అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 27, 2012

అన్నదాతకు అదనపు రుణం!


రూ.9,345 కోట్ల ఎక్కువ పంట రుణాలు 
మొత్తం వ్యవసాయరంగానికి రూ.52 వేల కోట్లు 
కార్యాచరణను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రైతులకు ఇవ్వాల్సిన పంట రుణాలను భారీగా పెంచాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. రూ.9,345 కోట్లు అదనంగా పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంమీద వ్యవసాయ రుణాలను రూ.52,711 కోట్లకు పెంచాలని చూస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికలో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర బ్యాంకర్ల సమితికి అందజేసి, చర్చించిన తరవాత తుది నిర్ణయం తీసుకుంటారు. తాజా ప్రతిపాదనల్లో పెద్దగా కోత ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ భావిస్తోంది. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఏటా బ్యాంకులు నెలల తరబడి జాప్యం చేయడం సర్వసాధారణమైంది. దీనివల్ల పంటల సాగు పనులు ప్రారంభించే తొలకరి సమయంలో పెట్టుబడులు అందక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. గత ఖరీఫ్‌కు సంబంధించి 2011, సెప్టెంబరు 30కల్లా రూ.20,285.43 కోట్ల పంటరుణాలు రైతులకు ఇవ్వాల్సి ఉండగా అక్టోబరు 20 నాటికి
రూ.17,429 కోట్లు మాత్రమే బ్యాంకులు పంపిణీ చేశాయి. ఖరీఫ్‌ గడువు ముగిశాక కూడా ఇంకా రూ.2,845 కోట్లు రైతులకు అందకపోవడం గమనార్హం. ప్రస్తుత రబీలోనూ అదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఖరీఫ్‌ పెట్టుబడులకు రైతులకు సత్వరం బ్యాంకు రుణాలను అందించేందుకు వ్యవసాయశాఖ తాజా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఇది ప్రభుత్వం ఆమోదం పొందితే పక్కాగా అమలు చేయాలని యోచిస్తోంది.
ప్రణాళికలో ముఖ్యాంశాలు... 
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.48 వేల కోట్ల మేర రుణాలు రైతులకు ఇస్తున్నారు. ఇందులో పంటరుణాలు రూ.30,985.43 కోట్లు కాగా మిగతావి వ్యవసాయ అనుబంధ పనులకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాలు. ఈ మొత్తాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీగా పెంచాలని ప్రతిపాదించారు.
* ఇప్పటి వరకు పంటరుణాలు తీసుకోని రైతుల కోసం ప్రత్యేకంగా అందరికీ ఉపయోగపడేలా ఒక దరఖాస్తును నాబార్డు సహకారంతో రూపొందిస్తున్నారు. దీన్ని జిల్లా వ్యవసాయ అధికారులు.. ఆదర్శ రైతుల ద్వారా రుణాలు తీసుకోని వారికి అందజేస్తారు.
* రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, రుణాల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ అంతా మే నెలఖారుకల్లా పూర్తిచేసి, జూన్‌ 15 కల్లా రుణాలు పంపిణీ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
* రబీ సీజన్‌కు సైతం ఈ ఏడాది సెప్టెంబరుకల్లా దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేసి, అక్టోబరు 15కల్లా రుణాలు ఇచ్చేయాలి.
* రుణ అర్హత గుర్తింపు కార్డులున్న వారందరికీ రుణాలు అందేలా చూడాలన్నది మరో లక్ష్యం. ఒక్కో రైతుకు వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోతే.. కౌలు రైతులను సంఘాలుగా ఏర్పాటుచేసి వాటికి రుణం అందేలా మండల వ్యవసాయ అధికారులు శ్రద్ధ తీసుకోవాలి.
* 2011-12 ఆర్థిక సంవత్సరానికి రుణ అర్హత కార్డులు 5,78,125 మంది కౌలురైతులకు మాత్రమే అందజేశారు. మిగిలిన 20 లక్షల మందికి సత్వరం కార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకుంటారు.
* బ్యాంకులకు చాలా దూరంగా ఉన్న గ్రామాల్లో వారానికి రెండురోజుల పాటు రైతులకు పంటరుణాలు ఇచ్చేందుకు బ్యాంకుసేవలు అందించేలా చర్యలు తీసుకుంటారు. ఇందుకు బ్యాంకుల సహకారాన్ని కోరుతున్నారు.
* ప్రస్తుత రబీలో వడ్డీ లేకుండా పంటరుణాలు ఇస్తున్నందున రైతుల్లో బాగా అవగాహన కల్పించి, నిర్ణీత గడువులోగా అందరూ తిరిగి చెల్లించేలా వ్యవసాయశాఖ కృషిచేస్తుంది. దీనివల్ల రికవరీ మెరుగై రైతులకు తిరిగి త్వరగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తాయని భావిస్తున్నారు.

No comments:

Post a Comment