అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, April 25, 2012

విహరిద్దాం రండి..!



జిల్లాలోనే దర్శనీయ స్థలాలెన్నో
సెలవుల్లో మధురానుభూతులకు వీలు
(న్యూస్‌టుడే- మెదక్‌)
బడులు ముగిశాయి.. సెలవులు వచ్చాయి.. పిల్లలను తోడ్కొని సెలవుల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆధ్యాత్మిక ఆనందాన్ని, పర్యాటక కేంద్రాల్లో విహరించి మధురానుభూతులను మూటగట్టుకోవాలని చాలా మంది ఆశిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల సందర్శనకు వెళ్లాలంటే నాలుగైదు రోజులు పడుతుంది. రానుపోను ఛార్జీలు, భోజనం, తదితర ఖర్చు కూడా వేలల్లోనే అవుతుంది. ఉద్యోగులు, ఉన్నవారు అయితే ఫర్వాలేదు. మధ్యతరగతి వర్గాల వారికి ఆయా ప్రాంతాలకు వెళ్లిరావడం ఆర్థిక భారమే. అయితే వారు దిగులు పడాల్సిన పనేలేదు. ఎందుకంటే మన జిల్లాలోనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయాలు, కళాత్మక నైపుణ్యంతో నిర్మితమై మందిరాలు చారిత్రక వైభవాన్ని తెలిపే కోటలు... పర్యాటక కేంద్రాలుగా వెలుగొందుతున్న ప్రాజెక్టులు, వన్యప్రాణులతో అలరారే అభయారణ్యాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఒకటి, రెండు రోజుల్లో ఆయా ప్రాంతాలను సందర్శించే వీలుంది. జిల్లాలో దర్శనీయ ప్రాంతాలపై కథనం మీకోసం...
మదిదోచే మందిరం.. మెదక్‌ చర్చి..
ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి మెదక్‌ పట్టణంలో ఉంది. యూరప్‌ గోతిక్‌ శైలిలో అతిసుందరంగా నిర్మితమైన ఈ చర్చి ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో రూపుదిద్దుకొన్న చర్చి సందర్శనకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాక వివిధ రాష్ట్రాలు, విదేశీ పర్యాటకులు సైతం వస్తారు. ఈ చర్చిలో అడుగడుగునా కళాత్మక నైపుణ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మెదక్‌ చర్చి అందాలను చూసి తీరాల్సిందే.
* వసతి: దూర ప్రాంతాల నుంచి మెదక్‌ చర్చి సందర్శనకు వచ్చే పర్యాటకులు బసచేసేందుకు చర్చి ప్రాంగణంలో వసతి సదుపాయాలు ఉన్నాయి.
* ఎంత దూరం: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి మెదక్‌కు 100 కిలోమీటర్ల దూరం. జిల్లాకేంద్రం సంగారెడ్డి నుంచి 70 కిలోమీటర్లు.
ఏడుపాయలు.. ఎన్నెన్నో అందాలు..
ఏడుపాయల... తెలంగాణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక కేంద్రం. మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తూ మళ్లీ ఒకచోట కలిసి ప్రవహించే అరుదైన ప్రదేశం ఇది. మహాభారత కాలంలో జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన స్థలంలోనే ఏడుపాయల వనదుర్గామాత ఆలయం కొలువై ఉంది.
* వసతి: భక్తులు, పర్యాటకులు బస చేసేందుకు, అథితి గృహాలు, షెడ్లు ఉన్నాయి.
* ఎంత దూరం: హైదరాబాద్‌ నుంచి 120 కిలో మీటర్లు, సంగారెడ్డి నుంచి 70, మెదక్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరం. మెదక్‌ నుంచి ఉదయం సాయంత్రం బస్సులు ఉంటాయి. బొడ్మట్‌పల్లి చౌరస్తా, ఏడుపాయల కమాన్‌ నుంచి ఆటోలు ఉంటాయి.
చరిత్ర చెప్పే ఖిల్లా..
శతాబ్దాల నాటి రాజరిక వ్యవస్థ తీరుతెన్నులను తెలియజేసే ప్రాంతం మెదక్‌ ఖిల్లా. కాకతీయ రాజులు, కులీకుతుబ్‌ షాహీలు, మొగల్‌, నిజాం నవాబుల రాజరిక చరిత్ర తెలుసుకోవాలనుకునే వారు మెదక్‌ పట్టణంలోని చారిత్రక ఖిల్లాను సందర్శించాల్సిందే. ఇపుడిపుడే పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకొంటున్న ఈ చారిత్రక కోట పర్యాటకులకు వందల ఏళ్లక్రితం నాటి చరిత్రను పరిచయం చేస్తుంది.
