అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, May 1, 2015

స్వచ్ఛమైన అభివృద్ధి కోసం... (ఈనాడు మే 01 2015)



స్వచ్ఛత, పరిశుభ్రతల విషయంలో ప్రతి వ్యక్తీ తనకు తానే పారిశుద్ధ్య కార్మికుడు కావాలని ఏనాడో ఉద్బోధించారు మహాత్మాగాంధీ. ఏటికేడు పోటెత్తుతున్న వలసలతో దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోతున్న నేపథ్యంలో- స్వచ్ఛ భారత్‌ ఉద్యమానికి పిలుపిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ! నిరుడు జూన్‌లో రాష్ట్రాధికారం చేపట్టిన వెంటనే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడం తెలిసిందే. 2050నాటికి సైతం వర్తించేలా మహా ప్రణాళిక రూపకల్పన జరగాలని బృహత్‌ లక్ష్యం నిర్దేశించిన కేసీఆర్‌- తన విశ్వనగర విజన్‌లో నేడు రాజధాని పరిశుభ్రతకు పెద్దపీట వెయ్యడాన్ని సహర్షంగా స్వాగతించాల్సిందే! మే16న గవర్నర్‌ చేతులమీదుగా ప్రారంభమయ్యే 'స్వచ్ఛ హైదరాబాద్‌'ను ప్రజా ఉద్యమంగా కదం తొక్కిస్తామంటున్న ముఖ్యమంత్రి, 'చార్‌ సౌ షహర్‌'ను మొత్తం 400 భాగాలుగా గుర్తించి వాటికి 400మంది బాధ్యుల్ని నియమిస్తామని చెబుతున్నారు. ప్రతిచోటా 15మంది స్థానికులతో కమిటీల ఏర్పాటు ద్వారా, మొత్తం 6000మందితో స్వచ్ఛ సైన్యాన్ని సిద్ధంచేసి వారికి ముందుగానే అవగాహన కల్పించనున్నారు. వారంతా ఆయా కాలనీల్లో పర్యటించి పరిశుభ్ర ప్రణాళికకు రూపుదిద్దడంతోపాటు వీధులు, పార్కుల నిర్వహణ, చెత్త సేకరణ- నిల్వ-రవాణా, మురుగు కాల్వలు, మరుగుదొడ్ల నిర్వహణలపైనా దృష్టి సారించనున్నారు. ఆయా పనుల పరిపూర్తికి అవసరమైన దాదాపు రూ.1000కోట్ల నిధుల్ని మహానగర పాలక సంస్థ సమకూర్చనుంది. ఇటీవల 'స్వైన్‌ఫ్లూ' కేసుల ఉద్ధృతి గ్రేటర్‌ హైదరాబాద్‌లో అపరిశుభ్రత ఏ స్థాయిలో మేట వేసిందో స్పష్టీకరించింది. వాయు, ధ్వని కాలుష్యాలు, కలుషిత నీటి సరఫరాలు, పొంగిపొర్లే మురుగు కాల్వలు, రోడ్లపైనే చెత్తాచెదారాలు, పిచ్చికుక్కల స్వైర విహారాలు నిత్యానుభవమైన నగరవాసులు స్వచ్ఛ హైదరాబాద్‌కు తమవంతు తోడ్పాటును అందిస్తే ఆరోగ్యకర వాతావరణ పరికల్పన కష్టసాధ్యమేమీ కాదు! కలిమి లేములతో సంబంధం లేకుండా ఇళ్లముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి పరిశుభ్రతను పాటించడం మన సంస్కృతి. వ్యక్తిగతంగా, వ్యవస్థాపరంగా దాన్ని అలక్ష్యం చేసిన పాపం పెనుశాపమై రాజధాని నగరాన్ని నేడు వెంటాడుతోంది. తీరూతెన్ను లేకుండా అడ్డం పొడవూ పెరిగిపోయిన నగరంలో ఎన్ని వేల మురికివాడలున్నాయో నగరపాలక సంస్థ దగ్గర సరైన లెక్కలే లేవు. నగరంలో సుమారు 6700 కిలోమీటర్లకుపైగా మంచినీటి సరఫరా వ్యవస్థ, 3600 కిలోమీటర్లపైనే మురుగునీటి వ్యవస్థ, వాటికి తోడు వాననీటిని నాలాల్లోకి చేర్చేందుకు చేపట్టిన 1700 కిలోమీటర్ల వరద నీటి కాల్వలు- ఇవన్నీ భూగర్భంలోని నిర్మాణాలే. వాటికి తోడు విద్యుత్‌, టెలికాం కేబుళ్ల నిర్మాణాలన్నీ భూగర్భంలోనుంచి వెళుతున్నవే. ఆయా విభాగాల