉండగా ఆహార ఖర్చు రూ.1002గా ఉంది.

* దేశంలో సగటు గ్రామీణ ఎంపిసిఇ రూ.1054గా ఉంటే ఆహార ఖర్చు రూ.600గా ఉంది. పట్టణ ఎంపిసిఇ రూ.1984గా ఉండగా ఆహార ఖర్చు రూ.881గా ఉంది. అంటే గ్రామీణ భారతావని వినియమ ఖర్చులో 57 శాతం ఆహారం కోసమే ఖర్చు చేయాల్సివస్తోంది. పట్టణాల్లో మొత్తం వినియమ ఖర్చులో 44.4 శాతం ఆహారం కోసం వెచ్చిస్తున్నారు.

No comments:

Post a Comment