అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, June 8, 2012

అర్బన్‌లో జనవిస్ఫోటం

పదేళ్ల పెరుగుదల శాతంలో రాష్ట్రంలోనే అధికం
రూరల్‌ జనాభా: 15,72,032 అర్బన్‌లో: 37,24,364
బాలానగర్‌ మండలంలో అత్యధికం
నవాబుపేటలో అత్యల్పం
0-6 వయస్సునవారి పెరుగుదలలో అరుదైన రికార్డు
లింగనిష్పత్తిలో అట్టడుగుస్థానం
న్యూస్‌టుడే, రంగారెడ్డి జిల్లా

జిల్లా అర్బన్‌ ప్రాంతంలో జనమే జనం. పదేళ్లలో ఈ జిల్లా అర్బన్‌ ప్రాంతంలో జనాభా రికార్డు స్థాయిలో
పెరిగిపోయింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ లేనంతగా జన పెరుగుదల ఉంది. జనాభా అర్బన్‌ ప్రాంతానికి తరలివచ్చింది. గ్రామీణాన్ని వదిలి పట్టణాలకు వలసపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మండలాల వారీగా జనాభా గణాంకాలను గురువారం గణాంకశాఖ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాను పరిశీలిస్తే... బాలానగర్‌ మండలం మొదటిస్థానంలో ఉండగా నవాబుపేట అట్టడుగు స్థానంలో ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా.. మండలాల వారీగా జనాభా వివరాలు వెలుగులోకి వచ్చాయి.

జిల్లా 52,96,396 మంది జనాభాతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్న విషయం ఇప్పటికే తెలిసిందే. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 15,72,032 మంది ఉండగా పట్టణ ప్రాంతాల్లో 37,24,364 మంది ఉన్నట్లు తేలింది. జిల్లాలో నాలుగు మండలాల్లో పూర్తిగా పట్టణీకరణ జరిగినట్లు గణాంక శాఖ గుర్తించింది. గత పదేళ్లలో ఆయా మండలాల్లో వసతుల విషయంలో పూర్తిగా మార్పు చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి, బాలానగర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌ మండలాలుగా వాటిని అధికారులు గుర్తించారు.

* గత పదేళ్లలో జిల్లా జనాభా విపరీతంగా పెరిగింది. 48.15శాతం పెరుగుదలతో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 12.82శాతం పెరుగుదలతో రాష్ట్రంలో మూడోస్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో పెరుగుదల విషయంలో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 70.71 శాతం పెరుగుదల కనిపించింది.

* మండలాల వారీగా జనాభా పెరుగుదల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజేంద్రనగర్‌లో 69.04శాతం పెరగగా ఘట్‌కేసర్‌లో 49.26 శాతంగా నమోదైంది.

* జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో పదేళ్లలో జనాభా పెరుగుదల విషయానికి వస్తే ఉప్పల్‌లో 229.21 శాతం నమోదు కాగా హయత్‌నగర్‌లో 180.77శాతం నమోదైంది.

* రాష్ట్రంలో తక్కువ జనాభా పెరుగుదల నమోదు చేసిన మండలాల్లో ఇబ్రహీంపట్నం ఉంది. ఇక్కడ - 26.58 శాతం తగ్గుదల కనిపించింది.

లక్ష దాటిన తాండూరు మండలం
వికారాబాద్‌లో 53వేలు.. తాండూరులో 64వేలు

ప్రస్తుతం జిల్లాలో రెండు మున్సిపాలిటీలో ఉన్నాయి. వికారాబాద్‌, తాండూరు మున్సిపాలిటీలు ఉండగా ఆయా ప్రాంతాల్లో జనాభా విషయంలో స్పష్టత వచ్చింది. వికారాబాద్‌ పట్టణ ప్రాంతంలో 53,185 మంది ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 32,376 మంది ఉన్నారు. తాండూరులో పట్టణ పరిధిలో 64,621 మంది ఉండగా గ్రామీణ ప్రాంతంలో 53,623 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్ష జనాభా దాటిన మండలాల్లో తాండూరు మండలమే కావడం విశేషం.

బాలానగర్‌లో అత్యధిక జనాభా
జిల్లాలో మండలాల వారీగా జనాభా సంఖ్యలో బాలానగర్‌ మండలం మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ 5,67,320 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో సరూర్‌నగర్‌(5,47,448), కుత్బుల్లాపూర్‌(5,02,932), మల్కాజిగిరి(4,14,530) ఉన్నాయి. అత్యల్ప జనాభా ఉన్న మండలాల్లో నవాబుపేట ఉంది. ఇక్కడ 41,199 మంది ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు.

