అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, January 23, 2012

అడవిలో కొనబోతే కొరివి!



  • రవాణాఛార్జీల పేరుతో సబ్‌డిపోలు మూసేస్తున్న జీసీసీ 
  • సబ్‌డిపోల మూతతో నిత్యావసరాల స్వాహాకు మార్గం 
  • గిరిజనులకు భారంగా మారుతున్న రూపాయి బియ్యం 
  • ఇప్పటికే 68 డిపోలు ఎత్తివేత 

తీసుకునేవారు పేదలైనా కాకపోయినా 
చౌక ధరల దుకాణాల్లో ప్రభుత్వం అందించే బియ్యం కిలో రూపాయి. 
కానీ అత్యంత దుర్భర స్థితిలో బతుకునీడ్చే గిరిజనులు మాత్రం ఆ బియ్యం కోసం రూ.3 నుంచి రూ.4 ఖర్చు పెడుతున్నారు. కారణం మన యంత్రాంగం నిర్వాకమే... 

పేదల కడుపు నింపేందుకు కిలో బియ్యాన్ని రూపాయికే అందిస్తున్న ప్రభుత్వం. దాని భారాన్ని తగ్గించుకునేందుకు పరోక్షంగా చేపడుతున్న చర్యలు వేలాది గిరిజన కుటుంబాల కడుపు కొడుతున్నాయి. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లోని గిరిజనానికి నిత్యావసరాలను అందుబాటులో ఉంచేందుకు రేషన్‌దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన సబ్‌డిపోలను రవాణాభారం పేరుతో ఎత్తివేస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఏడు మండలాల్లో 520 రెవెన్యూ గ్రామాలు ఉండగా 102 గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు నడుస్తున్నాయి. వీటిద్వారా పౌరసరఫరాల శాఖ అందించే బియ్యం, కిరోసిన్‌, పంచదార, కందిపప్పు వంటి నిత్యావసరాలను గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గిరిజనులకు సరఫరా చేస్తోంది. ఏజెన్సీలో ఒక గ్రామానికి మరో గ్రామానికి నడుమ దూరం ఎక్కువగా ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మారుమూల గ్రామాల్లోని గిరిజనులకు వెసులుబాటు కల్పించేందుకు రేషన్‌ దుకాణాలకు అనుబంధంగా రెండేళ్ల క్రితం 93 సబ్‌డిపోలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అక్కడికి బియ్యాన్ని చేర్చడానికి రవాణాఛార్జీలు పెరిగిపోయాయంటూ ఎక్కువవాటిని మూసివేయగా కేవలం 25 మాత్రమే నడుస్తున్నాయి. దీంతో గిరిజనులు నిత్యావసరాలను తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. రూ.10 విలువైన 10 కేజీల బియ్యాన్ని తీసుకువెళ్లేందుకు గిరిజనం సుమారు 10 కి.మీ. మేర కొండకోనల్లో నడచిరావడం లేదా రూ.20 నుంచి రూ.30 వరకు ఖర్చుపెట్టుకుని ఆటోలో రావడం చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని భరించలేక చాలా మంది గిరిజనులు రేషన్‌ తీసుకువెళ్లడమే మానేస్తున్నారు. ఇది అక్రమార్కులకు వరంగా మారుతోంది.
* మారేడుమిల్లి మండలంలో 14 రేషన్‌దుకాణాలు ఉండగా, వాటికి అనుబంధంగా 23 సబ్‌డిపోలు నడుస్తున్నాయి. వీటిలో 15 మూసివేశారు. ప్రస్తుతం 8 మాత్రమే నడుస్తున్నాయి. ఈ మండలంలోని కొండమీద ఉండే మారుమూల గ్రామం బొడ్డగండి. ఇక్కడ 50 కుటుంబాలకు పైగా ఉన్నాయి. ఈ గ్రామంలోని కుటుంబాలు, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆవాసాల్లో నివాసం ఉంటున్న మరో 50 కుటుంబాలు బొడ్డగండిలో ఉన్న సబ్‌ డిపో నుంచి నిత్యావసరాలు తీసుకుని వెళ్లేవారు. ప్రస్తుతం వీరు కొండకింద 10 కి.మీ. దూరంలో ఉన్న ధారగడ్డకు వచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఆటో ఎక్కితే రానుపోను రూ.30 అవుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. నిత్యావసరాలను తీసుకెళ్లే సమయంలో సుమారు 20 కేజీల బరువును మోయాల్సి ఉండటంతో కొండ ఎక్కడం కష్టంగా ఉంటుందని వారు వాపోయారు.

* వై.రామవరం మండలంలో 124 రెవెన్యూ గ్రామాలు ఉంటే 15 రేషన్‌దుకాణాలు మాత్రమే ఉన్నాయి. వీటికి అనుబంధంగా 30 సబ్‌డిపోలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేవలం 10 మాత్రమే నడుస్తున్నాయి. బూరుగుపాలెం సబ్‌డిపోను మూసివేయడంతో వారు 10 కి.మీ. దూరంలో ఉన్న వై.రామవరం మండలకేంద్రానికి వచ్చి సరుకులు తీసుకెళ్లాల్సి వస్తోంది.

రవాణాఛార్జీలు భరించలేకే.. 
మోహనరావు, జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ 
గిరిజనులకు వెసులుబాటుగా ఉంటుందని సబ్‌డిపోలను ఏర్పాటు చేసినా రవాణాఛార్జీలు భారంగా మారడంతో వాటిని తీసివేయాల్సి వస్తోంది. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం రవాణాఛార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పరిస్థితిని ఐటీడీఏ పీవోకి నివేదించాం. మూసివేసిన వాటిలో కనీసం 65 డిపోలనైనా కొనసాగిస్తే గిరిజనులకు ప్రయోజనంగా ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అవి ఆమోదం పొందితే ప్రభుత్వం రవాణాఛార్జీలు భరిస్తుంది. అప్పటిదాకా మేం ఏమీ చేయలేము.

No comments:

Post a Comment