* ఎంతదూరం: హైదరాబాద్‌ నుంచి 100 కిలోమీటర్లు, సంగారెడ్డి నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
వన్యప్రాణులకు నెలవైన అభయారణ్యం..
మెదక్‌-నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దులోని పోచారం వన్యప్రాణి అభయారణ్యం వివిధ రకాల వన్యప్రాణులతో అలరారుతూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ అభయారణ్యంలో చుక్కల జింకలు, సాంబార్‌, నెమళ్లు, కుందేళ్లు తదితర వన్యప్రాణులకు నెలవు. ఇక్కడ పచ్చదనం పరచుకుని ఉండే పార్క్‌... వన్యప్రాణులపై అవగాహన కల్పించే కేంద్రం ఉన్నాయి. అభయారణ్యాన్ని ఆనుకునే పోచారం ప్రాజెక్ట్‌ ఉంది.
* ఎంతదూరం: పోచారం అభయారణ్యం మెదక్‌ పట్టణం నుంచి 16 కిలోమీటర్లు, హైదరాబాద్‌ నుంచి 116 కిలోమీటర్ల, సంగారెడ్డి నుంచి 86 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం... కేతకి ఆలయం
కేతకి సంగమేశ్వరాలయం... జిల్లాలో పురాతన శైవక్షేత్రమిది. ఆలయాన్ని ఆనుకుని పెద్ద గుండం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ గుండంలో పుణ్యస్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు సోమ, శుక్రవారాలు, ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, శ్రావణమాసాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి.
* ఎంత దూరం: హైదరాబాద్‌ నుంచి 120 కిలోమీటర్ల దూరం. జహీరాబాద్‌ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝరాసంఘం మండల కేంద్రంలో కేతకి సంగమేశ్వరాలయం ఉంది.
* వసతి: ఆలయ ప్రాంగణంలో భక్తులకు వసతి సదుపాయాలు ఉన్నాయి.
సుందరం.. జైనమందిరం..
23వ జైన తీర్థంకరుడు పార్వ్శనాథుడి ఏకశిలా విగ్రహం కొలువై ఉన్న సుందరమైన జైన మందిరం మండల కేంద్రమైన కొల్చారంలో ఉంది. హైదరాబాద్‌ నుంచే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జైనులు ఎక్కువగా ఈ ఆలయ సందర్శనకు వస్తారు. ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. జైన దిగంబర స్వాములు వచ్చినపుడు కొల్చారం జైన మందిరంలో పత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
* ఎంతదూరం: ఈ ఆలయం హైదరాబాద్‌ నుంచి 85 కిలోమీటర్లు, సంగారెడ్డి నుంచి 55, మెదక్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరం.
*వసతి: దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకుల కోసం ఆలయ ప్రాంగణంలోనే వసతి సదుపాయాలు ఉన్నాయి.
చదువుల తల్లి కొలువైన క్షేత్రం..
మండల కేంద్రమైన వర్గల్‌లో ఉన్న విద్యాధరి ఆలయం ప్రముఖ దర్శనీయ క్షేత్రంగా వెలుగొందుతోంది. చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్న ఈ ఆలయం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ప్రతి శని త్రయోదశికి ప్రత్యేక తైలాభిషేకాలు, శని పూజలు ఉంటాయి. జిల్లా వాసులే కాక పొరుగు జిల్లాల నుంచి ముఖ్యంగా జంటనగరాల నుంచి భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తారు.
* ఎంతదూరం: సికింద్రాబాద్‌ నుంచి 40 కిలోమీటర్లు, గజ్వేల్‌ నుంచి 10 కిలోమీటర్లు, రాజీవ్‌ రహదారి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
* వసతి: యాత్రికులు బసచేసేందుకు ఆలయ ప్రాంగణంలో సత్రాలు ఉన్నాయి.
నాచగిరి నృసింహాలయం..
లక్ష్మీనృసింహస్వామి కొలువై ఉన్న నాచారంలోని ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ నిత్యం కుంకుమార్చన, అభిషేకం, వాహన పూజలు, శాశ్వత కళ్యాణం, సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు, స్వామివారి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
* ఎంతదూరం: లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం తూప్రాన్‌-గజ్వేల్‌ మార్గంలో ఉంది. ఈ దేవాలయం గజ్వేల్‌ నుంచి 18 కిలోమీటర్లు. 44వ జాతీయ రహదారిపై ఉన్న తూప్రాన్‌ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
* వసతి: ఆలయ ప్రాంగణంలో వసతి సదుపాయాలు ఉన్నాయి.
