ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనిపించిన అంశాన్ని సైతం పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు తమకు అనుకూలంగా రాయితీలు రాబట్టుకోవడానికి వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాకా ద్రవ్యోల్బణం దాదాపు రెండంకెల స్థాయికి చేరుకుంది కాబట్టి, దాన్ని తగ్గించడానికి అనే పేరుతో రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను వరుసగా పెంచుతూ వచ్చింది. గత నెలలో ప్రకటించిన విధానం
మాత్రమే దీనికి మినహాయింపు. వడ్డీ రేట్ల జోలికి రిజర్వుబ్యాంకు పోలేదు. కాని ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది, మరో వైపున పారిశ్రామిక సూచి అధోముఖంగా పయనిస్తున్నది. ఇలాంటి పరిస్థితిలో వడ్డీ రేట్లను రిజర్వుబ్యాంకు తగ్గించి తమకు రుణసదుపాయాన్ని అధికం చేయాలని పారిశ్రామిక రంగం డిమాండ్ చేస్తున్నది.గత కొద్ది రోజులలో భారత ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి పలు గణాంకాలు వెలువడ్డాయి. ఈ రక రకాల గణాంకాలు కొన్ని ఆశాజనకంగా ఉంటే మరి కొన్ని నిరాశాపూరిత వాతావరణాన్ని మరింత తీవ్రం చేసేవిగా ఉన్నాయి. వాటిపై ప్రభుత్వ వర్గాలు, ఆర్ధిక నిపుణులు విభిన్నమైన అంచనాలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆర్ధిక పరిస్థితి మరింత సానుకూలంగా మారుతుందని ఒకరంటుంటే, మరికొందరు పరిస్థితి అంత తేలిగ్గా ఉండదని చెబుతూ మరిన్ని రాయితీల ఆవశ్యకతను వివరిస్తున్నారు. వీటన్నింటి మధ్య సామాన్యులు మాత్రం పూర్తి గందరగోళంలో పడిపోతున్నారు.
ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతున్నదన్నది మొదటి వార్త. 2011 డిసెంబరు 31 తేదీతో ముగిసిన వారంలో ఆహార ద్రవ్యోల్బణం అంతకు ముందు సంవత్సరం ఇదే వారంతో పోల్చుకున్నపుడు 2.1 శాతం తక్కువగా ఉంది. అంటే మైనస్ వృద్ధిరేటు నమోదయింది. డిసెంబరు 24తో అంతమయిన వారంలో అయితే మరింత తక్కువగా మైనస్ 3.36 శాతంగా ఉంది. ఆహార ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్న తరుణంలో ఈ వార్త సామాన్యులకు వూరట కలిగించేదిగా ఉంది. అయితే ఇది ఊహల్లో మాత్రమేనని మర్చిపోరాదు. గత ఏడాది ఇదే వారాల్లో అత్యధిక స్థాయిలో 20 శాతంగా ఉండటం వల్ల ఇప్పుడు మైనస్ వృద్ధిరేటు కనిపిస్తున్నది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గినందువల్ల నిజంగా సామాన్యులకు కలిగిన వూరట ఏమీలేదు. పైగా ఇవన్నీ టోకుధరల ఆధారంగా వేసిన లెక్కలు. టోకుధరలు అనేవి మార్కెట్లో ఆయా ఆహార ధాన్యాలకు పదార్ధాలకు మార్కెట్లో లభించే ధరలు. వినియోగదారులు చెల్లించే ధరలు టోకుధరల సూచీలో నమోదుకావు.
ఆహార సరుకుల టోకు ధరలు తగ్గాయి కాబట్టి దాని ప్రభావం మొత్తం టోకుధరల సూచీపైన కూడ కనిపిస్తుంది. ఆహార పదార్ధాల ధరలు మొత్తం సూచీలో 14 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. డిసెంబరు నెలలో టోకుధరల సూచీ గత రెండేళ్లలో అతి తక్కువగా 7.47 శాతానికి పడిపోయింది. ఈ తరుగుదల ఇలా కొనసాగి వచ్చే మార్చినాటికి ద్రవ్యోల్బణం 6-7 శాతానికి పడిపోతుందని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెబుతున్నారు. గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇదే కాలంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడం. 80 శాతం ముడిచమురు అవసరాలకు దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత దేశం అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగిపోవడం ఒక్క దానివల్లనే కాకుండా రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడం వల్ల కూడ అధిక మొత్తం చెల్లించాల్సి వస్తున్నది. అయినా ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది కాబట్టే ఈ మాత్రమయినా మొత్తంగా ద్రవ్యోల్బణంలో తగ్గుదల కనిపిస్తున్నది. పైగా ఇంతకు ముందే చెప్పుకున్నట్లు వినియోగదారుల ధరల సూచీలో తగ్గుదల దాదాపు ఏమీ లేదు. 9 శాతం పైనే కొనసాగుతున్నది.
ద్రవ్యోల్బణం లెక్కలు ఎంతో కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక ఉత్పత్తి సూచి మాత్రం నత్తనడక నడుస్తున్నది. గత అక్టోబరు మాసంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచి అంతకు ముందు సంవత్సరం ఇదే నెలతో పోల్చుకున్నపుడు 5.1 శాతం తగ్గిపోయింది. 2010 అక్టోబరులో పారిశ్రామిక ఉత్పత్తి సూచి 11.5 శాతం ఉంది. 2011 ఏప్రిల్- అక్టోబరు ఆరు మాసాల కాలం మొత్తాన్ని తీసుకుంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచి 3.5 శాతంగా ఉంది. 2010 ఏప్రిల్- అక్టోబరు ఆరు మాసాల కాలంలో పారిశ్రామిక సూచీ 8.7 శాతం పెరిగింది. పారిశ్రామిక సూచీలో 75 శాతానికి ప్రాతినిధ్యం వహించే మాన్యుఫాక్చరింగ్ రంగం అక్టోబరులో 6 శాతం పడిపోయింది. 2010 అక్టోబరులో మాన్యుఫాక్చరింగ్ రంగం 12.3 శాతం అభివృద్ధిని నమోదు చేసింది. పెట్టుబడి వస్తువుల ఉత్పత్తి మరీ దారుణంగా 25.5 శాతం క్షీణించింది. 2010 అక్టోబరులో ఇది 21.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే నవంబరు మాసంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ పెరిగింది. గత ఐదు మాసాలలో ఎన్నడూ లేనంతగా 5.9 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ అది మొత్తం సంవత్సరంలో ఎంత ఉండేదీ సందేహమే.
మరో వైపున మన దేశం ెన్నోఆశలు పెట్టుకున్న ఎగుమతుల పెరుగుదల లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంటున్నది. ఎగుమతులు ఆశించినంత పెరగకపోగా దిగుమతులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు అంచనాలను మించిపోతున్నది. ఈ ఆర్ధిక సంవత్సరంలో వాణిజ్య లోటు 15,500 కోట్ల డాలర్ల నుండి 16,000 కోట్ల డాలర్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా ఎగుమతులు 30,000 కోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యం. కాని ఈ లక్ష్యం చేరుకోవడం మాట అటుంచి, గత జులై నుండి వరుసగా ప్రతినెలలోను ఎగుమతులు అంతకంతకు తగ్గిపోతున్నాయి. 2011 జులైలో 2,670 కోట్ల డాలర్లు, అగస్టులో 2480 కోట్ల డాలర్లు, సెప్టెంబరులో 2,360 కోట్ల డాలర్లు, అక్టోబరులో 2,232 కోట్ల డాలర్లు ఎగుమతులు మాత్రమే జరిగాయి. ఎగుమతులు ఇంతగా పడిపోవడానికి ప్రధాన కారణం ఐరోపా యూనియన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభమే. 27 సభ్యదేశాలున్న ఐరోపా యూనియన్ భారత దేశపు ఎగుమతులకు అతి పెద్ద వనరు. మన మొత్తం ఎగుమతులలో 17 శాతం ఈ ప్రాంతానికే వెళుతున్నాయి. 2009-10లో ఈ ప్రాంతానికి భారత దేశం నుంచి 7,445 కోట్ల విలువైన ఎగుమతులు జరిగితే, 2010-11లో ఇవి 9,134 కోట్ల డాలర్లకు పెరిగాయి. కాని ఈ ఏడాది ఆ మొత్తం దరిదాపులకు సైతం చేరుకునే పరిస్థితి లేదు. ఐరోపా యూనియన్‌తో పాటు అమెరికా, జపాన్‌లను కలుపుకుంటే మన ఎగుమతుల్లో 30 శాతం పైగా ఆ దేశాలకే చేరుతున్నాయి. ఈ దేశాలు సైతం ఆర్ధిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మన ఎగుమతుల లక్ష్యం అందుకోవడం పూర్తిగా అసాధ్యం. ఇదే సమయంలో మనం తప్పనిసరిగా దిగుమతి చేసుకోవలసిన ముడి చమురులాంటి వాటికి రూపాయి మారకం విలువ విపరీతంగా పడిపోవడం వల్ల చాల ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తున్నది. దానివల్ల కూడ మన దిగుమతుల బిల్లు పెరిగిపోయి వాణిజ్య లోటు అధికమవుతున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో భారత దేశపు జిడిపి పెరుగుదల రేటు గత ఏడాదికన్నా తగ్గిపోతుందని, ఇది మరీ తక్కువగా ఉంటుందని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీయే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2010-11లో జిడిపి పెరుగుదల 8.5 శాతంగా నమోదుకాగా 2011-12లో అది 7 శాతం కన్నా దిగువకు పడిపోతుందని ప్రణబ్ చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు కూడ బల్లగుద్ది చెబుతున్నాయి. జిడిపి పెరుగుదల రేటు పడిపోవడం గురించి ఎవరికీ సందేహాలు లేవు. కాని దానిపట్ల ప్రభుత్వమూ, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలూ ఎందుకు ఇంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నదే అర్థం కాని విషయం. ప్రణబ్ ముఖర్జీ మొత్తం ఆర్ధిక పరిస్థితిని ఏకరువు పెట్టి, ఇంతటి క్లిష్టపరిస్థితిని తట్టుకొని నిలబడాలంటే ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు.
ప్రపంచ బ్యాంకు మొత్తం ప్రపంచ జిడిపి పెరుగుదల 2012లో 2.5 శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నది. గతంలో ఇదే సంస్థ 3.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. తర్వాత దాన్ని 2.7 శాతానికి, ఇప్పుడు 2.5 శాతానికి తగ్గించింది. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ తదితర అభివృద్ధి చెందిన దేశాల జిడిపి 1.4 శాతం మాత్రమే పెరుగుతుందని చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాల జిడిపి 2012లో 5.4 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఇదే విధంగా భారత జిడిపి కూడ 7 శాతం మించదని చెబుతున్నది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పరిష్కారాలను కూడ తనదైన శైలిలో బ్యాంకు చెబుతూనే ఉంది. అతి స్వల్పకాలంలో అంటే తక్షణం ద్రవ్యపరమైన ఉద్దీపనలు కల్పించాలని, దీర్ఘకాలికంగా సంస్థాగత సంస్కరణలను అమలుచేయాలని కోరుతున్నది. ఉద్దీపనలన్నీ సంపన్నులకూ, సంస్కరణల భారాలన్నీ సామాన్యులపైన అన్న సంగతి భారత దేశంలో ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వ్యాసం ఆరంభంలో చెప్పిన ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనిపించిన అంశాన్ని సైతం పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు తమకు అనుకూలంగా రాయితీలు రాబట్టుకోవడానికి వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాకా ద్రవ్యోల్బణం దాదాపు రెండంకెల స్థాయికి చేరుకుంది కాబట్టి, దాన్ని తగ్గించడానికి అనే పేరుతో రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను వరుసగా పెంచుతూ వచ్చింది. గత నెలలో ప్రకటించిన విధానం మాత్రమే దీనికి మినహాయింపు. వడ్డీ రేట్ల జోలికి రిజర్వుబ్యాంకు పోలేదు. కాని ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది, మరో వైపున పారిశ్రామిక సూచి అధోముఖంగా పయనిస్తున్నది. ఇలాంటి పరిస్థితిలో వడ్డీ రేట్లను రిజర్వుబ్యాంకు తగ్గించి తమకు రుణసదుపాయాన్ని అధికం చేయాలని పారిశ్రామిక రంగం డిమాండ్ చేస్తున్నది. అలా చేస్తే తప్ప మళ్లీ ఉత్పత్తి పుంజుకొని ఆర్ధిక వ్యవస్థ కోలుకోదని చెబుతున్నారు.
ఇలా మొత్తంగా ఇటీవల కాలంలో వెలువడుతున్న గణాంకాలన్నింటితో సంక్షోభ భయాన్ని అధికం చేసి చూపుతూ, దానిని నివారించాలన్నా, తట్టుకోవాలన్నా పారిశ్రామిక వేత్తలు, ప్రజలు, ప్రభుత్వమూ ఇలా ప్రతి ఒక్కరు సవాళ్లను ఎదుర్కోవాలని, త్యాగాలకు సిద్ధపడాలని చెబుతున్నారు. ఆచరణలో ఆ సవాళ్లకు మూల్యం చెల్లించేది ఎవరు? ఇదంతా సంక్షోభ భారాలను ప్రజలపై మోపి, రాయితీల జల్లులను సంపన్నులపై కురిపించే వాతావరణం ఏర్పాటుకు సన్నాహమే అని అర్థం చేసుకోవాలి. సాధారణ ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్న కష్టాల గురించి ఏ ఒక్కరూ పెదవి విప్పడం లేదు. భారాలను మరింత పెంచడానికి మాత్రం పూనుకుంటున్నారు.
-గుడిపూడి విజయరావు
No comments:
Post a Comment