మూడేళ్ల వైద్య కోర్సులు ప్రవేశపెట్టాలి
మందులన్నీ ఉచితంగానే ఇవ్వాలి
ప్రొఫెసర్ కె.శ్రీనాథరెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్ - న్యూస్‌టుడే
ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంతోనే..: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయకుండా ఎన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టినా ఆశించినస్థాయి ప్రయోజనాలు రావు. అందరికీ ఆరోగ్యం అనే దానికి వైద్యబీమా ఒక్కటే పరిష్కారం కాదు. వైద్యరంగంలో బీమా కీలకంగా మారితే, వైద్యసేవల ఖర్చులు పెరిగిపోతాయి. ప్రజలకు ఏదైనా జరిగితే వైద్యపరంగా రక్షణ ఉందనే నమ్మకం కల్పించాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా జీవించడానికి అవసరమైన రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం, విద్య, పరిసరాల పరిరక్షణ అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. 0గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రెట్టింపు చేయాలి. వైద్యుల కొరత దృష్ట్యా ప్రాథమిక వైద్యసేవలపై మూడేళ్ల వైద్యకోర్సులు ప్రవేశపెట్టి, వారిని ఉపకేంద్రాల్లో నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
వైద్యసేవల భారం తగ్గించాలి: వైద్యసేవల్లో ఆస్పత్రుల్లో చేరిన తరవాత అవుతున్న ఖర్చుతో పోలిస్తే... వైద్యపరీక్షలు, మందుల కోసం వెచ్చిస్తున్న మొత్తం ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించడానికి తప్పనిసరి జాబితాలో ఉన్న మందులన్నీ రోగులకు ఉచితంగా ఇవ్వాలి. వైద్యరంగం కోసం స్థూల జాతీయోత్పత్తిలో 2.5శాతం నిధులు కేటాయిస్తే, అందులో 0.5 శాతం నిధులను మందుల కోసం ఇస్తే మందులన్నీ ఉచితంగా ఇవ్వడానికి వీలవుతుంది. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే జనరిక్ మందులు కొనుగోలు చేస్తే సరిపోతుంది.
రెఫరల్ విధానం: ప్రతి చిన్న విషయానికి రోగులు నేరుగా జిల్లా, బోధనాస్పత్రులకు రావడం వల్ల ఆస్పత్రుల్లో రద్దీ నెలకొంది. పీహెచ్‌సీల నుంచి ప్రాంతీయ ఆస్పత్రులు, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రులకు రోగులను పంపే రెఫరల్ విధానాన్ని బలోపేతం చేయాలి. జిల్లా ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ విభాగాలను అభివృద్ధి చేసి, నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలి.
ఒకే చట్రం కిందకు బీమా పథకాలు: ప్రస్తుతం వివిధ మంత్రిత్వశాఖల కింద అమలు చేస్తున్న వైద్యబీమా పథకాలన్నింటినీ ఒకే చట్రం కిందకు తీసుకురావాలి. ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే ఫీజులపై నియంత్రణకు, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
ప్రజల భాగస్వామ్యం: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. దీనికి ప్రజాసంఘాలు, మేధావులు బాధ్యత తీసుకోవాలి. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారకుండా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది.
నిపుణుల అభిప్రాయాలు: 2000 నాటికి అందరికీ ఆరోగ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటికీ ప్రజలకు రక్షిత మంచినీరు అందించే పరిస్థితి లేదని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్ చెప్పారు. వైద్యశాస్త్రం అభివృద్ధి ఫలాలు పేదప్రజలకు అందుబాటులో లేకుండా, సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితం అవుతోందని ఎమ్మెల్సీ గేయానంద్ వివరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని నిమ్స్ మాజీ సంచాలకుడు డాక్టర్ రాజారెడ్డి సూచించారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయకుండా, వ్యాధులు వస్తే అందించాల్సిన వైద్యసేవలను వ్యాపారంగా మారుస్తున్న ప్రస్తుత విధానం పట్ల డాక్టర్ రామయోగయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment