prajasakti Mon, 30 Jan 2012, IST
- సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్లింపుపై జాన్ వెస్లీ
- అమలుకు ప్రత్యేక చట్టం తప్పనిసరి
- వివిధ రూపాల్లో వివక్ష కొనసాగుతోంది
దళితుల అభివృద్ధికి మాత్రమే వినియోగించాల్సిన సబ్‌ప్లాన్ (ఎస్‌సి స్పెషల్ కాంపొనెంట్) నిధులను దారి మళ్లించడం 2జి కుంభకోణంకన్నా పెద్దదని జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి దయనీయంగా ఉంది. భూమి
లేకపోవడంతో వ్యవసాయ కూలీలుగా తరతరాలుగా మగ్గిపోతున్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో లేదు. సామాజికంగా, ఆర్థికంగా అణిచివేత, దోపిడి దళితులపై కొనసాగుతోందనీ వెస్లీ అన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జాన్‌వెస్లీ ప్రజాశక్తి ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేవి ?
దళితులు ప్రధానంగా రెండు రకాలు- అంటే సామాజిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సామాజికంగా అంటరానితనం, కులవివక్ష, అగ్రకులాల దురంకారంతో దళితులపై దాడులు, ఆత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు చేస్తున్నారు. కుల వివక్ష అనేక రూపాల్లో కొనసాగుతోంది. హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, దళితులకు క్షవరం చేయకపోవడం, పండుగలు, విందు భోజనాల్లో వివక్ష చూపించడం, వినాయక చవితి ఉత్సవాల్లో దళితవాడ వినాయకులను అగ్రకుల వినాయకులు తర్వాతనే తీసుకెళ్లాలని ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా సుబ్బలేడు గ్రామంలో దళితులపై అగ్రకులస్థులు దాడి చేశారు. దసరా పండుగనాడు జమ్మిఆకు తీసుకొచ్చినందుకు కొట్ర గ్రామంలో దాడి చేశారు. రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో తిమ్మప్ప అనే దళితున్ని అగ్రకులస్థులు హత్య చేశారు. ఇలా....ఎన్నో! భూమి లేకపోవడం దళితులకు ప్రధాన సమస్య. 70శాతం మంది దళితులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కోనేరు రంగారావు కమిటీ నివేదికలో 45లక్షల ఎకరాల మిగులు భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని తేల్చింది. వీటిని దళితులకు,పేదలకు పంపిణీ చేయడంలేదు.
స్పెషల్ కంపోనెంట్ నిధులను దళితుల సంక్షేమం కోసం ఏ మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ?
స్పెషల్ కంపోనెంట్ నిధులను దళితులకు ఖర్చు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో దళితుల జనాభాను బట్టి నిధులను కేటాయించాలని 1980లో కేంద్రప్రభుత్వం నిర్ధేశించింది. ఈనిధులను దళితుల ప్రయోజనాలకే ఖర్చు చేయాలని, కోత విధించకూడదని, ఇతర రంగాలకు మళ్లించకూడదని, అనివార్యంగా ఏవైనా నిధులను ఖర్చు చేయకపోతే, వాటిని వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలని ప్రణాళిక సంఘం ఆదేశించింది. కానీ ప్రభుత్వాలు భేఖాతరు చేశాయి. దీంతో దళితులు చాలా నష్టపోయారు. గత 15ఏళ్లలో స్పెషల్ కంపోనెంట్ నిధులను ఖర్చు చేయకుండా రూ. 4లక్షల కోట్లను మళ్లించారు. రూ. 1.76 లక్షల 2జి స్ప్రెక్టమ్ కుంభకోణం ఇప్పటికి పెద్దదని అంటున్నారు. కాని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది అంతకంటే పెద్ద కుంభకోణం కదా! స్పెషల్ కంపోనెంట్ నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దళితులకు ఏమేరకు అందుతున్నాయి?
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచార పథకాలుగా మరాయి. దళితులకు ఏమాత్రం చేరడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌లో 12 రకాలు సంక్షేమపథకాలను అమలు చేస్తోంది. గతేడాది బడ్జెట్‌లో కేవలం రూ.70కోట్ల నిధులనే కేటాయించింది. వీటిలో సగానికిపైగా సిబ్బంది జీతభత్యాలకే సరిపోతున్నాయి. స్వయం ఉపాధి పథకాలకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకర్లు ఇచ్చే హామీ పత్రం ఆధారంగానే రుణాలు ఇస్తామని మెలికపెట్టింది. దీంతో దళిత నిరుద్యోగులకు రుణాలు అందడం కలగానే మిగిలింది.
ఎస్సీ, ఎస్టీ ఉపకారవేతనాల కోసం వయో పరిమితిని విధించడం సబబేనా ?
ఎస్సీ, ఎస్టీ విద్యారులకు ఉపకారవేతనాల కోసం వయో పరిమితిని విధించడం దుర్మార్గం. దళితుల ఆర్థిక పరిస్థితుల రీత్యా చదువులో వెనుకబడే పరిస్థితి ఉంది. చదువుకునే హక్కు నుంచి దళితులను దూరం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపకారవేతనాలకు వయో పరిమితిని తగ్గించడం వల్ల ఉన్నత చదువులకు దళితులు దూరమయ్యే పరిస్థితి ఉంది. దళితులకు విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత. దాన్నుండి తప్పుకోరాదు.
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టేందుకు ఏవైనా కార్యక్రమాలు చేపట్టారా ?
వివక్ష, దాడులపై కెవిపిఎస్ నిరంతం పోరాడుతోంది. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతికి సామాజిక చైతన్యయాత్రలు, ప్రతిఘటన పోరాటాలను నిర్వహిస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి రాఘవులు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రాంతంలో 70 గ్రామాల్లో దేవాలయ ప్రవేశం, రెండు గ్లాసుల పద్దతిపై ప్రతిఘటన ఉద్యమం జరిగాయి. దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు అండగా నిలబడి పోరాటం చేస్తున్నాం. సబ్‌ప్లాన్ నిధులను నోడల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర నాయకత్వం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. నిలకడగా ఆందోళనలు చేస్తోంది. శనివారంనాడు ఇదే విషయమై పార్టీ ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ను కలిసింది. దళితుల సమస్యలపై వివిధ సంస్థలు, సంఘాలు చేపట్టే కార్యక్రమాలకూ ఆయా సందర్భాల్లో పార్టీ సంఘీభావం తెలుపుతోంది. అయితే దళితుల సమస్యల పరిష్కారానికి కేవలం దళితులే గాక అన్ని సామాజిక తరగతుల్లోని పేదల పోరాటాలతో మమేకం అవుతుంది.
మీ భవిష్యత్ కార్యక్రమం ఏంటి ?
బడ్జెట్ సమావేశాల్లో స్పెషల్ కంపొనెంట్ ప్లాన్ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, దళితుల సమస్యలపై రెండు రోజులు శాసనసభను నిర్వహించాలని ఉద్యమించనున్నాం. వివిధ దళిత సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులతో ఐక్య కార్యమ్రాలు సాగుతున్నాయి. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రికి, మంత్రులకు, రాజకీయ పార్టీల అధ్యక్షులకు కెవిపిఎస్ తరఫున లేఖలు రాశాం. దీని కోసం ప్రతి గ్రామంలో కూడా గ్రామసభలను నిర్వహించి తీర్మానం చేయించాలి. విశాలమైన ఐక్యకార్యాచరణ సాగాలి. కొన్ని స్వతంత్ర కార్యక్రమాలూ ఉండొచ్చు. ఈ అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. దళితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి చర్చించి, వాటి పరిష్కారానికి కార్యాచరణను ఖమ్మంలో జరిగే మహాసభలో రూపొందిస్తాం.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి రాఘవులు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రాంతంలో 70 గ్రామాల్లో దేవాలయ ప్రవేశం, రెండు గ్లాసుల పద్దతిపై ప్రతిఘటన ఉద్యమం జరిగాయి. దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు అండగా నిలబడి పోరాటం చేస్తున్నాం. సబ్‌ప్లాన్ నిధులను నోడల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర నాయకత్వం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. నిలకడగా ఆందోళనలు చేస్తోంది. శనివారంనాడు ఇదే విషయమై పార్టీ ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ను కలిసింది.
No comments:
Post a Comment