బ్యాంకుల్లో తలసరి డిపాజిట్ల కంటే రుణాలు అధికం
తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నం
తలసరి ఆదాయంలో ముందు వరుసలో..
శిశుమరణాల్లో దక్షిణాదిలో మనమే ఫస్ట్
వివిధ అంశాల్లో 15 ప్రధాన రాష్ట్రాలతో పోలిక
ఇటీవల విడుదల చేసిన అర్థగణాంక విభాగం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తలసరి ఆదాయంలో దేశంలోని 15 ప్రధాన రాష్ట్రాలతో
ముందు వరసలో నిలిచిన రాష్ట్రం... శిశుమరణాల్లో బీహార్‌లాంటి వెనకబడిన
రాష్ట్రాలతో పోటీపడింది. రసాయన ఎరువుల వినియోగంలో ముందున్న మనం...
ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగతా రాష్ట్రాల కంటే వెనుకబడ్డాం. తలసరి బ్యాంకు
డిపాజిట్ల కంటే తలసరి బ్యాంకు రుణాలే మన రాష్ట్రంలో ఎక్కువ. ఒక్క తమిళనాడు
మినహా మిగతా రాష్ట్రాల్లో బ్యాంకు రుణాల కంటే బ్యాంకుల్లో ఉన్న తలసరి
డిపాజిట్లే ఎక్కువ.
‘రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం-2012’ను అర్థగణాంక శాఖ ఇటీవల విడుదల చేసింది. వివిధ సూచీలను 15 రాష్ట్రాలతో పోల్చింది. ముఖ్యాంశాలు ఇవీ..

తలసరి ఆదాయంలో హర్యానాది తొలిస్థానం. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 15 రాష్ట్రాల సగటు తలసరి ఆదాయం
కంటే తొమ్మిది రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువ.
తలసరి బ్యాంకు
డిపాజిట్ల కంటే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మన రాష్ట్రంతో పాటు
తమిళనాడులో ఎక్కువ. రూ. 1.31 లక్షలతో తలసరి బ్యాంకు డిపాజిట్లు, 1.06 లక్షల
రుణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 15 రాష్ట్రాల సగటు బ్యాంకు
డిపాజిట్ల కంటే మన రాష్ట్రంలో తలసరి డిపాజిట్ మొత్తం తక్కువ. కానీ రుణాల
విషయంలోనూ 15 రాష్ట్రాల సగటు కంటే ఎక్కువే.
శిశుమరణాల్లో 6.2 శాతంతో
మధ్యప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం,
రాజస్థాన్, బీహార్, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. దక్షిణాది
రాష్ట్రాలతో పోలిస్తే.. మన రాష్ట్రంలోనే శిశుమరణాలు అధికం. అతి తక్కువ
శిశుమరణాలు కేరళలో (1.3 శాతం) నమోదయ్యాయి.

రసాయన
ఎరువుల వినియోగంలో పంజాబ్ నంబర్ వన్. హెక్టారుకు ఒక్కో పంటకు 237.05 కిలోల
ఎరువులను పంజాబ్ రైతులు వినియోగిస్తుండగా... 225.65 కిలోల వినియోగంతో మన
రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. 209.92 కేజీలతో హర్యానా మూడోస్థానంలో ఉంది.
15 రాష్ట్రాల సగటు రసాయన ఎరువుల వినియోగం 135.76 కిలోలే.
రసాయన
ఎరువుల వినియోగంతో పాటు.. హెక్టారుకు సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో
పంజాబ్‌దే తొలి స్థానం. మన రాష్ట్రంతో పోలిస్తే.. దాదాపు రెట్టింపు
దిగుబడిని పంజాబ్ రైతులు సాధిస్తున్నారు. హర్యానా, పశ్చిమబెంగాల్, కేరళ,
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 15 రాష్ట్రాల సరాసరి
కంటే తక్కువ ఎరువులు వినియోగిస్తున్న కేరళ దిగుబడిలో నాలుగోస్థానంలో
నిలిచింది. ఎరువుల వినియోగంతోపాటు దిగుబడిలోనూ రాజస్థాన్ ఆఖరుస్థానంలో
నిలిచింది. రసాయన ఎరువులపై మన రైతులు భారీగా ఖర్చు పెడుతున్నా దిగుబడిలో
మాత్రం మిగతా రాష్ట్రాలకంటే వెనుకబడి ఉన్నారు.
సగటు విద్యుత్
వినియోగంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్, హర్యానా, తమిళనాడు,
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
No comments:
Post a Comment