మరో మూడు రోజుల్లో స్కూళ్లు ప్రారంభం
పుస్తకాల్లేకుండానే పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి
ఇప్పటిదాకా మండల కేంద్రాలకు చేరిన పుస్తకాలు 20 శాతంలోపే
ముద్రణ దశలోనే మూలుగుతున్న 3, 6, 7 తరగతుల పుస్తకాలు
రచన స్థాయిలోనే హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, మరాఠీ, ఒరియా పుస్తకాలు
మార్కెట్‌లోకి అందుబాటులోకి రాని సేల్ పుస్తకాలు
{పైవేటు స్కూల్ విద్యార్థులకూ తప్పని ఎదురుచూపులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: బుక్కయ్యారు.. విద్యార్థులు మళ్లీ బుక్కయ్యారు!
మూడు రోజుల్లో స్కూళ్లు తెరుచుకోనున్నా.. సుమారు కోటి మంది విద్యార్థులకు
పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితే కనిపించడం లేదు!! పుస్తకాలను అందుబాటులోకి
తేవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జూన్ 12న స్కూళ్లు తెరిచే నాటికి
విద్యార్థులందరికీ పుస్తకాలు అందజేస్తామన్న విద్యాశాఖ ఆచరణలో చతికిల
పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు
ఇవ్వాల్సిన ఉచిత పాఠ్య పుస్తకాలు ఇంకా స్కూళ్లకు చేరలేదు. అధికారులు 20
శాతం పుస్తకాలను కూడా మండల కేంద్రాలకు చేర్చలేకపోయారు.
ఇక
ప్రైవేటు స్కూళ్లలో చదివే దాదాపు 50 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన
పుస్తకాల్లో ఇప్పటివరకు 25 శాతం పుస్తకాల ముద్రణ మాత్రమే పూర్తయినట్లు
అంచనా. ప్రైవేటు స్కూల్ విద్యార్థుల కోసం మే 15 నాటికే నిర్ణీత కేంద్రాల్లో
సేల్ పుస్తకాలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని ప్రభుత్వం గొప్పలు
చెప్పుకున్నా ఆచరణకు నోచుకోలేదు. దీంతో మార్కెట్‌లో కొనుక్కుందామన్నా
పుస్తకాలు దొరకని దుస్థితి నెలకొంది.
అడుగడుగునా నిర్లక్ష్యం..
పుస్తకాల పంపిణీలో ఏటా జాప్యం జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం కళ్లు తెరవడం
లేదు. విలువైన కాలాన్ని కోల్పోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా
పట్టించుకోవడంలేదు. అన్నింట్లో ప్రభుత్వ పెద్దల జోక్యం, పేపరు కొనుగోళ్లు,
ముద్రణ పనుల అప్పగింతల్లో ముడుపుల బాగోతం కారణంగా గత ఏడాది కూడా ఇదే
పరిస్థితి నెలకొంది. దాదాపు సగం ఏడాది వరకు విద్యార్థులు
పుస్తకాల్లేకుండానే చదువుకోవాల్సి వచ్చింది. దీంతో ఈసారి మే 31నాటికే మండల
కేంద్రాలకు అందేలా చూస్తామని, జూన్ 12న స్కూళ్లు తెరిచే రోజున
విద్యార్థులందరి చేతుల్లో పుస్తకాలు ఉంటాయని మంత్రి శైలజానాథ్ చెప్పారు.
కానీ ఆ హామీలకు దిక్కు లేకుండా పోయింది. టెండరు ప్రక్రియ నుంచి మొదలుకొని
ఫిలింల తయారీ.. వాటిని ప్రింటర్లకు, పబ్లిషర్లకు ఇవ్వడం.. పేపరు
కొనుగోళ్లు.. ముద్రణ పనుల అప్పగింత.. ముద్రణ.. ట్రాన్స్‌పోర్టు.. తదితర
అన్ని దశల్లోనూ సర్కారు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించింది.
40 శాతం పుస్తకాలు ముద్రణకే నోచుకోలేదు..
రాష్ట్రంలోని 79 వేల సర్కారీ స్కూళ్లలో చదివే 80 లక్షల మంది విద్యార్థులకు
స్కూళ్లు తెరిచే నాటికి 5.20 కోట్ల పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. కానీ
విద్యాశాఖ వేసిన అధికారిక లెక్కల ప్రకారమే.. ఇప్పటి వరకు ముద్రణ పూర్తయినవి
కేవలం 60 శాతమే కావడం గమనార్హం. వీటిల్లో 20 శాతం కంటే తక్కువ పుస్తకాలే
మండల కేంద్రాలకు వెళ్లాయి. జిల్లా కేంద్రాలకు చేరినవి 20 శాతంగా ఉన్నాయి.
మిగితా వాటిల్లో కొన్ని ముద్రణ దశ దాటి బైండింగ్ దశలో ఉండగా.. ముద్రణ
పూర్తయినవి మరికొన్ని హైదరాబాద్‌లోని గోదాముకు.. అక్కడ్నుంచి జిల్లాలకు
సరఫరాచేసే దశల్లోని ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు పూర్తయి
స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ముద్రణ
పూర్తయిన పుస్తకాలు మండల కేంద్రాలకు చేరేందుకే మరో నెల రోజులు పట్టే అవకాశం
ఉంది. ఇక మిగిలిన 40 శాతం పుస్తకాలు ముద్రణ పూర్తి చేసుకొని హైదరా బాద్
నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి మండలాలకు, మండల పాయింట్ నుంచి స్కూళ్లకు
చేరేందుకు ఇంకెన్ని నెలలు పడుతుందో సర్కారుకే తెలియాలి!
పుస్తకాలు లేకుండానే బడిబాట..
ప్రైవేటు స్కూళ్లలో చదివే దాదాపు 50 లక్షల మంది విద్యార్థులకు దాదాపు 2
కోట్ల పుస్తకాలు అవసరం. వీటికి సంబంధించిన పేపరు కొనుగోలు, ముద్రణ
వ్యవహారాలన్నీ పబ్లిషర్లే చేపట్టేలా విద్యాశాఖ పనులను అప్పగించింది. కానీ
వాటి ఫిలింలను అందజేయడంలో తీవ్ర జాప్యం చేసింది. ఆమ్యామ్యాల కోసం ఓ మంత్రి
చేసిన ఒత్తిడి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎట్టకేలకు ఫిలింలను ఇటీవల అందజేసినా ముద్రణ పూర్తయ్యేసరికి మరో నెల రోజులకు
పైగా పట్టనుంది. విద్యార్థుల కోసం మే 15 నాటికే జిల్లా కేంద్రాల్లోని
పుస్తక విక్రయ కేంద్రాల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సి ఉన్నా..
పుస్తకాలు ఎక్కడా కనిపించ లేదు. ఫిలింలను ఆలస్యంగా ఇవ్వడం వల్లే ఈ జాప్యం
నెలకొంది. దీంతో ఈసారి ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులు కూడా
పుస్తకాల్లేకుండానే బడిబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
3,6,7 తరగతి పుస్తకాలు మరింత లేటు..?
దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 3, 6, 7 తరగతుల పాఠ్య
పుస్తకాలను ఈసారి మార్చాలని గత ఏడాదే విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు
అనుగుణంగా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) చర్యలు
చేపట్టింది. అయితే పుస్తకాలకు సంబంధించిన పనులను (రచన, ఫిలింల తయారీ,
ముద్రణ వంటివి) సకాలంలో చేయించడంలో విద్యాశాఖ విఫలమైంది. ఫలితంగా ఆ
పుస్తకాలు ఇంకా ముద్రణ, బైండింగ్ దశల్లోనే ఉన్నాయి. 7వ తరగతికి చెందిన
కొన్ని పుస్తకాల ముద్రణ అయితే ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీంతో 3, 6, 7
తరగతులకు విద్యార్థులకు పుస్తకాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి
ఉంది.
ఇతర మీడియం బుక్స్‌లోనూ అదే తీరు..
రాష్ట్రంలోని
హిందీ, ఉర్దూ, తమిళం, మరాఠీ, ఒరియా, కన్నడ, బెంగాలీ మీడియం స్కూళ్లలో లక్షల
మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి సంబంధించిన పుస్తకాలు ఇంకా రచన,
ఫిలింల తయారీ స్థాయిల్లోనే ఉన్నాయి. అనువాదం సమస్య పేరుతో తెలుగు, ఇంగ్లిషు
మీడియం మినహా ప్రతి ఏటా ఇతర మీడియం విద్యార్థుల పుస్తకాల ముద్రణలో సర్కారు
జాప్యం చేస్తూనే ఉంది. గత ఏడాదైతే నవంబరు నెల వరకు కూడా ఈ పుస్తకాల పంపిణీ
పూర్తి కాలేదు. ఈసారి కూడా అదే పునరావృతం అయ్యేట్టుంది.
No comments:
Post a Comment