0-6వయస్సున్న వారూ ఎక్కువే
0-6 పిల్లల సంఖ్య విషయంలో జిల్లా రాష్ట్రంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మరే జిల్లాల్లో లేని విధంగా ఈ వయస్సు ఉన్న వారి విషయంలో 2001తో పోల్చితే 2011 నాటికీ పెరుగుదల కనిపించింది. జిల్లాలో సగటు 19.06శాతంగా ఉంది. ఇందులో అర్బన్‌లో 43.46శాతం పెరుగుదల కనిపించినా.. రూరల్‌లో తగ్గుదల కనిపించింది. మండలాల వారీగా అర్బన్‌ ప్రాంతాల్లో హయత్‌నగర్‌(232.92), ఘట్‌కేసర్‌(103.57), ఉప్పల్‌(171.32).. రూరల్‌ ప్రాంతాల్లో రాజేంద్రనగర్‌(47.12శాతం)లో పెరుగదల కనిపించింది. రాజేంద్రనగర్‌లో 2001లో 2,128 మంది పిల్లలు ఉండగా 2011లో 3,078 మందిగా ఉన్నారు.

లింగవివక్ష రాష్ట్రంలోనే అధికం
లింగనిష్పత్తి విషయంలో రాష్ట్రంలో జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. జిల్లాలో 2001లో ప్రతి వేయి మంది పురుషులకు 944 మంది మహిళలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 955గా ఉంది. రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో వేయి మంది పురుషులకు 955 మందే మహిళలే ఉన్నారు. రూరల్‌ ప్రాంతాల్లో లింగనిష్పత్తి విషయంలో 968 నిష్పత్తితో రాష్ట్రంలో చివరిస్థానంలో నిలిచింది. అర్బన్‌ ప్రాంతాల్లోను ఇదే వివక్ష కొనసాగుతోంది. అర్బన్‌ ప్రాంతాల్లో లింగనిష్పత్తి విషయంలో 950తో రాష్ట్రంలో చివరి నుంచి రెండోస్థానంలో జిల్లా ఉంది. 0-6 వయస్సున వారి విషయం తీసుకుంటే మరీ ఘోరంగా ఉంది. 2001లో ప్రతి వెయ్యి మంది బాలురుకు 959 బాలికలు ఉండగా ప్రస్తుతం 947కు పడిపోయింది.

* జిల్లాలో లింగనిష్పత్తి విషయంలో యాలాల మండలం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వేయి మంది పురుషులకు 1053 మంది స్త్రీలు ఉన్నారు. బషీరాబాద్‌లో 1024, పెద్దేముల్‌లో 1016 మంది ఉన్నారు. అలాగే అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 924, శామీర్‌పేట, ఘట్‌కేసర్‌లో 926 మంది ఉన్నారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో లింగ వివక్ష ఎక్కువగా ఉందన్న వాదన వినిపిస్తోంది. విశేషమేమిటంటే.. గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి ఎక్కువగా ఉండగా అర్బన్‌ ప్రాంతాల్లో తక్కువగా ఉంది.

కీసరలో అధిక అక్షరాస్యత
అక్షరాస్యతలో జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. జనాభాలో 78.05శాతంతో 36,69,033 మంది చదువుకున్న వారు ఉన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 8,54,133 మంది ఉండగా అర్బన్‌ ప్రాంతాల్లో 28,14,900 మంది ఉన్నారు. రాష్ట్ర రాజధాని సమీపాన ఉండటంతో విద్య విషయంలో జిల్లాలోని అర్బన్‌ ప్రాంతాల్లో బాగా చైతన్యం వచ్చింది. వేర్వేరు ప్రాంతాల నుంచి జిల్లాలోని అర్బన్‌ ప్రాంతానికి పిల్లల చదువుల కోసం వచ్చి వేలాది కుటుంబాలు స్థిరపడుతున్నాయి. విద్యాసంస్థలు ఎక్కువగా ఉండటంతో అర్బన్‌లో ఎక్కువ మంది చదువుకునేందుకు వీలుగా ఉంది. అర్బన్‌ ప్రాంతాల్లో అక్షరాస్యతలో రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానంలో ఉంది. జిల్లా విషయానికొస్తే అక్షరాస్యత విషయంలో కీసర మండలం 89.60శాతంతో మొదటిస్థానంలో ఉంది. అత్యల్పంగా దోమ మండలంలో 51.30శాతం అక్షరాస్యత నమోదైంది.

No comments:

Post a Comment