మధ్య సమన్వయం కొరవడి- తవ్వడం, పూడ్చటం- తవ్వడంగా పౌర సేవల యంత్రాంగం పని దిగజారింది. పౌరుల్లో ఉదాసీనతకు నగర పాలక సంస్థ ప్రాణాంతక నిర్లక్ష్యం జతపడి పరిస్థితి అదుపు తప్పుతున్న తరుణంలో- 'స్వచ్ఛ హైదరాబాద్‌' సామాజికంగా ఓ సానుకూల పరివర్తనకు నాంది కావాలి. విశ్వనగర విజన్‌లో భాగంగా రాజధానిలోని మౌలిక సదుపాయాలపై సాగించిన అధ్యయనం ఇప్పటిదాకా లోటుపాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టింది. 150చోట్ల కూరగాయల విపణులు, 80చోట్ల బహుళ అంచెల పార్కింగ్‌ సదుపాయం, 136 ప్రదేశాల్లో బస్సులు నిలిపే సౌకర్యం, 50చోట్ల బహుళార్థ సాధక భవనాలు, 250 బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు, 36 శ్మశాన వాటికల ఆధునికీకరణలకూ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ప్రభుత్వపరంగా సకల మౌలిక సదుపాయాలూ అందుబాటులోకి తీసుకురావడం ఒకెత్తు. వాటి వినియోగంలో పరిశుభ్రత పాటించేలా పౌరసమాజాన్ని సమాయత్తం చెయ్యడం మరొకెత్తు! స్వచ్ఛత, పరిశుభ్రత తమ మనుగడకు ప్రాణావసరమన్న సందేశం ప్రజల మనసుల్లో నాటుకొనేలా ప్రభుత్వ ప్రచారోద్యమం పదునుతేలాలి!
రోజూ లక్షలమంది మురుగును చెత్తను పేరుస్తూ ఉంటే, వందలమంది సిబ్బందితో వాటిని ప్రక్షాళన కావించడం సాధ్యం కాదు. విశ్వనగరంగా రాజధానికి కిరీటధారణ చెయ్యాలంటున్నప్పుడు ఆ స్థాయికి దీటుగా సమస్త వ్యవస్థల నిర్మాణం సాగక తప్పదు. రాజధాని నగరంలో రోజూ 4000 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగుపడుతోందని అంటున్నారు. మరోవంక వాయుకాలుష్యం కోరసాచి రోజుకు 1500 టన్నుల ధూళి కణాలు గాలిలో కలిసి శ్వాసకోశ వ్యాధులకు కారణభూతమవుతున్నాయి! 'స్వచ్ఛ హైదరాబాద్‌' వాటన్నింటికీ విరుగుడు కావాలి. మెరుగైన రవాణా వ్యవస్థ కలిగిన సింగపూర్‌తోపాటు 35 నగరాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతంగా సాగుతోందని నిరుడు 'సీమన్స్‌' నివేదిక ప్రకటించింది. ప్రజా రవాణా సదుపాయాలు గణనీయంగా మెరుగుపడితే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి వాయుకాలుష్యమూ అదుపులోకి వస్తుంది. మనిషి మనుగడకు అత్యంత అనుకూలమైన 230 నగరాల జాబితాలో వియన్నా అగ్రభాగాన నిలవగా, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు 138వ స్థానం దక్కింది! సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్‌)గా తేజరిల్లనున్న రాజధానినగరం అవకాశాల స్వర్గంగా అంతర్జాతీయ సమాజాన్ని సూదంటురాయిలా ఆకట్టుకోవాలంటే- నగరంలో జీవనశైలి, నాణ్యత, పరిశుభ్రత వంటి వాటన్నింటిలో గొప్ప మార్పు ప్రస్ఫుటం కావాలి. కాలుష్య రహిత పరిసరాలు, ఏమాత్రం వంకపెట్టలేని విధంగా మౌలిక సదుపాయాలు, సేవలు పూర్తిస్థాయిలో పురివిప్పాలి. నాలుగు రోజుల హడావుడిగా కాదు; వచ్చే నాలుగు దశాబ్దాల జనచైతన్య జీవఝరిగా రాజధాని విశ్వనగర భవితకు 'స్వచ్ఛ హైదరాబాద్‌' మేలుబాటలు పరవాలి!

No comments:

Post a Comment