అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Tuesday, January 31, 2012

'పట్టు' జారుతున్న మల్బరీ


  • గతేడాది కిలో రూ.400
  • ఈసారి కిలో రూ.150
  • 'దారం' కొనలేక చేనేత విలవిల
ఆరుగాలం కష్టపడి పండించిన 'పట్టు' గూళ్లకు ధరల్లేక రైతన్నలు లబోదిబోమంటున్నారు. గతేడాది కిలో పట్టు
రూ.400 ధర పలకగా, ఈ ఏడాది రూ.100-150 వుంది. నాణ్యత లేకపోవడం వల్లనే ధర తక్కువగా ఉందని, పెద్దసంఖ్యలో పంటను సాగు చేశారని ఒకవైపు వ్యాపారులు నమ్మబలుకుతున్నారు. మరోవైపు నేతన్నలు పట్టు దారం కొనలేక మగ్గానికి దూరమవుతున్నారు. కిలో పట్టు దారం రూ.2100 ధర పలుకుతోంది. పెట్టుబడి కూడా రావడం లేదని మల్బరీ రైతులు విలవిలలాడుతున్నారు చేనేత రంగానికి సిల్క్‌ను సబ్సిడీతో పంపిణీ చేస్తామని పట్టు పరిశ్రమ శాఖ ప్రకటించింది. అయితే ఇంతవరకూ అమలు కాలేదు. 2009లో మొదటి విడతగా 8వేల పాసు పుస్తకాలను మాత్రమే మంజూరు చేసింది. ఇవి ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. పట్టుగూళ్లు కొనుగోలు నుంచి దారం తయారు చేసి విక్రయించే వరకూ మధ్య వ్యాపారి లక్షల్లో లాభాలార్జిస్తున్నారు. ఆరుగాలం కష్టపడే మల్బరీ రైతు, నేతన్న మాత్రం కష్టాల్లో కునారిల్లుతున్నారు. ఇదెక్కడి తిరకాసో మరి.

పట్టు పరిశ్రమకు చిత్తూరు జిల్లా పడమటి మండలాలు ఎంతో అనుకూలం. మదనపల్లి డివిజన్‌ పరిధిలో వేలాది ఎకరాల్లో పంట సాగు చేస్తారు. ఎంతోమంది రైతులకు ఒకప్పుడు ఉపాధిగా ఉన్న పట్టుపరిశ్రమ నేడు 'పట్టు' జారుతోంది. ఎంతో శ్రమకోర్చి, అప్పు చేసి మట్టి (గుడ్లు) తెచ్చి, వాటిలో పట్టు పురుగులను మేపి తయారైన గూళ్లను మార్కెట్‌కు తరలిస్తే కనీస ధర పలకకపోవడం రైతన్నను వేదనకు గురిచేస్తోంది. గతేడాది కిలో 400 రూపాయలు పలికిన ధర, ప్రస్తుతం సగానికి తక్కువగా పడిపోయింది. రోజుకో విధంగా 100-140 రూపాయలుగా ధర పలుకుతోంది. దీంతో ఎంతో ఆశతో మల్బరీ సాగు చేసిన రైతన్నలు ఎంతో కొంతకు వదిలించుకోవాలని చూస్తున్నారు. మదనపల్లి ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రానికి సమీపంలో దాదాపు రెండువేల ఎకరాల్లో రెండువేల కుటుంబాలు మల్బరీని సాగు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్‌ గుడ్లను తీసుకుని వాటిని పొదిగించి పట్టు పురుగులను మేపి, ఆ తరువాత గూళ్ల దశకు రాగానే విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కష్టానికి తగ్గ ఫలితం రావడంలేదని వాపోతున్నారు. అక్కడి రైతులను 'ప్రజాశక్తి' పలకరించగా వారి వేదన వర్ణనాతీతం. వారి మాటల్లోనే...
వాతావరణ పరిస్థితులే ధరల తగ్గుదలకు కారణం
వాతావరణ పరిస్థితుల వల్ల పట్టు గూళ్ళలో నాణ్యత లేదు. ఇటీవల కాలంలో ముసురు వర్షాల వల్ల అన నుకూల వాతావరణం నెలకొంది. ఎండ లేకపోవడంతో నాణ్యత తగ్గిం ది. మనరాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రాల్లోనూ మల్బరీసాగు ఎక్కువ చేయడంతో ధరలు తగ్గాయి. ఇక్కడికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రరాష్ట్రాల నుండి రోజుకు సగటున 2.5టన్నుల పట్టుగూళ్లు వస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో పండించిన రైతులు కూడా శ్రీనివాసపురం, చింతామణి, చిల్‌గట్ట, రామ్‌నగర్‌, కోలార్‌, ముళబాగల్‌లోను, మనజిల్లాలోనూ పలమనేరు మార్కెట్‌లు ఉన్నా ఇక్కడికే తెస్తున్నారు. నాణ్యత లేకపోవడంతో రీలర్లు కొనడానికి ముందుకు రావడం లేదు. గతంలో రీలర్లకు పట్టుగూళ్లను అప్పుకు సైతం ఇచ్చేవారు. ప్రస్తుతం నగదు వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వలన కూడా కొంతమంది రీలర్లు ఇక్కడికి రావడం లేదు. ఈనెల ఒకటో తేదీన సగటు ధర కిలో రూ.102.50పైసలు ప్రారంభమై మధ్యమధ్యలో కిలోరూ.164, 177లు ఆ తరువాత రూ.148లు, ఈనెల 11న రూ.137.58పైసలు పలికింది.. సోమవారం కిలో రూ.135 నుండి రూ.150వరకు పలికింది. గతంలో ధరలు బాగా ఉన్నాయని, మంచి లాభాలు వస్తాయని ఒకరిపై ఒకరు పోటీగా మల్బరీని సాగు చేశారు. దీంతో మల్బరీసాగు ఉన్నదానికంటే ఎక్కువైంది. అందువల్లనే ధర పతనమయ్యింది. ఎం.విజయ రాఘవరెడ్డి, మార్కెట్‌ అధికారి
పట్టుగూళ్లు నాణ్యత లేదు : ఫయాజ్‌, రీలరు (వ్యాపారి)
మదనపల్లె మార్కెట్‌కు వచ్చే పట్టుగూళ్లు నాణ్యతగా లేకపోవడంతో రేట్లు ఎక్కువగా పలకడం లేదు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించలేదు. పక్క రాష్ట్రాలలో పట్టుగూళ్లు నాణ్యతగా ఉండటంతో అక్కడ పలికే ధరల్తో పోల్చితే ఇక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి. గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువగా పట్టును సాగు చేయడం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి.
మల్బరీతోటను తొలగిస్తున్నాను.. : జి.రామక్రిష్ణారెడ్డి
మాది మొలకలచెరువు మండలం కాలువపల్లి. నేను 300 మట్టి పట్టు పురుగులను తీసుకొచ్చి మేపాను. 25వేల రూపాయలు ఖర్చయ్యింది. ప్రస్తుతం కిలో 140 రూపాయలు ధర పలుకుతోంది. ఈ లెక్కన అమ్మితే 12వేల రూపాయలు మాత్రమే చేతికొస్తుంది. పెట్టుబడి కూడా రాకపోతే ఈ పట్టును ఎందుకు సాగు చేయడం. అందుకే వచ్చే ఏడాది మల్బరీ పంటను సాగు చేయదలచుకోలేదు.
కూలికెళ్లడం నయం
నారాయణమ్మ, గంగుడుపల్లి, చంద్రగిరి మండలం
పట్టు గూళ్లు మేపేదానికన్నా కూలికెళ్లడం మేలు. కనీసం పట్టెడన్నమైనా దొరుకుతుంది. 60 మట్టిలు మేపి మార్కెట్‌కు తరలిస్తే కనీసం ఖర్చులు కూడా రాలేదు. రోజుకు ఒక మనిషి కూలికెళితే 150 రూపాయలు ఇస్తున్నారు.
ధర అధ్వానంగా ఉంది
గురవారెడ్డి, గంగుడుపల్లి, చంద్రగిరి మండలం
ఏడాది పొడవునా పట్టునే నమ్ముకుని బతుకుతున్నాను. ఇప్పుడు పట్టుగూళ్ల ధర ఎపుడూ లేనంత అధ్వానంగా ఉంది. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఇరవై కుంటల భూమిలో మల్బరీ సాగు చేశాను. 85 మట్టిలలో పట్టుగూళ్లను మేపి మార్కెట్‌కు తెచ్చాను. ధర ఇలాగే సాగితే ఇకనుంచి పట్టు పరిశ్రమను వదిలేయాలనుకుంటున్నాను. 

No comments:

Post a Comment