అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, June 8, 2012

ప్రమాద ఘంటికలు!

బాల బాలికల నిష్పత్తి ఆందోళనకరం



రాష్ట్రంలో ప్రతి 1000 మంది బాలలకు 943 మంది బాలికలే
2001 జనాభా లెక్కల్లో నమోదైన 961 కంటే తగ్గిన నిష్పత్తి
28 మండలాల్లోనైతే బాలికల నిష్పత్తి 850 కంటే కూడా తక్కువ!
2001లో ఒక్క మండలంలోనూ ఇంత తక్కువ నిష్పత్తి లేదు
బాలికలు ఎక్కువగా ఉన్న మండలాల సంఖ్య 111 నుంచి 62కు తగ్గింది
మండలాలవారీ జనాభా వివరాల్లో వెల్లడైన చేదు నిజాలు
అత్యధిక జనాభా ఉన్న మండలంగా విజయవాడ అర్బన్
ఆఖరి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి
దశాబ్ద కాలంంలో 11.1 శాతం పెరిగిన రాష్ట్ర జనాభా
జనాభా పెరుగుదల ఆదిలాబాద్‌లో అత్యధికం
పట్టణ జనాభా అతి తక్కువగా పెరిగిందీ ఆ జిల్లాలోనే
రాష్ట్రంలో మొత్తంమీద పెరిగిన అక్షరాస్యత

హైదరాబాద్, న్యూస్‌లైన్: జనాభా పెరుగుదలలో అసమానతలు రాష్ట్రానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ముఖ్యంగా బాలురతో పోలిస్తే బాలికల నిష్పత్తి బాగా తగ్గుతోంది. ఆరేళ్ల లోపు వయసులో ప్రతి 1,000 మంది బాలురకు కేవలం 943 మంది బాలికలే ఉన్నట్టు తేలడం కలవరపెడుతోంది. 2001 జనాభా లెక్కల (961)తో పోలిస్తే ఇది బాగా తగ్గింది. కొన్ని మండలాల్లో ఈ నిష్పత్తి 800 కంటే కూడా తగ్గిపోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోనైతే బాలికల నిష్పత్తి అతి తక్కువగా 528గా నమోదైంది! బాల బాలికల నిష్పత్తిలో ఇంతటి వ్యత్యాసం భవిష్యత్తులో సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. జన గణన విభాగం రాష్ట్ర డెరైక్టర్ వై.వి.అనూరాధ గురువారం విడుదల చేసిన మండలాల వారీ జనాభా వివరాలు ఈ చేదు నిజాలను వెల్లడించాయి. ఇక అత్యధిక జనాభా ఉన్న మండలాల జాబితాలో 10.35 లక్షల జనాభాతో విజయవాడ అర్బన్ రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవగా, కేవలం 19,366 మందితో తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ఆఖరు స్థానంలో ఉంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పట్టణ జనాభాతో పోలిస్తే గ్రామీణ జనాభా వృద్ధి రేటు తగ్గింది. మండలాలవారీ జనాభా వివరాల్లో ముఖ్యాంశాలు ఇవీ...

రాష్ట్ర మొత్తం జనాభా 8,46,65,533. ఇందులో గ్రామీణ జనాభా 5,63,11,788 (66.51 శాతం)కాగా, పట్టణ జనాభా 2,83,53,745 (33.49). అయితే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గత దశాబ్దం (2001-2011)లో అంతకు ముందు దశాబ్దం (1991-2001)తో పోలిస్తే పట్టణ జనాభా వృద్ధిరేటు పెరిగి, గ్రామీణ జనాభా వృద్ధిరేటు తగ్గింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో గత దశాబ్దంలో జనాభా వృద్ధిరేటు ముందు దశాబ్దంతో పోలిస్తే తగ్గింది. దశాబ్ద కాలంలో రాష్ట్ర జనాభా 11.1 శాతం పెరిగింది. రాష్ట్ర సరాసరి పెరుగుదల కంటే 8 జిల్లాల్లో ఎక్కువగా, 15 జిల్లాల్లో తక్కువగా వృద్ధి రేటు నమోదయింది.

గ్రామీణ జనాభా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 14.11 శాతం పెరిగింది. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 1.09 శాతం పెరుగుదల నమోదయింది. పట్టణ జనాభా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 70.71 శాతం పెరిగింది. తర్వాత స్థానాల్లో మెదక్ (29.8 శాతం), చిత్తూరు(29.5 శాతం) జిల్లాలు నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లాలో పట్టణ జనాభా పెరుగుదల అతి తక్కువగా 0.66 శాతం నమోదయింది.

జనాభా వృద్ధిరేటులో విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం తొలి స్థానంలో నిలిచింది. ఈ మండలంలో దశాబ్దకాలంలో జనాభా 648.14 శాతం(దాదాపు ఆరున్నర రెట్లు) పెరిగింది. దాదాపు 400 శాతం వృద్ధిరేటుతో వరంగల్ జిల్లా హన్మకొండ రెండోస్థానంలో, 269 శాతంతో విశాఖపట్నం రూరల్ మండలం మూడో స్థానంలో నిలిచాయి. ఉప్పల్(229.21 శాతం), హయత్‌నగర్(180 శాతం) నాలుగు, ఐదో స్థానంలో నిలబడ్డాయి.

ఆఖరు ఐదు స్థానాల్లో ఉన్న మండలాల్లో జనాభా పెరగకపోగా తగ్గిపోయింది. వలసలు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు కావడం తదితర కారణాల వల్ల జనాభా తగ్గుదల నమోదయింది. దశాబ్దకాలంలో వరంగల్ మండలంలో 44 శాతం, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలో 18.91 శాతం, వైఎస్‌ఆర్ జిల్లా అట్లూరులో 17.36 శాతం, శ్రీకాకుళం జిల్లా వంగరలో 14.13 శాతం, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో 13.4 శాతం జనాభా తగ్గింది.

గ్రామీణ జనాభా పెరుగుదలలో 96 శాతంతో తిరుపతి అర్బన్ మండలం తొలి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (69 శాతం), ఘట్‌కేసర్ (49 శాతం), కర్నూలు జిల్లా శ్రీశైలం (47.88 శాతం), ఖమ్మం జిలా మణుగూరు (44.63 శాతం) మండలాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆఖరు ఐదు స్థానాల్లో ఉన్న మండలాల్లోనూ జనాభా తగ్గింది. చిత్తూరు జిల్లా మదనపల్లి (-33.34 శాతం), పుత్తూరు (-24.08 శాతం), నగరి (-19.63 శాతం), వైఎస్సార్ జిల్లా అట్లూరు (-17.36 శాతం), శ్రీకాకుళం జిల్లా వంగర (-14.13 శాతం) మండలాల్లో జనాభా తగ్గిపోయింది. పట్ణణీకరణ జరగడం వల్ల కూడా కొన్ని మండలాల్లో గ్రామీణ జనాభాలో తరుగుదల నమోదయింది.

పట్టణ జనాభా వృద్ధిరేటులో పెదగంట్యాడ (648.14 శాతం), హన్మకొండ (624.81), హయత్‌నగర్ (353), విశాఖ రూరల్ (268.42), ఉప్పల్ (229.21 శాతం) తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇక్కడా ఆఖరి ఐదు స్థానాల్లోని మండలాల్లో జనాభా తగ్గింది. వరంగల్ (-44.02 శాతం), మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ (-32.25 శాతం), కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ (-30.93), రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (-26.58), ఆదిలాబాద్ జిల్లా మందమర్రి (-22.24 శాతం) మండలాల్లో జనాభా తగ్గింది.

ఆరేళ్ల లోపు పిల్లల జనాభా వృద్ధిలో పెదగంట్యాడ, విశాఖ రూరల్, హన్మకొండ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. వరంగల్, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, బెల్లంపల్లి మండలాలు ఆఖరి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ మండలాల్లో పిల్లల జనాభా తగ్గింది.

అక్షరాస్యత పర్లేదు

గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఇటు గ్రామీణ, అటు పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 60-69 శాతం మధ్య అక్షరాస్యత ఉన్న మండలాల సంఖ్య ఈ పదేళ్లలో 202 నుంచి 471కి పెరిగింది. 70-79 శాతం అక్షరాస్యత ఉన్న పట్టణ మండలాల సంఖ్య 108 నుంచి 169కి పెరిగింది. 90 శాతానికి మించి అక్షరాస్యత ఉన్న మండలాలు రాష్ట్రంలో రెండే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కీసర, హైదరాబాద్ జిల్లా హిమాయత్‌నగర్ మండలాల్లో 90 శాతానికిపైగా అక్షరాస్యులు ఉన్నారు.

పాపం పాపాయి...
బాలికల పట్ల వివక్ష, విచ్చలవిడి లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు తదితరాల కారణంగా రాష్ట్రంలో బాలురతో పోలిస్తే వారి జనాభా తగ్గిపోయింది. అమ్మాయిల పట్ల వివక్ష తగదని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అమ్మాయిల గోడు అమ్మానాన్నలకే పట్టడం లేదు. అలాగే స్త్రీ పురుష నిష్పత్తి కూడా పట్టణ ప్రాంత మండలాల్లో తక్కువగా ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి.
ఊ రాష్ట్రంలో బాల బాలికల (0-6 ఏళ్ల వయసు) నిష్పత్తి 943. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో బాలికల నిష్పత్తి అత్యంత తక్కువగా (528) నమోదయింది. అట్టడుగు నుంచి రెండో స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మండలం (704) నిలిచింది.

2001 జనాభా లెక్కల ప్రకారం 111 మండలాల్లో బాలుల కంటే బాలికల జనాభా ఎక్కువగా నమోదైంది. కానీ పదేళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితి దిగజారింది. అమ్మాయిల సంఖ్య 62 మండలాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. బాలికల నిష్పత్తి 850 కంటే తక్కువ నమోదైన గ్రామీణ మండలాలు 2001లో అసలే లేకపోగా, ఈసారి 15 గ్రామీణ మండలాలు ఆ జాబితాలో చేరాయి. పట్టణాల్లోనూ పరిస్థితి దిగజారింది. 2001 గణనలో ఒక్క నాగర్‌కర్నూలు మండలంలో మాత్రమే బాలికల నిష్పత్తి 850 కంటే తక్కువ నమోదవగా, ఇప్పుడు అలాంటి మండలాలు 13కు పెరిగాయి.

ఇక రాష్ట్రంలో ప్రతి 1,000 మంది పురుషులకు 992 మంది స్త్రీలున్నారు. 635 మండలాల్లో ఈ నిష్పత్తి రాష్ట్ర సరాసరికి సమానంగా, లేదా ఎక్కువగా నమోదయింది. 481 మండలాల్లోనేమో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంది. ఇక 76 మండలాల్లో స్త్రీల నిష్పత్తి 950 కంటే తక్కువగా ఉంది. 5 మండలాల్లోనైతే ఇది 900 కంటే కూడా తగ్గిపోయింది! ఆ మండలాలు.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ (894), జిన్నారం (890), గోల్కొండ (890), విజయవాడ రూరల్ (885), శ్రీశైలం (847).

No comments:

Post a Comment