అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, April 25, 2012

ప్రోత్సాహం ఏదీ?


ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందని చేయూత
అరకొరగా ఐఐపీపీ 2010-15 అమలు
ఆటోమొబైల్ యూనిట్లకే పరిమితం
పెద్ద పరిశ్రమలన్నీ స్థానికేతరులవే
అవగాహనపై ఐపీఓల నిర్లక్ష్యం



జిల్లాలో ఎస్సీ, ఎస్టీల్లోని ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ పాలసీ (ఐఐపీపీ) 2010-15 ద్వారా రాయితీలు ప్రకటించినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. సరైన ప్రోత్సాహం లేనికారణంగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులు ఈ రాయితీలను ఉపయోగించుకోవడం లేదు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడం లేదు. ఉత్పత్తి, సేవా రంగాల్లో ప్రాజెక్టు ఎంపిక చేసుకుని ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను జిల్లా పరిశ్రమల కేంద్రం ఎంపిక చేయాల్సి ఉంది. అయితే పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్న ఔత్సాహికుల సంఖ్య ఆశించినంతగా లేదు. ఒకటి, రెండు పరిశ్రమలు స్థాపించినా అవీ స్థానికేతరులకు చెందినవే కావడం గమనార్హం.

సంగారెడ్డి, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఇండస్ట్రియల్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ పాలసీ (ఐఐపీపీ 2010-15) కింద జిల్లాకు ఇప్పటివరకు సుమారు రూ.27 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) అంచనా. ఐఐపీపీ కింద 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం రెండు, మూడు రంగాల్లో మాత్రమే రాయితీలు కోరుతూ ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకున్నారు. రూ.14 కోట్ల విలువ చేసే 150 ఆటోమొబైల్ యూనిట్లను జిల్లా పరిశ్రమల కేంద్రం మంజూరు చేసింది. ఇందులో అద్దె కార్లు, సుమోలు, జీపులతో పాటు ట్రాక్టర్లు, జేసీబీ వంటివి ఉన్నాయి. ముగ్గురు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఉత్పత్తి రంగంలో రూ.12 కోట్లతో 15 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీల సంఖ్య నామమాత్రంగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రాయితీలపై ఆంక్షలు ఉండటంతో, ఆయా ప్రాంతాలకు చెందిన వారే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. మైనింగ్, హోటల్, విద్యుత్ ఉత్పత్తి, ఐటీ, టూరిజం, ఫ్లోరి కల్చర్, నిర్మాణ రంగాల్లో భారీగా పెట్టుబడులకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీల్లో అవగాహన లోపంతో వాహనాల కొనుగోలుకు మాత్రమే పరిమితమవుతున్నారు.

ఔత్సాహికులకు నిరాశే...
ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐఐపీపీ 2010-15లో భాగంగా జీఓఎంఎస్ 61(2010), జీఓఎంఎస్ 42 (2011)ను ప్రభుత్వం జారీ చేసింది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఎస్సీ, ఎస్టీలకు వర్తించే రాయితీలపై ఈ ఉత్తర్వుల్లో మార్గదర్శకాలను నిర్దేశించారు. రాయితీలపై ఆశతో దరఖాస్తు చేసుకుంటున్నా సవాలక్ష ఆంక్షలతో యూనిట్లు మంజూరు చేయడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి దరఖాస్తులకు మోక్షం కలగకపోవడంతో డీఐసీ చుట్టూ తిరగాల్సి వస్తోందని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆరోపణ. దరఖాస్తు చేసుకున్న వారికి సింగిల్ విండో పద్ధతిలో త్వరితగతిన అనుమతులు లభించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. పథకం తీరు తెన్నులపై అవగాహన కల్పించాల్సిన పరిశ్రమల ప్రోత్సాహక అధికారులు (ఐపీఓలు) కార్యాలయాల్లో పోస్టర్లు, బ్యానర్లతో సరిపెడుతున్నారు. ఐపీఓలు క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు.

అవగాహన కల్పిస్తాం: డీఐసీ జీఎం
ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న సమస్యలను డీఐసీ జీఎం దేవానంద్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నా ఎక్కువగా ఆటోమొబైల్ యూనిట్ల కోసమే దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నం చేయాలన్నారు. ఈ మేరకు వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment