ఎరుపెక్కిన కన్నులతో... కరుకెక్కిన గుండెలతో... ఒక్కొక్కరూ తూటాలై... నిజాం కోటగోడల్లో దిగబడ్డారు... బిడ్డల్ని వదలి పోరుగడ్డపై ఆయుధాలు చేతబూని సాగారు... విముక్తి పథాన ఆడామగా తేడా లేకుండా ఉరికారు... ఇది జనం మోగించిన యుద్ధభేరి! నగరంపై పటాలాలన్నీ తుపాకులు ఎక్కుపెట్టి సాగాయి... అడుగడుగునా జన నీరాజనాలు అందుకున్నాయి... నిజాం నియంతృత్వ నైజం మెడలు వంచాయి... నగరాన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయి... ఇవి జన, సైనిక దళాల విజయ ఫలాలు. ప్రజలు, సైనికులు... అందరిదీ వి'ముక్తకంఠం'. వెరసి నరనరానా దేశభక్తి ఉవ్వెత్తున లేచింది... భాగ్యనగరం దేశంలో విలీనమై భరతమాతకు వన్నెలద్దే ఆభరణమై మెరిసి మురిసింది...
నిజాం నియంతృత్వ పోకడలు, రజాకార్ల ఆగడాలకు అల్లాడిన జనం తిరగబడ్డారు. వారి పోరాటాలు.. త్యాగాలు ఫలించాయి. నవాబుల కింద నలిగిన ఆనాటి హైదరాబాద్ ప్రజలకు సరిగ్గా 64 ఏళ్ల క్రితం ఇదే రోజు విముక్తి లభించింది.
ఆ రోజు 1947 ఆగస్టు 15. దేశమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటున్నారు. హైదరాబాద్ మాత్రం నిజాం సంస్థానంలోనే కొనసాగుతోంది. భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాంకు బ్రిటిషు ప్రభుత్వం మూడు అవకాశాలు ఇచ్చింది. పాకిస్థాన్‌తో చేరడం, ఇండియన్ యూనియన్‌లో విలీనమవడం, స్వతంత్రంగా ఉండటం. నిజాం మూడో అవకాశాన్ని ఎంచుకున్నాడు. నగరంలో ఎవరూ త్రివర్ణ పతకాన్ని ఎగుర వేయకూడదని ఆంక్షలు విధించాడు. అయినా కొంతమంది యువకులు జాతీయ జెండాల్ని నగర వీధుల్లో ఎగుర వేయగలిగారు. పోలీసులు లాఠీఛార్జి చేశారు. అయినా పలు చోట్ల జెండాలు రెపరెపలాడాయి. 1911 నుంచి 1948 వరకు నిజాం ఏలుబడిలో, రజాకార్ల అజమాయిషీలో ఎంతో వేదనకు గురయ్యారు. ధన, మాన, ప్రాణాలను కోల్పోయినవారు, వీరి ఆకృత్యాలను భరించలేక హైదరాబాద్ స్టేట్‌ను ఇండియన్ యూనియన్‌లో కలపాలంటూ తిరుగుబావుటా ఎగురవేశారు.
అడుగడుగునా ఆంక్షలు..
దేశం మొత్తం స్వాతంత్య్ర వేడుకులు జరుపుకొంటున్నా ఇక్కడివారు జెండా పట్టడానికి వీల్లేదు. జాతీయ నినాదాలే కాదు, నేతల పేర్లు పలకడమూ నిషేధం. చివరి నిజాం హైదరాబాద్ ప్రజల పట్ల మరి నిరంకుశంగా వ్యవహరించాడు. పాఠశాలలో నిజాం రాజు స్తోత్రం, నిజాం ప్రభుత్వ పతాకావిష్కరణ, వందన సమర్పణ చేయడం ఆనవాయితీ. నుదుట బొట్టు పెట్టుకోరాదు. మందిరంలో గంట మోగించకూడదు. తెలుగు చదివినా నిజాం ఆగ్రహానికి గురి కావాల్సిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం ఊపందుకుంది. ఆ రోజుల్లో స్టూడెంట్ యూనియన్‌కు నాయకులుగా ఉన్న చెన్నమనేని రాజేశ్వరరావు నేతృత్వంలో మారువేషంలో వెళ్లి జాతీయ జెండాలు ఎగురవేయడం, సాయుధ పోరాటంలో పాల్గొనడం చేసేవారు. నిజాంపై పోరాడేందుకు ఆయుధ శిక్షణలోనూ వీరు కీలక పాత్ర పోషించారు. రావి నారాయణ రెడ్డితో పాటూ మరెంతో మంది కమ్యూనిస్టులు నేతృత్వంలో తిరుగుబాటును తీవ్రతరం చేశారు. ప్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో స్టేట్ కాంగ్రెస్ అధ్వర్యంలో నిజాంకు వ్యతిరేకంగా హర్తాళ్‌లు, రాస్తారోకోలు, ఆందోళనలు జరుగుతున్నాయి. యువకులు అనేక ప్రాంతాల్లో రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. నిజాంపై పోరాటానికి ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో పోరాటం చేశారు. హైదరాబాద్ విలీనం అనేది ఎక్కువమంది ప్రజల ఆకాంక్షగా మారింది.
ఆపరేషన్ పోలోలో...
సెప్టెంబరు 13న ఆపరేషన్ పోలో మొదలైంది. భారత సైన్యం షోలాపూర్, పుణె, నాగ్‌పూర్ ప్రధాన మార్గంలోని నల్‌దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని పటాన్‌చెరు మీదుగా హైదరాబాద్ వైపు సాగింది. విజయవాడ నుంచి మరో రైఫిల్స్ దళం... గుంతకల్ మీదుగా హైదరాబాద్ వైపు సాగింది. సూర్యాపేట వద్ద భీకర పోరాటం జరిగింది. ఫిరంగి మోతలతో ఆ ప్రాంతం మోగిపోయింది. ఆకాశంలో విమానాలు చక్కర్లు కొడుతూ భారత సైన్యం రజాకార్లతో నాలుగు గంటలపాటూ యుద్ధం నడిచింది. రజాకార్ల శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయాయి. ఇక్కడి నుంచి సైన్యం హైదరాబాద్ వెళ్లకుండా మూసీ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. రెండు గంటల్లోనే మార్గాన్ని పునరుద్ధరించుకున్న సైన్యం హైదరాబాద్‌కు చేరుకుంది. మొయినాబాద్, కర్నూలు వైపు నుంచి నగరంలోకి సైన్యం ప్రవేశించింది. వీరికి అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. దాదాపు అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. ఫిరంగులతో సిద్ధమైన సైనిక చర్యకు రజాకార్లు నిలదొక్కుకోలేక పోయారు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో సైన్యాన్ని ఎదిరించలేక పారిపోయారు. ఇదంతా జరుగుతుండగానే సెప్టెంబరు 16న నగరంలో నిజాం బ్లాక్‌అవుట్ ప్రకటించారు. ఇళ్లలోంచి ఎవరూ బయటికి రాకుండా రజాకార్లు పహారా కాస్తున్నారు. నిశబ్దం రాజ్యమేలుతోంది. సైరన్ మోగితే చాలు... అందరూ ఇళ్లపైకి ఎక్కి విమానాలు వస్తాయని, తమను రక్షిస్తాయని చూడసాగారు. ఓటమి అంచుల్లో ఉన్న రజాకార్లు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రజలు ఆ రాత్రంతా బిక్కుబిక్కుగా గడిపారు. తెల్లారితే తమ జీవితాల్లో వెలుగులు పూస్తాయనే ఆశతో... ఎప్పుడు భానుడు వస్తాడా అని ఎదురుచూడటం మొదలెట్టారు. సెప్టెంబరు 17 ఉదయం హైదరాబాద్‌లో యాక్షన్ మొదలైంది. మేజర్ జనరల్ జెఎన్ చౌదరి దీనికి నాయకత్వం వహించారు. పైన విమానాలు కింద యుద్ధ ట్యాంకులు, పోలీసులు చుట్టుముట్టారు. పాతబస్తీలోకి పోలీసుల ట్రక్కులు, ట్యాంకర్లు, వాహనాలు, మిలటరీ బలగాల కవాతు మొదలైంది. 'ఆపరేషన్ పోలో' పేరుతో నిర్వహించిన పోలీసు చర్యకు నిజాం దిగివచ్చి లొంగిపోయాడు. సైన్యాన్ని ఎదుర్కోవడం తమ వల్ల కాదని కేంద్రం హోంమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ముందు మోకరిల్లాడు. నిజాం ప్రధానమంత్రి లాయిక్ అలీ రాజీనామా చేశాడు. రజాకార్ నేత ఖాసీం రజ్వీ ఏకంగా పాకిస్థాన్‌కు పలాయనం చిత్తగించాడు. హైదరాబాద్ ప్రజలు సాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి త్రివర్ణ పతాకాల్ని ఎగురవేశారు. ఇళ్లపైనా జెండాలు ఎగురవేశారు. సంబరాలు జరుపుకొన్నారు. మిఠాయిలు పంచారు.
7 గంటలకు ప్రకటన
'నా ప్రియమైన ప్రజలారా! గవర్నర్ జనరల్ హిజ్ ఎక్సలెన్సీ రాజగోపాలాచారి పేర ఈ సందేశాన్ని తెలుపుటకు సంతోషిస్తున్నా. నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. ఈ చర్య ఇంతకుముందే తీసుకోనందుకు విచారిస్తున్నా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నా సైన్యాన్ని యుద్ధ విరమణ చేయాల్సిందిగా ఆదేశించానని గవర్నర్ జనరల్‌కు తెలియజేస్తున్నా. ఐక్యరాజ్య సమితిలో కేసును ఉపసంహరించు కుంటున్నా' అని హైదరాబాద్ ఆఖరి నిజాం మీర్ అలీ ఉస్మాన్‌ఖాన్ 1948 సెప్టెంబరు 17న రాత్రి 7 గంటలకు తన రాచరికాన్ని వదులుకుంటూ దక్కన్ రేడియోలో ప్రకటన చేశారు. నిజాం రాజు తమ అధికార ప్రకటనలన్నీ ఇక్కడి నుంచే వెల్లడించేవారు. 1925లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం ఆకాశవాణిగా ప్రసారాలు అందిస్తోంది.
* నాటి నుంచి డిసెంబరు 1, 1949 వరకు హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ పరంగా మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి పరిపాలించారు.
ఎంతో మంది నేలరాలారు...
రజాకార్లు 1,373 మంది హతమయ్యారు. 1,911 మంది బందీలయ్యారు. హైదరాబాద్ సైన్యంలో 807 మంది చనిపోగా, 1,647 మంది బందీలయ్యారు. భారత సైన్యంలో 10 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ సంస్థానాన్ని 22 మార్గాల్లో చుట్టుముట్టి నిజాం మెడలు వంచగలిగారు.
అప్పటి హైదరాబాద్‌లో...
ఉత్తర కర్ణాటక ప్రాంతం... రాయచూర్, బీదర్, గుల్బార్గా ఉండేవి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్, పర్భణి, నాందేడ్, భీడ్ జిల్లాలు, ప్రస్తుతం తెలంగాణలోని పది జిల్లాలు నిజాం పాలనలోనే ఉండేవి. 82,698 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేది. ఈ మొత్తం 1948 సెప్టెంబరు 17న భారత సమాఖ్యలో విలీనమయ్యాయి. హైదరాబాద్ స్టేట్‌గా కొంత కాలం పరిపాలన సాగింది. 1956లో భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుతో తెలుగు మాట్లాడేవారిని ఆంధ్రరాష్ట్రంలో, కన్నడిగులు కర్ణాటక, మఠారీ వాసులు మహారాష్ట్రలో కలిసిపోయారు.
ఎవరెవరు ఎంతమంది?
నాటి హైదరాబాద్ సంస్థానంలో
మొత్తం జనాభా: 1.63 కోట్లు
తెలుగువారు: 48.2 శాతం
మరాఠీలు: 26.4
కన్నడిగులు: 12.3
ఉర్దూ : 10.3
యాసిడ్ బాంబులేశాం...
రజాకార్లకు వ్యతిరేకంగా వరంగల్‌లో పోరాడాం. కేసముద్రం గూడ్స్‌బండిని పడగొట్టాం. ఖమ్మం జిల్లాలో అల్లూరి క్యాంపులో బాంబులు తయారు చేసేవాళ్లం. 1936 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించాం. 1948 సెప్టెంబరులో రజాకార్లు, పోలీసులపై యాసిడ్ బాంబులతో దాడులు చేశాం. ఎంతో పోరాటం చేస్తే కానీ భారత సమాఖ్యలో విలీనం కాలేదు. ఆ విజయోత్సవాలను ఈ తరానికి అందించేందుకు సికింద్రాబాద్ మహబూబ్ కళాశాలలో 400 మంది పిల్లల ఏర్పాటు చేసి సభ నిర్వహించబోతున్నాం. పలువురు స్వాతంత్య్ర సమరయోధుల తమ అనుభవాలను పంచు కోనున్నారు.
-
నర్రా మాధవరావు, స్వాతంత్ర సమయోధులు, సికింద్రాబాద్
న్యూస్‌టుడే- చార్మినార్,
చాంద్రాయణగుట:్ట రజాకార్లు గ్రామాలు, బస్తీలపై దాడులు చేసి ప్రజలను
హింసించేవారు. మహిళలను చెరబట్టడం.. వివస్త్రలను చేసి బతుకమ్మలు
ఆడించడం... బహిరంగ శిక్షలను అమలు పరచడం తదితర దుశ్చర్యలకు
పాల్పడేవారు. దీనికి తోడు 1948 ఆగస్టు 21న రజాకార్లు ఇమ్రోజ్ పత్రికా కార్యాలయం
నుంచి ఇంటికి వెళుతున్న పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‌ను దారుణంగా
కాల్చి చంపారు. అతని చేతులు నరికి వేశారు. నిజాం నిరంకుశ పాలనకు తోడు..
రజాకార్ల దుర్మార్గాలతో విసిగి వేసారిన జనం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ప్రజల ఆవేదన ఆక్రోశంగా మారింది. నారాయణరావు పవార్ లాంటి వ్యక్తులు నిజాం
వాహనంపై బాంబులు విసిరి తమ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించారు.
ఈ ఆక్రోశమే తెలంగాణ సాయుధ పోరాటానికి దారి తీసింది. తెలంగాణ సాయుధ పోరాటం
మావో లాంటి ప్రపంచ నేతలకు మార్గదర్శకంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.
అంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి, నిజాం వ్యతిరేక పోరాటానికి
పాతబస్తీతో విడదీయలేని అనుబంధం ఉంది.
నిజాం వంశస్తుడి
నిరసన:
నిజాం పాలనకు వ్యతిరేకంగా నిజాం కుటుంబానికి చెందిన మొఘల్‌పురా వాసి జహందార్ అఫ్సర్ పాతబస్తీలో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితుడైన అతను నిజాం దేవిడీల్లోనే కమ్యూనిస్టు నేతలకు ఆశ్రయం కల్పించేవాడు. మారుపేర్లతో కమ్యూనిస్టులు మొఘల్‌పురా, పంచమొహల్లా దేవిడీలలో జహందార్ అఫ్సర్ మిత్రులుగా ఆశ్రయం పొందేవారు. నిజాం కుటుంబీకులు మందలించినప్పటికి జాహందార్ అఫ్సర్ తన పోరాట పంథాను విడనాడలేదని అతని సహచరులు చెబుతుంటారు.
శాలిబండలో ఆశ్రయం:
శాలిబండ సయ్యదలీ చబుత్రాలోని మనోహర్ రాజ్ సక్సేనా న్యాయవాదిగా రైతుల పక్షాన నిలిచాడు. సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరులకు ఉచితంగా న్యాయ సహాయం అందించారు. అంతేగాకుండా అర ఎకరం పైగా విస్తీర్ణంలో గల తన ఇంటిలో కమ్యూనిస్టు నేతలైన రాజ్‌బహదూర్ గౌర్ తదితరులకు ఆశ్రయం కల్పించేవారు. మనోహర్‌రాజ్ సక్సేనా ఇంటినుంచి బయటకు వెళ్లడానికి అన్ని వైపులా ద్వారాలు ఉండడంతో ఓవైపు నుంచి పోలీసులు వస్తే మరో దారి గుండా విప్లవ కారులను తప్పించేవారు.
గంట మోగితే గుబులే
- డాక్టర్ గోపాలాచారి, హరిబౌలి
ఆనాడు రజాకార్లు బస్తీల్లో కవాతు పేరిట వీర విహారం చేసేవారు. జనం భయంతో వణికి పోయేవారు. ఆగడాలను అడ్డుకోవడానికి ఇళ్లలో కారం, రాళ్లు, రోకలిబండలు, యాసిడ్ సీసాలు సిద్ధంగా ఉంచుకునే వారు. ఇళ్లపై గంట ఏర్పాటు చేసుకునేవారు. రజాకార్లు ఎవరి ఇంటిపై దాడి చేసినా వెంటనే ఆ ఇంటివారు గంటను మోగించేవారు. గంట మోత విని స్థానికులు అక్కడికి గుమిగూడి రజాకార్ల ఆగడాలను అడ్డుకునేవారు. సంస్థాన్‌పై సైనిక చర్య ప్రారంభం కాగానే ఇక్కడి యువత పెద్దలు వారిస్తున్నా వినకుండా నిజాం జెండాలను ( ఆసఫ్ జాహి పర్చం) తొలగించి జాతీయ జెండాలు ఎగురవేశారు.
జనం మధ్యే శిక్షలు
- తిరుపతి పద్మారావు, మూసాబౌలి
నిజాం పాలనను ఎదిరించిన వారిని రజాకార్లు బహిరంగంగా ప్రజల సమక్షంలో శిక్షించేవారు. తన చిన్న తనంలో అలియాబాద్ ప్రాంతంలో రాందాస్ అనే వ్యక్తి నిజాం పాలనను వ్యతిరేకించాడని రజాకార్లు అతన్ని పట్టుకుని బహిరంగంగా తల నరికేందుకు సిద్ధమయ్యారు. బలిష్టుడైన రాందాస్ జూలు విదిల్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటనను కళ్లారా చూసిన జనం అప్పట్లో కథలు కథలుగా చెప్పుకొనేవారు.
No comments:
Post a Comment