అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, November 28, 2012

పుట్టగొడుగుల్లా అపార్ట్‌మెంట్ల నిర్మాణం




నిబంధనలకు పాతర
చోద్యం చూస్తున్న అధికారులు
మణికొండ, న్యూస్‌టుడే: శివారు గ్రామాల్లో కనీస నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 10 అడుగులు వెడల్పున్న రోడ్లలోనూ ఐదారు అంతస్థులతో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. పార్కులు, ప్రభుత్వ స్థలాలే కాదు రోడ్లను సైతం ప్లాట్లుగా మార్చి ఇబ్బడి ముబ్బడిగా అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. రాజేంద్రనగర్‌ మండల పరిధిలోని మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, నెక్నాంపూర్‌, బండ్లగూడ, హైదర్షాకోట్‌ తదితర గ్రామ పంచాయతీల్లో నిబంధనలకు పాతరేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో జీ+2కి మాత్రమే అనుమతి ఇవ్వాలి. అదీ గృహ అవసరాలకే. అయితే, శివారు గ్రామ పంచాయతీల్లో జీ+3 వరకు నిర్మాణ అనుమతి ఇవ్వవచ్చని 2007లో అప్పటి డీపీవో జీవోపై ఇచ్చిన వెసులుబాటు ఉత్తర్వులు అక్రమ కట్టడాలకు ఊతమిచ్చింది. కాగా, జంటనరాల పరిధిలో జీవో 86 అమలులో ఉండడంతో బిల్డర్లు గ్రామ పంచాయతీలపై కన్నేశారు. ఆయా గ్రామాల్లో బిల్డర్లు జీ+3కి అనుమతి తీసుకుని జీ+5, జీ+6, జీ+7 ఎత్తుతో అపార్ట్‌మెంట్లు నిర్మించారు... నిర్మిస్తున్నారు. ఇలా మణికొండలో 500, పుప్పాలగూడలో 800, నెక్నాంపూర్‌లో వందకు పైగా అపార్ట్‌మెంట్లు నిబంధనలను అతిక్రమించి నిర్మించారు. అలాగే మిగిలిన గ్రామాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా ఆకాశాన్నంటేలా అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరిగాయి. అయితే నిర్మాణాలను పర్యవేక్షించాల్సిన హెచ్‌ఎండీఏ, జిల్లా పంచాయతీ అధికారులు మామూళ్ల మత్తులో మిన్నకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో రెచ్చిపోయిన నెక్నాంపూర్‌ గ్రామ కార్యదర్శి ఖుమ్రుద్దీన్‌ ఏకంగా 3000 గజాల స్థలంలో అపార్ట్‌మెంటు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. దీనిపై మాజీ సర్పంచి ఫిర్యాదుతో విచారణ చేయించిన జిల్లా కలెక్టర్‌ ఖుమ్రుద్దీన్‌ను గత జనవరిలో సస్పెండ్‌ చేశారు. అక్రమాలకు ఊతం బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంలు
2008లో ప్రభుత్వం బిల్డింగ్‌ ఫీనలైజేషన్‌ స్కీమ్‌(బీపీఎస్‌), లేఅవుట్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) జీవోలను విడుదల చేసింది. 2007 డిసెంబరు 15 వరకు నిర్మించిన అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడానికి బీపీఎస్‌ను నిర్దేశించారు. అక్రమ లేఅవుట్లలో 2007 డిసెంబరు 31 వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ చేయాలి. కాగా, ఈ జీవోలే అక్రమార్కులకు ఊతమిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు తర్వాత నిర్మించిన అపార్ట్‌మెంట్లను సైతం క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేశారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు సైతం ఆ జీవోల ప్రకారమే(నిర్మాణం చేయకుండానే) గతంలో దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రభుత్వం అప్పట్లో ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి పరిశీలన చేయకుండానే దరఖాస్తులను స్వీకరించడంతో అవినీతికి బీజం పడింది. ఇక అధికారుల తీరు పిల్లి గుడ్డిదైతే ఎలిక ఎక్కిరించిందన్న చందంగా తయారైందనే విమర్శలు విన్పిస్తున్నాయి. దీనిపై మండల ఈవోపీఆర్డీని ీన్యూస్‌టుడే' వివరణ కోరగా ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిధిలో జీ+2కి మించి నిర్మాణం చేపట్టే అవకాశం లేదన్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మార్గదర్శకాలు ఇచ్చామన్నారు.
అనుమతులు రాక ప్లాట్ల యజమానుల ఇక్కట్లు
ఇక్కడి అపార్ట్‌మెంట్లలో తెలిసో తెలియకో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. అప్పట్లో ప్రైవేటు రంగ బ్యాంకులు నిబంధనలను పట్టించుకోకుండా కొనుగోలుదారుడే ధ్యేయంగా రుణం మంజారు చేయడంతో వేల మంది ఇక్కడ అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్‌, బండ్లగూడ, హైదర్షాకోట్‌ తదితర గ్రామాల పరిధిలోని సుమారు 2వేల వ్యక్తిగత ప్లాట్లకు సంబంధించిన ఫైళ్లు ప్రస్తుతం హెచ్‌ఎండీఏ కార్యాలయంలో మూలుగుతున్నాయి. వాటిలో అధిక శాతం బీపీఎస్‌కు నామ మాత్రపు సొమ్మును చెల్లించినవే ఉన్నాయి.
పార్కు స్థలాలలో ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌..?
రాజేంద్రనగర్‌ మండల పరిధిలో వందలాది అక్రమ లేఅవుట్లలోని పార్కు, ఇతర సామాజిక అవసరాలకు వదిలిన ఖాళీ స్థలాలు కనుమరుగయ్యాయి. జంట నగరాల పరిధిలో 1974 తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచులు లే అవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం లేదు. కానీ, వడ్డించే వాడు మనవాడైతే ఇక చెప్పేదేముంది.. అవినీతి అధికారుల పుణ్యమాని వందల ఎకరాల్లో సైతం లే అవుట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తదనంతరం ఆయా లేఅవుట్లలోని పార్కు, ఇతర అవసరాలకు వదిలిన స్థలాలను సైతం రివైజ్డ్‌ లేఅవుట్ల పేరుతో ప్లాట్లుగా మలిచి ఆ ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌లో సక్రమం చేసుకుంటున్నారు. 2007 డిసెంబరు 31 వరకు రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లను మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌లో రెగ్యులర్‌ చేయాలి. ఇవేమీ పట్టించుకోని అధికారులు గుడ్డిగా, దర్జాగా పార్కు స్థలాల్లోను అనుమతులు ఇచ్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్‌ బండ్లగూడ, నార్సింగి, కోకాపేట తదితర గ్రామాల్లోని లేఅవుట్లలో కనీనం కాలు మోపడానికి జాగా లేకుండా పోయాయి.
గడువు ముగిసినా పాత తేదీలతో మంజూరు
రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం గతేడాది ఆగస్టు 22తో ముగిసింది. అయితే రాజేంద్రనగర్‌ మండల పరిధిలో పలువురు సర్పంచులు ఇప్పటికి పాత తేదీలతో అపార్ట్‌మెంటు నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలను మూటకట్టుకున్న సర్పంచులు కొందరు ఇటీవల దాదాపు 200 అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. అదీ 2007లో ఇక్కడ పనిచేసి.. బదిలై ఇటీవల పదవీ విరమణ పొందిన కార్యదర్శుల సంతకంతో అనుమతి ఇచ్చినట్లు ఇటీవల మణికొండ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో వెలుగు చూసింది. కొందరు నకిలీ రసీదులతో పని కానిస్తున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి.

No comments:

Post a Comment