అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, January 23, 2012

చీడపీడలను వెంట తెచ్చిన చలి


వరంగల్ అగ్రికల్చర్: రాష్ట్రంలో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మిరప పంటపై పలు రకాల చీడపీడలు దాడి చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడంతో మొక్కల పెరుగుదల ఆగిపోయింది. ఈనెలు పసుపు రంగుకు మారుతున్నాయి. పురుగులు, తెగుళ్ల బారి నుండి మిరప పంటను రక్షించుకోవాలంటే తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని వరంగల్ ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త రావుల ఉమారెడ్డి సూచిస్తున్నారు. ఆ వివరాలు...

ఆకుల అడుగున చేరి...
ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు నల్లి పురుగులు మిరప ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు కాడల మాదిరిగా సాగుతాయి. అవి బోర్లించిన పడవ మాదిరిగా కన్పిస్తాయి. ఆకు తొడిమలు సాధారణ తొడిమల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. నల్లి నివారణకు లీటరు నీటికి అయిదు మిల్లీలీటర్ల చొప్పున డైకోఫాల్ కలిపి ఆకుల అడుగు భాగాలు బాగా తడిసేలా పిచికారీ చేయాలి.

నష్టపరుస్తున్న వైరస్ తెగుళ్లు ఇవే
ప్రస్తుతం మిరప పంటలో కుకుంబర్ మొజాయిక్, జెమిని వైరస్ తెగుళ్ల ఉధృతి కన్పిస్తోంది. కుకుంబర్ మొజాయిక్ తెగులు సోకిన ఆకులు పాలిపోయి లేతాకుపచ్చ రంగుకు తిరుగుతాయి. మొక్కలు గిడసబారతాయి. కొన్ని సందర్భాల్లో ఆకులు తోకల్లాగా సన్నబడి పసుపు రంగుకు మారతాయి. వాటిపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కాయల పైన కూడా నల్లని వలయాలు కన్పిస్తాయి. ఈ తెగులు పేను ద్వారా వ్యాపిస్తుంది. పురుగు మందుల్ని విచక్షణారహితంగా వాడితే దీని ఉధృతి పెరుగుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 40 గ్రాముల చొప్పున ఎసిటామిప్రిడ్ కలిపి వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.

జెమిని వైరస్ తెగులు సోకిన మిరప ఆకులు చిన్నవిగా మారి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. సూక్ష్మ ధాతు లోపాలు ఏర్పడినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉన్నందున భూమిలోని పోషకాల్ని మొక్కలు గ్రహించలేకపోతున్నాయి. దీనివల్ల పైరులో సూక్ష్మ ధాతు లోపాలు కన్పిస్తున్నాయి. 

జెమిని వైరస్ తెగులు సోకినప్పుడు, సూక్ష్మ ధాతు లోపాలు ఏర్పడినప్పుడు పైరులో ఒకే వూదిరి లక్షణాలు కన్పించినప్పటికీ ఒక ప్రధానమైన తేడా ఉంది. ఆకులు గుంపులు గుంపులుగా ఉండి, చిన్నవిగా కన్పిస్తే సూక్ష్మ ధాతు లోపాలు ఏర్పడినట్లు భావించాలి. ఆకులు అక్కడక్కడా మాత్రమే చిన్నవిగా కన్పిస్తే అప్పుడు జెమిని వైరస్ తెగులు సోకిందని గ్రహించాలి. తెల్లదోమ ద్వారా వ్యాపించే ఈ తెగులు నివారణకు మందులేవీ లేవు. 

అయితే కొన్ని యాజమాన్య, సస్యరక్షణ చర్యల ద్వారా దీనిని అదుపులో ఉంచవచ్చు. పొలం గట్ల మీద కలుపు లేకుండా చూడాలి. రసాయన మందుల్ని గట్ల మీద కూడా పిచికారీ చేయాలి. ఎక్కువ విస్తీర్ణంలో తెగులు సోకినట్లయితే చెట్లను పీకి దూరంగా పడేయాలి. పసుపు రంగు రేకులకు గ్రీజు పూసి పొలంలో అక్కడక్కడా (ఎకరానికి నాలుగు చొప్పున) ఏర్పాటు చేస్తే తెల్లదోమలు అక్కడికి వచ్చి గ్రీజుకు అతుక్కొని చనిపోతాయి.

తెగులు వ్యాప్తికి కారణమైన తెల్లదోమ నివారణకు అయిదు శాతం వేప గింజల కషాయం పిచికారీ చేయాలి. లేకుంటే ఎకరానికి 200 లీటర్ల నీటిలో 300 గ్రాముల ఎసిఫేట్ లేదా 40 గ్రాముల థయోమిథాక్సామ్ కలిపి 7-10 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి. సూక్ష్మ ధాతు లోపాల నివారణకు ఇనుము, జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన మందును పిచికారీ చేసుకోవాలి. బయో మందులు వాడకూడదు.

ఆకుల అడుగున బూడిద
చలి ప్రభావం వల్ల శిలీంద్రాల ఉధృతి ఎక్కువగా ఉండి మిరప పైరుకు బూడిద తెగులు సోకుతుంది. తెగులు సోకిన ఆకుల అడుగు భాగాన తెల్లని బూడిద మాదిరిగా ఏర్పడుతుంది. ఆకుల పై భాగాన పసుపు రంగులో మచ్చలు కన్పిస్తాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు రాలతాయి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున గంధకం (నీటిలో కరిగే) కలిపి పిచికారీ చేసుకోవాలి.

చెట్టంతా ఎండుతుంది
మిరప పైరుకు శిలీంద్రం ద్వారా కోనోఫొరా కొమ్మ ఎండు తెగులు సోకుతుంది. తెగులు సోకితే చెట్టు పైన ఉన్న ప్రధాన కొమ్మలు పై నుండి కిందికి ఎండుతాయి. తెగులును సకాలంలో నివారించకుంటే చెట్టంతా ఎండుతుంది. ఈ తెగులు నివారణకు ముందుగా తెగులు సోకిన కొమ్మల్ని కత్తిరించి దూరంగా పడేయాలి. లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ + 0.1 గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్ చొప్పున కలిపి చెట్టంతా తడిసేలా వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.

No comments:

Post a Comment