కోటిలింగాల కోట... సిద్దిపేట
సిద్దిపేట పట్టణ శివారులో మెదక్‌ మార్గంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఆలయ గర్భంలో కోటి లింగాలను ప్రతిష్ఠించారు. ఏటా మహాశివరాత్రికి, ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. రుద్రాభిషేక పూజలు ఇక్కడ ప్రత్యేకం.
* ఎంతదూరం: హైదరాబాద్‌ నుంచి 106 కిలోమీటర్ల దూరం. సంగారెడ్డి నుంచి 140 కిలోమీటర్లు, మెదక్‌ నుంచి 70 కిలోమీటర్ల దూరం.
అనంతసాగర్‌ సరస్వతి క్షేత్రం..
చిన్నకోడూర్‌ మండలం అనంతసాగర్‌ గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ చదువుల తల్లి సరస్వతి మాత కొలువై ఉంది. నిత్యం అభిషేకం, అర్చన, కుంకుమార్చన, అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉంటాయి. ఏటా వసంత పంచమి సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులకు ఆలయ ప్రాంగణంలో వసతి సదుపాయాలున్నాయి.
* ఎంతదూరం: హైదరాబాద్‌ నుంచి 120 కిలోమీటర్లు, సిద్దిపేట పట్టణం నుంచి 20 కిలోమీటర్లు, రాజీవ్‌ రహదారిపై ఉన్న శనిగరం స్టేజీ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
బొంతపల్లి.. వీరభద్రుడి ఆలయం..
జిన్నారం మండలం బొంతపల్లిలో ఉన్న ఆలయంలో వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. ఈ మందిరంలో అద్దాల మండపం ఉండటం ప్రత్యేకం. ఇక్కడ నిత్యం అభిషేకం, అర్చనలు జరుగుతాయి. ఏటా శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజలు, ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
* ఎంతదూరం: హైదరాబాద్‌-మెదక్‌ ప్రధాన మార్గంలో బొంతపల్లి కమాన్‌ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆ ఆలయం ఉంది. హైదరాబాద్‌ నుంచి 40, బాలానగర్‌ నుంచి 25, నర్సాపూర్‌ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శక్తి స్వరూపిణి చాముండేశ్వరి..
మెదక్‌-సంగారెడ్డి మార్గంలో కౌడిపల్లి మండలం చిట్కుల్‌ గ్రామం వద్ద మంజీరా నది ఒడ్డున ఈ ఆలయం వెలసింది. ఇక్కడ శక్తి స్వరూపిణి అయిన చాముండేశ్వరీమాత కొలువై ఉంది. ఇటీవలే సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో నిత్యం కుంకుమార్చన, అభిషేకం, వాహన పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం వద్ద ఏడాది పొడుగునా నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుండటం విశేషం.
* ఎంతదూరం: చాముండేశ్వరి దేవాలయం మెదక్‌-జోగిపేట-సంగారెడ్డి మార్గంలో చిట్కుల్‌ గ్రామం సమీపంలో ఉంది. సంగారెడ్డి నుంచి 40 కిలోమీటర్లు, మెదక్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరం.
* వసతి: ఆలయ ప్రాంగణంలో భక్తులకు వసతి సదుపాయాలున్నాయి.
సింగూరు ప్రాజెక్ట్‌..
సింగూరు ప్రాజెక్ట్‌ వద్ద జల విద్యుదుత్పత్తి కేంద్రం, పార్క్‌ ఉంది. ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. సంగారెడ్డి మండలం కల్పగూర్‌ వద్ద మంజీరా అభయారణ్యం ఉంది. ఇక్కడ మొసళ్లు ఉంటాయి. వివిధ దేశాల నుంచి పలు రకాల పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.
* ఎంతదూరం: సంగారెడ్డి నుంచి సింగూర్‌ ప్రాజెక్ట్‌ 38 కిలోమీటర్లు, సంగారెడ్డి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మంజీరా అభయారణ్యం ఉంది.
* వసతి: సింగూర్‌ ప్రాజెక్ట్‌ వద్ద నీటిపారుదలశాఖ అతిథి గృహం ఉంది.

No comments:

Post a Comment